2006-06-22

అపరాధ భావన

August 15, 03.
ఆమ్స్టర్ డామ్, హాలెండ్ నించి వుప్పర్తల్, జర్మనీ కి రైలు ప్రయాణం లో:
భయం భయం గా దగ్గరవుతోంది సాయం కాలం
చెప్పరాని చెప్పలేని గుబులు పుట్టిస్తూ.
ఆకాశం అంతా ఏదో తెలీని వేదన అలుముకుంది
బావి గట్టు దగ్గరున్న రావి చెట్టుమీద
అంతా గోల గోల గా ఉంది.
మరి పక్షులు గూళ్ళకి చేరతాయా ?
మార్కాపురపు బాల్యం మెల్లగా వెనక్కి వస్తోంది.
ఆటలాడే సమయం అయిపోయింది.
ఇక నాన్న వస్తాడు
ధుమ ధుమ లాడుతూ కంది పచ్చడి కలుపుతూ ఉంటాడు
అమ్మ లోలోపల పళ్ళు కొరుకుతూ వడ్డిస్తూనే ఉంటుంది.
మజ్జిగ దగ్గర వస్తుంది తారాస్థాయి.
చెంబులో పళ్ళేలో గాల్లోకి లేస్తాయి.
అందరితో పోలుస్తూ అసంతృప్తి ప్రకటిస్తూ
విరుచుకు పడుతుంటాడు నాన్న.
అవును అవునవును
తప్పంతా నాదేగా నాన్నా - అవును నాదేనా
ఇప్పుడు ఆఫీసు లో ఏ పని జరిగినా జరక్కపోయినా
అదంతా నాదే బాధ్యత. అందుకనే ఈ క్షోభ.
ఎన్ని హృదయాలు తూట్లు పడాలో
ఎంత మంది 'వాంగో' లు బలి అవాలో
ఎన్ని చిత్రాలు ఛిద్రమవాలో
ఎన్ని కుంచెలు విరిగిపోవాలో
ఈ పోల్చి చూసుకోవడాలకి.
తప్పు తప్పు గా ఉందే అంతా ?
ఈ కౄరత్వానికి పరిష్కారం మార్క్సు కనిపెట్టాడనుకున్నారు.
అసలు మనిషి ని మార్చకుండా
పై పైన తూతూ మంత్రం వేసారు.
కౄరత్వం అధికారం కేవలం వేషం మార్చుకున్నాయంతే.

1 Comments:

Anonymous అజ్ఞాత said...

మీ అన్వేషణ ప్రవాహం కాదు సముద్రం లా ఉంది.

9:34 PM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home