ఖాళీ
7/13/02
కరుడు గట్టిన బాల్యం. ఆర్ధిక విద్యా వనరులెంత పెరిగినా రాని అభయం.
******
ఎంత రాసినా ఏమిటి ప్రయోజనం ? ప్రయోజనం ఉన్నా తర్వాత ప్రయోజనంఉండదు. ఎందుకంటే కాలం ప్రయోజనంఅన్న మాటకి కొత్త అర్ధాన్నిస్తూ ఉంటుంది అనంతంగా.. ఏ మాటకైనా స్థిరమైన అర్ధం ఎలా వుంటుంది?
మళ్ళీమళ్ళీ దుఃఖం.. గొంతులో ఏదో మేకు ఉన్నట్టుగా, కళ్ళమీద వత్తినట్లుగా బాధ. ఎక్కడనించి, ఎందుకు బాధ వస్తోందో తెలీదు. అసలు తెలుసుకుందామన్న కోరికే లేదు. బాధ గుండా ప్రయాణించడంఒక్కటే సరియైన మాట గా తోస్తోంది.
ఎందుకు ఈ బాధ లోనే పడి కొట్టుకుంటావు? అలా బయటికి వచ్చి ఏదైనా సినిమానో పుస్తకమో పట్టుకోరాదా అంటున్నారు ఎవరో తన మనసు లోపల. తల్లిదండ్రులూ , స్నేహితులూ, సహచరులూ - ఎంతో మంది ఎన్నో రకాలుగా లోపల మాట్లాడుతున్నారు. - భార్యా భర్తల సంభాషణ వెనక అటూ ఇటూ ఐదు తరాల తల్లుల్నీ తండ్రుల్నీ దృశ్యం గా నిలబెట్టి కొనసాగించిన సినిమా సన్నివేశం గుర్తుకొస్తూంది
పుస్తకంచదవడం, సినిమా చూడడం, మాట్లాడడం అప్పుడు కలిగే ఆలోచనలూ - దాని విధానంఆ ఆక్టివిటి
అయిపోగానె మళ్ళీ "సమయం" దాని ప్రతాపంచూపించడం- ఇవన్నీ వెంటవెంటనే తలపులలోకి వస్తాయి.
కాబట్టి వీటో.
లోకం లో చెల్లాచెదరుగా, చెదురుమదురుగా వ్యాపించిన బాధంతా ఒక్క సారిగా జీవితంలోపల జొరబడి గాఢంగా అలుముకుంది కొద్దిరోజులుగా.. తప్పు! తప్పు! ఇదంతా ఏదో కాస్త చెయ్యి తిరిగిన స్టైలిస్టిక్ రైటింగ్ లాగా ఉంది. పెంచుకున్న ఊహా చిత్రాల వల్లా, వేసుకున్న ముడుల వల్లా, తేల్చుకోలేక, లోపలకి చూసుకోవడం చాతకాక బాధ పడుతున్నావు కానీ, ఎక్కడనించో బాధ ప్రత్యక్షం అవడం ఏమిటి, వెర్రి మొర్రి !
ఈ బాధ, అసహనం లోపలే అంటుకొని ఉన్నాయనీ, అవి ఎప్పటి కన్నా మాయమవుతాయో లేవో తెలీదు కానీ బాహిర భౌతిక పరిస్థితులు మారడం వల్ల పోవని తెరలు తెరలుగా లోపల్నించి ఒక్కసారిగా ఉబికి వచ్చిన నమ్మకం లాంటి దేదో విద్యుద్ఘాతంలా వెన్నును తాకింది. ఒక్క క్షణమే.. మాయమయిన బాధ.. ఏదో తేలిక తనం.. ఒక్క సారిగా "జీవం" పోసుకున్న ప్రదేశాలూ, మనుషులూ, శబ్దాలూ… కొత్తగా ఏమీ జరగలేదని స్వచ్ఛంగా కన్పిస్తున్న నిజం. మెదడు లోంచి మాయమయిన భవిష్యత్తు.. లోపలికి చూస్తే ఉండాల్సిన బాధ స్థానం లో కన్పించిన పెద్ద ఖాళీ…
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home