2015-06-06

పాతపాటలు


కొన్ని విశేషాలు

చక్కటి సంస్కృత పదాలతో మన దేశం గురించి రాసిన పాటలలో చాలా మంది తెలుగు వారికి తెలిసిన పాట "జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్యధాత్రి" అనేది (దేవులపల్లి వారి రచన). ఇలా సంస్కృత పదాలతో మన దేశాన్ని నుతిస్తూ రాసిన మరో చక్కటి పాట "జయ జననీ పరమపావనీ" - ఇది "మనదేశం" అనే సినిమాలోని బృంద గానం.

ఈ సినిమా సీనియర్ ఎన్ టి ఆర్ నటించిన తొలి సినిమా అని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పాట సినిమా మొదట్లో టైటిల్స్ పడేటప్పుడు వస్తుంది. నేపధ్య సంగీతంతో సహా సినిమా మొత్తానికి సంగీత దర్శకత్వం వహించిన తొలి సినిమా ఘంటసాల గారికి ఇదే. ఈ పాట పొడుగూతా నేపధ్యంలో వినపడే ఒక తాళ వాయిద్యం యొక్క శబ్దం (జలతరంగిణి శబ్దాన్ని పోలి ఉన్నది) చాలా బాగుంటుంది. పల్లవి రావడానికి ముందు ఘంటసాల వినిపించిన ఒక మ్యూజిక్ బిట్ విన్నప్పుడు తర్వాతెప్పుడో ప్రసిద్ధమైన "పడవ సాగిపోతోంది" అనే లలిత గీతం గుర్తొస్తుంది. ఈ చిత్రంలో ఘంటసాలకి సంగీత సహాయకుడు అవధానం కృష్ణమూర్తి (విజయా కృష్ణమూర్తి).

పాటలో తాళపు దెబ్బ తరవాత ఎత్తుకునే పంక్తులు వినడానికి చాలా బావుంటాయి. కేవలం నాలుగు పొట్టి పంక్తులే రెండు చరణాల్లోనూ ఉన్నా అద్భుతమైన ట్యూను, ఆర్కెస్ట్రేషన్ వల్ల మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

ఈ సినిమాలోని పాటలన్నీ రాసింది సీనియర్ సముద్రాల గారే. హీరోయిన్ కృష్ణవేణి తన పాటలు తనే పాడుకున్నారు. ఆమె గొంతులో కొంచెం ఎస్ వరలక్ష్మి కంఠపు tinge వినపడుతుంది. సినిమాలో ఉన్న అద్భుతమైన డ్యూయట్ (సినిమా లో నలభై రెండు నిముషాల తరవాత వస్తుంది) "ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం" అనేది. ఈ పాటని కృష్ణవేణి, ఎం ఎస్ రామారావు (సుందరకాండ‌ ఫేం)‌ పాడారు. దీనిలో కూడా ఈ పాట పర్యంతమూ వెనక చిడతల్లా వినిపించే ఒక తాళ వాయిద్యం ముచ్చటగా ఉంటుంది. పాట మధ్యలో కృష్ణవేణి ఒకచోట పాడటం ఆపి వేసి "అదే" అంటుంది. పాట ఆగినా తాళ వాయిద్యం ఆగకుండా వినిపించడం లో ఘంటసాల ప్రతిభ ద్యోతకమవుతుంది. ఈ పాట పిక్చరైజేషన్ లో మరో విశేషం ఉంది - పాట మొదలవడానికి ముందు హీరో (చదలవాడ నారాయణరావు) తన గది తలుపు తట్టినట్లు, పిలిచినట్లు హీరోయిన్ భ్రమ పడుతుంది. నేను పిలవలేదు నువ్వు కలగన్నావేమోనని హీరో ఆమెతో అన్న తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత చల్లగా, మెల్లగా ఒక హమ్మింగ్ తో పాట ప్రారంభమవుతుంది. పాటంతా అయ్యాక ఇది కలగానైనా లేదా నిజంగానైనా ప్రేక్షకుడు ఊహించుకునేలా ఈ పాట చిత్రీకరించబడిందా అనిపిస్తుంది.  కానీ పాట అయిన తర్వాత ఇంట్లో ఉన్న పెద్దావిడ వచ్చి తొంగి చూసే షాట్ ఒకటుంది. అది తీసేసినట్లైతే పాటంతా హీరోహీరోయిన్ ల మనసుల్లో ఊహింపబడిందా లేక నిజంగా పాడుకున్నదా అనే విషయం ప్రేక్షకుల ఊహకు వదిలివేసినట్లుగా ఉండి ఇంకా బాగుండేదేమో. 
టైటిల్స్ అయిపోయిన వెంటనే ఘంటసాల తన 'లేత ఖంగు' కంఠంతో భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రని క్లుప్తంగా చెప్పారు. ఇంకా సినిమాలో ఒక సీన్ లో వినపడే రేడియో అనౌన్సర్ కంఠం ఘంటసాలదే. సినిమాలో నాగయ్య గారిది నిడివి ఉన్న పాత్ర. ఆయన డైలాగులు ఆయనే చెప్పుకున్నా ఒక్క సన్నివేశంలో ఒక డైలాగ్ కి మాత్రం ఘంటసాల తన గొంతు అరువిచ్చినట్లుగా అనిపిస్తుంది. (సినిమా లో  1:32:04 దగ్గర) తల్లి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు నాగయ్య చెప్పే డైలాగ్ - "నన్ను కూడా తల్లి లేని వాడిని చేస్తావా అమ్మా!" అనేది ఘంటసాల గొంతులా వినపడుతుంది. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సీనులో ఈ ఒక్క డైలాగు ఘంటసాల డబ్ చేశారేమో!?ఒక హాస్య సన్నివేశంలో వంగర గారు చెప్పే ఆంజనేయ దండకంలో "నీ నీటు నీ గోటు" అనిపించారు సముద్రాల సీనియర్. తిట్ల లాగా వినపడినా ఈ రెండు మాటలకి మంచి అర్థాలే ఉన్నాయి


************************************************


జంధ్యాల గారు తీసిన 'బాబాయ్ అబ్బాయ్' సినిమాకి మాతృక 'వద్దంటే డబ్బు' అని చాలా మందికి తెలిసే ఉంటుంది. 'వద్దంటే డబ్బు' చాలా మంచి సినిమా అయినా కూడా కాలగర్భంలోనే ఉండిపోయిందనిపిస్తుంది. ఈ సినిమాకి సంగీతం టి ఎ కళ్యాణం. అన్ని పాటలూ జనరల్ గా బాగానే ఉన్నా బాగా గుర్తుండిపోయే పాట మాత్రం "అల్లది, అవతల, అదిగో నా ప్రియ కుటీర వాటిక" ఈ మాటలని విడిగా అనుకున్నా, చదివినా ఎబ్బెట్టుగా తోచి ముందే సిద్ధపరచిన ట్యూన్ కి కిట్టించేసినవి అయి ఉంటాయనీ, డబ్బింగ్ పాట స్థాయిలో ఉంటుందనీ అనిపిస్తుంది. కాని ఈ మాటలని ట్యూన్ లో విన్నప్పుడు "కిట్టించారన్న" మాట మరుపుకు వస్తుంది. ముఖ్యంగా జిక్కీ కంఠం లోని ఆ "మలుపులు" వింటుంటే పాటలోని సాహితీ విలువల లేమి మనసుకి పట్టదు. ఈ పాట కేవలం ట్యూను వల్ల, గాయకురాలి ప్రతిభ వల్ల రాణించింది.

'
బాబాయ్ అబ్బాయ్' సినిమాకి 'వద్దంటే డబ్బు' సినిమా కథ యొక్క మూలమైన పాయింటుని తీసుకుని జంధ్యాల తనదైన శైలిలో సన్నివేశాలను అల్లుకుని ఉంటారు అనుకుంటాం. అయితే సుత్తి వీరభద్రరావు పైపులు ఎక్కడం, హీరో - హీరోయిన్ కి(బాలకృష్ణ, అనిత) కాఫీ కలిపి ఇచ్చే కామెడీ సన్నివేశం లాంటివి కూడా 'వద్దంటే డబ్బు' నుంచి దాదాపుగా అలానే తీసుకుని జంధ్యాల వాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.ఎన్ టి ఆర్, షావుకారు జానకి లు 'కాఫీ కామెడీ' సన్నివేశంలో చాలా సహజంగా నటించి సన్నివేశాన్ని అద్భుతంగా రక్తి కట్టించారు. ముఖ్యంగా ఈ సన్నివేశంలో అత్యంత సహజంగా నవ్వుతూ షావుకారు జానకి చూపిన నటనా కౌశలం - 'కన్యాశుల్కం' లో సరసంగా సుదీర్ఘంగా నవ్విన సావిత్రి ప్రతిభకూ, 'చలిచీమలు' లో నూతనప్రసాద్ టెలిఫోన్ లో మాట్లాడే సుదీర్ఘ సన్నివేశంలో అతని ప్రక్కన అతి సున్నిత శృంగార భావప్రకటన చేస్తూ ముగ్ధంగా ముసిముసిగా నవ్విన నటి (తాతినేని / వేజెళ్ళ రాజేశ్వరి ?) ప్రతిభకూ ఏ మాత్రమూ తీసిపోదనిపిస్తుంది.



******************************************
సారంగ రాగం - ఒకసారి వింటే విడవకుండా మనసుని హాంట్ చేసే రాగాలలో సారంగ ఒకటి. ఈ రాగంలో సినిమా పాటలు ఎక్కువ ఉన్నట్లు తోచదు. చాలా మందికి తెలిసిన ఒక పాట 'నా ఇల్లు' సినిమాలో నాగయ్య గారు స్వరపరచిన "అదిగదిగో గగనసీమ" (రచన - దేవులపల్లి). త్యాగరాజస్వామి రచించిన 'నౌకాచరిత్రము' అనే నృత్యనాటికలో ఉన్న "ఓడను నడిపే ముచ్చటకనరే వనితలారా నేడు" అనే కీర్తనని బాపు తీసిన త్యాగయ్య సినిమాలో ఎస్ జానకి చేత పాడించారు - ఇది కూడా ప్రసిద్ధమైనదే.

ఈ రాగం ధ్వనించే ఇంకొక పాట - ఘంటసాల స్వీయ సంగీత సారధ్యంలో విజయా వారి 'చంద్రహారం' సినిమా కోసం పాడిన "విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్యా, అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా" అనేది. ఈ సినిమా ఫ్లాప్ అవడం వలన ఈ పాట అంత ప్రాచుర్యంలోకి వచ్చినట్లు లేదు. ఈ పాట సినిమా మొదట్లో టైటిల్స్ వేసేటప్పుడే వస్తుంది. ఈ సినిమా కోసం ఘంటసాల గారికి ఆర్కెస్ట్రాలో సహాయపడింది మాష్టర్ వేణు గారు, అవధానం కృష్ణమూర్తి గారు (విజయా కృష్ణమూర్తిగా ప్రసిద్ధులు).

******************************
 

'ఏమి సేతురా లింగా' అనే తత్వాన్ని బాలమురళి గారి గొంతులో చాలా మంది వినే ఉంటారు. ఈ పాటలోని భావాన్నే వేరే మాటలతో వేటూరి సుందర్రామ్మూర్తి గారి చేత అద్భుతంగా రాయించి, బాలు, శైలజల చేత అంతకన్నా అద్భుతంగా పాడించి, వీటన్నిటినీ మించి ఈ పాటని సినిమా సందర్భానికి అత్యద్భుతంగా అన్వయించారు 'జననీ జన్మభూమి' అనే సినిమాలో కె.విశ్వనాధ్ గారు."సరిగంగ తానాలు జరిపించుదామంటే" - అని మొదలై "సామీ ఓ సామీ నేనేమి సెయ్యాలో సెప్పవేమి" అంటూ సాగుతుంది ఈ పాట. 'ఏమి సేతురా' లో ఉన్న "తుమ్మి పువ్వులకి తూనీగల ఎంగిలి" , "గంగ నీళ్ళకి చేప కప్పల ఎంగిలి" లాంటి భావాలు తన మాటల్లో చెప్పి చివర్లో "నన్నే నీకొగ్గేసి కన్నూ మూదామంటే కన్నోళ్ళ మురిపాల ముద్దులెంగిలి సేసే" అంటూ పై సంగతితో ముక్తాయించి అజ్ఞాత తత్వ్త రచయిత కన్నా తానేమీ తీసిపోనని నిరూపించుకున్నారు వేటూరి గారు. ఇది నిజంగా వేటూరి గారి జీనియస్ కి తార్కాణం.ఈ దేశంలో ఏ పనికి పూనుకుందామన్నా అన్నీ అవినీతి జాడ్యంతో ఎంగిలై పోయాయి అన్న విషయాన్నీ, వ్యవస్థకి దాసోహమైన పెద్దవాళ్ళ పెంపకం ("కన్నవాళ్ళ ఎంగిలి") అన్న విషయాన్నీ పాటలో ప్రతిఫలింప చేశారు. అద్వైత భావంతో రాసిన తత్వాన్ని తీసుకుని దాన్ని లౌకిక విషయానికి అన్వయిస్తూ ఔచిత్యం చెడకుండా రాసిన ఈ పాట సినిమా కథకి అద్భుతంగా సరిపోయింది. ఈ పాట చివర్లో "నావంటి, నట్టేటి నావంటి బతుకుల్లో సుక్కానివైనా నువ్వే" అని ఆ తర్వాత "ఉత్త రేపు సుక్కా నువ్వే" అన్నారు వేటూరి. "రేపుసుక్క" అంటే ఏమిటో అనుకున్నాను. తరవాత రమణమూర్తి అనే సార్ ఇది ఉత్తరపు చుక్క అనగా ధ్రువనక్షత్రం అని వివరించారు

******************

శ్రీరామరాజ్యంలో 'జగదానందకారకా' పాటని వినే ఉంటారు. మునుపు ఎనభైల్లో కృష్ణ, శ్రీదేవిలతో బాలయ్య తీసిన 'చుట్టాలున్నారు జాగ్రత్త' అనే సినిమాలో ఎమ్ఎస్ విశ్వనాథన్ స్వరపరచిన "రెక్కలు తొడిగీ రెపరెపలాడి రివ్వంటుంది కోరిక" అనే పాట ఛాయలు ఈ 'జగదానందకారకా' పాటలో చాలా కనిపిస్తాయిజగదానందకారకా పాట పల్లవిలో మొదటి లైను పాడి తరవాత రెక్కలు తొడిగీ పాటలో రెండవలైను పాడుకుంటే భలే కలిసిపోయిందే అనిపించింది... సరదాగా నవ్వుకోవడానికి...... 
***************************


'ఒకే కుటుంబం' సినిమా కోసం దేవులపల్లి రచించి కోదండపాణి సంగీతం సమకూర్చిన పాట "అవునే తానే నన్నేనే" చాలా మంచి పాట. శివాజీ గణేశన్, ఎమ్ ఆర్ రాధ నటించిన 'పావమన్నిప్పు' అనే సినిమాకి రీమేక్ ఇది. (నాగభూషణం, రామారావు ప్రధానపాత్రలుగా నటించిన సినిమా) ఈ పాటకి తమిళ మాతృక "అత్తాన్ ఎన్నత్తాన్" అనే పాట. ఆసక్తి ఉంటే ఆ పాట కూడా యూట్యూబ్ లో వినండి. అది కూడా చాలా గొప్ప పాట.ఇంకో విషయం ఏమిటంటే పావమన్నిపు సినిమాని తెలుగులో "పాపపరిహారం" పేరుతో డబ్బింగ్ కూడా చేశారు. ఆ డబ్బింగ్ సినిమాలో ఈ పాట "చిలకా ఓ చిలకా" అనే పల్లవితో ఉంటుంది. ఈ పాట వింటుంటే ట్యూనుకి మాటలు కిట్టించినట్లు తెలిసిపోతుంది. కాని ఈ "అవునే తానే" పాట వింటే సమర్థుడైన కవి ట్యూను కోసం రాస్తూ కూడా మాతృకలో ఉన్న భావాన్ని తెలుగులోకి ఎంత అద్భుతంగా తేగలడో అవగతమవుతుంది.


********




1 Comments:

Blogger GARAM CHAI said...

బాగా చెప్పారు సార్...

తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ... వీక్షించండి ఆశీర్వదించండి


https://www.youtube.com/garamchai

4:26 AM  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< Home