2001-08-23

నిశ్శబ్దం

23 Aug 01.
మనసంతా ఉల్లాసంగా ఉంది. ప్రశాంతంగా కూర్చుని ఉంటే వినబడుతున్న పక్షుల శబ్దాలు. అవి తన లోపల్నించి బయల్దేరుతున్నాయా లేక బయటి నించా అని అనిపిస్తోంది. ఆ కిలకిలారావాలు ముఖ కేంద్ర స్థానం లోంచి వెలికి వస్తున్నట్లుగా ఒక అనుభూతి. అట్లానే పక్కవాళ్ళ మాటలు ?
బార్న్స్ అండ్ నోబెల్ లోచక్కటి కాఫీ. మనసంతా హాయిని నింపే రంగులు., మనుషులూ, వాసనలూ, వర్ణచిత్రాలూ. అన్నిటినీ మించి పుస్తకాలూ. ఏం జరుగుతోందో, ఎలా ఆలోచనలు గమనించబడుతున్నాయో, ఈ స్రవంతి అంతా మాయమయింది. బహుశా నేను లేకపోయి ఉండవచ్చు.

2001-08-12

అధిక్యత - తిండి

Aug 12, 01.
మళ్ళీ రేగిన గాయం. అధిక్యత కోసం వెంపర్లాట. తీవ్రమైన ఆగ్రహం, అశాంతి. మెదడులో అంటుకున్న మంట. మంటని చూడాలని ప్రయత్నిస్తుంటే కదిలి విసిరేయబడుతున్న మనసు. కేంద్రం నించి వికర్షిస్తున్న ఆలోచనలు.
తిండి ని చూస్తే వదల్లేదు దేహం. చచ్చేట్టుగా తిని అధిక్యతా భావాన్ని తృప్తి పర్చుకోవాలని చూస్తుంది, ఆ పదార్ధాలు పళ్ళ కింద పడి నలుగుతూంటే. కడుపు మొర్రో అన్నా సరే - నాలుక తద్వారా మెదడు ఆహా అంటోంది కదా..

2001-08-08

మాంటేజ్ ప్రేలాపన

8/8/01
కదలని కలం. నిరంతరం కదుల్తున్న మనసు.. మెదడు. అంటే భయం. రక్తపు చుక్కలు - కౄరత్వం- పోలీసు. ఛాయ- మాట - సంగీతం- మనిషి- పిచ్చి ప్రలాపాలు - డైలాగులు - విదూషకుడు - కాళ్ళూ చేతులూ- పెన్ను తలకాయ- సినిమాలు - మళ్ళీ సంగీతం - మోహనం- వనజనయనా నీ మోము జూచుటే.. - మరి టాక్స్ బ్రేక్ సంగతి ? - ఎలాగా పొంతన ఇన్ని వైరుధ్యాలకి ? - నిజంగా వైరుధ్యమేనా ? - తీవ్రమైన ఆందోళన - పెద్దకేక - మనసు హఠాత్తుగా ప్రశాంతం - మళ్ళీ డిస్టర్బెన్సు - భయంకరమైన కోపం - అలగా సినిమాలు - కాల్పులు - నిస్త్రాణ - క్వాంటం అణువుల చీలిక - శక్తి స్వరూపాలు - బుద్ధాస్ నేచర్ - మనసుకి కుదురు - ఎప్పుడూ ఇలాగే వుంటే ? - అరె మళ్ళీ సుఖం - లాలసత - కార్మిక్ రిసొనాన్స్ - అంతా మోసం - మరి పునర్జన్మ ? - అసలు కార్మికులు ఎవరు ? - మార్క్సు పుట్టించాడా?
- ఫ్రాయిడ్ ఎందుకు గంతులేస్తున్నాడు ? - ఆత్మ సాక్షాత్కారమా ?