2006-06-21

జ్వరం ఒక వరం

శ్రీమతి సరోజినీ ప్రేమ్ చంద్ (Srimati Sarojini Premchand) గారి "మబ్బుల అడవి" (Mabbula Adavi) కవితా సంపుటం లోనించి. చాలా చక్కటి కవిత.
_______________________________________________________
జ్వరం ఒక వరం

బాల్యంలో బడి కి ఎగనామం పెట్టే ఒక ఎత్తు.
బెడిసి కొడితే
ఆకాశం కింద గాలితో పరుగులు తీసే కాళ్ళకి
నవారు మంచం లో ఖైదు.

ఇప్పుడు గానుగ ఆపేసి
ఎద్దు కాళ్ళని కట్టి పడేసి
ఎన్నాళ్ళనించో ఊరిస్తున్న పుస్తకం
ఒక్క బిగిన చదివే అదును.

ఆల్బుఖారా చప్పరిస్తూ
బాబరు తెచ్చాడా, బుడత కీచులా
ఏ స్తానో ఈ బుఖారా జన్మస్థానం
సోమరిగా వాగే మనసుకు
సువిశాలమైన ఆటస్థలం

పిచ్చాపాటీల నుంచీ
తప్పని సరి కబుర్ల శ్రవణం నించి
ఊసుపోని ఇరుగుమ్మల నించి
రక్షించే కవచం అవుతుంది మంచం
నన్ను నాతోనే పంచుకునే స్నేహం పుట్టుకొస్తుంది.
బిరుసెక్కిన అరచేతుల్లా
కడగంటి చూపైనా ఎరగని మోచేతుల్లా
లోలోపలి లోతుల్లో
అణగారి పోయిన మోజులూ మోహాలూ
తడిమి చూసుకునే తరుణం అవుతుంది.

చనిపోయిన మామ్మ, చిన్ననాటి నెచ్చెలీ,
మాగాయ అన్నం లో మీగడేసి పెట్టిన అత్తయ్యా -
అంతా గుర్తుకొచ్చి జ్ఞాపకాల కణాలు కరిగి
కళ్ళ అంచుల్దాకా ప్రవహించే
మనోచిత్రాల స్రవంతవుతుంది.

కిటికీ లోనుంచి పిలిచే ఆకాశపు నీలం
అతి దగ్గర నేస్తాల మాటల్లా వినిపించే
కాకి అరుపు, పిట్టల కిలకిల, ఉడతల కీచుకీచులూ
చెట్లపై కదులుతున్న లేలేత ఎరుపులూ,
పచ్చి పచ్చి పచ్చలూ, పండబారిన పసుపులూ
మునుపెన్నడూ గమనించని వాటి రూపురేఖలూ

కొబ్బరిచెట్టు గంభీరంగా నిలబడి
గోపాల రెడ్డి గారిలా చేతులూపడం
కొత్తగా ఆవిష్కరించుకున్న రంగుల చిత్రపటం అవుతుంది.

నుదుటి మీద యుడికొలొన్ దస్తీ కంటే
చల్లని ప్రేమ హస్తం
వూరికే పడుకున్నా వురిమురిమి తొంగి చూడని
వంటింటి నిశ్శబ్దం
మందలింపు మాటల్లో మందులా సేదనిచ్చే
వింత తత్వం

జ్వరం వస్తే ఎందుకసలు అంత కలవరం ?

1 Comments:

Blogger spandana said...

నిజమే అద్భుత కవిత.
జ్వరం నిజంగానే వరంగా ఉండేది. నావరకైతే స్కూలుకి ఎగ్గొట్టాడనికి కాదు గానీ, పుస్తకాలు ఏక బిగిన చదవడానికీ, అమ్మ చేతి నుదుటి స్పర్షకీ ...
మా ఆవిడ చెప్తుంది..జ్వరం తెచ్చుకోవటానికి ఉల్లి గడ్డ చంకలో పెట్టుకుని పడుకునేదట చిన్నప్పుడు.. నాకంత తెలివి లేదు అప్పుడు.
-- ప్రసాద్

7:11 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home