2005-03-21

భయ గుణింతం

2001 ?
ఏదో పెద్ద మార్కెట్ లోనో ఇంకెక్కడయినానో జనసమ్మర్దాన్ని చూస్తే భయంభయంగా ఉండేది వాడికి. అంత మంది మనుషుల్ని ఒకే చోట చూసి - నేల నించి కాలుష్యం అంతా ఒకే సారి పైకి ఊరినట్లు. వాడు ఒక్కడే కూచుని ఆలోచించుకుంటేనే ఇన్ని రకాల విషయాలు మనసుకి తోస్తున్నయే…. అవి ఇన్ని భయాల్నీ, సందేహాల్నీ, కోపతాపాల్నీ రేపుతున్నాయే - వీటన్నిటినీ ఇంత మంది మనుషుల చేత గుణిస్తే ఎంత భయం!! అందరి లోనూ ఎంతో కొంత ఉండే చెడ్డ ని భూతద్దంలో అనేక రెట్లు పెంచి భయ పడుతున్నప్పుడు; ఆనందం, మంచితనం, ప్రేమ - వీటి సంగతేమిటి మరి ? అవి ఎందుకు గుర్తు రావు? పర్ యూనిట్ లెక్క లో మంచి కన్న చెడ్డ ప్రతి ఒక్కరి లోనూ ఎక్కువ వుంటుందన్న నమ్మకం ఎలా ఏర్పడింది? అసలు అటో ఇటో ఏ అభిప్రాయ మైనా నమ్మకమైనా ఎందుకు ఉండాలి?