స్వరోత్సవం - ఋషిమూలం
Aug 12-20, 02.
కవీ అయితే నీ ఋషులెవ్వరు? అన్న ప్రశ్న విని "రాతదేవుళ్ళు" అన్న పదం ఊహించుకొని అమితంగా నవ్వుకోవడం. ఇవాళ పేపర్లో భూమాతకి స్థూలకాయం అని ఓ సైన్స్ వార్తకి పెట్టిన శీర్షిక తలుచుకొని మిక్కిలిగా వినోదం.
"పాట దేవుళ్ళు" :
కన్నుల పండుగ రష్యా అంటున్నారు బాలమురళి విజయవాడ ఆర్కైవ్స్ వాళ్ళ సంగీతం సీడీ లో. ఏళ్ళక్రితం విని మళ్ళీ అలాంటి రాగం ఎక్కడ పడుతుందా అనుకుంటున్న "కృష్ణాయన బారదే" (కన్నడ పురందర దాసా?) లోని పోలిక స్పష్టంగానే ఉంది. కేదారం ట దీని పేరు.
భామరో ఊరికీ అని ప్రతి అక్షరం లోనూ ఆనందభైరవి ని పిండుతున్నాడు. దాంతో పాటు నరాల్నీ.
*పరమ హంస హృదయోత్సవకారీ అంటున్న మంగళంపల్లి కంఠం తో పాటు అంపోలు వారి వయొలిన్ తీగ నడిచి వెడుతోంది అదే దారిలో మనసునిండా సంగీత పరిమళాలువెదజల్లుతూ. హృదయంలో సుఖపుగీతలు గీస్తూ సాగుతూనే ఉంది రోజంతా పాట. సుదీర్ఘంగా ఒకటే స్వరం లాగా వినబడుతూ అన్ని వంపులూ ఎలా తిప్పాడో ఆ శబ్దాన్ని-సుఖపుదెబ్బలు కొట్టారు ఇద్దరు మురళీకృష్ణలూ.*
మైండ్ లో రికార్డ్ చేసి సొంతం చేసుకోకపోవడం లో, అర్ధం చేసుకోవాలన్న(సంగీతాన్నే!) కోరిక లేని తనంలో, జ్ఞాపకానికి కమిట్ చెయాలన్న ఆరాటం లేక పోవడంలో ఎంత స్వేచ్ఛ, హాయి..
ఆలోచిస్తే (ఆలోచించకూడదేమో ఇలా) - ఎన్నో శతాబ్దాల క్రితం ఎవరో రాసిన పాటల్ని దశాబ్దుల క్రితం పాడటం -ఎవరో ఎక్కడో చేసిన పరిశోధనల వల్లా, ఈ రేడియో కేంద్రాల వల్లా, CD టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళ వల్లా జరిగిన అనేక వేల సంఘటన ల గొలుసు లో "నేను విని ఈ రాత్రుళ్ళు ఆనందించడం" అనే సంఘటన ఇప్పుడు జరుగుతోంది. రాగ నిర్వచనం చేసిన ఋషిమూలం ఎక్కడుందో ఇప్పుడు? సామవేదం ఏ కాస్మిక్ డాన్స్ లో
భాగం? అబ్బా ఏమిటి అధివాస్తవికత ఇంత వాస్తవంగా తెలియబడుతొఓంది మైండ్ కి ? క్షణ క్షణం స్పృహ తప్పుతూ మేల్కోవడం లాగుంది ఇప్పుడు?
-----------------------------------------------------------------------
*కీర్తన పల్లవి "గాయతి వనమాలీ" ( సదాశివ బ్రహ్మేంద్రస్వామి-ఆల్ ఇండియా రేడియో ఆర్కైవల్ రిలీజ్ - సదరన్ గ్లోరీ - మంగళం పల్లి గానం - అంపోలు మురళీకృష్ణ వయొలిన్)
0 Comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< Home