2011-10-29

నీలం రాజు లక్ష్మీ ప్రసాద్ గారి నోట్ బుక్ నుండి

గ్రీసు దేశం లోని ఏథెన్స్ నగరం వద్ద ఒక రోడ్ అంచున ఈసప్ కూర్చొని ఉన్నాడు. ఎవరో ఒక మనిషి అటు వెళుతూ, 'ఈ నగరం లో మనుషులు ఎలాంటి వారు?' అని అడిగాడు. అందుకు బదులుగా ఈసప్ ఆ వ్యక్తితో 'నువ్వెక్కడి నుండి వస్తున్నావో, అక్కడి మీ మనుషులు ఎలా ఉంటారో అది చెప్పు' అన్నాడు. ఒకింత చిరాకు ప్రకటిస్తూ ఆ వ్యక్తి "నేను ఆరగోన్ నుండి వస్తున్నాను. అక్కడివారు అబద్ధాల కోర్లు, దొంగలు, నిత్యం పోట్లాడుకుంటూ ఉంటారు. " అన్నాడు.
"నేనిలా చెప్పాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను. కానీ ఈ నగరంలోని ప్రజలు కూడా దాదాపు మీ ప్రజల వంటి వారే" నన్నాడు ఈసప్.
కాసేపటికి మరో మనిషి అటువస్తూ ఈసప్ ను అదే ప్రశ్న అడిగాడు. ఈసప్ పూర్వంలాగానే 'నీ రాక ఎక్కడినుండి అక్కడి నీ ప్రజలు ఎటువంటి వారు' అనే ఎదురు ప్రశ్న వేశాడు.
ఆ మనిషి ముఖం సంతోషంతో వికసించింది. "నేను ఆరగోన్ నుంది వస్తున్నాను. అక్కది మనుషులు స్నేహపాత్రులు. ఇతర్ల యెడల దయగానూ, మర్యాద తోనూ ప్రవర్తిస్తుంటారు. సదాలోచన ఉన్నవారు. వారిని వదిలిపెట్టి వచ్చెయ్యాల్సొచ్చినందుకు విచారిస్తున్నాను " అన్నాడు.
ఈసప్ బాగు బాగు అన్నట్లు తల ఊపి "బాబూ ఇక్కడి నగరంలోని మనుషులు కూడా అలాంటి వారేనని నీకు తెలుస్తుందిలే" అన్నాడు.

** ** *** **** *******
చిన్ని కన్నయ్యను, డాక్టర్ అప్పుడే వాక్సినేట్ చేశాడు. వాక్సినేట్ చేసిన చోట బాండేజ్ వేయనారంభించాడు. ఆ చేతి మీద బాండేజ్ వేయవద్దని, అవతలి చేతి మీద బాండేజ్ వేయమని కోరాడు కన్నయ్య.
"అదేమిటి కన్నయ్యా, నొప్పిగా ఉన్న చేతి మీది బాండేజ్ వేయాలి. మిగతా పిల్లలు ఆ చేతిని కొట్టాకూడదు. ముట్టాకూడదు అని వారికి తెలియాలి కదా? " అన్నాడు డాక్టర్.
"అవతలి చేతికే వేయండి దాక్టర్ గారూ, నా క్లాసు పిల్లల సంగతి మీకు తెలియదు" అన్నాడు కన్నయ్య నిదానంగా.
*******
లిన్ చీ అనే జెన్ మాస్టర్ తన కుటీరంలో కూచోనున్నాడు. ఆయన్ని దర్శించుకోడానికి ఎవరో ఒక ఆగంతకుడు వచ్చాడు. అతడెందుకో బాగా కోపంగా ఉన్నాడు. తలుపు దభాల్న తోసి తన బూట్లని చిరాకుతో కిందికి వేసి కొట్టి లోనికి ప్రవేశించాడు. అటు తర్వాత, మాస్టర్ కు గౌరవంగా వంగి అభివందనం తెలిపాడు.
లిన్ చీ అతడ్ని చూస్తూ, "ముందు వెళ్ళి ఆ తలుపును, ఆ బూట్లను క్షమించమని అడిగి రా" అని అజ్ఞాపించాడు. వచ్చిన వాడికి ఈయన ఎందుకిట్లా అంటున్నాడో అర్థం కాలేదు. అక్కడ కూచున్న వారందరూ నవ్వనారంభించారు. 'మీరు నవ్వులాపండి' అని వారందరినీ మందలిస్తూ, లిన్ చీ ఆగంతకునితో "నే చెప్పినట్లు చేయలేని పక్షం లో నీవు వెళ్ళవచ్చు, నీతో నేను వ్యవహరించను" అనేశాడు.
"కానీ ఆబూట్లను, తలుపునీ క్షమించమని అడగడం వెర్రి వ్యవహారంగా ఉంటుందండీ" అన్నాడు ఆ మనిషి.
"నువు కోపం తో తలుపును దభాల్న తోసినపుడూ బూట్లను కిందికివేసి కొట్టినప్పుడూ వెర్రి గాలేదు కాబోలు. ఇప్పుడు వెళ్ళి వాటిని క్షమాపణ కోరమంటుంటే, ఇది వెర్రి గా కనిపించిందన్న మాట. ప్రతి వస్తువుకీ చైతన్యమున్నదని గుర్తుంచుకో. అందువల్ల నే చెప్పినట్లు చేయి. ఆతలుపూ, బూట్లూ నిన్నుక్షమిస్తే తప్పితే నేను నీతో మాట్లాడేది లేదు. " అన్నాడు లిన్ చీ.
లిన్ చీ ఆజ్ఞ ను శిరసా వహింపక తప్పలేదు ఆ మనిషికి. అతడు వెళ్ళి ఆ తలుపును, బూట్లను క్షమించమని వేడుకున్నాడు. మొదట్లో అతడి కిదేదో పిచ్చి గా కనిపించింది. కానీ క్షణాలు గడుస్తున్న కొద్దీ తలుపూ బూట్లయొక్క మనసులు కరగనారంభించినట్లూ, అవి తనని క్షమిస్తున్నట్లు, అతడికో వింత అనుభూతి కలగడం మొదలైంది.
లిన్ చీ అతడ్ని గమనిస్తూనే ఉన్నాడు. క్షమించమని అడుగుతున్న ఆ వ్యక్తి చిత్తశుద్ధితో మనసారా అడుగుతున్నాడనీ, తలుపుకీ బూట్లకీ కలిగిన మానసిక బాధ కరగి పోవనారంభించిందనీ, లిన్ చీ కి అనిపించినప్పుడు, ఆ మనిషిని తన వద్దకు రమ్మని పిలిచాడు. ఆ వ్యక్తి అటు తరవాత సన్యాసిగా లిన్ చీ వద్దనే ఉండిపోయాడు.
భౌతిక వస్తువులైనా గడ్డ కట్టిన చైతన్యమేమో ! వాటినికూడా ఒకింత మర్యాద గానూ గౌరవంగానూ చూడాల్సి ఉంటుంది. అసలు మన చెప్పులు మనల్ని మోసి మోసి, మన కోసంకంకర రోడ్ల మీద ముళ్ళబాటల మీద పడ్డ బాధల్ని గుర్తుంచుకుంటే భరతుడు రామపాదుకల్ని మోసినట్లు, ఈ మన చెప్పుల్ని కూడా మోస్తే మన ఋణం తీరుతుందేమో ఆలోచించండి' అన్నాడు మిత్రశ్రీ.
**********************************************
మిసెస్ రేపాపోర్ట్ ఓ కొత్త కాడిలాక్ కారును వంద డాలర్లకు అమ్ముతానని ప్రకటించింది. ఆ ప్రకటన చూచి వచ్చినతడు అడిగిన మొదటి ప్రశ్న "కార్ కి ఉన్న దోషమేమిటి? " అని.
"ఏమీ లేదు. మీకు కొనుక్కోవడం ఇస్ష్టంలేకపోతే వెళ్ళండి. నా సమయాన్ని వృధా చేయవద్దు. " అన్నది ఆవిడ. వచ్చినాయన ఆవిడ వద్ద కారు తాళపు చెవి తీసుకొని, గరాజ్ లోకి వెళ్ళి కార్ ని వెనక్కు తోలుకుంటూ వచ్చి, ఇంటి ముందు నిల్పి, వంద డాలర్లు తీసి ఆవిడ చేతికి ఇచ్చాడు. "మీ డబ్బు చేతికి వచ్చిందిగా ! ఇక ఇప్పుడు చెప్పండి కిటుకేమిటో ? " అన్నాడు.
"ఏమీ లేదు. నా భర్త ఈ మధ్యనే మరణించాడు. అతది వీలునామా లో ఈ కొత్త కారును అమ్మి వచ్చిన డబ్బు ను తన సెక్రటరీ గా పని చేసిన ఆవిడకు ఇచ్చేయమని రాసి పోయాడు. " అంది ఆమె.
*********************************************
ఓ రాజకీయ నాయకుదు, ముల్లా నసీరుద్దీన్ ని కోర్టు కీడ్చి 'ఇతడు నన్ను గాడిద అన్నాడండి' అని ఫిర్యాదు చేశాడు. "నసిరుద్దీన్ !ఇది చాలా తప్పు సుమా ! " అన్నాడు జడ్జ్.
"నాకు నాయకుణ్ణి గాడిద అని సంబోధించడంతప్పని తెలీదండీ. క్షమించండి. " అన్నాడు నసీరుద్దీన్. సరేనన్నాడు జడ్జి.
"కానీ గాడిదను నేను నాయకా అని సంబోధిస్తే, మీకేమైనా అభ్యంతరమా "అని అడిగాడు నసిరుద్దీన్ అమాయకంగా.
"ఏ అభ్యంతరమూ ఉండదు. గాడిద, కోర్టు కొచ్చి ఫిర్యాదు చేయదు కదా? అందువల్ల నీకలా పిలవాలని అనిపిస్తే అలాగే కానీ" అన్నాడు జడ్జ్ ముసిముసి గా నవ్వుకుంటూ.
వెన్వెంటనే, నసిరుద్దీన్ పక్కనున్న రాజకీయ నాయకుడి వంక తిరిగి "నాయకా ఎలా ఉన్నావు ? " అని అడిగాడు.
**********************************************************
జెన్ సాధన మొదలెట్టినప్పుడు కొండలు, నదులు, తోడేళ్ళు - సాధారణ కొండలు, నదులు, తోడేళ్ళు గానే ఉంటాయి. బౌద్ధం అనుగ్రహించిన కళ్ళతో ప్రపంచాన్ని చూడనేర్చినప్పుడు - కొండలు, నదులు, తోడేళ్ళు సాధారణమైనవిగా తోచవు. అవన్నీ అసాధారణం గా కనిపిస్తై. కానీ జెన్ సాధన పూర్తి చేసిన తర్వాత - కొండలు, నదులు, తోడేళ్ళు కేవలం కొండలూ, నదులూ , తోడేళ్ళే - అవి సాధారణమైనవీ కాదూ, అసాధారణమైనవీ కాదు.
***********************************************************
నేర్చుకోదలచిన వానికి, భగవంతుడి సృష్టి లో, ప్రతి ఒక్కటీ పనికి వస్తుంది. పనికి రానిదంటూ లేదు. అన్నాడు ఉత్కళ రావు.
ఇది అతిశయోక్తి గా భావించిన మా బృందం లో ఒకరు
"అయితే రైలు నించి ఏమి నేర్చుకోవచ్చునో చెప్పండి. " అన్నాడు. "ఒక్క నిముషం ఆలస్యం అయితే ప్రయత్నమంతా నిష్ఫలమైనట్లే నని తెలిసి వస్తుంది. "
" మరి టెలిగ్రామ్ నుండి ? "
"ప్రతి ఒక్క పదానికి మూల్యం చెల్లించక తప్పదని !"

"మరి టెలిఫోన్ నుండి ? "
"మనమిక్కడ పలికే పలుకులు, ఆవల అక్కడ వినిపిస్తున్నవని! " అన్నాడు ఉత్కళ రావు.
************************************************
ప్ర: కాలాతీత స్థితి లో, మీరంటున్నట్లు నేను పరిపూర్ణుడనె అయినప్పుడు, నేనసలు ఎందుకు పుట్టాల్సి వచ్చింది ? అసలీ జీవితం యొక్క ప్రయోజన మేమిటి ?

నిసర్గదత్త : బంగారాన్ని ఆభరణంగా చేస్తే ఆ బంగారానికి ఏమిటి లాభం అని అడిగినట్లుంది. ఆభరణానికి బంగారం యొక్క వన్నె, అందం చేకూరుతై. బంగారం ఐశ్వర్యమేమీ పెరగదు. అదే విధం గా వాస్తవం గనక కర్మ లో అభివ్యక్తీకరింపబడితే, ఆ కర్మ అర్థవంతం గానూ అందం గానూ రూపొందుతుంది.
ప్ర: ఈ విధం గా వ్యక్తీకరణ జరగడం లో వాస్తవానికి కలిగే ప్రయోజనమేమిటి ?
నిసర్గదత్త : ఏమి ప్రయోజనముంటుంది ? ఏమీలేదు. కానీ ప్రేమ యొక్క స్వభావమే అంత : తననితాను వ్యక్తీకరించుకోవడం, ధృవపరుచుకోవడం, కష్టాల నతిక్రమించడం, ఇవీ దాని లక్షణాలు. క్రియాత్మకంగా ప్రవర్తిల్లే ప్రేమయే ఈ ప్రపంచం, అనే విషయం నువ్వు గ్రహించినపుడు, దాని వంక నీ దృక్పధం, దృష్టి మారిపోతాయి.
**********************************************************
కృష్ణమూర్తిగారొకసారి ప్రసంగిస్తున్నప్పుదు ఒక కుక్క గట్టిగా మొఱగడం ప్రారంభించింది. చేసేదేమీ లేక, కృష్ణజీ ఆగిపోయారు. సమావేశం లో నున్న ఒక వనిత, ఇదే అదనుగా భావించి, అకస్మాత్తుగా లేచి నుంచొని గబగబా ఏదో మాట్లాడసాగింది. ఎవరికీ ఆమె మాటలు ఎవరికీ అర్థం అవలేదు, వినరాలేదు. కృష్ణమూర్తి నిట్టూర్చి, "క్షమించాలి మేడం, శునకమే గెలుస్తున్నది" అన్నాడు.
కృష్ణమూర్తి నుండి సహజంగా పుట్టుకొచ్చే సమాధాన చాతుర్యం, హాస్యం ఒలికించే చమత్కార భాషణ, ఆ సమయానికి అక్కడ ప్రత్యక్షమయ్యే ఆయన అంతర్గత చైతన్య ప్రవాహంయొక్క తాకిడిని , ఏ కృష్ణమూర్తి పుస్తకమూ అందించగలిగి లేదు. అక్కడి పరిస్థితిని పునరావృతం చేయనలవీ కాదు. కేవలంఅక్కడ ఏమి సంభవించింది అని మాత్రమే చెప్పగలం.
*****************************************************
ఒక ఇటాలియన్ సామెత :
చదరంగం ఆట అయిపోయిన తర్వాత రాజూ, బంటూ ఒకే చెక్క పెట్టె లోకి వెళ్తారు
******************************************************
రబ్బై మోషే ఇజ్ టాక్ వద్దకు ఇద్దరు యూదులు తీర్పు చెప్పమంటూ వచ్చారు. వారిద్దరూ శ్మశాన భూమి లో తాము మరణించినప్పుడు పూడ్చి పెట్టడానికని రెండు స్థలాలు కొన్నారు. ఒక దానికన్నా రెండోది మరి కాస్త బాగుంది. అది నాకు కావాలంటే నాకు కావాలని వాదోపవాదాలు సలుపుకున్నారు. ఎటూ పరిష్కరించుకోలేక, ఇజ్ టాక్ ను తీర్పు చెప్పమన్నారు. రబ్బై కాస్త ఆలోచించి "ఎవరు ముందు చనిపోతే వారికా బాగున్న స్థలం దక్కుతుంది" అన్నాడు. ఇద్దరు యూదులూ వాదులాడుకోవడం మానేసి, మౌనంగా ఆలోచించుకుంటూ ఇళ్ళకి వెళ్ళారు.
************************************************************
జెన్ మాస్టర్ అవసరం ఎవరికి ?
జెన్ మాస్టర్ ఉండడంమనిషికి అవసరమంటారా ? మాస్టర్ ఎందుకుందాలి ? అని ఓ విద్యార్థి సియూంగ్ సాన్ ను అడిగాడు.
నువ్వీ మీటింగ్ కు ఎందుకు వచ్చావు ? అని ప్రశ్నించాడు సియూంగ్.
విద్యార్థి ఊరకుండి పోయాడు.
నీవు ఆలోచించే మనిషివైతే, మాస్టర్ అవసరమే. ఆలోచనలను అంతం చేసిన వాడివనుకో, మాస్టర్ అక్కరలేదు. నీ మనసు స్పష్టంగా తేటతెల్లంగా ఉంటే , జెన్ మాస్టరే కాదు, ఆ బుద్ధుడు కూడా అక్కరలేదు, ఏదీ అక్కరలేదు.

1 Comments:

Blogger Madhu Latha said...

ఇంటింటా తెలుగు వెలుగులు వెలగాలని ఈ వెబ్ సైటు తయారుచేయబడినది.
www.teluguvaramandi.net

8:28 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home