యముడి ముందు చలం
యముడి ముందు చలం - Yamudi mundu chalam
గుడిపాటి వెంకట చలం (Gudipati VenkataChalam) గారు రాసిన ఈ స్కెచ్ 1948 నాటిదట. "పరమ సత్యాన్ని" రెండు పేజీల్లో ఎలా చెప్పగలిగాడా అనిపిస్తుంది చదివితే. తరచిన కొద్దీ కొత్త కొత్త సత్యాలు స్ఫురింపజేసే ఈ సంభాషణ నిజంగా ఒక మాస్టర్ పీస్. ఆధ్యాత్మికంగా ఆకలి గొన్నవాళ్ళు ఆవురు ఆవురు మని చదవవలసిన రచన.
చలం : ఎవరూ ? యముడా?
యముడు : అవును.
చలం : ఉన్నావా ? లేవనుకున్నాను.
యముడు : అనుకోలేదు. అనుకున్నాననుకున్నావు.
చలం : అన్ని మతాల వాళ్ళూ ఇక్కడికి రావలసిందేనా?
యముడు : యముడి లో నమ్మకం ఉన్నవాళ్ళు
చలం : తక్కిన వాళ్ళూ ?
యముడు : వాళ్ళ నమ్మకం ప్రకారం
చలం : అసలు నమ్మకం లేక పోతే ?
యముడు : ఏమీ లేదు. దేంట్లోనూ నమ్మకం లేని వాళ్ళకి.
చలం : మరణం తరవాత జీవితంలోనే నమ్మకం లేకపోతే ?
యముడు : మరణం తోనే ఆఖరు !
చలం : నాకూ నమ్మకం లేదే ! చాలా మందికి లేదు ఇప్పుడు.
యముడు : లేదంటే చాలదు. నిజంగా, నిస్సందేహంగా లేక పోవాలి. లేని వాళ్ళ జీవితమే వేరు. మృగాలకి లేదు. వాటికి మృత్యువు తోనే అంతం. మరణంతో నిజంగా అంతంఅనుకునే మనిషికి జీవితంపైన ఆ పట్టు ఉండనే ఉండదు. అ రాతలు, ఆ వాదాలూ, ఆ ప్రేమలూ, ద్వేషాలూ నిలచి పని చెయ్యవు. నువ్వు చెప్పేదే నిజమని నమ్మకం. అవన్నీ ఏమిటి ? ఏదీ నిలవక ప్రతి నిముషం బూడిదై పొయ్యే ప్రపంచం లో సత్య మనేది ఎక్కడ వుంది ?
చలం : కానీ మానవ జాతి అభివృద్ధి, సత్యానికి కళ్ళు తెరవగల…
యముడు : ఏం మానవజాతి ? పదేళ్ళ తరవాత ప్రపంచం వుంటుందని ఆ విశ్వాస మేమిటి ? సత్యమేదో తెలుసుకుంటుందని ఆ ఆశ ఏమిటి ?
చలం : అట్లా అయితే ఈ విశ్వాసాలేం లేకుండా స్వార్ధంగా బతికేవాడికి ఇక లోకం లేదన్న మాట !
యముడు : స్వార్ధంగా బతికే వాడికి వుంది. వాడు దేనికో బతుకుతున్నాడు గనుక.
చలం : మరి ఎవరికి లేదూ ?
యముడు : అంటే అందరికీ వుంది. కాని అనేక విధాలుగా వుంది.
చలం : నాకు యముడు అనే వాడిలో ఎన్నడూ నమ్మకంలేదు.
యముడు : అయితే యముడివా అని నన్నెందుకు అడిగావు ? యముడని నన్నెందుకు అనుకున్నావు ?
చలం : అవునేమో, అనుకున్నాను.
యముడు : అందుకనే అయినాను.
చలం : అనుకోకపోతే ?
యముడు : యముణ్ణి కాను.
చలం : అప్పుడు ఎవరు ?
యముడు : నువ్వెవరని అనుమానిస్తే వాణ్ణి.
చలం : తరవాత ?
యముడు : తరువాత నువ్వేమని అనుకుంటున్నావో, అది !
చలం : ఏమీ అనుకోవటం లేదు.
యముడు : అబద్ధమాడకు. (నవ్వుతున్నాడు). నేను చెప్పనా ? నీకు స్వర్గమా, నరకమా? అనుకుంటున్నావు . అవునా ?
చలం : నాకు స్వర్గనరకాలలో నమ్మకం లేదు.
యముడు : అదంతా సరేలే. అది భూలోకంలో. పుస్తకాలలో. ఇక్కడ నన్ను చూసి అనుకున్నావా లేదా ?
చలం : మరి యముడు గనక తరవాత అంతేకదా నేను అనుకోవలసింది !
యముడు : అవును. అంతే కదా. అదే నిజం !
చలం : సరే, స్వర్గమా, నరకమా ?
యముడు : నేను యముణ్ణయినప్పుడు, నరకమే గా నీకు ?
చలం : నాకు నరకం లో ఎప్పుడూ నమ్మకం లేదు.
యముడు : లేదు. కాని నీ ఊహలూ, రాతలూ, పనులూ, ప్రపంచం లో ఏ మార్పు తెస్తాయనుకున్నావో ? ప్రపంచం లోని వాడివేగా నువ్వూను ? నీలో అవి తెచ్చే ఫలితమే నరకం ?
చలం : స్వర్గం కాకూడదా ?
యముడు : కావచ్చు. కాని నరకాన్ని ఏరుకున్నావు.
చలం : ఎప్పుడు ?
యముడు : ఇప్పుడే, అంటే నీ జీవితమంతా అన్నమాట!
చలం : అంటే ?
యముడు : ఇప్పుడనేది - పూర్వం ఎప్పుడూ అనే దాని పర్యవసానం - ఏ కార్యానికైనా ఫలితంవుంటుంది అనే నమ్మకంవుంటే, మరి ఫలితం వుండకుండా వుండదు. మిగిలిపోయిన ఫలితాలు అక్కడ అనుభవించాలి.
చలం : ఆ నమ్మకం లేకపోతే?
యముడు : లేకపోతే స్వర్గం లేదు, నరకం లేదు. కాని ఫలితం కలగదని పనులు చేసే వాళ్ళెవరు ?
చలం : నేను యముడననీ, నరకమనీ ఎందుకు అనుకున్నానంటే, చిన్నప్పటి భయాలూ, అలవాట్లూ వొదలక. అంతే కానీ నమ్మకం వుండి కాదు.
యముడు : మరి ఏం విశ్వసించావు ?
చలం : నాకేం తెలీదన్నాను.
యముడు : సరే, ఇప్పుడు నేర్చుకుంటావు.
చలం : ఏం నేర్చుకుంటాను ?
యముడు : ఏం నేర్చుకోవాలని వుంటే అదే !
చలం : ఏం లేద నా!
యముడు : అదే నేర్చుకుంటావు. నరకం లో.
చలం : మరి ఈ శిక్ష ఎందుకు ?
యముడు : నీ అవినీతి కార్యాల ఫలితంగా.
చలం : అట్లా రండి. నీతి అంటే ఏమిటి ? అవినీతి అంటే ఏమిటి ?
యముడు : నీకు తెలుసా ?
చలం : నాకు తెలీదు. తెలుసునన్నవాళ్ళతో వాదిస్తాను.
యముడు : నీ వాదాలు నాకు తెలుసు.
చలం : నా పుస్తకాలు చదివారా ?
యముడు : నిన్ను చదువుతున్నానుగా ఇప్పుడు !
చలం : నేను చాలా సార్లు మారాను.
యముడు : అన్ని మార్పులతోటీ స్పష్టంగా నిన్ను చదువుతున్నాను.
చలం : మరి చెప్పండి నీతి అంటే ఏమిటో ?
యముడు : నువ్వేమంటే అదే !
చలం : అయితే నాకు శిక్ష ఎందుకు ?
యముడు : నువ్వనే నీతికే నువ్వు విరుద్ధంగా చాలాసార్లు ప్రవర్తించావు గనక. కాదా ?
చలం : అవును. కానీ నా ఆదర్శం చాలా ఉన్నతం.
యముడు : కాని, నీ నీతి కీ, నీ ఆదర్శానికీ నువ్వు అపకారం చేసుకున్నావు. దానికి పరిశాంతి ఈ నరకం !
చలం : అసలు ఏ ఆదర్శం లేకుండా శాస్త్రాల్లోదీ, పొరుగువారనేదీ నీతిగా తీసుకుని బతికే వారికి నీతి గా వుండడం సులభం.
యముడు : అవును.
చలం : మరి వాళ్ళకి ?
యముడు : స్వర్గం
చలం : స్వర్గమా ? ఎందుకు ?
యముడు : నీతి గా బతికారు గనక. వాళ్ళ మనసులో అవినీతి చేశామనే నేరభావంలేదు గనక.
చలం : నేరభావం లేక పోతే చాలునన్న మాట. ఇక నేరమనేది లేదా?
యముడు : అదేగా రాసావు ఇన్నాళ్ళూ? పాప పుణ్యాలు లేవనీ, మనసు కల్పించుకుంటోదనీ, ఎవరి అంతరాత్మ వారికి ధర్మకర్త అనీ!
చలం : అంటే స్వర్గ నరకాలకి మనసులే ఆధారమా ?
యముడు : అవును. అంతే. నువ్వు రాసిన మాటలే. కాని నీకు నమ్మకం లేదన్న మాట.
చలం : మరి వీటి ని నిర్ణయించే దేవుడు ?
యముడు : దేవుడూ అంతే. కావాలంటే వున్నాడు. అఖ్కర్లేక పోతే లేడు !
చలం : మరి ఇదంతా నిర్ణయించే దెవరు ?
యముడు : నువ్వే !
చలం : తక్కినవాళ్ళనీ ?
యముడు : వాళ్ళే !
చలం : మరి నువ్వూ !
యముడు : నువ్వు వున్నావంటే వున్నాను అని చెప్పాను కదూ !
చలం : చాలా అన్యాయంగా వుంది వ్యవహారం.
యముడు : ఏమిటి ?
చలం : లేని దేవుడిలో స్వర్గం నమ్మితే, స్వర్గమా ?
యముడు : ఆ !
చలం : నేను చూసిన దొంగ భక్తులకీ, మూఢులకీ, పురుగు ల్లాంటి క్షుద్రులకీ ?
యముడు : వాళ్ళకీ అట్లాంటి స్వర్గమే. అంటే, వాళ్ళు కోరుకునేలాంటి స్వర్గం. వారు ఆరాధించే దేవుడు.
చలం : విష్ణు భక్తులకీ ?
యముడు : వైకుంఠం.
చలం : ఎంత బుద్ధి హీనుణ్ణి ! నేనూ ఓ దేవుణ్ణి నమ్మితే …
యముడు : ఏం లాభం ? నువ్వు నమ్మలేవు. అయినా ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. గట్టిగా కోరుకుంటే వైకుంఠానికి వెళ్ళవచ్చు. కాని త్వరలోనే నరకానికి పోవాలని కోరుకుంటావు.
చలం : ఎందుకు ?
యముడు : భరించలేక. నీ స్వభావం అట్లాంటిది గనక.
చలం : ఏం చేస్తారు వైకుంఠం లో ?
యముడు : ఏం చెయ్యాలని ఆ భక్తులు కోరుకుంటారో అదే !
చలం : భజన ! పిడి భజన !
యముడు : అవే… భరిస్తావా ?
చలం : వాళ్ళూ ?
యముడు : (నవ్వుతో) అదేదో గొప్పపని అని మీ లోకం లో ప్రార్ధిస్తారు. నీ సాన్నిధ్యం లో చేర్చుకో. ఇంక మాకేమీ అవసరం లేదని! కాని అన్ని అవసరాలూ వుండనే వుంటాయి. వెడతారు వైకుంఠానికి. రాత్రింబగళ్ళు భజనే భజన !
చలం : వాళ్ళకి శాంతి అది !
యముడు : అనుకుంటారు.. భజన్లు, విష్ణుసాన్నిధ్యం శాంతి నిస్తుందని, భేషజాలకి భక్తి కోరుకుంటారు. కాని దాంటో నిలవలేక యాతన పడతారు.
చలం : నిజం గా భక్తి మాధుర్యం కలవాళ్ళో ?
యముడు : వాళ్ళకి ఫరవాలేదు. కాని వాళ్ళెందరున్నారు ? చాలా మంది కోరుకునే స్వర్గాలు అంతే, అసలు వాళ్ళకి ఇక్కడ ఏం కావాలో తెలిసిన వాళ్ళెంతమంది ?
చలం : మరి వాళ్ళేమౌతారు ?
యముడు : అట్లా తెలీక వెతుక్కుంటూ వుంటారు, అయోమయం గా తెలుసుకున్న దాకా.
చలం : మరి నరకంలో బాధలు పెడతారు కదా ?
యముడు : ఎవరన్నారు ? నువ్వు కోరుకున్నవన్నీ నరకం లో ఉన్నాయి. అందుకని అక్కడికి వెడుతున్నాము. మేమేం బాధ పెట్టము. ఆ బాధలేవో నువ్వే పెట్టుకుంటావు !
చలం : ఎందుకు పెట్టుకుంటాను ?
యముడు : భూలోకం లో ఎందుకు పెట్టుకుంటావు ? అక్కడా అంతే !
చలం : నాకు కావలసిన వన్నీ ఇక్కడా వుంటాయిగా ?
యముడు : అదే బాధ ! కావలసినవన్నీ వుండే బాధ. పైగా అవి నిన్నో పట్టాన వదలవు. స్వర్గం లో భజనలు మల్లేనే తలుచుకో. నీ పుస్తకాలూ, నీ కలలూ….
చలం : మరి ఇంక ఆ లోకానికీ, ఈ లోకానికీ వ్యత్యాసమేముంది ?
యముడు : ప్రయత్నాలూ, ఆశలూ ఫలించే లోకం ఇది. అంతే. ఆ లోకం లో మిగిలి పోయినవన్నీ.
చలం : ఈ నరక కాలం అయిపోయింతరవాత ఏమవుతాను ?
యముడు : ఏం లేదు. కానీ అనుకోకుండా వుండవు.
చలం : అప్సరస తో తిరుగుతో వుండాలనుకుంటే… ?
యముడు : అపుడెందుకు ? ఇప్పుడూ తిరగగలవు. అట్లా కోరుకుంటే. కానీ అక్కడంతా శాంతీ, సుఖం అనుకోటం లోనే మనుషులు చేసే పొరపాటు. వాళ్ళ మనసు వాళ్ళ తోటే వుంటుంది.
చలం : చాలా అర్ధంకాకుండా వుంది.
యముడు : అంతేలే. ఈ జన్మల్ని ఎవరూ నీ మీద రుద్దడం లేదు.
చలం : మరి సత్యం, న్యాయం, పద్ధతీ, అభివృద్ధీ…
యముడు : అవన్నీ వున్నాయి. కాని నువ్వు అనుకునేట్టు సంకుచితంగా కాదు. విలువలున్నాయి. కాని అవి కనబడవు నీకు. స్వార్ధంగా, క్రూరంగా బతికే మనుషులకి జీవితం లోంచి ఏమొస్తుంది? ఇతరుల కన్నీళ్ళలో బాధ పడే వాడికి, ఒక్క చిరునవ్వు లోంచి వచ్చే మాధుర్యం ఎవరెరుగుదురు ? బైట ఏం జరుగుతోందని కాదు - వాటి నించి నీ లోపల ఏం జరుగుతోందనే దృష్టి నీకు కలిగిన రోజున సమన్వయం ఎక్కువగా కలుగుతుంది.
చలం : మరి ఈ జనన మరణాల్నించి తప్పించుకోవాలని చేసే సాధకులు - మూర్ఖులేనా?
యముడు : వాళ్ళకింకా జీవించాలని వుంది. నిజంగా అఖ్కర్లేక పోతే, జనన మరణాల్నించి తప్పించుకోవడం ఒక్క నిముషం పని. జీవితం లో తాము కల్పించుకున్న బాధల్ని తామే పడలేక, ఏదో ముక్తి కావాలనే ఏడుపు ఆ సాధన అంతా.
చలం : మరి ఈశ్వరుడు ఆనందమయుడు, ఆత్మ ఆనందస్వరూపం అంటారు, అదేమిటి ?
యముడు : దేని మీదా ఆధార పడని ఆనందం కావాలనుకున్న నిమిషాన అదీ సిద్ధం గానే వుంది.
చలం : మరి అందరూ ఆ ఆనందాన్ని ఎందుకు కోరుకోరు ?
యముడు : వాళ్ళకి అఖ్కర్లేదు గనక !
చలం : ఎందుకు అఖ్కర్లేదు ?
యముడు : నీకెందుకు అఖ్కర్లేదు ?
చలం : అఖ్కర్లేకేం ? దొరక్కగానీ !
యముడు : దొరకడ మేముంది ? నువ్వు గట్టిగా ఇంకో దృష్టి లేకుండా వాంఛించాలి అంతే. నిజంగా యోచించుకో. ఆనందం అనేటప్పటికి నీ మనసు ఏం వాంఛిస్తుంది ? నీ పుస్తకాలు తెప్పించనా ? ఆ ఆనందమే పుష్కలంగా దొరుకుతుంది నీ కిక్కడ ! ఆ రూపాన ఆనందం వద్దని నువ్వు మొర పెట్టిందాకా ?
చలం : నా మొర ని ఎవరు వింటారు ?
యముడు : నువ్వే !
చలం : విని ?
యముడు : విని, ఇంకో రకమైన ఆనందాన్ని కోరుకుంటావు ?
చలం : తరువాత ?
యముడు : అది సిద్ధిస్తుంది. అంతే.. నిరంతరంగా అంతే…. అది ఇవ్వలేదనీ, ఇచ్చాడనీ, దేవుణ్ణీ, విధినీ, లోకాన్నీ, కర్మనీ తిడుతో బతుకుతారు. ఎవరు వాంఛించేది వాళ్ళకి తటస్థించి తీరుతుంది. అంతకన్న కరుణ గల విషయం ఆలోచించుకో గలవా ? వెళ్ళు. వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు.
చలం : ఎవరు ?
యముడు : నీ కధా నాయికలు. నువ్వు వాంఛించి, ఊహించి కల్పించుకున్న ఆదర్శ వ్యక్తులు.
చలం : అమ్మో !
యముడు : (నవ్వుతో) చూశావా ? నీ నరకం ఇక్కడే ప్రారంభమయింది !
చలం : పోనీ స్వర్గానికి పోనీరా ?
యముడు : నిరభ్యంతరంగా . కానీ అక్కడ మునులూ, రాంభజన గాళ్ళూ.
చలం : ఆడవాళ్ళూ?
యముడు : రాజ్యలక్ష్ములూ, కాంతం, హృదయేశ్వరులూ, సవితలూ వుంటారు.
చలం : వద్దులేండి. నరకానికే పోతాను.
యముడు : నాకు తెలుసు గా ! అంటే నీకు తెలుసుగా !
1 Comments:
వాహ్! అనలేకపోతూ ఉన్నాను. ఎంత నిగూడత్వము. చలం రచనలు కొన్ని చదివాను గాని, ఆయన తత్వ దృష్టి నాకు తెలియదు. స్వర్గ నరకాలు, కష్ట సుఖాలూ, దేవుడూ దయ్యం అన్నీ కూడా మనిషి లోపల మనసు కర్మాగారంలో పుట్టేవే అనే సత్యం ఎంత చక్కగా ఉంది.
-- ప్రసాద్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home