2005-03-24

శ్రీశ్రీ వ్యాసాలు

Aug 4, 02.
అరవై ఏళ్ళ క్రిందటి గాఢమైన ఆధునిక వచనం.. అంత అమోఘమైన వచన రచనా శక్తి ఎక్కడ నించి వచ్చిందో.. ఎంత ఉద్వేగం. పత్రికలూ, సాహితీ వివాదాలూ, కవులూ, స్వాతంత్ర్యోదయం, ఆశలూ, వాగ్దానాలూ, ఆశాభంగాలూ. మానవుడి మూల సమస్య ఎలాగూ ఉద్వేగాల వల్ల తీరదు కానీ అభినివేశానికీ, ఉద్వేగానికీ, ప్రేరణ కీ జీవితంలో ఉన్న ప్రాముఖ్యాన్ని నిరాకరించలేం. వాటిని అనుభవించి దాటుకోవాల్సిందే. వ్యాసాల్ని చదివి ఆనాటి పారిశ్రామిక నాగరికతా సమాజపు సంక్షోభాన్నీ, ఆనాటి మానవుడి మానసిక స్థితిని కొంత వరకూ అందుకోవచ్చు. ఆనాటి పాత్రికేయ సమాజం, కాలగర్భం లో కలిసిపోయిన ఢంకా, రూపవాణి, నవోదయ, తెలుగుస్వతంత్ర.. - ఏదో రాద్దామనీ, చేద్దామనీ, చేరవేద్దామనీ, ఎవరికో చెప్పాలనీ, చూపాలనీ ఎంత తపన, వేదన… ఉదయిని జనార్ధనరావు లాంటి వాళ్ళు ఈ వేదనాయుత స్పెక్ట్రం లో మరీ చివర ఎక్స్ట్రీం కి చేరుకున్నారేమో పాపం.. - తమ భావల్నీ, నిజం అని భావిస్తున్న విషయాల్నీ సమాజానికి అందించాలన్న ప్రయత్నం- దీన్ని మానలేరు. కానీ అలా చేయడానికి రిసోర్సెస్ అయితే లేవు తమ దగ్గర. సాహిత్యం లో ప్రమాణాలని ఎరిగినవారూ, భాషా సాంస్కృతిక రంగాలలో విషయజ్ఞులూ కానీ ఆధునిక సమాజ జీవితానికి అవి ప్రైమరీ కాకపోవడం వల్ల (ఇంజనీరింగో, వైద్యమో, పద్దుల తనిఖీ యో లాంటివి) ఆర్ధిక వసతి లేక ఘర్షణ. వేదనాయుత జీవితం. ఈ వలయం తమని మింగకుండా జాగ్రత్త పడి తమ సృజన ని కాపాడుకున్నది ఎవరో కొ. కు. లాంటి అరుదైన వ్యక్తులే.