2022-08-11

 

తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని మరపురాని అభినయ సన్నివేశాలు

I ఎస్విఆర్ 

1. మాయబజార్ సినిమాలో శశిరేఖని దొంగతనంగా తీసుకురావడానికి ద్వారకకి వెళ్ళిన ఘటోత్కచుడు (ఎస్విఆర్) నిద్రిస్తున్న శశిరేఖ దగ్గరకి వచ్చాడు -  కృష్ణుని పనుపున తనకి సహాయంగా వచ్చిన మైనా అనే చెలికత్తెతో. 

ఈ షాట్ తీస్తున్నప్పుడు స్క్రిప్ట్ లో - శశిరేఖని చూసిన ఘటోత్కచుడు “ఈమె నా సోదరుడైన అభిమన్యునికి తగిన పడతియే" అని రాసి ఉందట.  ఇది చూసిన ఎస్విఆర్ కెవి రెడ్డిని అడిగారుట – "ఈ డైలాగ్ ని రాక్షస వాచకంతో బిగ్గరగా చెప్పమంటారా? అందరూ నిద్రిస్తున్న సమయం కదా? ఎలా?” అని. 

అప్పుడు కెవి రెడ్డిగారు నవ్వి "ఇది కేవలం నువ్వు ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో సూచించడానికి మాత్రమే రాసినది.  డైలాగ్ కాదు.  ఈ డైలాగ్ ని నువ్వు మైండ్ లో నిజంగా అనుకోవాలి.  అప్పుడు నీ ముఖంలో ఆ భావం పలుకుతుంది.  లేకపోతే 'ఈ అమ్మాయి నాకూ తగినదే' అన్న భావం కలగవచ్చు రాక్షస ప్రవృత్తి కలిగిన ముఖకవళికల వల్ల" అని కెవి రెడ్డి గారు చెప్పారట.  

ఆప్యాయతతో కూడిన ఈ ఎక్స్ ప్రెషన్ ని ఎస్విఆర్ ప్రకటించిన విధం ఈ కింద లింక్ లో 1:38:27 లో చూడవచ్చు.  

https://youtu.be/tas_30CdOss

(ఈ విశేషం సింగీతం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్రాత్మక డాక్యుమెంటరీ - 'మై ఏజ్ లెస్ జర్నీ' ఎపిసోడ్ - 7 లో ఉంది.  ఇక్కడ మాయబజార్ సినిమా గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి.  అంతే కాదు దాదాపు 50 వీడియోలు ఉన్న ఈ ఎపిసోడ్ లలో అయిదు దశాబ్దాల తెలుగు,కన్నడ, తమిళ సినిమా విశేషాలెన్నెన్నో ఉన్నై.   

ఈ విశేషానికి సంబంధించిన లింక్ --> 

https://www.youtube.com/watch?v=ne84_9s-OLY

(కనీసం 8:14 నించీ చూడండి.  'ప్రియదర్శిని' లో శశిరేఖాభిమన్యుల యుగళగీతపు సన్నివేశం కోసం ముందు పింగళి వ్రాసిన పల్లవి (కుశలమా, నవ వసంత మధురిమా) కి సాలూరి రాజేశ్వరరావుగారు చేసిన బాణీ కేవీరెడ్డి గారికి ఎంత బాగా నచ్చిందో, ఆయన తప్పుకున్న తరవాత ఘంటశాల గారి బాణీ లో వేరే పల్లవి తో 'నీవేనా నను'  పాట ఎలా తయారయిందో లాంటి విశేషాలెన్నో ఉన్నై.

నటుల నించి మౌన భావ ప్రకటన కోసం కూడా ఒక "virtual dialogue” వ్రాయడం ఎలా ఉపకరిస్తుందో అనేదీ, యస్వీఆర్ సందేహం గురించి 12:45 దగ్గర ఉంది.
 
**

II  సావిత్రి / చదలవాడ కుటుంబరావు

కన్యాశుల్కంలో రామప్పపంతులు (సిఎస్సార్) ఇంట్లో ఉన్న మధురవాణి (సావిత్రి) ని చూడటానికి వచ్చిన  పోలిశెట్టి (చదలవాడ కుటుంబరావు) “పంతులు గారు లేరు" అన్న మాట వినగానే చేసిన భావప్రకటనతో మొదలయ్యే ఈ సన్నివేశంలో (1:00:30 దగ్గర నించి ) అడుగడుగునా సావిత్రి, చదలవాడ జీనియస్ ని చూడవచ్చు.  మచ్చుకి -

a. "ఓహో, పోలిశెట్టి గారా" అంటూ ఓ సావిత్రి ఓ సరసపు  బాణం వేసి, దానికి అతను ఎలా కుదేలయాడో మళ్ళీ ఒక వాలుచూపుతో పరికించిన తీరు (1:01:02 దగ్గర )

b. రావప్పంతులు వ్యవహారం పైకి పటారం లోన లొటారం అనీ, మధురవాణిని ఇష్టపడే వాళ్లల్లో తనూ ఒకణ్ణనీ నర్మగర్భంగా పోలిశెట్టి సాగించిన సంభాషణ.  దానికి ఊతం ఇస్తూనే రావప్పంతులు గురించిన భోగట్టా లాగటం, అదే సమయంలో కొద్ది దూరం పాటిస్తూ కొంచెం భయం పెట్టడం --- ఇదంతా సాగుతుండగా పంతులు ప్రవేశాన్ని తను గమనించానని సావిత్రి చేసిన భావ ప్రకటన (1:02:42 దగ్గర) 

దాన్ని గమనించి తన టోన్ ని తక్షణమే చదలవాడ మార్చడం  (1:02:47)
లింక్ --- > 

https://www.youtube.com/watch?v=FyqCu4WLu9A

ఇది గురజాడ వారి నాటకంలో లేదు. సదాశివబ్రహ్మం గారి ఊహకి సావిత్రి, చదలవాడల ప్రాణప్రతిష్ట!!

c. ఈ సినిమాలోనే  -  రామప్ప పంతులు అన్యాయంగా లుబ్ధావధాన్లు మీద 'కొత్త పెళ్ళికూతురుని చంపేశాడ'న్న కేసు బనాయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సావిత్రి వ్యక్తం చేసిన మానసిక సంఘర్షణ

బాల్యవివాహాన్ని తప్పించడానికి తను వేసిన ఉపాయం చివరకి ఒక ముసలి బ్రాహ్మణుడి పీకకి చుట్టుకుంటుందేమోనన్న మనో వైక్లబ్యం,  తను చూపించిన ఆగ్రహాన్ని నిర్లక్ష్యం చెయ్యడంతో కలిగిన వేదన, వెంటనే దీన్ని ఎలాగైనా ఆపాలన్న దృఢనిశ్చయం, దాని కోసం ఏం చెయ్యాలా అన్న గాఢాలోచన, కాగితాల పెట్టె దగ్గరకి వెళ్ళగానే ఉపాయం తట్టిందన్న వ్యక్తీకరణ 

(ఇవన్నీ 2:26:13 నుండి 2:27:13 వరకు - సరిగ్గా ఒక్క నిమిషంలోనే !! )  

https://www.youtube.com/watch?v=FyqCu4WLu9A

అసలు నాటకానికి ఇదంతా సినిమా పొడిగింపు.  పోలిశెట్టి, మధురవాణుల మధ్య సన్నివేశానికి కనీసం గురజాడ నాటకంలో కొంత సూచనప్రాయమైన దన్ను ఉంది (పేకాట సీను వగైరా) - కానీ ఈ సన్నివేశం పూర్తిగా సావిత్రి ప్రతిభే!

**

III  వాణిశ్రీ 

అనుగ్రహం సినిమాలో - భర్త బ్రహ్మచర్యాన్ని పాటించడంలో తను సహకరించలేకపోయానన్న అపరాధభావనని, ఆ పాప పరిహారానికి తను తీసుకున్న నిర్ణయాన్ని అద్బుతంగా వ్యక్తీకరించింది.  

(1:56:42దగ్గర ఈ లింక్ లో చూడండి --> 

https://www.youtube.com/watch?v=cAg1pdIysik

**

IV  ముదిగొండ లింగమూర్తి 

1. సైలెంట్ రియాక్షన్స్ ఇవ్వడంలో లింగమూర్తి గట్టివాడు అని కెవి రెడ్డి పొగిడేవారు.  "యోగి వేమన సినిమాలో చివరి షాట్ లో లింగమూర్తి (వేమన స్నేహితుడు అభిరాముడు) వీపు మాత్రమే కెమేరా వైపు ఉంటుంది.  వేమన (నాగయ్య) తనని కావలించుకోగానే ఒళ్ళు పులకరించినట్టు, జలదరించినట్టు లింగమూర్తి వీపుతోనే ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు, గ్రేట్" అని అభినందించారు కెవి రెడ్డి గారు.

"ఎచటనుండి వచ్చు ఎచటికి తాబోవు నిదుర చందము ఎరుగనేర్చెనేని సర్వముక్తుడగును సర్వంబు తానవును  విశ్వదాభిరామ వినురవేమ" –ఆర్ద్రపూరిత సన్నివేశం.

ఇది కింది లింక్ లో 2:10:50 దగ్గర చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=KyYHjS086FY

2. ఈ సినిమాలోనే నాగయ్య, లింగమూర్తి ల మధ్య అద్భుతంగా పండిన ఇంకో సన్నివేశంలో లింగమూర్తి గారి వాచకం నటీనటులకి పాఠ్య పుస్తకం లాంటిదే.

ఓ తత్త్వం పాడుతూ ( జగజ్జోతి ఉన్నాది, నాదమినవే మనసా నాదమినవే, నాదమినీ భేదముడిగి మోదమందావే"  బిచ్చమడిగే పిల్లవాడి అభినయం, వాళ్ళు సతాయిస్తున్నారని మూగకంసాలి విసుగు,
 “తెల్లవారిందో లేదో అప్పుడే పుట్టపగిలిందీ...  ఫొండి"  అనడంలో లింగమూర్తిగారి విసురూ,  తర్వాత నాగయ్య గారితో సంభాషణలు - (శంఖద్రావకం, రసం, ఇంగిలీకం, జంగాలపచ్చ, సత్తు అన్నీ సమకూర్చా.  ఇదిగో పుట్టలోని వాని బుడుగుతొడుగు  - ఇవన్నీ సముద్రాల గారి సంభాషణలు :) )

ఇవన్నీ  9:05  దగ్గర చూడవచ్చు.  

https://www.youtube.com/watch?v=KyYHjS086FY

3. స్వర్గసీమ సినిమాలో లింగమూర్తి భానుమతి తండ్రిగా నటించారు - పల్లెటూరి వాడిగా.  ఈ పాత్రలో కొంత హాస్యం పాలు కూడా ఉంది.  సినిమాలో - హీరోని (నాగయ్య) వలలో వేసుకోమని కూతురితో చెప్పే  సన్నివేశం ఉంది.  "ఎన్నాళ్లని ఈ బిగువు?  వాడేం దయ్యమా రాక్షసుడా?  దగ్గరకెళ్ళి అంతా సరి చేసుకో" అనేది తండ్రి పాత్ర చెప్పవలసిన డైలాగ్.  ఆ డైలాగ్ లో లింగమూర్తి గారికి చమత్కారం కనిపించలేదుట.

సెట్ లో దర్శకుడు బి.ఎన్ రెడ్డిగారితో ఆ మాట అంటే ఆయన కస్సుమని మండిపడి “చమత్కారం ఏం చేస్తావో చేసి చూపించు" అని అరిచారుట థుమథుమలాడుతూ.   

“వాడేం పులా, సింగమా? - ఊఁ...”  అని చేసి చూపించారుట.  ఊ అనడంలో ఒక చమత్కారం రావడంతో దర్శకుడూ, రైటరూ సరే అన్నారు.  ఇది కింది లింక్ లో 36:22 దగ్గర చూడవచ్చు.  

https://www.youtube.com/watch?v=n84k51Qfp78

(ఈ విశేషం రావి కొండలరావు గారు వ్రాసిన 'బ్లాక్ అండ్ వైట్' పుస్తకంలో లింగమూర్తిగారి గురించి ఉన్న వ్యాసం - 'భిన్నభూమికా నిర్వహణ సమర్థుడు' లోనిది) 

2021-11-08

చేతన – స్థలకాలాలు - జగత్తు - పరిణామ సిద్ధాంతం - కార్యకారణ సంబంధం


డొనాల్డ్ హాఫ్ మన్ - స్టీఫెన్ వోల్ఫ్రాం - కర్ట్ జయమంగల్ - జిం న్యూమాన్ - నిసర్గదత్త మహరాజ్


డొనాల్డ్ హాఫ్ మన్ గారి ఇంటర్వ్యూ - (వెల్కం టు హోం పాడ్ కాస్ట్ అనే యూట్యూబ్ చానల్ లో peter takis తో 22/4/21)


మన ఎదురుగా ఆపిలో, టేబులో ఉండటం అనేది ‘స్థలకాల పరిమాణ మితి’ (space time dimension) లో మాత్రమే ట. స్థలకాలాలు మనలో, మనకోసం మనమే ఏర్పరచుకున్నవి కాబట్టి (rather, the natural selection has created this interface for our survival and reproduction) ఆ ‘స్థలకాలం’ లేనప్పుడు అవీ ఉండవు. ఇదిసరే, సుబోధకమే. మనం లేనప్పుడు కెమేరా తీసిన ఫొటోలు కూడా మనం వాటిని ‘చూసే’ సమయంలో, ఆ స్థలకాలాల మితి లోనే ఉంటాయి. కాబట్టి ఆ ఫొటోల ఉనికి కూడా మన లో ఉన్న స్థలకాల ఇంటర్ఫేస్ కి లోబడే ఉంటుంది.

కాబట్టి ఈ భూమీ, సమస్త విశ్వమూ - స్థలకాల పరిమాణ మితి కి లోబడే ఉన్నాయి కాబట్టి - ‘నేను’ చూడనప్పుడు అవి ఉండవు - ఉండలేవు. ఇది ఎవరికి వారికి ‘వ్యక్తిగతం’ గా అనువర్తించే ‘సార్వజనీన’ సత్యం. స్థలకాలాలు మిథ్య అయితే (శాశ్వత సత్యం కాకపోతే) - జగత్తు మిథ్యే.


The process of ‘discovering’ mathematics is also, in some sense, a process of ‘inventing’ it – అంటున్నాడు హాఫ్ మన్ గారు. ఇవల్యూషన్ (evolution) అనేది కేవలం reproductive capacity ని పెంచడానికి మటుకే ఉపయోగపడుతుంది - it does not recognise ‘happiness’ as the ultimate requirement – అంటున్నాడు. కాబట్టే ఇవల్యూషన్ బై నాచురల్ సెలక్షన్ మనకిచ్చిన ఇంటర్ఫేస్ (అంటే evolutionary shaped sensory systems- మన ఇంద్రియ వ్యవస్థ) అనేది మనకెన్నటికీ సత్యం (అలాంటి నిరపేక్ష, వస్తుగత సత్యం అనేది ఒకటుంటే అసలు) అనేదాన్ని చెప్పడానికి design చెయ్యబడలేదు - అని గణిత శాస్త్ర (గేమ్ థియరీ) సహాయంతో ఋజువు చేశాడుట హాఫ్ మన్ గారు - చేతన్ ప్రకాశ్ అనే గణితజ్ఞుడూ, మరికొందరు సహాయకులతో కలిసి.

మరి ఒకవేళ ఈ గణితం అనేదే మన స్థలకాల మితి’ కి లోబడినదయితే అప్పుడెలా ఈ విషయాన్ని నమ్మడం?’ (what if the so-called ‘mathematical reasoning’ itself is subject to and part of the interface? - ఈ మాదమాటికల్ ఫాకల్టీ - ఈ బుద్ధి, తర్కం - ఇవి కూడా evolution మనకిచ్చిన interface లో భాగం కాదా?) అన్న ప్రశ్నకి డాన్ హాఫ్ మన్ గారు ఇలా జవాబిచ్చారు.


నాకూ ఖచ్చితంగా తెలియదు. ఒక విషయం మాత్రం రూఢి అయిన విషయమే - అది ఏమిటంటే మన ఇంద్రియ వ్యవస్థ (sensory system), ‘సత్యం’ నించి కావాలనే దూరంగా ఉండేలా రూపొందింది (evolutionary theorem says that our sensory systems have been shaped to be deliberately away from Truth).

ఈ విషయం ఋజువైంది. అయితే మన ‘గణిత తర్కానికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే మన గణిత, తర్క బౌద్ధిక సామర్థ్యాలకు పరిణామ సిద్ధాంతం అనువర్తించదు, అన్వయించదూ కాబట్టి (theory of evolution does NOT apply to our maths and reasoning faculty)”


ఒక ఆపిల్ పండు కన్న రెండు ఆపిలు పండ్లు తింటే రెట్టింపు శక్తి లభిస్తుంది - అన్న తర్కం థియరీ ఆఫ్ ఇవల్యూషన్ పరిధిలోనిది కాదనీ, ఈ తర్క శక్తి మనకి దాని(TOE) వల్ల రాలేదనీ అంటున్నారు హాఫ్ మన్ (.. is NOT shaped and also OUT OF the purview of the evolutionary theorem)

అంతే కాదు. ఇంద్రియ శక్తుల వ్యవస్థ ని స్థలకాల పరిమితి లో ఉంచుతూ, మనలని సత్యానికి తగినంత దూరం లో ఉంచాలని నిరంతరం మనల్ని ‘రియాలిటీ’ నించి దూరంగా ‘తోసే’ వత్తిడులు ఎల్ల వేళలా పనిచేస్తూ ఉంటాయట. అయితే ఇవి గణిత, తర్క శాస్త్ర శక్తుల మీద మాత్రం ఉండవట!! (there are no selection pressures that are working uniformly against maths and logic, like they do work against our sensory systems) అంటున్నారు హాఫ్ మన్ గారు..


ఇంకా కర్ట్ గోడెల్ గారి సిద్ధాంతాన్ని ఉటంకిస్తూ - ‘no matter how much maths we know, it can be considered – and is like – you JUST began !! In principle, there NO END to the richness of the mathematical structures -.. which is like another way of saying that the ‘very act of discovering maths is like inventing them’ అని చెబుతూ, మళ్ళీ - నాకే నే చెప్పిన దానికి పూర్తి అర్థం తెలీదు - అంటున్నారు ఎంతో నిజాయితీ గా డాన్ హాఫ్ మన్ గారు !..ఇంకా - having said all this, i wonder if there is a deep theory of who we are beyond evolution and natural selection... Our actions do really matter that the process of our discovering maths is also the act of inventing it – అంటూనే, ఇది నాకున్న వేగ్ ఐడియా మాత్రమే .. దీన్ని గురించి ఇంకా ఆలోచించాలి.. పర్స్యూ చెయ్యాలి అని కూడా చెబుతున్నారు.


***

కర్ట్ జయమంగళ్ అన్న పేరున్న (బహుశా భారతీయ మూలాలున్న) ఆయన అనేక మందిని Theory of Everything గురించి (ఆ పేరుతో ఉన్న తన యూట్యూబ్ ఛానల్) ద్వారా ఇంటర్వ్యూ చేస్తూంటారు. Bestrup, Stephen Wolfram లాంటి ఆధునిక శాస్త్రవిజ్ఞానకారుల్నే కాకుండా, రూపర్ట్ స్పైరా లాంటి ప్రసిద్ధ అద్వైత గురువుల తో కూడా వివరంగా, తీరిక గా మాట్లాడుతూ ఉంటాడీయన.


అనేక శాస్త్రాలలో ఉద్దండుడైన స్టీఫెన్ వోల్ఫ్రాం (a rare trifecta of a physicist, computer scientist, mathematician - and also a businessman) గారిని జయమంగళ్ రెండు గంటల పైగా చేసిన ఇంటర్వూ లో కొన్ని ఆసక్తికర విషయాలు:


Simple rules (like those in cellular automata) lead to extremely complicated patterns that are impossible to be reduced for guessing them ahead of time. This is Computational Irreducibility (ఏ సమీకరణానికీ, లెక్కకీ ఒదగనితనం) – you have to run the system / program to see what is going to happen after a certain number of steps. You can’t possibly predict without running the actual system /program. అంటే ఈ వ్యవస్థలు (సిస్టమ్స్) ఎలా పనిచేస్తాయో తెలుసుకోడానికి మనకి ఏ సమీకరణాలూ, ప్రోగ్రాములూ సహాయపడలేవు. ఇవి దేనికీ ఒదగని, లొంగని అనూహ్య వ్యవస్థలన్నమాట. ఒక నిర్దిష్ట (ఫలానా) సూత్రం ప్రకారం ఒక బొమ్మని (పాటర్న్) ని మార్చుకుంటూ వెళితే, ఏ పదివేలసార్లో మార్చాక ఆ బొమ్మ ఎలా తయారవుతుందంటే, చెప్పడానికి వీలుపడదన్నమాట. ఆ పదివేల సార్లు అచ్చంగా మార్చి చూడాల్సిందే! వేరే దారి లేదు. అలాంటి వ్యవస్థలను ‘అనూహ్య వ్యవస్థ’ లంటున్నారు.

So, if there is a simple rule underlying the whole universe, leading to irreducibility – how come we can “figure out anything” at all about the universe ? అన్న జయ మంగళ్ ప్రశ్నకి వోల్ఫ్రామ్ గారు - “Within any system of computational irreducibility, there is/are ALWAYS pockets of reducibilty – and they are nothing but our భౌతిక శాస్ర్రాల్ట! అంటే ఎటువంటి దురూహ్య వ్వవస్థలలో కూడా కొన్ని ఊహ్యభాగాలు ఉండక తప్పదన్నమాట!

ఈ మాట వోల్ఫ్రామ్ గారంటున్నప్పుడు, జయమంగళ్ - ఆల్వేస్...ఆల్వేస్‌... ఆల్వేసా....ఆల్వేసా... అని గుచ్చి గుచ్చి - is it correct to say that it IS IMPOSSIBLE to CONSTRUCT a system WHERE it is WHOLLY, ENTIRELY computationally irreducible ? అని నొక్కి నొక్కి అడుగుతూంటే, వోల్ఫ్రామ్ తనదైన ఫార్మల్ అమెరికన్ శైలి లో “i believe that to be correct” అంటున్నారు గుంభనంగా!!! అని ఊరుకోకుండా it would be very interesting to fully formalise that notion...అని ముక్తాయించారు! కంప్యుటేషన్ థియరీలోని కొన్ని సిద్ధాంతాలు దీన్ని ఫార్మలైజ్ చెయ్యడానికి కొంతవరకూ పనికిరావచ్చట – వీటిని స్పీడప్ థీరమ్స్ అంటారట.

కాబట్టి ఈ బ్రహ్మాండ భువన యంత్రాగం మొత్తంమీద ఒకవేళ Computationally Irreducible అయిఉన్నా, పై సూత్రం ప్రకారం కొన్ని Pockets of Reducibility ఉండాలి కదా! - అవే మన భౌతిక శాస్త్రాల్ట! - ఆ ఫిజిక్సూ, గణితాలే ఈ పాకెట్స్ ఆఫ్ రెడ్యూసబిలిటీ అనీ - వాటివల్లే మనం చేయగల ప్రిడిక్షన్స్ సాధ్యపడుతున్నాయంటాడు వోల్ఫ్రామ్ గారు!

ఇక తర్వాతి ప్రశ్న ఏమంటే - are there other such pockets which are unknown to us yet? అంటే గ్లోబల్ గా వర్తిస్తాయని మనమనుకుంటున్న క్వాంటం సిద్ధాంతం, సాపేక్షతా సిద్ధాంతాలే కాకుండా ఇంకా అలాంటి Reducible Pockets ఏమన్నా ఉన్నాయేమో? - అన్నది.

దీనికి స్థీఫెన్ వోల్ప్రాం గారు - ఈ మధ్యనే - ఈ ఇంటర్వ్యూ కి కొద్ది వారాల ముందే, అంటే May-June 2021 లో - తాను ఈ విషయాన్ని కనిపెట్టాననీ, దాన్ని ఇలా వివరిస్తున్నారు.


The reason that we know these ‘known pockets’ of theories (quantum mechanics, general theory of relativity etc.,) is because of certain attributes that we, as Observers of this Universe have – and those attributes lead us to those things / theories / pockets of reducibility !!!

These attributes are like –

a) we have a computationally bounded way of understanding the universe. విశ్వాన్ని మన మనసు తో ఇంద్రియాల సహాయంతో అర్థంచేసుకోవడం - అనేది ఒక (స్థలకాల) యాంత్రిక పరికలన వ్యవస్థకు లోబడి ఉంది.

b) we have a definite thread of experience in time - in the sense that we are NOT operating on with many many threads of experiences. We have a definite – thread of consciousness that follows us..

కాలంలో కొనసాగుతూ ఉండే స్థిరమైన “నేను” అనే అనుభవం మనకుంది. మనలోలోపలి భావాలూ, యోచనలూ ఎలా మారిపోయినా, అవన్నీ “కలుగుతున్న వాడు” ఒకడు నిర్దిష్టంగా కొనసాగుతూ ఉంటాడు.

One of the NON-Trivial things in Wolfram’s model (of understanding the universe) – is that NOTION of maintaining our IDENTITY through TIME.. స్థలకాలాలలో మనం ఇలా కొనసాగడమనేది వోల్ఫ్రాం గారి నమూనా (విశ్వావగాహనకు ఆయన రూపొందిస్తున్నది) లో అత్యంత ముఖ్యమైనదిగా తేలిందట.

We also do that in SPACE in a similar way.. It is NOT obvious that there is a pure notion of motion in space. Actually our atoms of space (పరమాణువులతో కూడిన మనలోని జీవ కణాలు) are being destroyed and recreated zillion of times per second..Yet, we maintain (at least, that is what we think అని ఉంటే బాగుండేది) a solid, continuous identity through Space (in addition to Time!)

This is a NON-Trivial and an Extremely Important fact as observers in our understanding of the universe అని మళ్ళీ నొక్కి చెబుతున్నారు వోల్ప్రాం గారు!!

As we move, in space, the atoms in us are entirely become different in various points of space – still, we carry our identity through time and space – The ASSUMPTION that I maintain that Identity IS finally THE REASON for all those physics and other laws that we get!!

అంటే if we did not have that assumption about ourselves, we would operate with different laws of physics !! That is, the notion that we collapse different paths of history to a single definite outcome is DIRECTLY RELATED to the face that we maintain a DEFINITE IDENTITY through time and space... Say, if we just are capable of saying “ Oh! I don’t care about maintaining a definite identity, through time and space, and am perfectly happy to have branched out a zillion times” , then you no longer get this idea of Quantum Mechanics and other laws of physics and won’t be able to do predict the outcomes the way you do now...

So, చివరకి వోల్ప్రామ్ గారు చెప్తున్నదేమంటే - it is our way of constructing ourselves and the way we think about ourselves – and the way we perceive the universe, that drive the Laws of Physics – మనం ఎవరని మనం అనుకుంటున్నామో, దాని (స్థలకాలాలలో కొనసాగుతూ ఉనికిలో ఉన్న ‘నేను’) మీద ఆధారపడే మనకి తెలుస్తున్న భౌతిక శాస్త్రాలన్నీ ఉన్నాయనీ, మనం ప్రస్తుతం మనకున్న పరిమాణాత్మిక తలాలూ (డైమన్షన్స్), వాహికా నేపథ్యాలూ లేకపోతే, ఈ నిత్యసత్యాలని మనం అనుకుంటున్నా భౌతిక సూత్రాలు చెల్లవనీ అంటున్నారు.

ఇదీ చివరకు తెలిసింది... దీని పర్యవసానం ఏమిటంటే - there might be completely different laws of Physics and other PLANES of Existence that we may be UTTERLY UNAWARE of.. అనీ, and that is ALMOST, UNDENIABLY the case అనీను...

ఇంత పెద్ద బ్రహ్మాండం లో ఖచ్చితంగా other intelligent species / aliens / civilisations ఉండి తీరాలని చాలా ఎక్కువ మంది శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారే, మరి మనకి ఇప్పటిదాకా తారసపడలేదు అంటే కారణం ఇదే అయ్యుండాలంటారు వోల్ఫ్రాం గారు.. because those species / aliens are operating /or having a completely different perception – it does not tally with our narrative of the Universe – ఇదంతా చెప్పి, it is Humbling to know that all the laws of physics and other stuff that we have discovered and built are NOTHING but a result of the WAY WE PARSE the Universe!!! If we parse the Universe differently, we’d have completely different laws of physics అంటున్నాడు వోల్ఫ్రాం గారు!!

' బుద్ధి' అని మనం పిలుచుకునే దాని దృక్కోణం వల్లనే,  ఈ భౌతిక శాస్త్ర సూత్రాలన్నీ ఆవిష్కరించుకున్నాం. అవి సార్వత్రిక, నిత్య సత్యాలేమీ కావు.  బాహ్య ప్రపంచం తో మన మేధ ని తాడించి, మోటుకుని, ఎదుర్కొని, అన్వయించుకునే విధానమే మన శాస్త్రపరిజ్ఞానమంతా  - ఇది ఒకరకమైన అవగాహన మాత్రమే -"శాశ్వత సత్యం" (అలాంటిదంటూ ఏదన్నా ఉంటే)  కాదు.   

ఇదీ వోల్ఫ్రాం గారి తుది తీర్మానం...

******

జిమ్ న్యూమాన్ (ప్రస్తుతం వియన్నాలో నివసిస్తున్న ఒక అద్వైతి) ఇలా అంటున్నారు:

ఎప్పుడూ దేన్నో కోరడమే వ్యక్తి తత్త్వం. ఏదో అర్థం, పరమార్థం - తనకి తాను స్వతంత్రంగా వాంఛించాననుకుంటున్నదీ దీనికి కావాలి. భవిష్యత్తులో, తరవాత జరగబోయే దానిలో ఏదో ఆశ – దానికి కావాలి. ఏదో జరగబోయే అనుభవం కోసం అవసరం... ఇవన్నీ, “ఉండటం” అని వ్యక్తి అనుకునే దానిలోని విడదీయరాని అంతర్భాగాలే.

వ్యక్తి గా ఉండటం అనేది స్వయం విదితం - అది ఒక స్వీయ నిశ్చయం - తనకి తనే సత్యంగా చెప్పుకునేది. ‘ఈ వాక్యాలు చదివే అనుభవాన్ని నాకు నేను ఇప్పుడు కలిగించుకుంటున్నాను. అందుచేత నేను ఉన్నాను అనేది సత్యం’ - ఇలాగ...

ఇలా “విడిగా” ఉన్నాను అన్నది నిజం అనేది మనోజనితమైన అపార్థం!!

దీని ఫలితం - “విడిగా ఉన్న నేను అనే వ్యక్తి” నిజం అన్న అనుభవం - తనలోనో, బాహ్యంగానో ఏదో సరిగా లేదనుకోవడం..

ఉన్నది” అసంపూర్ణమనీ, తన ప్రయత్నం ద్వారా పరిపూర్ణత ని కనుగొనగలననీ దానివల్ల తన(?)ని బాగు చేసుకోవచ్చనీ ఈ విడివ్యక్తి గా ఉన్న అనుభవం సూచిస్తూ ఉంటుంది నిరంతరం.

ఏదో తెలుసుకోవడం’ ఉంటున్నంత వరకే ఈ వ్యక్తి సత్యం.

తెలుసుకుంటూ ఉండటం’ మాత్రమే వ్యక్తిని చెలామణీ లోకి తెస్తుంది. అనుభవం పొందడం ఉన్నంతవరకూ ఈ తెలుసుకుంటూ ఉండటమూ ఉంటూనే ఉంటుంది.

The experience of being an individual is Self-Confirming.. it is like ‘I am reading these words, because I experience it now, therefore I am real. This position is a psychosomatic misunderstanding.. i.e. as if this SEPARATE INDIVIDUAL is real..


This individual is basically a SENSE OF NEED.. It needs the NEXT Moment, Hope, Meaning and Purpose. That need is positivity for more and more experience. All these needs are part and parcel of Individual’s idea of what “THIS” is all about !!

The individual is REAL only with reference to Knowing..


Knowing is the CURRENCY of the Individual...

Experience is the Currency of Knowing..


****

సృష్టి గురించీ, కార్య కారణ సంబంధాల గురించి నిసర్గదత్త మహరాజ్ (1897 – 1981 – ముంబాయి లో నివసించిన

అద్వైత గురువు) చెప్పిన మాటలు:

నిసర్గదత్త :  గూటిలో చిక్కినట్లుగా ‘ఈ వ్యక్తి’ అనే బందిఖానాలో చిక్కారు మీరు. దాన్ని బద్దలు కొట్టండి.

ప్రాశ్నికుడు : ఎవరు బద్దలు కొట్టాలి? బద్దలు చెయ్యమని ఎవరిని మీరు అడుగుతున్నారు?

: జ్ఞాపకాల శృంఖాలాలనీ, మిమ్మల్ని మీరు ఫలానా గా గుర్తించుకొనడాన్నీ ఆపేసేయండి. ఈ కారాగారపు గూడు దానంతటదే బద్దలయిపోతుంది.

తెలుసుకుని గ్రహించే (‘జ్ఞా’) ప్రతివిషయానికీ సత్యాన్ని ఆపాదించే కేంద్రం తనలోనే ఒకటుంది. ఈ విధమైన అవగాహనతో - సత్యం యొక్క మూలం మీరేననీ, దీనిలో మీకిక ఏ సహాయమూ, నిర్థారణా, ధ్రువీకరణా అవసరం లేదనీ అర్థం చేసుకుంటే చాలు. విషయసత్యాన్ని మీరు గ్రహించడం కాదు, వాటికి సత్యాన్ని ఆపాదించేది మీరేనని అర్థం చేసుకుంటే సరిపోతుంది. గోచరించే విషయ జగత్తుని అలానే అంగీకరిస్తున్నారు కాబట్టే అవి అలా ఉన్నాయి. వాటిని అలానే ఆమోదించి స్వీకరించకపోతే, అవి కరిగిపోతాయి.

******

కారణరహితం అని నేను అంటున్నానంటే దాని అర్థం - ఒక నిర్దిష్ట కారణమే ఉండనక్కర లేదని! - మీ అమ్మగారికే నువ్వు జన్మించి ఉండనక్కరలేదు. మరొక మాతృమూర్తి కి జన్మించి ఉండి ఉండవచ్చు. కానీ ఈ భూమి, సూర్యుడు - ఇవి లేకుండా జన్మించగలిగి లేవు.

నిజానికివి కూడా ఉపకరణాలే.. జన్మించాలనే నీ ‘కోరికే’ అన్నిటి కన్నా ముఖ్యం. అదే నీకు జన్మనిచ్చి నామరూపాలను సాకారం చేసింది.. ఒక వ్యక్తిగత ప్రపంచాన్ని సృష్టించింది..

ఇలా “స్థలకాలాలలో కార్యకారణ సంబంధానికి లోబడ్డ ప్రపంచాన్ని” - నీ కోసం ఏర్పరచుకున్న తర్వాత ప్రతిదానికీ కారణాలు వెతికి దానికి వాటిని కనిపెట్టక తప్పదు నీకు !! సందేహాన్నీ, జవాబునూ రెండింటినీ నువ్వే విధించుకుంటున్నావు !!

ప్రతి విషయమూ ఇంకొకదానితో ముడిపడి ఉన్నదే నిజానికి..ప్రతి దానికీ ఈ లెక్కన అసంఖ్యాకమైన కారణాలుండక తప్పదు.. అత్యంత అల్పమైన విషయానికి కూడా విశ్వం లో ఉన్న ప్రతీదీ దోహద పడాల్సిందే!

ఏ విషయమైనా ఇప్పుడిలా ఉందంటే కారణం - సమస్త విశ్వమూ ఇప్పుడున్న స్థితిలో ఈ క్షణం ఇలా ఉంది కాబట్టే.. ఈ బ్రహ్మాండం యొక్క ప్రస్తుత స్థితి, దానిలోని సమస్త అంశాల తోనూ - అత్యల్ప విషయాలతో సహా - ముడిపడి ఉంది.

ఈ సకల బ్రహ్మాండం లోని ప్రతి అంశం యొక్క ప్రస్తుత స్థితి, మిగతా అన్ని అంశాల స్థితి తో కట్టబడి ఉంది.

**

ఇదంతా చెప్పి మళ్ళీ “అసలీ కార్య కారణ సంబంధాల గురించి తల బద్దలు కొట్టుకోవడమెందుకు ? ఇలా వచ్చి అలా వెళ్ళి పోయే తాత్కాలికమైన వాటికి ఏమంత ప్రాముఖ్యం ఉంది కనక?” అంటూ ప్రశ్నిస్తారు నిసర్గదత్త మహరాజ్.

It is neither necessary nor possible to keep accounts in the domain of ‘కార్యకారణపటలం’ అంటారు నిసర్గదత్త మహరాజ్.

************************************

Donald Hoffman, Stephen Wolfram, Kurt Jaimungal, Jim Newman, Nisargadatta Maharaj

థియరీ ఆఫ్ ఎవ్విరిథింగ్, థియరీ ఆఫ్ ఇవల్యూషన్,  కంప్యుటేషనల్లీ ఇర్రెడ్యూసబిల్,  కంప్యుటేషనల్లీ రెడ్యూసబల్, 


2021-03-10

ఆధ్యాత్మిక అంత:కేంద్రం - రమణ మరణానుభవం

మృత్యువు యొక్క సంపూర్ణ ప్రాముఖ్యాన్ని ఒక మనిషి అర్థం చేసుకుంటే ఆ అవగాహన వెనుక ఒక నిండుతనం, జీవశక్తి ఉంటాయి. ఆ మనిషి మానవ చేతన నుంచి విముక్తుడవుతాడు. మీరు నిత్యం జీవిస్తూనే, అంతమైపోతూ ఉంటే జీవితం, మృత్యువు రెండూ ఒకటేనని తెలుస్తుంది. ఈ రెండూ ఒకటేనని అర్థం చేసుకున్నప్పుడు మీరు మరణం పక్కనే జీవిస్తూ ఉంటారు. ఇది చాలా అపూర్వమైన విషయం. అక్కడ గతమూ వర్తమానమూ భవిష్యత్తూ ఏమీ ఉండవు. ముగింపు మాత్రమే ఉంటుంది.


మరణం అనేది ఒక ముగింపు. దీనికి జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉంది. అంటే ఆత్మహత్య చేసుకోవడమో, బాధని భరించలేక జరిపే కారుణ్య మరణమో కాదు. తనకున్న బంధాలు, తనలోని గర్వం, ఇంకొకరిపట్ల ఉన్న ద్వేషం, శత్రుత్వ భావం - వీటన్నింటినీ అంతం చేయడం. మరణించడమూ, జీవించడమూ - ఇవి ఒకే గతిలో, ఒకే చలనంగా ఉన్నాయని మన జీవితం వంక పూర్ణదృష్టితో చూస్తే తెలుసుకోవచ్చు. ఈ దృష్టితో చూసినప్పుడు మరణం నించి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. అంటే ఈ భౌతిక శరీరం మరణించకుండా ఉండిపోవడం కాదు. 'అన్నీ ముగిసిపోయినట్లైన ఒక ప్రజ్ఞ' కలగడం వల్ల కొనసాగడం ఉండదు. "కొనసాగకపోవడం వల్ల కలిగే భయం" అనే దాని నించి విముక్తి లభిస్తుంది.


పై మాటల్ని 1982 లో జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు. దీనికి 86 సంవత్సరాలకి పూర్వమే వెంకటరామన్ అనే బాలుడికి కలిగిన ఆత్మానుభవాన్ని ఆయన (భగవాన్ రమణమహర్షి)

మాటల్లోనే చూస్తే -


మధురై ని వదిలి వెళ్ళిపోవడానికి బహుశా ఒక ఆరువారాల ముందు నా జీవితంలో పెనుమార్పు హఠాత్తుగా సంభవించింది. అప్పుడు నేను మా బాబాయి గారింటి మేడ మీది గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాను. మామూలుగా నేను ఆరోగ్యవంతుడినే. ఆరోజు కూడా నాకు ఆరోగ్యం బాగానే ఉంది. ఉన్నట్టుండి ఒక ప్రచండమైన, అకస్మికమైన మరణ భయం నన్ను ఆవహించింది. అనారోగ్యం వల్ల అలా జరిగిందనుకోవడానికి ఆధారమేమీ లేదు. అసలు ఆ మరణ భయానికి కారణం ఏమై ఉంటుంది? ఎందువల్ల అది కలిగింది? అని నేనసలు యోచించలేదు. దాన్ని వివరించాలని గాని, కారణం అన్వేషించాలని గాని నాకప్పుడు తోచలేదు. 'నేను మరణించబోతున్నాను' అన్న భావనే ప్రబలంగా కలిగింది. ఏం చేయాలి? పెద్దవాళ్ళనో, స్నేహితులనో, వైద్యుడినో కలుద్దామన్న ఆలోచన రాలేదు. దీనిని తక్షణమే, అక్కడే, నాకు నేనే పరిష్కరించుకోవాలని తీవ్రంగా అనిపించింది. ఉన్నట్లుండి కలిగిన ఆ మరణ భయపు దిగ్భా్రంతి నా మనసుని లోలోపలికి చొచ్చుకుపోయేలా చేసింది.


'సరే ఇప్పుడు మృత్యువు సంభవించింది - దీని అర్థం ఏమిటి? మృతి చెందేది ఏమిటి? ఈ శరీరమే కదా' అని మనసులో స్ఫురించింది - ఏ మాటలూ నిజంగా కూర్చుకోకుండానే. ఇక ఒక్కసారిగా నా శరీరం 'చనిపోవడాన్ని' అభినయించింది. వెల్లకిలా పడుకుని, అవయవాలనన్నింటినీ బిర్రబిగించి, శవంలాగే తయారయ్యింది. ఊపిరి ఆగింది. ఎటువంటి మాటా, కనీసం 'నేను' అనే శబ్దం కూడా పైకి రాకుండా పెదవులు బిగుసుకున్నాయి. ఇదంతా నా విచారణ యదార్థంగా మరింత నిక్కంగా ఉండాలనే.


సరే ఈ దేహం మరణించింది; దీన్ని శ్మశానానికి తీసికెళ్ళి కాల్చి బూడిద చేస్తారు. మరి శరీర మరణంతో 'నేను' అంతమైనట్లేనా? శరీరం నేనేనా? దేహంతో పని లేకుండానే ఎరుకను, స్ఫురణను సంపూర్ణంగా కలిగి ఉన్నాను. శరీరం ఒక నిశ్శబ్ద నిశ్చల జడపదార్థం. అంచేత 'నేను' శరీరానికి అతీతమైన తత్తా్వన్ని.


పైదంతా ఒట్టి ఆలోచన గా కాకుండా ఓ సజీవ సత్యంగా నాలో స్ఫురించింది. ఆలోచనల ప్రసక్తి లేకుండా నేను దానిని సూటిగా గ్రహించాను. ‘నేను’ అనేదే నిజం. నా వర్తమాన ఉనికిని గూర్చిన ఏకైక సత్యం. ఈ ‘నేను’ అనే కేంద్రంగానే శారీరపు ఎరుకతో కూడిన కార్యకలాపమంతా సంభవిస్తుంది. తత్‌క్షణం నుంచి 'నేను' లేక 'ఆత్మ' ఒక ప్రగాఢమైన ఆకర్షణతో తన దృష్టినంతటినీ తన పైనే కేంద్రీకరించింది. చావు భయం సమూలంగా అంతరించింది. మనసును లోపలే నిలిపి ఉంచే ఆత్మనిష్ఠ అప్పటినుంచి అప్రతిహతంగా, నిర్విరామంగా కొనసాగింది. సంగీతంలోని సప్తస్వరాల్లా ఇతర తలపులు వచ్చిపోవచ్చుగాక, కానీ ఆధార శ్రుతివలె ఈ ‘నేను’ యొక్క ఎరుక స్పష్టం, ప్రస్ఫుటం! శరీరం మాట్లాడటం, చదవడం వంటి ఏ పనుల్లో ఉన్నా ‘నేను’ పైనే ‘నా’ దృష్టి.”


ఇదీ భగవాన్ తన పదహారవ ఏట జరిగిన అనుభవం గురించి తరవాతెప్పుడో స్వయంగా చెప్పిన విషయం. ఇది జరిగాక ఆయన తిరువణ్ణామలై వచ్చి ఏదో గొప్పతపస్సు చేశారని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా అప్రయత్న, సహజ సమాధి మాత్రమేననీ - దానిని చూసి తపస్సు గా పొరపడే వాళ్ళనీ భగవానే స్వయంగా (కొద్దిసార్లే, కొద్దిమందితో అయినా) చెప్పారు.


వీలైనప్పుడల్లా తిరువణ్ణామలై వెళ్ళడం, రమణుడు ఉన్న, తిరుగాడిన ప్రదేశాలు చూడటం, ఆయన తన జీవితపర్యంతమూ అక్కడ నెలకొల్పిన ప్రాంకుర స్పృహ (ఓ రకమైన ప్రిమోర్డియల్ అవేర్నెస్ - వితౌట్ ప్రిమిటివిజమ్) ని కొంతవరకూ అందుకోవడానికి ప్రయత్నించడం - ఇవన్నీ రమణమహర్షి తత్త్వం మీద ఆసక్తి ఉన్నవాళ్లు తరచుగా చేసేవే.


ఇంకా మన తెలుగువాళ్ళు ప్రత్యేకంగా తిరువణ్ణామలై లో చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. సూరినాగమ్మ గారి రచనలలో ప్రస్తావించిన అనేక స్థలాల్ని సంఘటనలనీ రిలేట్ చేసుకుంటూ ఆశ్రమాన్ని చూడొచ్చు. చలం పాఠకులైతే ఆయన జీవితపు చివరి మూడు దశాబ్దాలలో చేసిన రచనల్లో '' ప్రభావాన్నిగుర్తు చేసుకుంటూ ఆ ప్రదేశాలన్నీ తిరగొచ్చు.


ఇంకా సమయం ఉండి తెలుగు సాహిత్యాసక్తి ఉన్న పాఠకులైతే రమణాశ్రమం లోపల ఉన్న గ్రంథాలయం లో ఉన్న పుస్తకాలు, పత్రికలు చూడవచ్చు. ఈ గ్రంథాలయం వెనుక ఉన్న ప్రాధమికమైన ఉద్దేశం ఆధ్యాత్మికమైనా సాహిత్య ప్రాముఖ్యం కలిగిన కొన్ని తెలుగు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి - 1930-50 ల మధ్యనాటివి. మచ్చుకి - మహాప్రస్థాన గీతాలలో కొన్నింటిని (వ్యత్యాసం - నూరు దోషాల లోని పుణ్యం నూరు పుణ్యాల లోని ఘోరం, అవతారం - యముని మహిషపు లోహఘంటలు, నవకవిత – ఝంఝానిల షడ్జధ్వానం ఇత్యాదులు) మొదటిసారిగా ప్రచురించిన ముప్పైల నాటి 'ప్రతిభ' సంచికలు, చందూర్ గారి సంపాదకత్వం లో వెలువడిన 'మాలి' పత్రిక (1949 నాటిది), తన బాల్య, యౌవ్వన స్నేహితుల గురించి చలం గారు చెప్పగా చిక్కాల కృష్ణారావు గారు వ్రాసిపెట్టిన 'చలం మిత్రులు' లాంటి పుస్తకాలు..


వెంకటరామన్ అనే యువకుడు అస్తమించి ఆత్మస్ఫురణ కలిగిన మహర్షి ఉదయించడం సమకాలీన ఆధ్యాత్మిక ప్రపంచం లో ఓ భూకంపం అనుకుంటే, దానికి ఎపిసెంటర్ లాంటిది మధురై అనుకోవచ్చు.

తిరువణ్ణామలై కి చాలా ఏళ్ళుగా వెళ్తూ ఉన్నా, నేనెప్పుడూ మధురై చూడలేదు. ఈ సంవత్సరం మే నెలలో మధురై వెళ్లి - ఎలాగూ అంతదూరం వెళ్ళాను కాబట్టి రమణుడు పుట్టిన ఊరు (తిరుచ్చుళి), తంజావూరు, తిరువయ్యారు, కుంభకోణం తిరిగివచ్చాను. ఈ ప్రయాణపు విశేషాలు క్లుప్తంగా... (ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)


రమణమందిరం, మధురై.


మధుర మీనాక్షీ దేవాలయం దక్షిణపు ద్వారానికి ఎదురుగా ఉన్న వీధిలో ఐదు నిమిషాల నడక దూరంలో 'రమణ మందిరం' ఉంది. అచ్చంగా అప్పటి కట్టడం కాకపోయినా పెద్ద ఎక్కువ మార్పులు చేయకుండా ఆ ప్రదేశాన్ని అలానే కాపాడుకొస్తున్నారు. ఈ ఇంటిలో పై అంతస్తులో ఉన్న ఆ చిన్న గదిలోనే ఆనాడు రమణుడికి ఆత్మానుభూతి కలిగింది. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. రమణుడి చిన్న ఫొటో, దీపం ఉన్నాయి. వెళ్ళగానే 'It all started here' అన్న అనుభూతి పొందవచ్చు.


తిరువణ్ణామలైలోని రమణాశ్రమాన్ని గురించి విని, చూసే వాళ్ళు చాలామందే ఉన్నా మధురైకి వచ్చి ఈ ప్రదేశాన్ని చూసేవాళ్ళు తక్కువే. పొద్దునా సాయంత్రం ఏదో ఓ అరగంట భజన కార్యక్రమాలు ఉన్నా అవి కింద గ్రౌండ్ ఫ్లోర్ లోజరుగుతాయి. చాలాసేపు కూచొని ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళకు అనువైన ప్రదేశం.


భూమినాధేశ్వరాలయం, తిరుచ్చుళి.


రమణుడు పుట్టిన ఊరు తిరుచ్చుళి. ఇది మధురైకి 30 మైళ్ళ దూరంలోనే ఉందని చాలా పుస్తకాల్లో ఉంది. పట్టణ విస్తరణ పథకాల వల్లనో, నూతన రహదారులు వేసే క్రమంలోనో లేక మధురై నగరం అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్లనో మధురై నుంచి తిరుచ్చిళికి వెళ్ళడానికి దాదాపు నాకు రెండున్నర గంటలు పట్టింది - వేగంగా పోయే తమిళనాడు rtc బస్సులలో.


మధురై పాతబస్టాండ్ (పెరియార్) నుంచి మాట్టుదావణి లోని కొత్త బస్టాండ్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి అరుప్పుకోటై అనే ఊరికి వెళ్ళాలి. అరుప్పుకోటై నుంచి తిరుచ్చుళి వెళ్ళే బస్సు ఎక్కి భూమినాధేశ్వర దేవాలయం స్టాప్ లో దిగాలి. ఇది చాలా పెద్ద ఆలయం. ప్రశాంతమైన వాతావరణం. రెండు పెద్ద పెద్ద ఆలయాలు ఒకటే ప్రాకారం లోపల ఉన్నాయి. ఒక దేవాలయంలో భూమినాధుడు మరొక దాన్లో సహాయవల్లి మూల విరాట్టులు. ఇక్కడే ఒక మూల ప్రళయ శివుని గుడి చాలా అద్భుతంగా ఉంది. ప్రళయ జలాల్లో శివుడు తన త్రిశూలంతో ఒక చిన్న సుడిని చేసి (తమిళంలో సుళి) భూభాగాన్ని రక్షించి దానిలో భూమినాధేశ్వరుడిగా వెలిశాడని స్థలపురాణం. అందుకే ఈ ప్రదేశానికి తిరుచ్చుళి అనే పేరు వచ్చింది. త్రిశూలపురమే తిరుచ్చుళి అయిందని చాలా మంది అనుకుంటారు కాని అది బహుశా సరికాదు.


రమణుడు పుట్టిన ఇల్లు.


భూమినాధేశ్వరాలయానికి ఐదు నిమిషాల నడకలో రమణుడు పుట్టిన ఇల్లు ఉంది. డిశంబర్ 30, 1879 లో రమణుడు పుట్టినప్పుడున్న పెంకుటింటిని 2010 లో పడగొట్టి మళ్ళీ నిర్మించారు. ఆయన పుట్టిన గది ఉన్నప్రదేశంలో ఆయన ఫోటో, దాని ముందు ఓ దీపం వెలిగించి ఉంది. భజనలు, పూజలు లాంటి కార్యక్రమాలేవీ జరుగుతున్నట్లు లేదు. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.


మీనాక్షీ దేవాలయం, మధుర.


దేవాలయం నిండా బాలాజీ (వెంకటేశ్వరస్వామి) తన చెల్లెలైన మీనాక్షిని శివుడికి కన్యాదానం చేసే చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. శివుడూ పార్వతీల మధ్య ఒకసారి జరిగిన నాట్యపోటీలో కింద పడిన తన చెవికమ్మని కాలితో తీసి పెట్టుకుంటున్న బ్రహ్మాండమైన శివుడి శిల్పం (ఊర్ధ్వ తాండవర్) లాంటి విశేష శిల్పాలు ఈ దేవాలయంలో చాలా ఉన్నాయి. గుడిలోని వెయ్యికాళ్ళ మండపంలో అనేక శిల్పాలని ప్రదర్శనగా పెట్టిన పెద్ద మ్యూజియం కూడా ఉంది.


తంజావూరు.

(ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)

మధురై నుండి తంజావూరు చేరుకోవడానికి నాలుగు గంటలు పట్టింది. తంజావూరు కి వెళ్ళే బస్సు మాట్టుదావణి బస్టాండులో ఎక్కాలి. తంజావూరు లో ఉన్నRTC కొత్త బస్టాండ్ బృహదీశ్వరాలయానికి చాలా దూరం. ఇక్కడ నుండి పాతబస్టాండ్ కి ఆటోలో వెళ్ళి అక్కడ ఉన్న హోటల్లో బస చేస్తే బృహదీశ్వరాలయం, సరస్వతీ మహల్ లాంటి ప్రదేశాలు చూడటానికీ, త్యాగరాజు సమాధి ఉన్న తిరువయ్యార్ వెళ్ళడానికీ అనువుగా ఉంటుంది.


మనకున్న ఆసక్తినిబట్టి బృహదీశ్వరాలయాన్ని చూడటానికి రెండు గంటల నుండి రెండు రోజుల దాకా పట్టవచ్చు. ముఖద్వారంలో ఉన్న గోపురం ఎత్తు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉండటం వల్ల ఒక రకమైన వింతశోభగా ఉంది. 1970-80కాలపు పాఠ్యపుస్తకాల్లో బృహదీశ్వరాలయం పేరిట ఉన్న చిత్రంలో విరిగిపోయిన రాళ్ళు, శిధిలాలతో కూడిన గోడల మధ్య దీనావస్థలో ఉన్న దేవాలయం దర్శనం ఇచ్చేది. దాన్ని ఊహించుకుంటూ వెళ్లినవాళ్ళకి చాలా ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. ఆలయప్రాంగణం లోపల ఇంటర్ ప్రెటేషన్ సెంటర్ అనే పేరుతో ఉన్న ఓ చిన్నభవనంలో ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా కట్టారో, ఎలా శిధిలమైపోయిందో, దాన్ని మళ్ళీ ఏ విధంగా గత రెండు దశాబ్దాలలో పునరుద్ధరించారో ఫోటోలలో చూడవచ్చు. ఆలయమంతా చాలా శుభ్రంగా ఉంది - ప్రాకారాలు, శిల్పాలు అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతున్నాయి.


ప్రాకారాలు దాటగానే మండపంలో బ్రహ్మాండమైన మహానంది శిల్పం! గర్భాలయం లోపల మూడున్నర మీటర్ల పైగా ఎత్తున్న శివలింగాన్ని క్యూలో చాలా దూరం నుంచే చూడవచ్చు. ఇవికాక ఆలయానికున్న పై అంతస్తుల్లో చాలా అద్బుతమైన శిల్ప సంపద ఉందట. వాటిని చూడటానికి ఇనప మెట్ల ఏర్పాటు ఉంది. కాని ఒక్క దక్షిణామూర్తి విగ్రహం దగ్గరకి ఎక్కడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విగ్రహం.


సరస్వతీమహల్.


సరస్వతీమహల్ భారతదేశంలో ప్రసిద్ధికెక్కిన అనేక ప్రాచీన గ్రంథాలున్న గ్రంథాలయం. ఇది మ్యూజియం, గ్యాలరీ లాంటి ఇతర భవనాలున్న తంజావూర్ మహల్ ప్రాంగణంలో ఉంది. ఈ ప్రాంతాన్ని 'అరమణై' అని వ్యవహరిస్తారు. మ్యూజియం ఇంకా ఇతర భవనాల్లోకి వెళ్ళడానికి టిక్కెట్ ఉంది కాని సరస్వతీమహల్ గ్రంథాలయం లోపలికి వెళ్ళడానికి మాత్రం అక్కర్లేదు. రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయం, వేటపాలెం లోని సారస్వతనికేతనం కన్నా ఇది పెద్దదీ, ప్రఖ్యాతి చెందినదీ కాబట్టి వెళ్ళగానే వేల పుస్తకాలు కనపడతాయని అనుకుంటాం. లోపలకి వెళ్ళాక కొన్ని బల్లలు కుర్చీలూ ఉన్న ఖాళీ హాలు దర్శనం ఇస్తుంది. హాలుకి ఓ మూల న్యూస్ పేపర్లు చదువుకునే ఏర్పాటు ఉంది. లోపలకి వచ్చేముందు బయట ఉన్న సెక్యూరిటీ ఉద్యోగితో 'ఊరికినే లైబ్రరీని చూడటానికి వచ్చాను' అని చెప్తే 'ఇది చూసే లైబ్రరీ కాదు సార్' అని ఎందుకన్నాడో అర్థమైంది - ఆ ఖాళీ హాలు చూశాక.


రైల్వే స్టేషన్లల్లో ఉండే వెయ్యింగ్ మిషిన్ సైజులో పుస్తకాల క్యాటలాగ్ సమాచారం ఇచ్చే కియోస్క్ లు రెండు ఉన్నాయి. వాటిల్లో పుస్తక శీర్షికని లేదా రచయిత పేరుని బట్టి పుస్తకాలు వెతుక్కునే ఏర్పాటు ఉంది. వెతుక్కుని కావలసిన పుస్తకం యొక్క నంబర్ అక్కడున్న ఉద్యోగికి ఇస్తే అతను లోపలున్న పుస్తక భాండాగారంలోకి వెళ్ళి సదరు పుస్తకాన్ని తెచ్చి ఇస్తాడు.


ఇదంతా అయ్యే పనేనా? - అయినా చూద్దాం అనుకుని చూస్తే, చాలా తెలుగు పుస్తకాలు కనపడ్డాయి కియోస్క్ లో. 1969 లో ప్రచురింపబడ్డ 'మద్రాసు తెలుగు' (చల్లా రాధాకృష్ణశర్మ) అనే పుస్తకాన్నీ, 1979 లో రంగనాయకమ్మ గారు తన స్వీట్ హోమ్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించిన చలం 'స్త్రీ' (ఆవిడ ముందుమాటతో) పుస్తకాల నంబర్లను కియోస్క్ కాటలాగ్ లోనుంచి రాసి సందేహిస్తూనే ఆ ఉద్యోగికి ఇచ్చాను. సందేహించడానికి కారణం - మునుపు గ్రంథాలయ ముఖద్వారం లో సరస్వతీ మహల్ అనే పేరు తెలుగు లో వ్రాసి ఉండేదనీ, దానిని ఈ మధ్యే తమిళ దురభిమానులు కొందరు తీసేయించారనీ ఆ మధ్యే చదివాను. ఈ విషయాన్ని వేటపాలెం గ్రంథాలయం చూడడానికి వచ్చిన తనికెళ్ళ భరణి గారు చెప్పి బాధ పడ్డారని ప్రకాశం జిల్లా ఎడిషన్లలో వ్రాసారు. దురుసుగా 'లేవు ఫో' అని చెప్పకపోయినా - 'పాత తెలుగు పుస్తకాలు కదా వెతకడం కష్టం' అని నసుగుతాడేమో కనీసం, అనుకుంటూనే ఇచ్చాను. ఐదు నిమిషాలు కూడా గడవకముందే గట్టి అట్టలతో నీట్ గా బైండింగ్ చేయబడి ఉన్న ఆ రెండు పుస్తకాలను తెచ్చి ఇచ్చాడు!


'మద్రాసు తెలుగు' పుస్తకంలో తంజావూరులో మాట్లాడే తెలుగుకి, మద్రాస్ లో మాట్లాడే తెలుగుకి ఉన్న భేదాలు ఇంకా మద్రాస్ తెలుగు భాష లక్షణాలు చర్చిస్తూ రాసిన వ్యాసాలు ఉన్నాయి.


ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు - కొన్ని తంజావూరు పలుకుబడులు :


  1. మీకు రాత్రి భోజనం కద్దా (మీరు రోజూ డిన్నర్ చేస్తారా?)

  2. అక్కడ భయం దొరకదు (భయం లేదు)

  3. దానికి ఏకసిగ్గు (దానికి ఒకటే సిగ్గు)

  4. ఇన్ని దినాలుగా ఏక వానలు (ఒకటే వానలు)

  5. పార్వ సరిగ్గా లేదు (కంటి చూపు సరిగ్గా లేదు)

  6. వాళ్ళకేదో బాధ్యం (వాళ్ళకేదో బంధుత్వం)

  7. నువ్వు మహా కంటివో (నువ్వు పేద్ద చూసినట్టు)


మద్రాసు పలుకుబడులు -


  1. దారం తేవే నీళ్ళు పీక్కుందాం (తాడు తీసుకురావే నీళ్ళు చేదుకుందాం)

  2. ముక్కద్దాలు (కళ్ళజోడు)

  3. జలదారి (తూము)

  4. పాతాళ గొలుసు (గాలం)

మద్రాసు తెలుగు లో 'బడు' ధాతువు వ్యావహారికంలో కూడా ఉందనిపించే కొన్ని వాక్యాలు -


  1. ఈ ఇల్లు గాలీగా ఉందని వినబడ్డాను (ఖాళీగా ఉందని విన్నాను)

  2. ఈ సమాచారం మీరు వినబడితిరా? (ఈ సమాచారం విన్నారా?)


మనం సాధారణంగా 'బడు' తో వాడే మాటని మద్రాసు తెలుగులో ఉపయోగించని ఉదాహరణలు కూడా (చెవులు సరిగ్గా వినడం లేదు' లాంటి వాక్యాల లో) ఈ పుస్తకం లో ఉన్నాయి.


ఈ రెండు పుస్తకాలు అంత త్వరగా ఇవ్వడంతో కాళూరి హనుమంతరావు గారు రాసిన 'సాహితీ జగతి' వ్యాసాల సంకలనం, దాంతోపాటే ఓ ఇంగ్లీషు పుస్తకం - వంద సంవత్సరాల క్రితం (1917 లో) ప్రచురించ బడ్డ లెడ్ బీటర్ గారి ఉపన్యాసాల సంకలనం - కూడా అడిగాను. అవి కూడా వెంటనే తెచ్చి ఇచ్చారు. ఇంత వేగంగా ఇవ్వడమే కాకుండా, ఇంత పాత పుస్తకాలని ఇంత మంచి కండిషన్ లో ఉంచగలుగుతున్నందుకు (అందునా తెలుగు పుస్తకాలు!) ఆశ్చర్యపోవాల్సిందే.


సాహితీ జగతిలో ఒక వ్యాసంలో కవిత్వానుభూతి లేని వాటికి Twinkle Twinkle little star / I don't wonder whar you are / For, by the spectroscopic ken / I know that you are hydrogen లాంటి పద్యాన్ని ఉదహరించారు.


'ద్రావిడ మూల భాషే తెలుగుకి కూడా మాతృక అనుకోకుండా, తెలుగు తెలుగునించే పుట్టిందేమో ఆలోచించండి' అని భాషావేత్తలకు కాళూరి హనుమంతరావు గారు ఇంకో వ్యాసంలో విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన ఇచ్చిన 'అచ్చతెలుగు' - అంటే ద్రావిడం కానివీ, ఇతర ద్రావిడ భాషల్లో సమానార్థకాలు లేనివీ - ఉదాహరణలు : కొంప (ఇల్లు), చిలువ (పాము), చీలి (పిల్లి).



తిరువయ్యార్.

(ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)

తంజావూరు పాత బస్టాండ్ నుండి అరగంటలో చేరుకోవచ్చు. తిరువయ్యార్ ని చాలా మంది తిరువయ్యూర్ అని పొరబడతారు. 'అయి' అంటే ఐదు, 'ఆర్' అంటే నది. ఐదు నదుల సంగమం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని తిరువయ్యార్ అంటారు. 'ఏహి త్రి జగదీశ మాం పాహి పంచనదీశా!' అనే త్యాగరాజ కీర్తన ఈ ఊరి దేవాలయంలోని పంచనదీశ్వరుడిని గురించి ఆలపించినదే.


త్యాగరాజస్వామి సమాధి మందిరం, ఇల్లు.


త్యాగరాజస్వామి తన జీవితంలో చాలా భాగం గడిపిన ప్రదేశం తిరువయ్యారు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. బస్టాండ్ నుంచి త్యాగరాజ స్వామి సమాధి మందిరానికి అరగంట నడక. సమాధి పక్కనే కావేరీ నది. నవనవలాడుతున్న ఆకులతో ఉన్న ఓ పెద్ద మర్రిచెట్టూ, దాని కొమ్మ మీదే పెరిగిన ఓ వేపచెట్టూ సమాధి మందిరం బయట ఉన్నాయి. సమాధికి ఆలయం కట్టించి, గోడల నిండా చాలా త్యాగరాజ కీర్తనల శిలాఫలకాలు తాపించిన బెంగుళూరు నాగరత్నమ్మ గారి సమాధి కూడా ఈ మందిరం ఎదురుగ్గానే ఉంది.


శిలాఫలకాల నిండా రాగతాళ వివరాదులతో కీర్తనల పూర్తి పాఠాలు తెలుగులో చెక్కబడి ఉన్నాయి.

అరుదైన రాగాలలో కీర్తనలు, ఎక్కడా కచ్చేరీలల్లో వినపడని కీర్తనలు చాలా చూడవచ్చు....


1. కోలాహలం (మదిలోన యోచన పుట్టలేదా మహరాజ రాజేశ్వరా!), 2. జూజాహుళి (పరాకు చేసిన నీకేమి ఫలముగల్గెరా పరాత్పరా! లాంటివి.

ఇంకా 'కారుబారు' అనే మాటతో 'కారుబారుసేయువారు కలరే నీవలే సాకేతనగరిని' అనే ముఖారి రాగ కీర్తనా, దేశ్యతోడి రాగంలో 'రూకలు పదివేలున్నా చారెడు నూకలు గతిగానీ! కోకలు వెయ్యున్నా కట్టుకొనుటకొకటిగాని! నూరు భక్షణములబ్బినా నోటికంతగాని! ఏరు నిండి పారినా పాత్రకు తగ నీరు వచ్చుగాని' లాంటి కీర్తనల పూర్తి పాఠాలు ఉన్నాయి.


త్యాగరాజ స్వామి నివసించిన ఇంటిని చూడాలంటే నదీతీరం నించి మళ్ళీ ఊళ్ళో కి వెళ్ళాలి. పాత ఇంటిని పడగొట్టి ఒక మందిరంలా పునర్నిర్మించారు. లోపల త్యాగరాజ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ ఇల్లు తిరుమంజనం వీధిలో ఉంది. చూడాలనుకున్న సందర్శకులకు ఇల్లు చూపించే ఏర్పాటు ఉంది - ఈ ఇంటి పక్కింటివారినడిగితే తాళం తెరిచి చూపించేట్లు. ఇంటిని సందర్శకుల కోసం తెరిచి ఉంచే వేళలు వేరే ఏమీ లేవు.



పంచనదీశ్వరాలయం.


తిరుమంజనం వీధికి ఐదు నిమిషాల నడక దూరంలోనే పంచనదీశ్వరాలయం ఉంది. చాలా పెద్దది. బ్రహ్మాండమైన ఆలయం. గర్భగుడి లోని మూలవిరాట్టు శివలింగం. దేవాలయం అంతటా ఉన్న శిల్పసంపద చాలా విస్తారంగా, అద్భుతంగా ఉంది.

కళ్ళు మూసుకుని ఉన్న యోగదక్షిణామూర్తి విగ్రహమూ, పానవట్టం మీద శివలింగం బదులు వినాయకుడు ఉండటమూ, శివపార్వతుల విగ్రహాలను పూజించడమూ, యముడికి శాంతి కలగడం కోసం ఒక నేల మాళిగలో సాంబ్రాణి పొడిలాంటిది వేసి మంటను ప్రజ్వలింపజేయడమూ - ఇలాంటి విశేషాలు ఈ దేవాలయ ప్రాంగణం లోనే చాలా చూడవచ్చు. గుడి బయట నుంచి రెండో ప్రాకారం వెంబడే గుడి వెనక్కి వెళ్ళి ఒక కొసన నిలబడి అరిచి ఇంకో కొననించి బ్రహ్మాండంగా ప్రతిధ్వనించడం వినవచ్చు.


కుంభకోణం.

(ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)

తంజావూరు నుంచి రెండు గంటల ప్రయాణంలో కుంభకోణం చేరుకోవచ్చు. సారంగపాణి ఆలయం ఇక్కడ ప్రసిద్ధమైనది. మూలవిరాట్టు శయనించి ఉన్న పెద్ద మహావిష్ణువు విగ్రహం. ఇది చాలా పెద్ద ఆలయం. పాతాళ శ్రీనివాసుడు, మెట్టు శ్రీనివాసుడు, కన్నాడి శ్రీనివాసుడు అనే పేర్లతో రకరకాల విగ్రహాలు, మందిరాలు ఆలయం లోపల ఉన్నాయి.


సారంగపాణి ఆలయానికి దగ్గరలోనే మరో పెద్ద రామాలయం (రామస్వామి ఆలయం) ఉంది. లోపల శిల్పాలన్నీ చాలా సెన్సువస్ గా ఉన్నట్టు నాకు అనిపించింది. 'దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?' అన్న పుస్తకాన్ని గుర్తుకు తెచ్చాయి కొన్ని శిల్పాలు. గర్భగుడిలో రాముడు సీత లక్ష్మణులతో పాటు భరతుడు, హనుమంతుడు కూడా ఉన్నారు.


కుంభకోణంలోని మరొక పెద్ద గుడి మహాకుంభేశ్వరాలయం. సకల జీవరాశుల ప్రాణానికి మూలాధారమైన పదార్థాన్ని బ్రహ్మ ఓ కుండ లో ఉంచగా, ప్రళయ సమయం లో అది ముక్కలై ఒక ముక్క కుంభకోణం లో పడిందట. ఆ పదార్థం ఈ గుడి కి దగ్గర లోనే ఉన్న మహామహం అనే కోనేరు లోనూ, ఈ గుడి లోనూ పడిందనీ స్థలపురాణం (ఇది ఒక వెర్షన్ ). ఈ కథలన్నీ గుడి లోపల వివరంగా రాసి ఉన్నాయి - బొమ్మలతో సహా!


రామానుజన్ నివసించిన ఇల్లు


సారంగపాణి ఆలయానికి దగ్గరలోనే విశ్వవిఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్ నివసించిన ఇల్లు ఉంది. దీనిని శాస్త్ర యూనివర్సిటీ వాళ్ళు సందర్శకుల కోసం చక్కగా పరిరక్షిస్తున్నారు. వారి నిర్వహణ చాలా బాగుంది. పెంకులు, గోడలు, తలుపులు, గడపలు అచ్చు ఆనాటివే అన్నట్లుగా ఉండి ఇంటి లోపలకి వెళ్ళగానే ఒక వంద సంవత్సరాలు కాలంలో వెనక్కి వెళ్ళినట్లు అనుభూతి కలిగింది. రామానుజన్ కి సంబంధించిన కొంత ఇన్ ఫర్మేషన్, ఫోటోలు, పేపర్ కటింగ్స్ ఇంట్లో ఉన్నాయి.


రామానుజన్ లండన్ లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో మానసిక సంఘర్షణని తట్టుకోలేక సబ్ వే రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఏదో అద్భుతంలాంటిది జరిగి రక్షింపబడ్డారు. ఆత్మహత్య చట్టప్రకారం నేరం కాబట్టి పోలీసులు కేసు పెట్టబోతే, హార్డీ గారు (రామానుజన్ ని లండన్ కి రప్పించినవాడు) రామానుజన్ రాయల్ సొసైటీ మెంబర్ కాబట్టి ఆయన్ని కోర్టుకి ఈడ్చకూడదని, చట్టం వర్తించదని చెప్తే - 'సరే' అని పోలీసులు వదిలేశారుట. అయితే రాయల్ సొసైటీ సభ్యులకి కూడా చట్టాలు వర్తిస్తాయనీ, అయినా అసలప్పటికి రామానుజన్ కి ఇంకా అఫిషియల్ గా ఆ సభ్యత్వం రాలేదన్న విషయం కూడా లండన్ పోలీసులకి తెలుసుననీ, హార్డీగారు చెప్పినదాన్ని "నమ్మినట్లు నటించి" రామానుజన్ ని వదిలిపెట్టారనీ, కేసు లేకుండా వదిలేసెయ్యడానికి అసలు కారణం రామానుజన్ మీద జాలిపడటం వల్లనేననీ - మొదలైన విషయాలు రాసి ఉన్న 'హిందూ పత్రిక' వార్త పేపర్ కటింగ్ ఇక్కడ నోటీస్ బోర్డులో ఉంది.



మధురై చూడాలన్న కోరిక పుట్టించి తద్వారా ఇన్ని ప్రదేశాలు చూసే అవకాశం కల్పించిన భగవాన్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెనక్కి వచ్చాను.