2000-12-24

ధిక్కరింపు

December 2000
**ఒక బాల్యం - సంక్షోభం - జీవితం ***
వాడికి స్కూల్ రోజుల్లో పొద్దున్నే స్నానం చెయ్యడం ఇష్టం ఉండేది కాదు. క్రూరు లైన పెద్దవాళ్ళు తిట్టి కొట్టి బెదిరించి స్నానాల గదిలోకి పంపిస్తే నీళ్ళు పారబోస్తూ శబ్దాలు చేసి కొంచెం సేపు అయిన తరవాత నీళ్ళ చుక్కలు కొన్ని శరీరం మీద చల్లుకొని బయటికి వచ్చేవాడు. పెద్దవాళ్ళ మీద ద్వేషం, ఆ రకం గా మోసం చెయ్యడం ద్వారా కసి తీర్చుకోవడం - అప్పుడు ప్రారంభమైన ఈ విషం - పెరిగి పెద్దదయి చాలా ఇంఫ్లుయన్స్ చేసింది అతడి జీవితాన్ని. ప్రతి సంబంధం లోనూ అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న దురాశ, ప్రతివాళ్ళనీ మోసం చెయ్యాలన్న ఆకాంక్ష, ఇంకా ఇంకా పోగుచేసుకుందామన్న కోరిక (ఇదే హింసకి మరోరూపం అని తరవాత తెలిసింది వాడికి),
సంఘం లో తనకి ఇంకా పేరు, కీర్తి రావాలన్న యావ. కీర్తి రావాలంటే డబ్బు ఒక్కటే ఉంటేచాలదని గ్రహించాడు తొందరగా. సంఘం మీద, పెద్దవాళ్ళమీద, ఆచారాల మీద తిరగబడడం ద్వారా కొంత కీర్తి సంపాయించాలనుకున్నాడు. పైకి ఎన్ని తర్కాలూ, మాటలూ చెప్పినా: ఆచారాలూ నియమాలూ కాన్షస్ గా పాటించే వాడి మనసు చట్రం లో ఎలా ఇరుక్కు పోయి ఉంటుందో వాటిని కాన్షస్ గా ధిక్కరించే వాడి మనసు కూడా అట్లానే ఉంటుందని తెల్సుకోలేక పోయాడు. ఏదో కొంతవరకూ ఆ దురద తీర్చుకున్న తర్వాత మనసుకి తెలిసింది వాడికి కొంచం కొంచం ఆ విషయం. తన అసలు స్వరూపం లో ఉన్న అధిక్యతా భావం లేదా వయొలెన్స్. తనని తాకుతున్న పరిసరాలనీ, వ్యక్తులనీ ఎలాగోలా కంట్రోల్ చెయ్యడం - దానికి రకరకాలుగా ఉపయోగ పడుతున్న తన మైండ్ చేసే మాయాజాలం. లోకం ఆశించే తెలివి రూపం తెచ్చుకుని పొటెంట్ గా తళతళా మెరుస్తున్న మెదడు లోని ఖడ్గం.

ఎదిరించడమూ, అందరికన్నా తను గొప్పవాణ్ణని నిరూపించుకోవడమూ కావాలి వాడికి. ఇది రోజంతా ఎలాగోలా పక్కనున్నవాళ్ళ వల్లో పనిజీవితం లోనో తీరితే సాయంత్రానికి ఇంటికొచ్చి సుఖిస్తాడు.
అలా తీరని సమయాల్లో ఆ అసంతృప్తి అంతా వెదజల్లుతాడు ఏదో ఒక రూపంలో. ఈ అధిక్యతా ప్రదర్శన

మీదనే అధారపడి నడిచిన చదువులూ, ఉద్యోగాలూ, డబ్బు సంపాదనా, అధికారపు వెంపర్లాట...
తనలో ఉన్న ద్వేషం ఎట్లా ద్విగుణం బహుళమై చుట్టూ ఉన్న పరిస్థితులమీదా మనుషులమీదా కమ్ముకుంటూ అసలు
జీవితానికి (ఉనికి లేదా సత్తా ?) దూరం చెసిందో తెలుస్తోంది. ఇట్లా ఉన్న ద్వేషం అసమర్ధతగా రూపొంది అది మళ్ళీ ద్వేషమై .. ఒక విషవలయం.. పరిసరాలని ప్రభావితం చెయ్యలన్న తీవ్రమైన కాంక్ష (బహుశా హింసాపూర్వక ద్వేషం కావచ్చు) .. బద్ధకం తో కూడిన సుఖలాలసత.. అదే చివరికి మిగిలి పోయింది. ఎవరు ఏది కావాలని అంతర్గతం గా కోరతారో అది లభ్యమవుతుంది' అని గొణుగుతున్నాడు యముడి ముందు అచలం..