2005-03-28

మనోధర్మపు సంకేతం

8/30/02
హృదయాన్ని గొంతు లోకి తెచ్చుకొని పాడుకున్నాను కరుణశ్రీ పద్యాల్ని ఘంటసాల వారిని అనుకరిస్తూ.
మనోధర్మమనే "core" కి టెక్నిక్ కలిసినప్పుడే పది కాలాల పాటు న్యూరల్ సర్క్యుట్రీ లకి "నేను" ని మరిపించగల కళ ప్రాదుర్భవిస్తుంది. ఇక్కడ టెక్నిక్ అన్న మాట ని భారతీయం చేస్తే సాంకేతికం. అబ్బా ఎంత అర్ధవంతంగా ఉందీ మాట. ఎంత చక్కటి అన్వయసౌలభ్యం. సాంకేతికం అంటే "అసలు" కి సంకేతం మాత్రమే అన్నట్టుగా..
ఈ సంకేతం గానంగా, కావ్యంగా, చిత్రంగా లేదా ఏదో శాస్తృం గా - ఏ రూపమైనా తీసుకోవచ్చు. "దీనికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యతే ఇవ్వండి - అసలు వేరే వుంది" అని చెప్తున్నట్టుగా ఉందీ మాట. (మరి టెక్నిక్ అనే ఇంగ్లీష్ మాట కి ఇటువంటి మూలార్ధం ఇంకేదైనా యూరోపయన్ భాష లో ఉందో లేదో!)
అన్ని రంగాల్లోనూ ఈ సంకేతాల వెనకే ఎక్కువ మంది వెర్రిగా పడడం వల్ల మనోధర్మపు ప్రభ కొడిగడుతుంది. మనుషులు తమ జీవితాలు మరింత సుఖవంతం కావడానికి చేస్తున్నామనుకునే ప్రాసెస్ లన్నింటిలోనూ ఇది కనబదుతోంది. పారిశ్రామిక నాగరికతని కొనసాగించడానికి, దాన్లో సుఖవంతం గా మనగలగడానికీ, ఆఫీస్ కి వెళ్ళి రోజూ పని చేస్తున్నాం. ఎన్నో టెక్నికల్ పనులు - ఇవన్నీ సంకేతాలే - అసలు తెలుసుకోవడానికీ, అది express చెయ్యబడడానికే వీటి ఉపయోగం, అంతవరకే వీటి విలువ అని గుర్తించ లేరు ఎక్కువ మంది.
మనోధర్మం అనేది కొంచెమో గొప్పో అభినివేశంఉన్నవాళ్ళకీ, ఒళ్ళంతా చెవుల్జేసుకునీ కళ్ళు చేసుకునీ వినే వాళ్ళకీ, చూసేవాళ్ళకీ కూడా ఉండొచ్చు. మనోధర్మాన్ని పరికిస్తూ దాని వంక చూస్తే టెక్నిక్ ని సొంతంచేసుకున్న వాళ్ళమీద పర్సనల్ గా ఉండే అతి ప్రేమలూ, అలాగే వాళ్ళకి ఉండే మహా అహంకారాలూ ఎంత అర్ధంలేనివో తెలుస్తాయి. ఈ హైరార్కీ లన్నీ (నేను ఇంత గొప్ప కళ ని సృష్టించాను కాబట్టి గొప్ప వాణ్ణనే గొడవలు) అసలు మనోధర్మపు వెలుగు ముందు కొట్టుకుపోవల్సిందే. - of course, ఆ వెలుగు ని చూడగలిగితే.