2005-05-06

విముక్తుడు

8/29/03
ప్రతి క్షణమూ అలల్లాగా ఎగసి పడే అనంతమైన ఆలోచనల వల్ల ఏమిటి ప్రభావం? అవి వాటి ముద్రలనీ, అడుగుజాడలనీ మనసు మీద వేయక పోతే ఏమీ లేదు కాన్సీక్వెన్స్.

స్వీయ ధర్మపు వాసననీ, కవి చెప్పిన ప్రాచీన స్మృతుల శబ్దాల్నీ కలిపితే..
ప్రాధమికమైన వేడి తో నిండిన వాతావరణం. ఏమీ చేయనక్కర లేని పగళ్ళూ - మధ్యాహ్నాలూ; ఏవో ప్రాధమిక మైన పనులు ఉన్నా - వంట, ఊడ్చటం, కడగటం, నానబోయడం, చేతుల్తో తిప్పడం, పొయ్యి వెలిగించడం - ఇవన్నీ ప్రదర్శించాల్సిన పనులు కాదుగా.
పగళ్ళూ రా త్రుళ్ళూ, సంఖ్యలూ పేర్లూ తగిలించుకోకుండానే మారుతుంటాయి. బయటి శక్తులు తమ తమ ప్రభావాలని రకరకాల వేషాల్లో మోసుకొచ్చి ఏమీ చెయ్యలేక విఫలమవుతుంటాయి. దేన్నీ మార్చనక్కరలేని స్థితి క్షణక్షణమూ అవగతమవుతూ ఉంటుంది. కాలం అనేది పేరు పెట్ట నక్కర్లేకుండానే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఉవ్వెత్తున ఎగిసి పడే కోరికలూ, ఆలోచనలూ ఆక్షణం లోనే అప్పటికప్పుడే అంతమవుతూ ఉంటాయి - ముద్రలని వదలకుండా. జీవితపు ప్రాధమిక అంశలన్నీ స్పష్టం గా ముందుకొచ్చి నిలబడతాయి. 'అసలు' అయిన 'మొదటి' దాన్ని తాకుతున్న భావన ముంచెత్తుతూ ఉంటుంది.
బలహీనమైన కాళ్ళూ, చేతులూ తమ పనుల్ని మెల్లగా చెయ్యడానికి మొహమాట పడవు. ముఖమూ, కళ్ళూ ఉద్రేకపు రంగు పూసుకోకుండానే వెలిగిస్తుంటాయి పరిసరాలని. ఆశయాలకీ చట్రాలకీ కన్ఫర్మ్ కావల్సిన అవసరం మాయమవుతుంది. వెకిలిలో, చెడ్డలో, సదుపాయాలు లేని తనంలో ఎండలో, మట్టి లో తన ప్రతిబింబాన్ని చూసుకుని నేను కాలుతూ ఉంటుంది జ్ఞానాగ్నితో.
ప్రస్తుత క్షణం లో ఉన్న భావమే తర్వాత క్షణంలో ఉంటుందనీ, ఉండాలనీ అన్పించదు. అసలు తర్వాత అన్న పదమే మాయమవచ్చు కూడా. మూల ప్రాధమిక ధర్మం వేడి, మురికి, మందబుద్ధి అయినప్పుడు - ఉన్న దాన్లోనే ఉండి పోవడం అంటే ఏమిటో అర్ధమవుతుంది. నేను పూసే అన్ని పూతలూ పూర్తిగా మాయమయి పూవులన్నీ వికసిస్తాయి.