2005-03-15

సాలెగూళ్ళు

3/3/02
గ్రామపు వీధిలోని ఎస్టీడీ బూత్ లో అయిదురూపాయిల కమీషన్ కోసం చెక్కబల్ల వేసుకుని
కూర్చున్న మనిషి కీ, సముద్రాల అవతల ఇక్కడ కనబడుతున్న కెమికల్
సైంటిస్ట్ కీ ఉన్న సంబంధం గురించి ఆలోచన. వీళ్ళు కెవ్లారో ఇంకేదో జేస్తేనే
తట్టుకుంటున్నాయట వత్తిడి కి రోదసీ లో శాటిలైట్లు. మరి బూత్ లో తిప్పగానే ఎక్కడో

మోగడం శాటిలైట్ల వల్లనే గదా.. లోకమంతా వ్యాపించిన ఆర్ధిక, సాంకేతిక పని సంబంధాలు
ఎంత గజిబిజి గా క్లిష్టంగా అల్లుకొని ఉన్నాయో ఊహించడానికే గుబులు, భయం
పుడుతుంది. మానవ సముదాయాలు తమ నాగరికతను పెంచుకొనే ప్రయత్నం లో
ఏర్పడ్డ సంబంధాలు అర్ధం చేసుకునే విషయం లో నే ఇన్ని గందరగోళాలూ, గొడవలూ
జరుగుతూంటే విశ్వాంతరాళం లో మనకి కనపడేవీ, కనపడనివీ శక్తులు - ఎన్నిఉన్నాయో,
వీటిలో ఎన్ని అంతస్సంబంధాలు ఉన్నాయో, అవి మనల్ని ఏ రకంగా ప్రభావితం
చేస్తాయో ఊహించడానికే భయం వేస్తూంది. నీ గది కిటికీ రెక్క మూసినప్పుడు
విడుదల అయ్యే శక్తి - గణన చెయ్యడానికి సాధ్యం కానంత తక్కువ అయితే
కావచ్చు- విశ్వం లో ని ప్రతి అణువు మీదా ఉంటుందంటున్నాడు భౌతిక శాస్త్రవేత్త.