2005-04-21

"హై పిచ్"

8/30/02
దాటుకున్నవాడు చేసే పనిని ఆపాలని రూలేం లేదు. వాడిష్టం(!?) మానొచ్చు మానక పోవచ్చు. మానడం అనే చర్య దాటాడు అనడానికి గుర్తు కాదు అన్ని సందర్భాలలోనూ…
పొద్దుణ్ణించీ నిస్త్రాణ గా ఉంది. మధ్యాన్నం నించీ మళ్ళీ సుఖపు షాట్లూ, హై లూనూ. ఇదంతా ఏదో డ్రగ్స్ తినే వాళ్ళ భాష లాగుంది కాబోలు. నిజానికి రెండున్నర నెలల నించీ ఒంటరిగా మాట్లాడుకున్న మాటలూ, విధవిధాలుగా చేసిన (అట్ట) హాసాలూ, ఆడిన నాట్యాలూ, వేసిన వేషాలూ ఎవరైనా చూసి ఉంటే (దేవుడు వాళ్ళని రక్షించు గాక!) ఏదో డ్రగ్ ప్రభావంలో ఉన్నాడనో లేక బాగా ముదిరిన పిచ్చి వాడనో అనుకోక మానరు - నా మట్టుకు నాకు జీవితం లో క్లారిటీ ఎంతో పెరిగినట్టు అనిపించినా - ఎవడి పిచ్చి వాడి కానందం!

//మెమొరీ కి కమిట్ చేయాలన్న కోరికా, సంగతుల్ని స్వాధీన పర్చుకోవాలన్న తృష్ణా లేకుండా కాసెట్ పెట్టుకుని పద్యాలు వింటూ పాడుకుంటూ ఉన్నా. అయినా బంధుమిత్ర సమాజ పరివారాలు ఆడియన్స్ గా ఊహించబడుతూనే ఉన్నారు. ఆ ధాటి ని భరించలేక శరీరం అంతా వేడి గా ఉంది.
///రెండు సంవత్సరాలుగా మనుషుల్తో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ కళ్ళలోకి లోతుగా సూటిగా చూడడం.. ఇది ఆధునిక సమాజం లో అమర్యాదగా పరిగణిస్తారేమో తెలీదు. ఏదో వెతుకుతున్నట్టూ, అవతలి మనిషి లోపలికి చొచ్చుకు పోయి కనెక్ట్ చేసుకోవాలన్న కోరిక కాబోలు ఇదంతా.. మనిషికీ మనిషికీ మధ్య ఏదొ బేసిక్ కోర్ లవ్ అనే పదార్ధం ఉందని తెలుస్తూంటుంది ఇలా కళ్ళలోకి చూస్తుంటే. మళ్ళీ ఎప్పుడైనా వివరంగా ఈ కళ్ళ లోకి చూడటం గురించి రాయాలి ఇప్పుడు ఓపిక లేదు.
/// మనలో లేని గుణాలు ఉన్నట్టుగా నమ్మించి అయినా సరే ఎదుటి వాళ్ళని సంతోషపెట్టి తద్వారా మనం ఆనంద పడుతూ ఒక రకమైన తృప్తి పొందడం -- చాలానే ఉండేది. డబ్బు కోరికలూ, ఇమేజ్ కోరికలూ తీరి - కొంత వరకూ 'చూసిన' తర్వాత ఇప్పుడు బాగానే తగ్గింది.

2005-04-01

బహుశా తనం

8/31/02
ప్రాబబిలిటీ కి సంభావ్యత అన్న సంస్కృతం వాడకుండా ఉండాలంటే ఇంకొక తెలుగు మాట ఉందా ? అంతా (అన్) లైక్లీహుడ్ లోనే ఉందంటున్నారు ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు. తమాషాగా అయినా థాంక్స్ గివింగ్ పండగ కి సాదకం తయారవాలంటే మైక్రోవేవ్ ఓవెన్ ని సిద్ధం చేసి మార్కెట్ లో ఉన్న టర్కీ దానంతట అదే ఓవెన్ లోకి రావడం కోసం ఎదురు చూస్తాడుట క్వాంటం ఫిజిసిష్టు. అది తరవాత క్షణమో, తరవాతి సంవత్సరమో, లేదా ఒక బిలియన్ సంవత్సరాల తర్వాతో - లేదా విశ్వపు జీవిత(!) కాలం లో ఎప్పుడైనా రావచ్చు.*
గమనించే వాడిని బట్టి ఎలక్ట్రాన్ తన ప్రవర్తన ని సంతరించుకుంటుందట. ప్రపంచం అంతా నీ వల్లనే రియాలిటీ ని ఆపాదించుకుంటోంది అంటే ఆలోచించడానికి నిరాకరిస్తారెందుకో? అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అని సుఖంగా పొట్ట నిమురుకుంటూ అరమోడ్పు కన్నులతో వాదించే వాళ్ళకి రియాక్షన్ చాలా వరకూ ఈ సోకాల్డ్ ఆధునికుల అవహేళనా భావమంతా…


*ఈ ముచ్చట ఉన్న పుస్తకం - సెల్ఫ్ అవేర్ యూనివర్స్ - అమిత్ గోస్వామి