2006-05-18

విశ్వ వ్యాకరణి

Dec 23, 05.

నోమ్ చామ్స్కీ గారు చెప్తున్నారు*. ప్రతి human brain లో lingual processing component జెనెటిక్ గా ఉండి మిగతా అన్ని సిస్టమ్స్ లాగానే 5, 6 ఏళ్ళ దాకా develop అయి maturity పొందుతుందిట. దీన్ని parser అంటున్నాడు. భావాన్ని మొట్టమొదట "అనుకునే" ఈ పార్సర్ భాష తో సంబంధం లేకుండా పనిచేస్తుందట. ఈ పార్సర్ అనేది 'భావాన్ని', బ్రైన్ లో ఇంకొక భాగానికి (ఏదో భాషా నైపుణ్యాన్ని సంపాదించుకుని దాచుకున్న భాగం) feed చేస్తే అప్పుడు ఆ భావం ఆ భాష లో సంభాషణ గానో రాత గానో బయటికి వస్తుందట. కాబట్టి 'నోములాయన' చెప్పింది ప్రతి మానవుడూ విశ్వవ్యాకరణ సూత్రాలు నేర్చుకునే పుడతాడనీ, ఏదైనా ఒక లేదా కొన్ని భాష లు నేర్చుకోవడం అనేది వేరే విషయం అనీ. అందుకనే భాష నేర్చుకోవడం అనేది one state of mind that stored the knowledge of a particular language అని define చేస్తాడు, విశ్వవ్యాకరణాన్ని వేరు చేస్తూ.

*- power and prospects అనే వ్యాస సంకలనం లో. ఇది "మామూలు" మనుషులకోసం రాసింది లాగానే ఉంది.

ఒక్కో సందర్భం లో

ఒక్క మాటే వంద ముద్దులు పెడుతుంది.
ఒక్క చూపే వెయ్యి రహస్యాలు చెప్తుంది.
ఒక్క నిట్టూర్పే లక్ష కౌగిలింతలుగా మారుతుంది.
వేల మైళ్ళ దూరపు నిశ్శబ్దమే గాఢ పరిష్వంగపు అనుభూతి నిస్తుంది

అవ్యాకరణి

May 8, 05.
బాధా తరంగిణి. భయ తరంగిణి.
అయితే చీకటి లో చివరగా ఉన్న 'టి' నెత్తు'టి' లాంటి ఔపవిభక్తికమేనా కాదా ? అయితే అసలు మాట (నామం) ఏమిటి ? చీకరు ..ఆ. ఆ- ఇదేమిటి మతి పోతున్నట్లుగా ఉంది ?!

అన్నమయ

May 6, 05.
విశ్వ ప్రకాశునకు వెలి ఏడ లోనేడ
శాశ్వతునకూహింప జన్మమికనేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ
హరికి నారాయణున కవుగాములేడ*

"కన్నులెదుటిదే ఘన వైకుంఠం.."

వందల సంవత్సరాల క్రితమే ఇట్లాంటి పదాలు రాయడానికి ఎలాంటి కాన్షస్ - (no-fear లేక భయ రాహిత్యం, స్పష్టత, సూటిచూపు) ఉండిఉండాలి అన్నమయ్యకి!

* అవుగాములు = అవడమూ, కాకపోవడమూ; కలిమీలేమీ, సుఖమూ దుఖ:మూ-
ఇక్కడ బహుశా "ద్వంద్వాలు" అని భావార్ధం అయి ఉండవచ్చు.
________________________________________________________
ప్రతి చర్య కీ ఊహించలేని unintended consequences ఉంటాయి. అప్పటిదాకా జరిగిన సంఘటనల వరసకి ఏదో add అయింది కాబట్టి. కొత్త కొత్త ఆలోచనలు ఆచర్య తరవాత పుట్టుకు రావచ్చు. వాటన్నింటినీ ఆలోచిస్తూ చర్య చేయడం సాధ్యం కాదు.
రోజూ వాకింగ్ చెయ్యడం ఆరోగ్యానికి మంచిదని మొదలు పెట్టవచ్చు. అలా నడవడం వల్ల దొరికే సమయమూ, శరీరంగురించో వేరే విషయాల గురించో ఆలోచించడానికి సమయం కుదరడమూ, ఆ ఆలోచనల వల్ల తర్వాత జరిగే పరిణామాలూ ఇవన్నీ వాకింగ్ మొదలు పెట్టేటప్పుడు ఊహించలేం.
___________________________________________________________

డిస్కవర్

Mar 29, 05.
చక్రాన్నీ, కాల్క్యులస్ నీ, మునుపు కనుగొన్న విజ్ఞాన శాస్త్రాన్నీ మళ్ళీ ఎవరూ కనిపెట్టక్కర్లా. కానీ "నేను" అనే దానికి సంబంధించినదీ, చేతనాంత: చేతన లలో ఉండే విషయాల్ని మాత్రం ఎవరికి వారు తనకు తానుగా కొత్త గా చూడాల్సిందే ట.

// ప్రేమ తో ఆజ్ఞాపించిన ప్రియురాలి కి ఎలా సమాధానం చెప్పడం?
// శ్రీనివాసుకి మాండలీనూ, కృష్ణన్ కి వయొలీనూ, ఎప్పటికీ అలవాటు గా మారవు. మారదు కాబట్టే కళ నాలుగు కాలాల పాటు నిలుస్తుంది.

జగమొండి కవి

Mar 17, 05
మొండి వాడు రాజు కన్నా బలవంతుడు - ఐతే
కోరికలు లేనివాడు మొండి వాడి కన్నా బలవంతుడు.
___________________________________
ఫోను చెయ్యలేదే ? అంటున్న స్నేహితులకి ఇలా చెప్పాట్ట కవి.
--మాట్లాడిన దానికన్న మాట్లాడని దానికే ఎక్కువ విలువా, ఆకర్షణాను. చేసి ఏదో మాట్లాడితే అంతా చేతనే. బాహిరమే. మాట్లాడకుండా ఉన్న నిశ్శబ్దం లో, అచేతన లో అంతర్గతంగా ఉన్న మాట్లాడుకోలేని మాటలన్నీ వినవచ్చు. --

ప్రస్థానం

Mar 14, 05.
అసలు కొంచెం ఏవో సందేహాలతోనే మొదలు పెట్టాడు ప్రయాణం,
చుట్టూతా దారి పొడుగున ఉన్న వాళ్ళు చెప్తున్నది వింటూ. సలహాలన్నీ కొంత కాలానికి ఆహా ఓహో లయినాయి. కాంతా కనక కీర్తి ప్రతిష్టలూ, ఉందో లేదోనని అనుమాన పడుతున్న అశేష సమాజం చేస్తున్న జేజేలు తారాస్థాయి కి చేరుతూండగా…
చటుక్కున ఆగాడు. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. ముందుకు పోవడం ఆగాడని చిన్నగా గొణుగుడు. "ఏదో కొంత విశ్రాంతి" - "మళ్ళీ బయల్దేరుతాడులే! " - "అయినా అన్నీ వస్తుంటే ఎందుకూ ఆగడం? " - ..
ఆగిన కాళ్ళు వెనక్కి తిరిగాయి. "ఏంటి వీడికేమన్నా పిచ్చా? వెర్రా?
ఏం మాయరోగం - సుబ్బరంగా అన్నీ వచ్చి పడుతుంటే? "
- తను ప్రయాణిస్తున్న దారి గుండా తన మీద పడుతున్న దుస్తులూ, ఆభరణాలూ తన కి నప్డంలేదని తెల్సిందిట అతనికి. వడి వడి గా వేరే దారి లో నడక సాగించాడు మూలాల్ని వెతుకుంటూ.

వైరాగ్య బంధాలు

Mar 11,05.

"వైరాగ్య బంధాలు" - సంసార బంధాల కన్న ఎక్కువ యోచింప వలసిన విషయం…
________________________________________________

సురస డాట్ నెట్ లో ద్వారం నాయుడి గారి వయొలిన్ వింటే జన్మ ధన్యమైనట్లుగా ఉంది.

భిన్నాలు

Mar 10, 05.
ఏ relationship లోనైనా క్రమంగా జరిగేదిదే - వాడికీ, వాళ్ళకీ మధ్యనున్న differences ని క్రమంగా glorify చేసుకుంటాడు. ఉహూ వీళ్ళు వేరే, మనతోటి కుదరదు - పడదు అని ఒక subtle and silent పో రాటానికి అనువుగా దారులు వేస్తాడు. "నా understanding కీ వీళ్ళకి వున్న దానికి చాలా బేధం. ప్రపంచం పట్ల నా దృక్పధం వేరే" అని దూరంగా జరిగిపోతాడు. దృక్పధాలు కలిస్తేనే దగ్గరితనం సాధ్యం అనుకుంటాడు అమాయకంగా. మనిషితనం మరుగున పడటం వల్ల సమాజంలో మనుషులమధ్య వచ్చిన సమస్య లివన్నీ.

జనాంతికం

Mar 07, 05.
“ఎప్పుడూ దు:ఖంగా మాంద్యంగా ఉంటుందండీ నాకు" అని స్వచ్చమైన చిరునవ్వుతో జనాంతికంగా చెప్పే మనిషితో ఏం మాట్లాడగలం?
//ఇప్పటిదాకా జీవితంలో ఒక పద్ధతి లేదా pattern ప్రకారం జరుగుతున్న సంఘటనల వరుస ఒక 'చివర' కి వచ్చినట్లుగానో, ఏదో తార్కిక ముగింపుకి చేరినట్లుగానో పదే పదే కలుగుతున్న ఒక భావన//

మాయమయిన నాణెం

Mar 5, 05.
'స్వ' అలా ఎగదంతుంటుంది దాన్ని కప్పిపెట్టి busy గా ఏదో పనిలో మునిగిపోనప్పుడల్లా. కొంతమందిలో ఉండే aggressive bio-desire ఇంకొంత మందిలో సేవా దృక్పధం తో అర్పించుకోవాలన్న కోరిక గా ఉండవచ్చు. - రెండూ ఒకే నాణేనికి ఇరువైపులంటున్నారు మరి. అది తెలియదు కానీ - ఈ మూల కోరికపు పాటర్న్ మాయమవడం ఒక జ్ఞాపకంగా గుర్తుంది "ఆ స్థితి" లో.

లోపలి స్వరూపం

Mar 4, 2005.

ఏదో అసలు స్వరూపపు మూల కోర్కె - దానికి హింస, చెడ్డ అన్న పేరు పెట్టక్కర్లేదు. కాని మనిషి ఆ pattern యొక్క అంశ లేకుండా ఏ పనీ చేయలేడు. వేరే రకంగా ఏదైనా మొదలుపెట్టినా కొంచెంసేపట్లోనే (రోజులో, వారాలో, నెలలో) ఆ 'మూలం' చేసే పనిలో వ్య క్తమవజూస్తుంది. కానీ సంఘంలో నిర్మించుకున్న మర్యాదాపూర్వక image వల్ల అలా ప్రవర్తిల్లడం సాధ్యం కాదు. అందుకని నిరాశా, నిస్పృహ, నిరుత్సాహం.
______________________________________________________

నాడి కొట్టుకోవడం గమనిస్తూ సిరల్లో రక్తంప్రవహిస్తున్న చప్పుడు వినడం.
ఒంగోలు కొండ మీదికి ఎర్రటి ఎండలో చెప్పుల్లేకుండా ఎక్కడం.
నేల క్లాసు 60 పైసల టిక్కెట్టు క్యూ లో చెమట చొక్కాల పూర్వజన్మ వాసన.
కాళ్ళంటుకు పోయే మండు టెండ లో ఎన్టీవోడి పోస్టర్ ని తాపీగా నమిలి మింగుతున్న జీవం.
కిళ్ళీ బడ్డీ లో నోరూరిస్తున్న ఐదు పైసల గొట్టాలు
డిటెక్టివ్ యుగంధరుణ్ణి రహస్యంగా చొక్కా కింద బంధిస్తున్న పెద్దన్నయ్య.
మల్లవల్లి ఇలాకా నించి ఒంగోలు మీదుగా సాగుతున్న తీగెలు
ఇరవైనించి తరవాతి శతాబ్దానికి ఒక్కసారిగా దూకిన జ్ఞాపకాలు
అనేక సంవత్సరాలుగా కరడు గట్టిన ఘర్షణా సంక్షోభాలు
బొట్లు బొట్లుగా రాలుతున్న బాధ.

పాత్రలూ - ధారులూ

Mar 1, 05.
అమాయకుడి ఆలోచనలు : భర్త భార్యని కొడతాడు. డబ్బున్నవాడు పేదవాణ్ణీ, బలవంతుడు బలహీనుణ్ణీ అన్యాయం చేస్తాడు. భార్య, పేదవాడు, బలహీనుడు - వీళ్ళంతా మంచివాళ్ళు. ఎవరికీ ఏ ఆపదా తలపెట్టని వాళ్ళు. బాధితులు ఎప్పుడూ మంచివాళ్ళే.
వారు వీరయితే తెలుస్తుంది అసలు సంగతి - యుగయుగాలుగా జరుగుతూనే వుందిట పాత్రలు మార్చుకోవడం.
/మరికొన్ని: Victims ఎప్పుడూ మంచివాళ్ళే. సంగీతం వినేవాళ్ళందరూ సహృదయులే. వెజిటేరియన్లందరూ సౌమ్యులే. అనుకునేవాళ్ళందరూ అమాయకులే.

అవకాశం - త్రాణ

Feb 9, 05.
Shrek-2 అనే సినిమా లో హీరో నీ సహాయకుణ్ణీ బంధించినప్పుడు సహాయకుడు గలభా చేస్తుంటే హీరో అంటాడు. You have the right to be silent but lack the capacity to use it అని. Spiritual point of view లో కూడా చాలా బాగా అన్వయించగల మాట ఇది.
'నేను' లోకీ చేతన లోలోపలికీ వెళ్ళడానికి అందరికీ అవకాశం ఉంది మానవుల్లో. కానీ ఆసక్తి/ఓపిక లేవు మెజారిటీకి.

హెలికో బాక్టరుడు

Feb 8, 05.

స్నేహితుల ఇంట్లో చదివిన 'హెలికో బాక్టర్ పైలోరి' గురించిన వ్యాసం (సైంటి. అమెరికన్ -Feb05) నిజంగానే huge thing లాగుంది scientific community లో. మైటోకాండ్రియల్ డీఎన్ఏ కన్నా ఇంకా వివరంగా మానవ జాతుల కదలికల్ని minute గా పట్టుకోవచ్చుట. ఎందుకంటే h-pylori is so much more genetically diverse than its host (!)హోమోసేపియన్స్. ఎక్కడి మానవుడు ? ఎక్కడి పైలోరి ? ఒకవిధంగా incredibly complex organism అయిన మానవశరీరమూ, ఏ విధంగానూ పోల్చలేని అమిత సూక్ష్మ క్రిమి- వేల సంవత్సరాలుగా పరస్పరం ఇచ్చి పుచ్చుకుని జీవనం సాగిస్తున్నాయట. ఏవో complex mathematical models (వేరే మహాగణకుల సహాయంతో) వేసి ఈ రెండు organisms పరస్పర సహకారాన్ని ఎలా పెంపొందించుకున్నాయో నిరూపించాడట డాక్టర్ మార్టిన్ బ్లేజర్ గారు. natural intelligence అంటే ఇదేనా ? వేన వేల సంవత్సరాలుగా ఎన్నో శరీరాలు హతమయే ఉంటై. అలాగే ఎన్నో పైలోరి క్రిములు కూడా.. కానీ మళ్ళీ మళ్ళీ జరగాల్సిందే ఈ ప్రాసెస్ ఒక సమతా స్థితి ఏర్పడే వరకూ.
/ అసలు ఈ understanding అంతా తప్పేమో.. ఇలా continuous గా ఒక పరమార్ధం కోసం evolution జరుగుతోందనీ ఇదంతా trying out for some equilibrium లేదా ideal అన్న విషయం.
// ఎప్పుడో ఏర్పడి పోయిందేమో ఈక్విలిబ్రియం. అసలు కదలికే దాన్ని disturb చేస్తోందేమో.

మంచి చెడ్డలు

Feb 3, 05.
చెడ్డ పనులు చెయ్యని వాళ్ళందరినీ మంచి వాళ్ళనగలమా? అలానే మంచి పనులు చెయ్య(లే) ని వాళ్ళందరిని చెడ్డ వాళ్ళనొచ్చా ? తప్పు కదా ?

లాంగ్ టెంపర్

Jan 30, 05
You are long tempered అంటున్నాడు తొమ్మిదేళ్ళ అబ్బాయి. ఇది short tempered కి వ్యతిరేకంట వాడి భాషలో. నంబర్ల కి ఎలాగైతే అంతంలేదో అలాగే భాషలో వాక్యాలకి అంతం లేదన్న విషయం భాషా శాస్త్రం లో ఒక ముఖ్యమైన ప్రాధమిక పాఠం ట. చేకూరి రామారావు గారి పుస్తకం చదివి కొత్త గా తెలుసుకున్న విషయం

ప్రోత్సాహం

Dec 20, 04.

ప్రోత్సాహం ఇవ్వడానికి qualification అని కాదు గాని - ఇచ్చే మనిషి మీద తీసుకునే వాడికి నమ్మకం, గౌరవం, అభిమానం ఉండాలి. లేకపోతే transmission సాధ్యపడదు. కావల్సింది అదే అని తెలిసినా ఇవ్వగలిగే మనుషుల్ని దూరంచేసుకుంటారు కొందరు. దీనికి కారణం అహంకారం, గర్వం, పొగరు, నిర్లక్ష్యం అయి ఉండవచ్చు.
//ఈ need, బాధ, negative pattern ని అనుభవించడం వెనుక ఎందుకు, ఎలా పోతుంది అన్న ప్రశ్నలున్నంతకాలం సంఘర్షణ, బాధ తప్పవు. ఇలా వుంది అంతే అన్న curiosity తో దానిలోనే వున్నప్పుడు అది మాయమవుతుంది.

2006-05-16

యముడి ముందు చలం

యముడి ముందు చలం - Yamudi mundu chalam
గుడిపాటి వెంకట చలం (Gudipati VenkataChalam) గారు రాసిన ఈ స్కెచ్ 1948 నాటిదట. "పరమ సత్యాన్ని" రెండు పేజీల్లో ఎలా చెప్పగలిగాడా అనిపిస్తుంది చదివితే. తరచిన కొద్దీ కొత్త కొత్త సత్యాలు స్ఫురింపజేసే ఈ సంభాషణ నిజంగా ఒక మాస్టర్ పీస్. ఆధ్యాత్మికంగా ఆకలి గొన్నవాళ్ళు ఆవురు ఆవురు మని చదవవలసిన రచన.
చలం : ఎవరూ ? యముడా?
యముడు : అవును.
చలం : ఉన్నావా ? లేవనుకున్నాను.
యముడు : అనుకోలేదు. అనుకున్నాననుకున్నావు.
చలం : అన్ని మతాల వాళ్ళూ ఇక్కడికి రావలసిందేనా?
యముడు : యముడి లో నమ్మకం ఉన్నవాళ్ళు
చలం : తక్కిన వాళ్ళూ ?
యముడు : వాళ్ళ నమ్మకం ప్రకారం
చలం : అసలు నమ్మకం లేక పోతే ?
యముడు : ఏమీ లేదు. దేంట్లోనూ నమ్మకం లేని వాళ్ళకి.
చలం : మరణం తరవాత జీవితంలోనే నమ్మకం లేకపోతే ?
యముడు : మరణం తోనే ఆఖరు !
చలం : నాకూ నమ్మకం లేదే ! చాలా మందికి లేదు ఇప్పుడు.
యముడు : లేదంటే చాలదు. నిజంగా, నిస్సందేహంగా లేక పోవాలి. లేని వాళ్ళ జీవితమే వేరు. మృగాలకి లేదు. వాటికి మృత్యువు తోనే అంతం. మరణంతో నిజంగా అంతంఅనుకునే మనిషికి జీవితంపైన ఆ పట్టు ఉండనే ఉండదు. అ రాతలు, ఆ వాదాలూ, ఆ ప్రేమలూ, ద్వేషాలూ నిలచి పని చెయ్యవు. నువ్వు చెప్పేదే నిజమని నమ్మకం. అవన్నీ ఏమిటి ? ఏదీ నిలవక ప్రతి నిముషం బూడిదై పొయ్యే ప్రపంచం లో సత్య మనేది ఎక్కడ వుంది ?
చలం : కానీ మానవ జాతి అభివృద్ధి, సత్యానికి కళ్ళు తెరవగల…
యముడు : ఏం మానవజాతి ? పదేళ్ళ తరవాత ప్రపంచం వుంటుందని ఆ విశ్వాస మేమిటి ? సత్యమేదో తెలుసుకుంటుందని ఆ ఆశ ఏమిటి ?
చలం : అట్లా అయితే ఈ విశ్వాసాలేం లేకుండా స్వార్ధంగా బతికేవాడికి ఇక లోకం లేదన్న మాట !
యముడు : స్వార్ధంగా బతికే వాడికి వుంది. వాడు దేనికో బతుకుతున్నాడు గనుక.
చలం : మరి ఎవరికి లేదూ ?
యముడు : అంటే అందరికీ వుంది. కాని అనేక విధాలుగా వుంది.
చలం : నాకు యముడు అనే వాడిలో ఎన్నడూ నమ్మకంలేదు.
యముడు : అయితే యముడివా అని నన్నెందుకు అడిగావు ? యముడని నన్నెందుకు అనుకున్నావు ?
చలం : అవునేమో, అనుకున్నాను.
యముడు : అందుకనే అయినాను.
చలం : అనుకోకపోతే ?
యముడు : యముణ్ణి కాను.
చలం : అప్పుడు ఎవరు ?
యముడు : నువ్వెవరని అనుమానిస్తే వాణ్ణి.
చలం : తరవాత ?
యముడు : తరువాత నువ్వేమని అనుకుంటున్నావో, అది !
చలం : ఏమీ అనుకోవటం లేదు.
యముడు : అబద్ధమాడకు. (నవ్వుతున్నాడు). నేను చెప్పనా ? నీకు స్వర్గమా, నరకమా? అనుకుంటున్నావు . అవునా ?
చలం : నాకు స్వర్గనరకాలలో నమ్మకం లేదు.
యముడు : అదంతా సరేలే. అది భూలోకంలో. పుస్తకాలలో. ఇక్కడ నన్ను చూసి అనుకున్నావా లేదా ?
చలం : మరి యముడు గనక తరవాత అంతేకదా నేను అనుకోవలసింది !
యముడు : అవును. అంతే కదా. అదే నిజం !
చలం : సరే, స్వర్గమా, నరకమా ?
యముడు : నేను యముణ్ణయినప్పుడు, నరకమే గా నీకు ?
చలం : నాకు నరకం లో ఎప్పుడూ నమ్మకం లేదు.
యముడు : లేదు. కాని నీ ఊహలూ, రాతలూ, పనులూ, ప్రపంచం లో ఏ మార్పు తెస్తాయనుకున్నావో ? ప్రపంచం లోని వాడివేగా నువ్వూను ? నీలో అవి తెచ్చే ఫలితమే నరకం ?
చలం : స్వర్గం కాకూడదా ?
యముడు : కావచ్చు. కాని నరకాన్ని ఏరుకున్నావు.
చలం : ఎప్పుడు ?
యముడు : ఇప్పుడే, అంటే నీ జీవితమంతా అన్నమాట!
చలం : అంటే ?
యముడు : ఇప్పుడనేది - పూర్వం ఎప్పుడూ అనే దాని పర్యవసానం - ఏ కార్యానికైనా ఫలితంవుంటుంది అనే నమ్మకంవుంటే, మరి ఫలితం వుండకుండా వుండదు. మిగిలిపోయిన ఫలితాలు అక్కడ అనుభవించాలి.
చలం : ఆ నమ్మకం లేకపోతే?
యముడు : లేకపోతే స్వర్గం లేదు, నరకం లేదు. కాని ఫలితం కలగదని పనులు చేసే వాళ్ళెవరు ?
చలం : నేను యముడననీ, నరకమనీ ఎందుకు అనుకున్నానంటే, చిన్నప్పటి భయాలూ, అలవాట్లూ వొదలక. అంతే కానీ నమ్మకం వుండి కాదు.
యముడు : మరి ఏం విశ్వసించావు ?
చలం : నాకేం తెలీదన్నాను.
యముడు : సరే, ఇప్పుడు నేర్చుకుంటావు.
చలం : ఏం నేర్చుకుంటాను ?
యముడు : ఏం నేర్చుకోవాలని వుంటే అదే !
చలం : ఏం లేద నా!
యముడు : అదే నేర్చుకుంటావు. నరకం లో.
చలం : మరి ఈ శిక్ష ఎందుకు ?
యముడు : నీ అవినీతి కార్యాల ఫలితంగా.
చలం : అట్లా రండి. నీతి అంటే ఏమిటి ? అవినీతి అంటే ఏమిటి ?
యముడు : నీకు తెలుసా ?
చలం : నాకు తెలీదు. తెలుసునన్నవాళ్ళతో వాదిస్తాను.
యముడు : నీ వాదాలు నాకు తెలుసు.
చలం : నా పుస్తకాలు చదివారా ?
యముడు : నిన్ను చదువుతున్నానుగా ఇప్పుడు !
చలం : నేను చాలా సార్లు మారాను.
యముడు : అన్ని మార్పులతోటీ స్పష్టంగా నిన్ను చదువుతున్నాను.
చలం : మరి చెప్పండి నీతి అంటే ఏమిటో ?
యముడు : నువ్వేమంటే అదే !
చలం : అయితే నాకు శిక్ష ఎందుకు ?
యముడు : నువ్వనే నీతికే నువ్వు విరుద్ధంగా చాలాసార్లు ప్రవర్తించావు గనక. కాదా ?
చలం : అవును. కానీ నా ఆదర్శం చాలా ఉన్నతం.
యముడు : కాని, నీ నీతి కీ, నీ ఆదర్శానికీ నువ్వు అపకారం చేసుకున్నావు. దానికి పరిశాంతి ఈ నరకం !
చలం : అసలు ఏ ఆదర్శం లేకుండా శాస్త్రాల్లోదీ, పొరుగువారనేదీ నీతిగా తీసుకుని బతికే వారికి నీతి గా వుండడం సులభం.
యముడు : అవును.
చలం : మరి వాళ్ళకి ?
యముడు : స్వర్గం
చలం : స్వర్గమా ? ఎందుకు ?
యముడు : నీతి గా బతికారు గనక. వాళ్ళ మనసులో అవినీతి చేశామనే నేరభావంలేదు గనక.
చలం : నేరభావం లేక పోతే చాలునన్న మాట. ఇక నేరమనేది లేదా?
యముడు : అదేగా రాసావు ఇన్నాళ్ళూ? పాప పుణ్యాలు లేవనీ, మనసు కల్పించుకుంటోదనీ, ఎవరి అంతరాత్మ వారికి ధర్మకర్త అనీ!
చలం : అంటే స్వర్గ నరకాలకి మనసులే ఆధారమా ?
యముడు : అవును. అంతే. నువ్వు రాసిన మాటలే. కాని నీకు నమ్మకం లేదన్న మాట.
చలం : మరి వీటి ని నిర్ణయించే దేవుడు ?
యముడు : దేవుడూ అంతే. కావాలంటే వున్నాడు. అఖ్కర్లేక పోతే లేడు !
చలం : మరి ఇదంతా నిర్ణయించే దెవరు ?
యముడు : నువ్వే !
చలం : తక్కినవాళ్ళనీ ?
యముడు : వాళ్ళే !
చలం : మరి నువ్వూ !
యముడు : నువ్వు వున్నావంటే వున్నాను అని చెప్పాను కదూ !
చలం : చాలా అన్యాయంగా వుంది వ్యవహారం.
యముడు : ఏమిటి ?
చలం : లేని దేవుడిలో స్వర్గం నమ్మితే, స్వర్గమా ?
యముడు : ఆ !
చలం : నేను చూసిన దొంగ భక్తులకీ, మూఢులకీ, పురుగు ల్లాంటి క్షుద్రులకీ ?
యముడు : వాళ్ళకీ అట్లాంటి స్వర్గమే. అంటే, వాళ్ళు కోరుకునేలాంటి స్వర్గం. వారు ఆరాధించే దేవుడు.
చలం : విష్ణు భక్తులకీ ?
యముడు : వైకుంఠం.
చలం : ఎంత బుద్ధి హీనుణ్ణి ! నేనూ ఓ దేవుణ్ణి నమ్మితే …
యముడు : ఏం లాభం ? నువ్వు నమ్మలేవు. అయినా ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. గట్టిగా కోరుకుంటే వైకుంఠానికి వెళ్ళవచ్చు. కాని త్వరలోనే నరకానికి పోవాలని కోరుకుంటావు.
చలం : ఎందుకు ?
యముడు : భరించలేక. నీ స్వభావం అట్లాంటిది గనక.
చలం : ఏం చేస్తారు వైకుంఠం లో ?
యముడు : ఏం చెయ్యాలని ఆ భక్తులు కోరుకుంటారో అదే !
చలం : భజన ! పిడి భజన !
యముడు : అవే… భరిస్తావా ?
చలం : వాళ్ళూ ?
యముడు : (నవ్వుతో) అదేదో గొప్పపని అని మీ లోకం లో ప్రార్ధిస్తారు. నీ సాన్నిధ్యం లో చేర్చుకో. ఇంక మాకేమీ అవసరం లేదని! కాని అన్ని అవసరాలూ వుండనే వుంటాయి. వెడతారు వైకుంఠానికి. రాత్రింబగళ్ళు భజనే భజన !
చలం : వాళ్ళకి శాంతి అది !
యముడు : అనుకుంటారు.. భజన్లు, విష్ణుసాన్నిధ్యం శాంతి నిస్తుందని, భేషజాలకి భక్తి కోరుకుంటారు. కాని దాంటో నిలవలేక యాతన పడతారు.
చలం : నిజం గా భక్తి మాధుర్యం కలవాళ్ళో ?
యముడు : వాళ్ళకి ఫరవాలేదు. కాని వాళ్ళెందరున్నారు ? చాలా మంది కోరుకునే స్వర్గాలు అంతే, అసలు వాళ్ళకి ఇక్కడ ఏం కావాలో తెలిసిన వాళ్ళెంతమంది ?
చలం : మరి వాళ్ళేమౌతారు ?
యముడు : అట్లా తెలీక వెతుక్కుంటూ వుంటారు, అయోమయం గా తెలుసుకున్న దాకా.
చలం : మరి నరకంలో బాధలు పెడతారు కదా ?
యముడు : ఎవరన్నారు ? నువ్వు కోరుకున్నవన్నీ నరకం లో ఉన్నాయి. అందుకని అక్కడికి వెడుతున్నాము. మేమేం బాధ పెట్టము. ఆ బాధలేవో నువ్వే పెట్టుకుంటావు !
చలం : ఎందుకు పెట్టుకుంటాను ?
యముడు : భూలోకం లో ఎందుకు పెట్టుకుంటావు ? అక్కడా అంతే !
చలం : నాకు కావలసిన వన్నీ ఇక్కడా వుంటాయిగా ?
యముడు : అదే బాధ ! కావలసినవన్నీ వుండే బాధ. పైగా అవి నిన్నో పట్టాన వదలవు. స్వర్గం లో భజనలు మల్లేనే తలుచుకో. నీ పుస్తకాలూ, నీ కలలూ….
చలం : మరి ఇంక ఆ లోకానికీ, ఈ లోకానికీ వ్యత్యాసమేముంది ?
యముడు : ప్రయత్నాలూ, ఆశలూ ఫలించే లోకం ఇది. అంతే. ఆ లోకం లో మిగిలి పోయినవన్నీ.
చలం : ఈ నరక కాలం అయిపోయింతరవాత ఏమవుతాను ?
యముడు : ఏం లేదు. కానీ అనుకోకుండా వుండవు.
చలం : అప్సరస తో తిరుగుతో వుండాలనుకుంటే… ?
యముడు : అపుడెందుకు ? ఇప్పుడూ తిరగగలవు. అట్లా కోరుకుంటే. కానీ అక్కడంతా శాంతీ, సుఖం అనుకోటం లోనే మనుషులు చేసే పొరపాటు. వాళ్ళ మనసు వాళ్ళ తోటే వుంటుంది.
చలం : చాలా అర్ధంకాకుండా వుంది.
యముడు : అంతేలే. ఈ జన్మల్ని ఎవరూ నీ మీద రుద్దడం లేదు.
చలం : మరి సత్యం, న్యాయం, పద్ధతీ, అభివృద్ధీ…
యముడు : అవన్నీ వున్నాయి. కాని నువ్వు అనుకునేట్టు సంకుచితంగా కాదు. విలువలున్నాయి. కాని అవి కనబడవు నీకు. స్వార్ధంగా, క్రూరంగా బతికే మనుషులకి జీవితం లోంచి ఏమొస్తుంది? ఇతరుల కన్నీళ్ళలో బాధ పడే వాడికి, ఒక్క చిరునవ్వు లోంచి వచ్చే మాధుర్యం ఎవరెరుగుదురు ? బైట ఏం జరుగుతోందని కాదు - వాటి నించి నీ లోపల ఏం జరుగుతోందనే దృష్టి నీకు కలిగిన రోజున సమన్వయం ఎక్కువగా కలుగుతుంది.
చలం : మరి ఈ జనన మరణాల్నించి తప్పించుకోవాలని చేసే సాధకులు - మూర్ఖులేనా?
యముడు : వాళ్ళకింకా జీవించాలని వుంది. నిజంగా అఖ్కర్లేక పోతే, జనన మరణాల్నించి తప్పించుకోవడం ఒక్క నిముషం పని. జీవితం లో తాము కల్పించుకున్న బాధల్ని తామే పడలేక, ఏదో ముక్తి కావాలనే ఏడుపు ఆ సాధన అంతా.
చలం : మరి ఈశ్వరుడు ఆనందమయుడు, ఆత్మ ఆనందస్వరూపం అంటారు, అదేమిటి ?
యముడు : దేని మీదా ఆధార పడని ఆనందం కావాలనుకున్న నిమిషాన అదీ సిద్ధం గానే వుంది.
చలం : మరి అందరూ ఆ ఆనందాన్ని ఎందుకు కోరుకోరు ?
యముడు : వాళ్ళకి అఖ్కర్లేదు గనక !
చలం : ఎందుకు అఖ్కర్లేదు ?
యముడు : నీకెందుకు అఖ్కర్లేదు ?
చలం : అఖ్కర్లేకేం ? దొరక్కగానీ !
యముడు : దొరకడ మేముంది ? నువ్వు గట్టిగా ఇంకో దృష్టి లేకుండా వాంఛించాలి అంతే. నిజంగా యోచించుకో. ఆనందం అనేటప్పటికి నీ మనసు ఏం వాంఛిస్తుంది ? నీ పుస్తకాలు తెప్పించనా ? ఆ ఆనందమే పుష్కలంగా దొరుకుతుంది నీ కిక్కడ ! ఆ రూపాన ఆనందం వద్దని నువ్వు మొర పెట్టిందాకా ?
చలం : నా మొర ని ఎవరు వింటారు ?
యముడు : నువ్వే !
చలం : విని ?
యముడు : విని, ఇంకో రకమైన ఆనందాన్ని కోరుకుంటావు ?
చలం : తరువాత ?
యముడు : అది సిద్ధిస్తుంది. అంతే.. నిరంతరంగా అంతే…. అది ఇవ్వలేదనీ, ఇచ్చాడనీ, దేవుణ్ణీ, విధినీ, లోకాన్నీ, కర్మనీ తిడుతో బతుకుతారు. ఎవరు వాంఛించేది వాళ్ళకి తటస్థించి తీరుతుంది. అంతకన్న కరుణ గల విషయం ఆలోచించుకో గలవా ? వెళ్ళు. వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు.
చలం : ఎవరు ?
యముడు : నీ కధా నాయికలు. నువ్వు వాంఛించి, ఊహించి కల్పించుకున్న ఆదర్శ వ్యక్తులు.
చలం : అమ్మో !
యముడు : (నవ్వుతో) చూశావా ? నీ నరకం ఇక్కడే ప్రారంభమయింది !
చలం : పోనీ స్వర్గానికి పోనీరా ?
యముడు : నిరభ్యంతరంగా . కానీ అక్కడ మునులూ, రాంభజన గాళ్ళూ.
చలం : ఆడవాళ్ళూ?
యముడు : రాజ్యలక్ష్ములూ, కాంతం, హృదయేశ్వరులూ, సవితలూ వుంటారు.
చలం : వద్దులేండి. నరకానికే పోతాను.
యముడు : నాకు తెలుసు గా ! అంటే నీకు తెలుసుగా !

గోడెల్ తర్కం

24th Nov 04.

భూమికి ఒకరోజు, సంవత్సరం లాగా వేరే గ్రహాలకి వేరే వేరే రోజులూ సంవత్సరాలూ (మన లెక్కలో) మరి విశ్వం మొత్తాన్ని లెక్క లోకి తీసుకుంటే కాల భావన అభాసం అవుతుందా? భూమిని మర్చి పోయి నేను విశ్వం లో ఉన్నాను అనుకునేట్టయితే రోజులూ సంవత్సరాల అర్ధం మారిపోతుంది.
విశ్వం లోని ప్రతి అణువూ కదులుతూనే ఉంది relative to something else అనుకునేట్లయితే ప్రతి కణం లోనూ కాలం ఉన్న భావన తెలుస్తోంది. కానీ విశ్వం పుట్టిన క్షణం (when there is one whole and no movement or space) దగ్గర కాలం = 0 అంటే ఏదో అర్ధమవుతున్నట్లే ఉంది.
// గోడెల్ అనే ఒక జర్మనీ ఆయన ఒక తర్కాన్ని నిరూపించాడట. ఏమిటయ్యా అది అంటే: ఏ వ్యవస్థ అయినా - పరస్పర విరోధం కాని, నిరూపించలేని కొన్ని స్వీకృతాలతో ఏర్పడుతుంది (అంటే కొన్ని basic premises, postulates, prove చెయ్యకుండా అంగీకరించవలసినవి ).
ఇటువంటి ఏ వ్యవస్థ లో అయినా అవును అనో కాదు అనో సమాధానం చెప్పలేని ప్రశ్నలు కొన్ని తలెత్తుతాయి. వీటి ని సమాధాన పర్చడానికి మళ్ళీ కొన్ని స్వీకృతాలతో (అంటే పరస్పరం నిరోధించుకోని postulates) ఇంకొక కొత్త వ్యవస్థ ని నిర్మించాలి. కనీ మళ్ళీ దీన్లో కూడా నిశ్చయంగా అవునో కాదో చెప్పలేని ప్రశ్నలు పుడతాయి' అని నిరూపించాట్ట గోడెల్ గారు. అంటే ఈయన సిద్ధాంతంవల్ల తెలిసిన దేమిటంటే - పరస్పర విరుద్ధం కాని స్వీకృతాలతో నిర్మించబడ్డ ఏ వ్యవస్థ లో అయిన సరే అనిశ్చిత ప్రశ్నలు (మళ్ళీ ఇంకొక system సహాయం లేకుండా జవాబు చెప్పలేనివి ) తలెత్తక మానవు.
అయినా ఇలాంటి క్లిష్టమయిన ప్రశ్నలు ఎందుకు వేసుకుంటారో అసలు దీన్ని ఎలా నిరూపించాడో అంతా దుర్గ్రాహ్యం గా ఉంది.
ఈ తర్కం నిరూపించిన తర్వాత రస్సెల్, వైట్ హెడ్ తాము తయారు చేయ బూనిన "స్వయంపరిపూర్ణక గణక వ్యవస్థలు" అసాధ్యాలని గ్రహించి విరమించేరట.
// ఈ అన్వేషణ అంతా అర్ధంలేనిది. ఏ అవరోధాలూ లేని పరిపూర్ణ ప్రశాంతత అంతటా విలసిల్లుతోంది అంటున్నాడు టాగోర్ గీతాంజలి లో. మరి వీళ్ళు ఆ కవిత్వం చదివారో లేదో.

పునరుక్తి - మోక్షం

19th Nov, 04

కొన్ని విషయాల గురించి అదే పనిగా మాట్లాడినా, discuss చేసినా దాని reality తగ్గినట్లనిపిస్తుంది. ఒక decision నో, కోరికనో, సంఘటన ప్రాశస్త్యాన్నో ఎక్కువ సేపు ఎవరికైనా వివరిస్తే - అది అసలు నిజం కానట్టనిపిస్తుంది.
// ఏదైనా నాటకం కోసం rehearsals వేస్తూ చాలా రోజులు అవే డైలాగ్స్ చెప్పగా చెప్పగా - ఆ నాటకం మొదటిసారి చదివినప్పుడు ఉన్న భావం null and void అయి నట్లుగా ఉండేది. ఏదో ఒకరకమైన అలసట తో కూడిన ప్రశాంతత, ఇదంతా అబద్ధం అన్న భావన కల్గేది. అలాగే ఒక పేరునో మాటనో అనేక సార్లు repeat చెయ్యడం వల్ల (చిన్నప్పుడు స్నేహితులపేర్లని ఇలా అనేవాళ్ళం వెక్కిరించడానికి) ఆ పేరులో ఉన్న నిజం (అంటే mind అంతకుముందు ఆ మాట కు కల్పించిన image లేదా association తగ్గిపోయినట్లనిపించేది. ) గాయత్రి నో, రామ నామాన్నో, కోకోకోలా అన్న మాట నో జపిస్తే వచ్చే ప్రశాంతత ఇదే అని కొంత మంది ఉవాచ.

దేవుడు

15th Nov 04.
దేవుడి పటం ముందు దేవుడే కూర్చున్నట్లనిపిస్తుంది. ఏం ఎందుకు కూడదు ? ఆ మాట కదేగా అర్ధం ?
నువ్వు నాస్తికుడి వేనా ? దైవం లో నమ్మకం లేదా? అని అడిగితే "ద్వి" అన్న భావన దైవం లో ఉన్నట్లైతే లేనట్టే మరి అన్నాట్ట.

ఆధునిక సంస్కృతం

Sept 5, 04.

ముసురు పట్టీ పట్టనట్టున్న మబ్బులు కమ్మిన హేమంతపు మధ్యా హ్నపు వేళ- మునుపు కురిసిన వానల వల్ల వచ్చిన బురద లో వేసిన బండరాళ్ళ మీదుగా నడుస్తున్నాడు, రెల్లు గడ్డి తో వేసిన గుడిసె తలుపు తీయడానికి. శారదానిలయపు సంస్కృతం, బ్రాడీ పేట ఆధునికపు కోరికలతో కలిసిన వాసనలు పీలుస్తూ.

అహంకారం

16th July 2004
కళ్ళలోంచి రాలే నిప్పు కణికలు
నోట్లోంచి ఆగి ఆగి వస్తున్న ఆవిరులు
నాకోసం ఒకలా ఉండని మనుషుల్ని
కొరికి నమిలి మింగుతున్న ఆలోచనలు
ఒకలా అంటే
నా భావ జాలానికి నిత్య స్తుతి, నిరంతర ప్రగతి !
ఊహించుకున్న సిద్ధాంత సంప్రదాయాల ప్రకారం హారతి
మేరు పర్వతంలా పెరుగుతున్న మేధ
ని చూసి బ్రహ్మ పుత్ర లా పొంగుతున్న అహం

ప్రశ్న

11th July, 2004.
సృష్టి తనను తాను వేసుకుంటున్న ప్రశ్నలన్నీ ఒక్కొక్క కదలిక లో వ్యక్త మవుతున్నాయి - జీవంగా

అఘాతం

June 5th, 2004

ఎదుటి మనిషి అవమానిస్తే - ఒక్కసారిగా మనసులోంచి వంద కత్తులు విచ్చుకుంటున్న భావన. ఆ మాటలన్నీ mind లో latent గా గూడు కట్టుకున్న వాసనల్ని ఒక్కసారిగా activate చేసి విరుచుకుపడమన్న కోరిక గా తర్జుమా అయినయి. కొయ్యబా రిపోయినట్టుగా దీన్నంతా చూస్తూ రాస్తున్నాడు. ప్రస్తుతానికి ఏమీ reaction లేని బాహ్య నిశ్శబ్దం. ఏ నిముషంలో ఏ మాట ఎదుటి మనిషి గొంతు లోనించి దూసుకు వస్తుందో, అది తన లో ఎటువంటి reaction కలిగిస్తుందోనని భయంతో వణికిపోతున్నాడు.
One part in him says “ఎంతమంది స్వాతంత్ర్యాలు హరించి వాళ్ళు బానిసలుగా పడి ఉంటే ఆనందించావో - దాని ఫలమే ఇది" అంటోంది. పూర్వజన్మల్ని నమ్మడమే అనుకోక్కర్లేదు. One series of events had happened in the past, results of which might be these events happening now. కారణాలు వెతుక్కుని కనబడితే తృప్తి పడే ఒకరకమయిన అలోచనా ధోరణి ఇది.
//మంచితనం, నెమ్మది, సౌజన్యం, వెలుగు - ఇవన్నీ చాలా మందికి (కనీసం కొన్ని సమయాల్లో) భరించలేనట్లుగా ఉంటాయి.

అవడం

22nd May, 2004

ఇలా కాకుండా ఉంటే మీరు ఏమయే వాళ్ళు ? అని అడగలేము వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు జీవించిన జీవితంలో ఏదో ఒకటి 'అవడం' అనేది లేదు - ఎప్పటి కప్పుడు "అచ్చంగా" జీవించడమే.

సాయంకాలం

April 11th, 2004

ప్రశాంతమయిన సాయంకాలం యొక్క వాసన పీలుస్తూ, తెల్లగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ - బాల్యపు ఇంటి వాతావరణాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది మనసు. కంది పచ్చడి రుబ్బుతున్నట్లు గానో , కాగుతున్న పులుసుని కుంపటి మీద కలియ బెడు తున్నట్లు గానో దృశ్యాలు మెదులుతూ ఉంటాయి.
// ఏమీ చెయ్యకుండా కూర్చోవాలనిపించడం ఒక మానసిక ధోరణి అయ్యుండవచ్చు. ఇతరులకి ఇబ్బంది కలిగించనంతవరకూ ఇది ఎందుకు అవమానకరంగా పరిగణింపబడాలో తెలియదు.
// మిగతా విషయాలన్నింట్లోనూ ఉండే పైసా బుద్ధి పుస్తకాలకి సంబంధించినంత వరకూ మాయమవుతుంది. అసలు ఏదో డబ్బు అన్నది మన దగ్గర్నించి పోతుందన్న విషయం పూర్తిగా మరుగున పడి, పుస్తకం మన దగ్గరుండడమో, లైబ్రరీ లోనో, మితృడి దగ్గరో ఉండడం లో మన పాత్రో అత్యంత సహజంగా తోస్తుంది.
// గరిక గడ్డి, పేడతో నిండిన మట్టి వాసన, పల్లెటూర్లో పక్కగా, ఒంటరిగా నుంచున్న మేడ మెట్లు, సాయం సంధ్య వేళ వీధిలో కుందుళ్ళు ఆడుకుంటున్న పిల్లల్ని అన్నానికి రమ్మని కేక వేసే అమ్మలు..

2006-05-15

సెనేట్ లో టెనెట్

March 9, 04.

c-span లో జార్జి టెనెట్ గారి హియరింగ్ చూస్తూ .. అంటే సెనేట్ సభ్యులకు ప్రభుత్వం తరఫున సమధానాలూ / సమాచారం ఇవ్వడం.
అన్నీ గంభీరమైన మొహలే. ఏ దేశాల్లో ఏయే మనుషులు చంపబోతున్నారో, వాళ్ళాపని చేయకముందే ఎలా చంపుకోవాలో చెబుతున్నాడు టెనెట్ గారు. ఆయన బుగ్గలు, మొహం, నుదురూ, మాట్లాడేటప్పుడు చేతులు కదిపే విధానం, ఇతర gestures అన్నీ చూస్తే అచ్చం ఆంధ్రా వాడి లాగానే ఉన్నాడు.
// లక్షల కోట్ల మందిలో పగిలిన హృదయాలు. హింస, క్రౌర్యం, అధికారం: ప్రేమ దొరకక అలమటిస్తున్న బతుకులు.
ఇంకా హింస, దానికోసం సన్నివేశాలూ, మతాలూ, సూత్రాలూ సృష్టించుకోవడం - అదంతా ఒక్కసారిగా ఈ సెనేట్ గదిలో టెనెట్ మాటల మధ్య నున్న నిశ్శబ్దం లో ప్రతిధ్వనిస్తోంది.
ఇనప మొహాలేసుకున్న ఆర్మీ బ్రాట్స్ - జీవనం కోసమే మొదలయిన పని (not always) చివరికి - మనుషుల్నీ, దేశాల్నీ నాశనం చేసే శతృత్వం, హింసా, రక్తం లో కలిసి పోయి దాన్నే కోర్ బీయింగ్ గా మార్చేసినట్టు. // పాపం హవాయీ సెనేటర్ ఆకాకా గారంటే ఉన్న చులకనా భావం తెలిసిపోతూనే ఉన్నట్లుంది - చిన్న హాలిడే దీవుల వాడని కాబోలు ..
// టెనెట్ చూపులూ, మాటలూ - concept మీద విరుచుకుపడి రాగయుక్తమైన సంగతులు వేయడం - ఏదో తాండవం చేస్తున్నట్లుగా ఉంది. సమాధానం చెప్పి ఒకరకమైన సెల్ఫ్ కంగ్రాట్యులేటరీ చూపుతో ఒక gesture ఇవ్వడం…. 'కృష్ణస్వప్నం' (లేక అలాంటి పేరేదో) అని (వివిన మూర్తి ?) చాలాకాలం క్రితం వార్త లో వచ్చిన కధ
గుర్తొస్తోంది. అర్జునుడు ఖాండవవనం లో నాగుల్ని చాలా కష్టపడి సంహరించి, ఇంత crude గా కాకుండా సులువుగా జరిగిపోయే మార్గం లేదా అని అడగడం, కృష్ణుడు రాబోయే కాలంలో hi-tech విమానాల్లో వీడియో చూస్తూ బాంబులు కురిపిస్తూ నవ్వుకోవచ్చని చెప్పడం etc…

2006-05-06

ఎందుకు ?

11/11/2001

ideals ఎందుకు ఏర్పడుతున్నాయి ? ఎందుకు ఏర్పడకూడదు ?
ఎందుకు patterns లో పడుతున్నాము ? ఎందుకు పడకూడదు ?
ఎందుకు confirm అవుతున్నాము ? ఎందుకు అవకూడదు ?
ఎందుకు పనికొస్తావురా నువ్వు ? ఎందుకు పనికి రావాలి ?