కల్పన
7/12/02
ఈ స్వకీయ కల్పనా ఫలిత కారాగార ప్రవాసం ఎప్పటికి తప్పేది?
ఏది నేర్చుకునే విషయం చూసినా ప్రతి దాన్లోనూ సూసైడల్లీ హై స్టాండర్డ్స్ పెట్టుకోవడం..
మెదడు నిండా నిండిన ఈ "అత్యున్నత శిఖర" మూర్ఖత్వానికి మానసిక వికాసపు ముసుగు
తగిలించడం- దాని వల్ల ఏర్పడుతున్న మోసం, కాపట్యం….
****************************************************
అతడొక ఆది మానవుడు. కూడూ గుడ్డా చక్కగా జనానికి లభ్యంఅయే దశ వచ్చిందనుకుంటున్నప్పుడు అతడు మాటలతో ఆటలాడడం ప్రారంభించాడు. ఏళ్ళ తరబడి మెదడు లో సాధన చేసి మాటల్ని అందంగా కూర్చే నేర్పు సంపాదించాడు. అలా చేయడం లో ఏదో సుఖం ఉందని గమనించాడు. కొన్నాళ్ళ తర్వాత తనలో తనే అనుకోవడం విసుగనిపించింది. తన చుట్టూ ఉన్న తన అంశలకీ, ప్రతిరూపాలకీ నేర్ప డం ప్రారంభించాడు. కొన్ని తరాలు గడిచాయి. ఆది మానవుడి అంశ రెండు గా విడిపోయింది. మాటల్ని ఆస్వాదించే, వాళ్ళని తృప్తి పరచే వర్గాలుగా. వాటి మేధ మునపటి కన్న అనేక రెట్లు పెరగడంవల్ల మానసికోల్లాసపు చివరలూ, ప్రమాణాలూ, పరిమాణాలూ పెంచబడ్డాయి.
పేరు తెలీకుండా ప్రతి వాళ్ళ లోనూ ఉన్న ఏదో ఊహ, జనసంఖ్య తో గుణించబడి మేరు పర్వతంలా, ఒక కల్పన గానే అయినా, పెరిగింది. మేరువుని అందరికన్నా ముందుగా అధిరోహించి ఆక్రమించుకోవడం కోసం సాముగరిడీలు ప్రారంభమయ్యాయి.
తనలో ఏర్పడుతున్న కోరికలూ, ముడులూ అవి సమాజాన్నీ, తర్వాతి తరాల్నీ ఎలా ప్రభావితం చేస్తున్నాయో, తన విద్వత్తు అంతా అవసరానికి మించి ఎలా పెరిగిపోయిందో, అది సాముగరిడీ లకి ఎలా బానిస అయిందో - ఇదంతా చూడకుండా గుడ్డిగా ఎన్ని వందల వేల సంవత్సరాలు జీవించి ఎంత విద్యా, కళా పోగేసినా శాంతి లేదని కొద్దికొద్దిగా అర్ధమవడం మొదలయింది.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home