2013-10-24

ఇళయరాజా - సంగీతం - కొన్ని జవాబులు

సంగీతం  అంటే మీరు చెప్పే అర్థం ?
'అంతా' ,  'సర్వం'  అన్న మాటలకి అర్థం  తెలుసు కదా.  'సంగీతం' అన్నా అర్థం  అదే !
***
మీకిష్టమైన  రాగం ?
ఆత్మ రాగం ..  ఇదే అందరిలోనూ  ఉండే ఆధార స్వరం, ఆధార శృతి ..
*****
మాట ముందా ,  రాత ముందా, పాట ముందా,  ఏది ముందు వచ్చింది ? (కోయంబత్తుర్ లో విష్ణుపురం అవార్డు సభకి అతిథి గా వెళ్ళి నప్పుడు వేరే వాళ్ళు తమ ప్రసంగం లో ప్రస్తావించిన మాటలకి తరవాత స్పందిస్తూ)

మొట్టమొదట వచ్చింది  - సంగీతం.
ఆ తరవాత వచ్చిందీ - సంగీతమే.
దాని తరవాత వచ్చిందే - సంగీతం !
ఏది సంగీతం కాదు ? మాట సంగీతం  కాదా ?
(మళ్ళీ గొంతు మార్చి వేరే లయలో ) -  మాట సంగీతం కాదా ?
ఈ మాట ఇలా అంటున్నప్పుదే సంగీతం అవడం లేదా ?  దీనిలో సంగీతం లేదా ?
(మళ్ళీ గొంతుక ని మంద్ర స్థాయి లోకి మార్చి )  ఇది సంగీతం  కాదూ ?
****
పైవన్నీ తమిళం లో జరిగిన సంభాషణలు.

2013-10-19

వెటకారం - ఉపమానం - పరమార్థం

ఒకటి :  వెటకారం

ఎలిక పాము  ప్రార్థన  - చలం 

(ఎలిక పాము - మన ప్రేవులలో ఉండే/పుట్టే నులి పురుగు)


మానవా !  నీవే మా సృష్టి కర్తవు.  నీవే రక్షకుడవు. నీ పేర్లు అనంతములు. నిన్ను అనేకులు అనేక పేర్ల తో పిలవగా తెలుసుకున్నాము. నారాయణా ! వెంకటప్పా! జోగులూ ! రంగమ్మా? హుస్సేన్ ! పాప,  చిట్టీ, రాజు, బాబు - ఇవి నీ పవిత్ర నామములలో కొన్ని ఐవున్నవి.

నీవు శాశ్వతుడవు. నీకు మృత్యువు లేదు. నీవు చండశాసనుడవు. నీ ఆజ్ఞలకు లోబడి ఈ పేగు భువనములన్నీ ఉదరాకాశమున అత్యద్భుతముగా నిలిచి యున్నవి.

నీవు భీషణుడవు. అప్పుడప్పుడు పెద్ద భూకంపములను కలుగజేసెదవు.  నీ ఆజ్ఞాబద్ధులమై కామ క్రోధములను విడనాడి సంసారాపేక్షతో మాత్రమే మా స్త్రీ లతో సంగమించి నీ హృదయమునకు ఆహ్లాదమును వొనగూర్చుచున్నాము.

నీవు ఆగ్రహపరుడవై గద్దించునపుడు మా ప్రాణములు దద్దరిల్లి భయముతో వణికెదము. అంత గద్దించి గూడ, మాకే కించిదపాయమును గూడ కలుగజేయవు. ఎంత కరుణామయుడవు ! మేము సేవించుటకై ఈ చీము ను సృష్టించితివి. ఈ అప్రమేయవరములకై  మేము శత సహస్ర వందనము లర్పించుచున్నాము. ఓ మహాప్రభూ ! నీవు శిశుడవు ! లోపరహితుడవు. సమస్త ప్రపంచములకు ఆధార భూతుడవు. నిష్కల్మషుడవు. సత్యరూపా నీకు జోహారు !

****

పై కథ చలం ఫౌండేషన్, విశాఖ పట్టణం వారు ప్రచురించిన బులెటిన్ -8  లో ఉంది. అందులో ఇంకా ఈ కథ గురించి ఇలా వుంది

ఈ కథ 15-8-1935 చిత్రగుప్త పత్రికలో అచ్చు అయింది. పూర్వ సంపుటాలలో రాలేదు. ఈ కథను పాత పత్రికల నుండి సేకరించి 1982 జనవరి జ్యోతి మాసపత్రికలో పునర్ముద్రించారు. కానీ ఇటీవల విడుదల అయిన చలం సమగ్ర సాహిత్ర్యం-20 సంపుటాలలో కూడా అది చేరలేదు.


రెండు -  కొ. కు.  -- ఉపమానం 
కొడవటిగంటి కుటుంబరావు గారి నవల "అనుభవం"  లోని ఆంజనేయులు గారనే వేదాంతి పాత్ర  మాటల్లో ('భూదేవి అనే ఆవిడ నిజంగా ఉందేమో') ఈ కథలోని సూచన ని ముందుకు తీసుకు వెళ్ళడం కనిపిస్తుంది.

కొ. కు.  నవల "అనుభవం" నించి :

నేను అన్నది అన్ని భ్రమల లోకీ గొప్ప భ్రమ అనీ, అసలు వ్యక్తి అనేది సృష్టి లోనే లేదనీ, ఒక పేరు పెట్టటానికి వీలైన సమిష్టికి మనం వ్యక్తిత్వం అంట గట్టుతున్నామనీ  ఆంజనేయులు గారు వాదించాడు.

"ఆ మాట ఎట్లా అనగలరు ? " అని వెంకటేశ్వర్లు ఆక్షేపించాడు. 

"ఎందుకనలేం ? మీ ఇష్టం  వచ్చిన ఏ వ్యక్తి నైనా చెప్పండి. అది సమిష్టి అనీ, అందులో చేరిన వాటన్నిటికీ వేరే వ్యక్తిత్వం ఉన్నదనీ, అవి మళ్ళీ సమిష్టులేననీ నేను రుజువు చేస్తాను.

ఒక మనిషి ని తీసుకోండి. వాడిలో వ్యక్తిత్వం ఎక్కడున్నది ? వాడి శరీరం లో ఎన్ని ధాతువులు ! ఎన్ని కోట్ల జీవకణాలు ! తమ పని తాము చేసుకుంటూ పోయే గుండెకాయ, ఊపిరితిత్తులు,  గ్రంథులు, రక్త ప్రవాహం, మెదడు, నరాలు ! వారి జీవితాలు వాటికున్నాయి.. శరీరం ఓ పెద్ద ప్రపంచం,  అందులో ఎన్నో జీవరాసులు, వాటివాటి ప్రత్యేక జీవితాలు. కొన్ని కొద్ది క్షణాలు మాత్రమే బతుకుతాయి.కొన్ని ఈ ప్రపంచం ఉన్నంత కాలమూ ఉంటాయి. మాటవరస కు చెబుతా.. భూదేవి  అంటూ ఒకతె నిజం గా ఉన్నదే మో ! ఉండి తానొక వ్యక్తి ననుకుంటున్నదేమో …!  ఉంటే మనకు కనిపించదా అనకండి .  మన శరీరంలో ఉండే రక్త కణాలకు మనం కనిపించం.  అవి నివసించే ప్రపంచం ఒక వ్యక్తి  అన్నది  వాటికి ఊహించరాని  విషయం.

ఇంకో విషయం చూసారో లేదో.  మన లోపల ఉన్న సమిష్టత్వం మనకు చాలడం  లేదు.  బయటి నించి సమిష్టిత్వాన్ని వెతుక్కుంటున్నాం. పది మంది చేరి తమ వ్యక్తిత్వాలను కలగలుపుకున్నప్పుడే  మనకు ఆనందమూ, ప్రయోజనమూ ఉంటున్నది.  వ్యక్తిత్వాన్ని సమిష్టి లో లీనం చెయ్యటానికి నా చిన్నతనంలో భజనలు చేసేవాళ్ళు. పురాణాలు వినేవాళ్ళు. తోలు బొమ్మలాటలు చూసేవాళ్ళు. ఉత్సవాలు చేసేవాళ్ళు.  తరవాత ఉద్యమాలు వచ్చాయి.  ఈనాడు  ఈ సినిమాలు అవీ అందుకే  ఉపయోగ పడుతున్నాయి.  కళలకున్న ప్రయోజనం కూడా అదే -  వ్యక్తులను సమిష్టి గా రూపొందించడం ….  నన్నడిగితే  నిజమైన వ్యక్తిత్వం అనేది పరమాత్మ కి మాత్రమే.  ఆ పరమాత్మ కూడా  వ్యక్తిత్వం లో తృప్తి చెందలేక సమిష్టిత్వాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కారణం చేతనే  ఈ సృష్టి అంతా నడుస్తున్నది. "  అన్నాడు ఆంజనేయులు గారు.

*******

  చివరి వాక్యాలలో సృష్టి పుట్టుక గురించి ఆధునిక భౌతిక శాస్త్రం చేస్తున్న భావనలు  ప్రతి ధ్వనిస్తున్నాయి. ఈ నవల యువ లో 1968-69 సంవత్సరాలలో ప్రచురింపబడింది.

దీన్ని ("పరమాత్మ కూడా  వ్యక్తిత్వం లో తృప్తి చెందలేక సమిష్టితత్వాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. ఆ కారణం చేతనే  ఈ సృష్టి అంతా")ముఖ్య భావనగా కొన్నేళ్ళ క్రితం (2004 -5) స్కాట్ ఆడమ్స్ అనే ఆయన  ఒక నవలే వ్రాసారు. (గాడ్స్ డెబ్రి - god’s debris అనే పేరుతో - దివ్య రేణువులు అనే అర్థం వచ్చేట్లు గా)  

---------------------------------------------------


 

మూడు -  రమణ మహర్షి - పరమార్థం 


1937 డిసెంబర్ - 1938 జనవరి  మాసాల మధ్య లో రమణ మహర్షి కీ అల్హాబాద్ విశ్వవిద్యాలయ తత్వ శాస్త్రాచార్యుడు డాక్టర్ సయ్యద్ గారి కీ జరిగిన సంభాషణ లో :  (ఇది గుఱ్ఱం సుబ్బరామయ్య గారు వ్రాసిన రమణ స్మరణామృతము  అనే పుస్తకం -archival special edition – 2000 లో ఉంది.) 

నా ప్రయాణ దినము వేకువ అలహాబాద్ విశ్వవిద్యాలయ తత్త్వ శాస్త్రాచార్యుడు డాక్టర్  సయ్యద్ ఒక ప్రశ్న వేసెను.  

"భగవాన్ , సృష్టి ప్రయోజనమేమి ? "  అని ఆయన అడిగెను.

సాధారణముగా శ్రీ భగవానులు తన ప్రత్యుత్తరములు అఱవము లో గానీ మలయాళము లో గాని చెప్పి వాటిని తర్జుమా చేయింతురు. కాని యీ మారు శ్రీ భగవానులు ఇంగ్లీషులోనే  భాషించిరి.


“can the eye see itself ?” (కన్ను తనను జూడగలదా ?) అని శ్రీ భగవానులు బదులు ప్రశ్న వేసిరి.

దానికి డాక్టర్ సయ్యద్  "చూడలేదు. అది ఇతరము నంతటిని జూడగలదు. ఒక్క తనను దప్ప అని జవాబిచ్చిరి.

"మఱి అది తనను జూడగోరితే ? "  అని శ్రీ భగవానులు మరల అడిగిరి. డాక్టర్ సయ్యద్ ఒక్క నిమిషమాలోచించి ఇట్లు పలికెను. "అది అద్దములో తన ప్రతిబింబమును మాత్రము చూడగలదు. "

ప్రత్యుత్తరమును బట్టుకొని శ్రీ భగవానులిట్లు వ్యాఖ్యానించిరి: 

"సరి. అట్లే సృష్టి,  '' తనను జూచుకొనుటకు అద్దము. "


ఇది విని నేను "శ్రీ భగవానులు  ఉద్దేశించినది e-y-e యా,  లేక  I యా ? "అని అడిగితిని.

శ్రీ భగవానులు "ఉపమానమునకు 'e-y-e', పరమార్థమునకు 'I' గ్రహింపవచ్చును. " అని సెలవిచ్చిరి.

                              ~*~