గండభేరుండం
20th April, 04.
అమితమైన పని. కళ్ళనిండా రక్తపు జీరలు. చిన్న లాప్ టాప్ ని చూసి చూసి. మధ్యలో హఠాత్తుగా ఏర్పడ్డ చెడ్డ స్పృహ. ఇతరులు చెడ్డగా ప్రవర్తిస్తారేమోనన్న భయపుఊహలూ, ప్రవర్తించారన్న విమర్శల వెనుక, అలా ప్రవర్తించాలన్న వాంఛ తళుక్కున మెరిసింది. తిట్ల వెనుక ఉన్న అసలు చెడ్డ బయటికి వస్తోంది. దీనికి బయట స్థితి తో సంబంధం లేదు. చెడ్డని ఆశించి, ఊహించి, తిట్టుకుంటూ క్రూరంగా ఆశగా నాలుక చప్పరించడమే దీని పని. వేల మంది పూర్వీకుల దీర్ఘాలూ, ఈసడింపులూ, వెక్కిరింపులూ, క్రూరత్వాలూ నాలో మూర్తీభవించినట్లుగా ఉంది. దానికి చక్కగా పూసిన చక్కెర పూతలు - తెలివితేటలూ, విన్యాసాలూ, ఆర్గ్యుమెంట్లూ.
18th April 04.
ఖండాంతరాలలో, మెట్ల మధ్య క్రీనీడల్లో సర్రున జారిపోతున్న కార్ల టైర్ల రాపిడి లో, విమానాల రెక్కలలో, క్షిపణుల దిగుడు చావులలో, రతి సుఖంలో - ప్రశాంతత లో వాలి పోతున్న ఆలోచనా గండ భేరుండం. అనేక ప్రదేశాలలో ఒకేసారి సంచరించాలన్న ఆతృత. గడ్డు గా పెట్టుకున్న ముఖాలు - భయాలూ, గర్వాలూ, బిడియాలూ - చెడ్డ అని ఏదైతే మనసు అనుకుంటోందో అది జరగబోతున్న వందలాది potential possibilities యొక్క వలయపు ఝంఝ. దాని వల్ల తృప్తి పడుతున్న వెకిలి తనపు అంశ. ప్రతి మాట లోనూ సన్నివేశం లోనూ రెక్కలు విదులుస్తున్న అహంకారపు గండభేరుండం. - మొన్నటి కలలో రెక్కలు విప్పి టపటపా కొట్టుకుంటూ ఆకాశం లో కెగురుతోంది. వివిధ ఫల పుష్ప వృక్ష జాతులతో కూడిన దట్టమైన అరణ్యాలలో ఉన్నదేమిటో కనుగొనాలని తిరుగాడుతోంది.
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home