2021-03-10

ఆధ్యాత్మిక అంత:కేంద్రం - రమణ మరణానుభవం

మృత్యువు యొక్క సంపూర్ణ ప్రాముఖ్యాన్ని ఒక మనిషి అర్థం చేసుకుంటే ఆ అవగాహన వెనుక ఒక నిండుతనం, జీవశక్తి ఉంటాయి. ఆ మనిషి మానవ చేతన నుంచి విముక్తుడవుతాడు. మీరు నిత్యం జీవిస్తూనే, అంతమైపోతూ ఉంటే జీవితం, మృత్యువు రెండూ ఒకటేనని తెలుస్తుంది. ఈ రెండూ ఒకటేనని అర్థం చేసుకున్నప్పుడు మీరు మరణం పక్కనే జీవిస్తూ ఉంటారు. ఇది చాలా అపూర్వమైన విషయం. అక్కడ గతమూ వర్తమానమూ భవిష్యత్తూ ఏమీ ఉండవు. ముగింపు మాత్రమే ఉంటుంది.


మరణం అనేది ఒక ముగింపు. దీనికి జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉంది. అంటే ఆత్మహత్య చేసుకోవడమో, బాధని భరించలేక జరిపే కారుణ్య మరణమో కాదు. తనకున్న బంధాలు, తనలోని గర్వం, ఇంకొకరిపట్ల ఉన్న ద్వేషం, శత్రుత్వ భావం - వీటన్నింటినీ అంతం చేయడం. మరణించడమూ, జీవించడమూ - ఇవి ఒకే గతిలో, ఒకే చలనంగా ఉన్నాయని మన జీవితం వంక పూర్ణదృష్టితో చూస్తే తెలుసుకోవచ్చు. ఈ దృష్టితో చూసినప్పుడు మరణం నించి సంపూర్ణ విముక్తి లభిస్తుంది. అంటే ఈ భౌతిక శరీరం మరణించకుండా ఉండిపోవడం కాదు. 'అన్నీ ముగిసిపోయినట్లైన ఒక ప్రజ్ఞ' కలగడం వల్ల కొనసాగడం ఉండదు. "కొనసాగకపోవడం వల్ల కలిగే భయం" అనే దాని నించి విముక్తి లభిస్తుంది.


పై మాటల్ని 1982 లో జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక ఉపన్యాసంలో చెప్పారు. దీనికి 86 సంవత్సరాలకి పూర్వమే వెంకటరామన్ అనే బాలుడికి కలిగిన ఆత్మానుభవాన్ని ఆయన (భగవాన్ రమణమహర్షి)

మాటల్లోనే చూస్తే -


మధురై ని వదిలి వెళ్ళిపోవడానికి బహుశా ఒక ఆరువారాల ముందు నా జీవితంలో పెనుమార్పు హఠాత్తుగా సంభవించింది. అప్పుడు నేను మా బాబాయి గారింటి మేడ మీది గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాను. మామూలుగా నేను ఆరోగ్యవంతుడినే. ఆరోజు కూడా నాకు ఆరోగ్యం బాగానే ఉంది. ఉన్నట్టుండి ఒక ప్రచండమైన, అకస్మికమైన మరణ భయం నన్ను ఆవహించింది. అనారోగ్యం వల్ల అలా జరిగిందనుకోవడానికి ఆధారమేమీ లేదు. అసలు ఆ మరణ భయానికి కారణం ఏమై ఉంటుంది? ఎందువల్ల అది కలిగింది? అని నేనసలు యోచించలేదు. దాన్ని వివరించాలని గాని, కారణం అన్వేషించాలని గాని నాకప్పుడు తోచలేదు. 'నేను మరణించబోతున్నాను' అన్న భావనే ప్రబలంగా కలిగింది. ఏం చేయాలి? పెద్దవాళ్ళనో, స్నేహితులనో, వైద్యుడినో కలుద్దామన్న ఆలోచన రాలేదు. దీనిని తక్షణమే, అక్కడే, నాకు నేనే పరిష్కరించుకోవాలని తీవ్రంగా అనిపించింది. ఉన్నట్లుండి కలిగిన ఆ మరణ భయపు దిగ్భా్రంతి నా మనసుని లోలోపలికి చొచ్చుకుపోయేలా చేసింది.


'సరే ఇప్పుడు మృత్యువు సంభవించింది - దీని అర్థం ఏమిటి? మృతి చెందేది ఏమిటి? ఈ శరీరమే కదా' అని మనసులో స్ఫురించింది - ఏ మాటలూ నిజంగా కూర్చుకోకుండానే. ఇక ఒక్కసారిగా నా శరీరం 'చనిపోవడాన్ని' అభినయించింది. వెల్లకిలా పడుకుని, అవయవాలనన్నింటినీ బిర్రబిగించి, శవంలాగే తయారయ్యింది. ఊపిరి ఆగింది. ఎటువంటి మాటా, కనీసం 'నేను' అనే శబ్దం కూడా పైకి రాకుండా పెదవులు బిగుసుకున్నాయి. ఇదంతా నా విచారణ యదార్థంగా మరింత నిక్కంగా ఉండాలనే.


సరే ఈ దేహం మరణించింది; దీన్ని శ్మశానానికి తీసికెళ్ళి కాల్చి బూడిద చేస్తారు. మరి శరీర మరణంతో 'నేను' అంతమైనట్లేనా? శరీరం నేనేనా? దేహంతో పని లేకుండానే ఎరుకను, స్ఫురణను సంపూర్ణంగా కలిగి ఉన్నాను. శరీరం ఒక నిశ్శబ్ద నిశ్చల జడపదార్థం. అంచేత 'నేను' శరీరానికి అతీతమైన తత్తా్వన్ని.


పైదంతా ఒట్టి ఆలోచన గా కాకుండా ఓ సజీవ సత్యంగా నాలో స్ఫురించింది. ఆలోచనల ప్రసక్తి లేకుండా నేను దానిని సూటిగా గ్రహించాను. ‘నేను’ అనేదే నిజం. నా వర్తమాన ఉనికిని గూర్చిన ఏకైక సత్యం. ఈ ‘నేను’ అనే కేంద్రంగానే శారీరపు ఎరుకతో కూడిన కార్యకలాపమంతా సంభవిస్తుంది. తత్‌క్షణం నుంచి 'నేను' లేక 'ఆత్మ' ఒక ప్రగాఢమైన ఆకర్షణతో తన దృష్టినంతటినీ తన పైనే కేంద్రీకరించింది. చావు భయం సమూలంగా అంతరించింది. మనసును లోపలే నిలిపి ఉంచే ఆత్మనిష్ఠ అప్పటినుంచి అప్రతిహతంగా, నిర్విరామంగా కొనసాగింది. సంగీతంలోని సప్తస్వరాల్లా ఇతర తలపులు వచ్చిపోవచ్చుగాక, కానీ ఆధార శ్రుతివలె ఈ ‘నేను’ యొక్క ఎరుక స్పష్టం, ప్రస్ఫుటం! శరీరం మాట్లాడటం, చదవడం వంటి ఏ పనుల్లో ఉన్నా ‘నేను’ పైనే ‘నా’ దృష్టి.”


ఇదీ భగవాన్ తన పదహారవ ఏట జరిగిన అనుభవం గురించి తరవాతెప్పుడో స్వయంగా చెప్పిన విషయం. ఇది జరిగాక ఆయన తిరువణ్ణామలై వచ్చి ఏదో గొప్పతపస్సు చేశారని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా అప్రయత్న, సహజ సమాధి మాత్రమేననీ - దానిని చూసి తపస్సు గా పొరపడే వాళ్ళనీ భగవానే స్వయంగా (కొద్దిసార్లే, కొద్దిమందితో అయినా) చెప్పారు.


వీలైనప్పుడల్లా తిరువణ్ణామలై వెళ్ళడం, రమణుడు ఉన్న, తిరుగాడిన ప్రదేశాలు చూడటం, ఆయన తన జీవితపర్యంతమూ అక్కడ నెలకొల్పిన ప్రాంకుర స్పృహ (ఓ రకమైన ప్రిమోర్డియల్ అవేర్నెస్ - వితౌట్ ప్రిమిటివిజమ్) ని కొంతవరకూ అందుకోవడానికి ప్రయత్నించడం - ఇవన్నీ రమణమహర్షి తత్త్వం మీద ఆసక్తి ఉన్నవాళ్లు తరచుగా చేసేవే.


ఇంకా మన తెలుగువాళ్ళు ప్రత్యేకంగా తిరువణ్ణామలై లో చేయగలిగినవి కొన్ని ఉన్నాయి. సూరినాగమ్మ గారి రచనలలో ప్రస్తావించిన అనేక స్థలాల్ని సంఘటనలనీ రిలేట్ చేసుకుంటూ ఆశ్రమాన్ని చూడొచ్చు. చలం పాఠకులైతే ఆయన జీవితపు చివరి మూడు దశాబ్దాలలో చేసిన రచనల్లో '' ప్రభావాన్నిగుర్తు చేసుకుంటూ ఆ ప్రదేశాలన్నీ తిరగొచ్చు.


ఇంకా సమయం ఉండి తెలుగు సాహిత్యాసక్తి ఉన్న పాఠకులైతే రమణాశ్రమం లోపల ఉన్న గ్రంథాలయం లో ఉన్న పుస్తకాలు, పత్రికలు చూడవచ్చు. ఈ గ్రంథాలయం వెనుక ఉన్న ప్రాధమికమైన ఉద్దేశం ఆధ్యాత్మికమైనా సాహిత్య ప్రాముఖ్యం కలిగిన కొన్ని తెలుగు పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి - 1930-50 ల మధ్యనాటివి. మచ్చుకి - మహాప్రస్థాన గీతాలలో కొన్నింటిని (వ్యత్యాసం - నూరు దోషాల లోని పుణ్యం నూరు పుణ్యాల లోని ఘోరం, అవతారం - యముని మహిషపు లోహఘంటలు, నవకవిత – ఝంఝానిల షడ్జధ్వానం ఇత్యాదులు) మొదటిసారిగా ప్రచురించిన ముప్పైల నాటి 'ప్రతిభ' సంచికలు, చందూర్ గారి సంపాదకత్వం లో వెలువడిన 'మాలి' పత్రిక (1949 నాటిది), తన బాల్య, యౌవ్వన స్నేహితుల గురించి చలం గారు చెప్పగా చిక్కాల కృష్ణారావు గారు వ్రాసిపెట్టిన 'చలం మిత్రులు' లాంటి పుస్తకాలు..


వెంకటరామన్ అనే యువకుడు అస్తమించి ఆత్మస్ఫురణ కలిగిన మహర్షి ఉదయించడం సమకాలీన ఆధ్యాత్మిక ప్రపంచం లో ఓ భూకంపం అనుకుంటే, దానికి ఎపిసెంటర్ లాంటిది మధురై అనుకోవచ్చు.

తిరువణ్ణామలై కి చాలా ఏళ్ళుగా వెళ్తూ ఉన్నా, నేనెప్పుడూ మధురై చూడలేదు. ఈ సంవత్సరం మే నెలలో మధురై వెళ్లి - ఎలాగూ అంతదూరం వెళ్ళాను కాబట్టి రమణుడు పుట్టిన ఊరు (తిరుచ్చుళి), తంజావూరు, తిరువయ్యారు, కుంభకోణం తిరిగివచ్చాను. ఈ ప్రయాణపు విశేషాలు క్లుప్తంగా... (ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)


రమణమందిరం, మధురై.


మధుర మీనాక్షీ దేవాలయం దక్షిణపు ద్వారానికి ఎదురుగా ఉన్న వీధిలో ఐదు నిమిషాల నడక దూరంలో 'రమణ మందిరం' ఉంది. అచ్చంగా అప్పటి కట్టడం కాకపోయినా పెద్ద ఎక్కువ మార్పులు చేయకుండా ఆ ప్రదేశాన్ని అలానే కాపాడుకొస్తున్నారు. ఈ ఇంటిలో పై అంతస్తులో ఉన్న ఆ చిన్న గదిలోనే ఆనాడు రమణుడికి ఆత్మానుభూతి కలిగింది. చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. రమణుడి చిన్న ఫొటో, దీపం ఉన్నాయి. వెళ్ళగానే 'It all started here' అన్న అనుభూతి పొందవచ్చు.


తిరువణ్ణామలైలోని రమణాశ్రమాన్ని గురించి విని, చూసే వాళ్ళు చాలామందే ఉన్నా మధురైకి వచ్చి ఈ ప్రదేశాన్ని చూసేవాళ్ళు తక్కువే. పొద్దునా సాయంత్రం ఏదో ఓ అరగంట భజన కార్యక్రమాలు ఉన్నా అవి కింద గ్రౌండ్ ఫ్లోర్ లోజరుగుతాయి. చాలాసేపు కూచొని ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళకు అనువైన ప్రదేశం.


భూమినాధేశ్వరాలయం, తిరుచ్చుళి.


రమణుడు పుట్టిన ఊరు తిరుచ్చుళి. ఇది మధురైకి 30 మైళ్ళ దూరంలోనే ఉందని చాలా పుస్తకాల్లో ఉంది. పట్టణ విస్తరణ పథకాల వల్లనో, నూతన రహదారులు వేసే క్రమంలోనో లేక మధురై నగరం అడ్డదిడ్డంగా పెరిగిపోవడం వల్లనో మధురై నుంచి తిరుచ్చిళికి వెళ్ళడానికి దాదాపు నాకు రెండున్నర గంటలు పట్టింది - వేగంగా పోయే తమిళనాడు rtc బస్సులలో.


మధురై పాతబస్టాండ్ (పెరియార్) నుంచి మాట్టుదావణి లోని కొత్త బస్టాండ్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి అరుప్పుకోటై అనే ఊరికి వెళ్ళాలి. అరుప్పుకోటై నుంచి తిరుచ్చుళి వెళ్ళే బస్సు ఎక్కి భూమినాధేశ్వర దేవాలయం స్టాప్ లో దిగాలి. ఇది చాలా పెద్ద ఆలయం. ప్రశాంతమైన వాతావరణం. రెండు పెద్ద పెద్ద ఆలయాలు ఒకటే ప్రాకారం లోపల ఉన్నాయి. ఒక దేవాలయంలో భూమినాధుడు మరొక దాన్లో సహాయవల్లి మూల విరాట్టులు. ఇక్కడే ఒక మూల ప్రళయ శివుని గుడి చాలా అద్భుతంగా ఉంది. ప్రళయ జలాల్లో శివుడు తన త్రిశూలంతో ఒక చిన్న సుడిని చేసి (తమిళంలో సుళి) భూభాగాన్ని రక్షించి దానిలో భూమినాధేశ్వరుడిగా వెలిశాడని స్థలపురాణం. అందుకే ఈ ప్రదేశానికి తిరుచ్చుళి అనే పేరు వచ్చింది. త్రిశూలపురమే తిరుచ్చుళి అయిందని చాలా మంది అనుకుంటారు కాని అది బహుశా సరికాదు.


రమణుడు పుట్టిన ఇల్లు.


భూమినాధేశ్వరాలయానికి ఐదు నిమిషాల నడకలో రమణుడు పుట్టిన ఇల్లు ఉంది. డిశంబర్ 30, 1879 లో రమణుడు పుట్టినప్పుడున్న పెంకుటింటిని 2010 లో పడగొట్టి మళ్ళీ నిర్మించారు. ఆయన పుట్టిన గది ఉన్నప్రదేశంలో ఆయన ఫోటో, దాని ముందు ఓ దీపం వెలిగించి ఉంది. భజనలు, పూజలు లాంటి కార్యక్రమాలేవీ జరుగుతున్నట్లు లేదు. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.


మీనాక్షీ దేవాలయం, మధుర.


దేవాలయం నిండా బాలాజీ (వెంకటేశ్వరస్వామి) తన చెల్లెలైన మీనాక్షిని శివుడికి కన్యాదానం చేసే చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. శివుడూ పార్వతీల మధ్య ఒకసారి జరిగిన నాట్యపోటీలో కింద పడిన తన చెవికమ్మని కాలితో తీసి పెట్టుకుంటున్న బ్రహ్మాండమైన శివుడి శిల్పం (ఊర్ధ్వ తాండవర్) లాంటి విశేష శిల్పాలు ఈ దేవాలయంలో చాలా ఉన్నాయి. గుడిలోని వెయ్యికాళ్ళ మండపంలో అనేక శిల్పాలని ప్రదర్శనగా పెట్టిన పెద్ద మ్యూజియం కూడా ఉంది.


తంజావూరు.

(ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)

మధురై నుండి తంజావూరు చేరుకోవడానికి నాలుగు గంటలు పట్టింది. తంజావూరు కి వెళ్ళే బస్సు మాట్టుదావణి బస్టాండులో ఎక్కాలి. తంజావూరు లో ఉన్నRTC కొత్త బస్టాండ్ బృహదీశ్వరాలయానికి చాలా దూరం. ఇక్కడ నుండి పాతబస్టాండ్ కి ఆటోలో వెళ్ళి అక్కడ ఉన్న హోటల్లో బస చేస్తే బృహదీశ్వరాలయం, సరస్వతీ మహల్ లాంటి ప్రదేశాలు చూడటానికీ, త్యాగరాజు సమాధి ఉన్న తిరువయ్యార్ వెళ్ళడానికీ అనువుగా ఉంటుంది.


మనకున్న ఆసక్తినిబట్టి బృహదీశ్వరాలయాన్ని చూడటానికి రెండు గంటల నుండి రెండు రోజుల దాకా పట్టవచ్చు. ముఖద్వారంలో ఉన్న గోపురం ఎత్తు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉండటం వల్ల ఒక రకమైన వింతశోభగా ఉంది. 1970-80కాలపు పాఠ్యపుస్తకాల్లో బృహదీశ్వరాలయం పేరిట ఉన్న చిత్రంలో విరిగిపోయిన రాళ్ళు, శిధిలాలతో కూడిన గోడల మధ్య దీనావస్థలో ఉన్న దేవాలయం దర్శనం ఇచ్చేది. దాన్ని ఊహించుకుంటూ వెళ్లినవాళ్ళకి చాలా ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. ఆలయప్రాంగణం లోపల ఇంటర్ ప్రెటేషన్ సెంటర్ అనే పేరుతో ఉన్న ఓ చిన్నభవనంలో ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా కట్టారో, ఎలా శిధిలమైపోయిందో, దాన్ని మళ్ళీ ఏ విధంగా గత రెండు దశాబ్దాలలో పునరుద్ధరించారో ఫోటోలలో చూడవచ్చు. ఆలయమంతా చాలా శుభ్రంగా ఉంది - ప్రాకారాలు, శిల్పాలు అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతున్నాయి.


ప్రాకారాలు దాటగానే మండపంలో బ్రహ్మాండమైన మహానంది శిల్పం! గర్భాలయం లోపల మూడున్నర మీటర్ల పైగా ఎత్తున్న శివలింగాన్ని క్యూలో చాలా దూరం నుంచే చూడవచ్చు. ఇవికాక ఆలయానికున్న పై అంతస్తుల్లో చాలా అద్బుతమైన శిల్ప సంపద ఉందట. వాటిని చూడటానికి ఇనప మెట్ల ఏర్పాటు ఉంది. కాని ఒక్క దక్షిణామూర్తి విగ్రహం దగ్గరకి ఎక్కడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విగ్రహం.


సరస్వతీమహల్.


సరస్వతీమహల్ భారతదేశంలో ప్రసిద్ధికెక్కిన అనేక ప్రాచీన గ్రంథాలున్న గ్రంథాలయం. ఇది మ్యూజియం, గ్యాలరీ లాంటి ఇతర భవనాలున్న తంజావూర్ మహల్ ప్రాంగణంలో ఉంది. ఈ ప్రాంతాన్ని 'అరమణై' అని వ్యవహరిస్తారు. మ్యూజియం ఇంకా ఇతర భవనాల్లోకి వెళ్ళడానికి టిక్కెట్ ఉంది కాని సరస్వతీమహల్ గ్రంథాలయం లోపలికి వెళ్ళడానికి మాత్రం అక్కర్లేదు. రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయం, వేటపాలెం లోని సారస్వతనికేతనం కన్నా ఇది పెద్దదీ, ప్రఖ్యాతి చెందినదీ కాబట్టి వెళ్ళగానే వేల పుస్తకాలు కనపడతాయని అనుకుంటాం. లోపలకి వెళ్ళాక కొన్ని బల్లలు కుర్చీలూ ఉన్న ఖాళీ హాలు దర్శనం ఇస్తుంది. హాలుకి ఓ మూల న్యూస్ పేపర్లు చదువుకునే ఏర్పాటు ఉంది. లోపలకి వచ్చేముందు బయట ఉన్న సెక్యూరిటీ ఉద్యోగితో 'ఊరికినే లైబ్రరీని చూడటానికి వచ్చాను' అని చెప్తే 'ఇది చూసే లైబ్రరీ కాదు సార్' అని ఎందుకన్నాడో అర్థమైంది - ఆ ఖాళీ హాలు చూశాక.


రైల్వే స్టేషన్లల్లో ఉండే వెయ్యింగ్ మిషిన్ సైజులో పుస్తకాల క్యాటలాగ్ సమాచారం ఇచ్చే కియోస్క్ లు రెండు ఉన్నాయి. వాటిల్లో పుస్తక శీర్షికని లేదా రచయిత పేరుని బట్టి పుస్తకాలు వెతుక్కునే ఏర్పాటు ఉంది. వెతుక్కుని కావలసిన పుస్తకం యొక్క నంబర్ అక్కడున్న ఉద్యోగికి ఇస్తే అతను లోపలున్న పుస్తక భాండాగారంలోకి వెళ్ళి సదరు పుస్తకాన్ని తెచ్చి ఇస్తాడు.


ఇదంతా అయ్యే పనేనా? - అయినా చూద్దాం అనుకుని చూస్తే, చాలా తెలుగు పుస్తకాలు కనపడ్డాయి కియోస్క్ లో. 1969 లో ప్రచురింపబడ్డ 'మద్రాసు తెలుగు' (చల్లా రాధాకృష్ణశర్మ) అనే పుస్తకాన్నీ, 1979 లో రంగనాయకమ్మ గారు తన స్వీట్ హోమ్ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించిన చలం 'స్త్రీ' (ఆవిడ ముందుమాటతో) పుస్తకాల నంబర్లను కియోస్క్ కాటలాగ్ లోనుంచి రాసి సందేహిస్తూనే ఆ ఉద్యోగికి ఇచ్చాను. సందేహించడానికి కారణం - మునుపు గ్రంథాలయ ముఖద్వారం లో సరస్వతీ మహల్ అనే పేరు తెలుగు లో వ్రాసి ఉండేదనీ, దానిని ఈ మధ్యే తమిళ దురభిమానులు కొందరు తీసేయించారనీ ఆ మధ్యే చదివాను. ఈ విషయాన్ని వేటపాలెం గ్రంథాలయం చూడడానికి వచ్చిన తనికెళ్ళ భరణి గారు చెప్పి బాధ పడ్డారని ప్రకాశం జిల్లా ఎడిషన్లలో వ్రాసారు. దురుసుగా 'లేవు ఫో' అని చెప్పకపోయినా - 'పాత తెలుగు పుస్తకాలు కదా వెతకడం కష్టం' అని నసుగుతాడేమో కనీసం, అనుకుంటూనే ఇచ్చాను. ఐదు నిమిషాలు కూడా గడవకముందే గట్టి అట్టలతో నీట్ గా బైండింగ్ చేయబడి ఉన్న ఆ రెండు పుస్తకాలను తెచ్చి ఇచ్చాడు!


'మద్రాసు తెలుగు' పుస్తకంలో తంజావూరులో మాట్లాడే తెలుగుకి, మద్రాస్ లో మాట్లాడే తెలుగుకి ఉన్న భేదాలు ఇంకా మద్రాస్ తెలుగు భాష లక్షణాలు చర్చిస్తూ రాసిన వ్యాసాలు ఉన్నాయి.


ఈ పుస్తకంలోని కొన్ని విశేషాలు - కొన్ని తంజావూరు పలుకుబడులు :


  1. మీకు రాత్రి భోజనం కద్దా (మీరు రోజూ డిన్నర్ చేస్తారా?)

  2. అక్కడ భయం దొరకదు (భయం లేదు)

  3. దానికి ఏకసిగ్గు (దానికి ఒకటే సిగ్గు)

  4. ఇన్ని దినాలుగా ఏక వానలు (ఒకటే వానలు)

  5. పార్వ సరిగ్గా లేదు (కంటి చూపు సరిగ్గా లేదు)

  6. వాళ్ళకేదో బాధ్యం (వాళ్ళకేదో బంధుత్వం)

  7. నువ్వు మహా కంటివో (నువ్వు పేద్ద చూసినట్టు)


మద్రాసు పలుకుబడులు -


  1. దారం తేవే నీళ్ళు పీక్కుందాం (తాడు తీసుకురావే నీళ్ళు చేదుకుందాం)

  2. ముక్కద్దాలు (కళ్ళజోడు)

  3. జలదారి (తూము)

  4. పాతాళ గొలుసు (గాలం)

మద్రాసు తెలుగు లో 'బడు' ధాతువు వ్యావహారికంలో కూడా ఉందనిపించే కొన్ని వాక్యాలు -


  1. ఈ ఇల్లు గాలీగా ఉందని వినబడ్డాను (ఖాళీగా ఉందని విన్నాను)

  2. ఈ సమాచారం మీరు వినబడితిరా? (ఈ సమాచారం విన్నారా?)


మనం సాధారణంగా 'బడు' తో వాడే మాటని మద్రాసు తెలుగులో ఉపయోగించని ఉదాహరణలు కూడా (చెవులు సరిగ్గా వినడం లేదు' లాంటి వాక్యాల లో) ఈ పుస్తకం లో ఉన్నాయి.


ఈ రెండు పుస్తకాలు అంత త్వరగా ఇవ్వడంతో కాళూరి హనుమంతరావు గారు రాసిన 'సాహితీ జగతి' వ్యాసాల సంకలనం, దాంతోపాటే ఓ ఇంగ్లీషు పుస్తకం - వంద సంవత్సరాల క్రితం (1917 లో) ప్రచురించ బడ్డ లెడ్ బీటర్ గారి ఉపన్యాసాల సంకలనం - కూడా అడిగాను. అవి కూడా వెంటనే తెచ్చి ఇచ్చారు. ఇంత వేగంగా ఇవ్వడమే కాకుండా, ఇంత పాత పుస్తకాలని ఇంత మంచి కండిషన్ లో ఉంచగలుగుతున్నందుకు (అందునా తెలుగు పుస్తకాలు!) ఆశ్చర్యపోవాల్సిందే.


సాహితీ జగతిలో ఒక వ్యాసంలో కవిత్వానుభూతి లేని వాటికి Twinkle Twinkle little star / I don't wonder whar you are / For, by the spectroscopic ken / I know that you are hydrogen లాంటి పద్యాన్ని ఉదహరించారు.


'ద్రావిడ మూల భాషే తెలుగుకి కూడా మాతృక అనుకోకుండా, తెలుగు తెలుగునించే పుట్టిందేమో ఆలోచించండి' అని భాషావేత్తలకు కాళూరి హనుమంతరావు గారు ఇంకో వ్యాసంలో విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన ఇచ్చిన 'అచ్చతెలుగు' - అంటే ద్రావిడం కానివీ, ఇతర ద్రావిడ భాషల్లో సమానార్థకాలు లేనివీ - ఉదాహరణలు : కొంప (ఇల్లు), చిలువ (పాము), చీలి (పిల్లి).



తిరువయ్యార్.

(ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)

తంజావూరు పాత బస్టాండ్ నుండి అరగంటలో చేరుకోవచ్చు. తిరువయ్యార్ ని చాలా మంది తిరువయ్యూర్ అని పొరబడతారు. 'అయి' అంటే ఐదు, 'ఆర్' అంటే నది. ఐదు నదుల సంగమం ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని తిరువయ్యార్ అంటారు. 'ఏహి త్రి జగదీశ మాం పాహి పంచనదీశా!' అనే త్యాగరాజ కీర్తన ఈ ఊరి దేవాలయంలోని పంచనదీశ్వరుడిని గురించి ఆలపించినదే.


త్యాగరాజస్వామి సమాధి మందిరం, ఇల్లు.


త్యాగరాజస్వామి తన జీవితంలో చాలా భాగం గడిపిన ప్రదేశం తిరువయ్యారు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. బస్టాండ్ నుంచి త్యాగరాజ స్వామి సమాధి మందిరానికి అరగంట నడక. సమాధి పక్కనే కావేరీ నది. నవనవలాడుతున్న ఆకులతో ఉన్న ఓ పెద్ద మర్రిచెట్టూ, దాని కొమ్మ మీదే పెరిగిన ఓ వేపచెట్టూ సమాధి మందిరం బయట ఉన్నాయి. సమాధికి ఆలయం కట్టించి, గోడల నిండా చాలా త్యాగరాజ కీర్తనల శిలాఫలకాలు తాపించిన బెంగుళూరు నాగరత్నమ్మ గారి సమాధి కూడా ఈ మందిరం ఎదురుగ్గానే ఉంది.


శిలాఫలకాల నిండా రాగతాళ వివరాదులతో కీర్తనల పూర్తి పాఠాలు తెలుగులో చెక్కబడి ఉన్నాయి.

అరుదైన రాగాలలో కీర్తనలు, ఎక్కడా కచ్చేరీలల్లో వినపడని కీర్తనలు చాలా చూడవచ్చు....


1. కోలాహలం (మదిలోన యోచన పుట్టలేదా మహరాజ రాజేశ్వరా!), 2. జూజాహుళి (పరాకు చేసిన నీకేమి ఫలముగల్గెరా పరాత్పరా! లాంటివి.

ఇంకా 'కారుబారు' అనే మాటతో 'కారుబారుసేయువారు కలరే నీవలే సాకేతనగరిని' అనే ముఖారి రాగ కీర్తనా, దేశ్యతోడి రాగంలో 'రూకలు పదివేలున్నా చారెడు నూకలు గతిగానీ! కోకలు వెయ్యున్నా కట్టుకొనుటకొకటిగాని! నూరు భక్షణములబ్బినా నోటికంతగాని! ఏరు నిండి పారినా పాత్రకు తగ నీరు వచ్చుగాని' లాంటి కీర్తనల పూర్తి పాఠాలు ఉన్నాయి.


త్యాగరాజ స్వామి నివసించిన ఇంటిని చూడాలంటే నదీతీరం నించి మళ్ళీ ఊళ్ళో కి వెళ్ళాలి. పాత ఇంటిని పడగొట్టి ఒక మందిరంలా పునర్నిర్మించారు. లోపల త్యాగరాజ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ ఇల్లు తిరుమంజనం వీధిలో ఉంది. చూడాలనుకున్న సందర్శకులకు ఇల్లు చూపించే ఏర్పాటు ఉంది - ఈ ఇంటి పక్కింటివారినడిగితే తాళం తెరిచి చూపించేట్లు. ఇంటిని సందర్శకుల కోసం తెరిచి ఉంచే వేళలు వేరే ఏమీ లేవు.



పంచనదీశ్వరాలయం.


తిరుమంజనం వీధికి ఐదు నిమిషాల నడక దూరంలోనే పంచనదీశ్వరాలయం ఉంది. చాలా పెద్దది. బ్రహ్మాండమైన ఆలయం. గర్భగుడి లోని మూలవిరాట్టు శివలింగం. దేవాలయం అంతటా ఉన్న శిల్పసంపద చాలా విస్తారంగా, అద్భుతంగా ఉంది.

కళ్ళు మూసుకుని ఉన్న యోగదక్షిణామూర్తి విగ్రహమూ, పానవట్టం మీద శివలింగం బదులు వినాయకుడు ఉండటమూ, శివపార్వతుల విగ్రహాలను పూజించడమూ, యముడికి శాంతి కలగడం కోసం ఒక నేల మాళిగలో సాంబ్రాణి పొడిలాంటిది వేసి మంటను ప్రజ్వలింపజేయడమూ - ఇలాంటి విశేషాలు ఈ దేవాలయ ప్రాంగణం లోనే చాలా చూడవచ్చు. గుడి బయట నుంచి రెండో ప్రాకారం వెంబడే గుడి వెనక్కి వెళ్ళి ఒక కొసన నిలబడి అరిచి ఇంకో కొననించి బ్రహ్మాండంగా ప్రతిధ్వనించడం వినవచ్చు.


కుంభకోణం.

(ఈ ప్రయాణం జరిగింది - 2016 మే నెలలో)

తంజావూరు నుంచి రెండు గంటల ప్రయాణంలో కుంభకోణం చేరుకోవచ్చు. సారంగపాణి ఆలయం ఇక్కడ ప్రసిద్ధమైనది. మూలవిరాట్టు శయనించి ఉన్న పెద్ద మహావిష్ణువు విగ్రహం. ఇది చాలా పెద్ద ఆలయం. పాతాళ శ్రీనివాసుడు, మెట్టు శ్రీనివాసుడు, కన్నాడి శ్రీనివాసుడు అనే పేర్లతో రకరకాల విగ్రహాలు, మందిరాలు ఆలయం లోపల ఉన్నాయి.


సారంగపాణి ఆలయానికి దగ్గరలోనే మరో పెద్ద రామాలయం (రామస్వామి ఆలయం) ఉంది. లోపల శిల్పాలన్నీ చాలా సెన్సువస్ గా ఉన్నట్టు నాకు అనిపించింది. 'దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు?' అన్న పుస్తకాన్ని గుర్తుకు తెచ్చాయి కొన్ని శిల్పాలు. గర్భగుడిలో రాముడు సీత లక్ష్మణులతో పాటు భరతుడు, హనుమంతుడు కూడా ఉన్నారు.


కుంభకోణంలోని మరొక పెద్ద గుడి మహాకుంభేశ్వరాలయం. సకల జీవరాశుల ప్రాణానికి మూలాధారమైన పదార్థాన్ని బ్రహ్మ ఓ కుండ లో ఉంచగా, ప్రళయ సమయం లో అది ముక్కలై ఒక ముక్క కుంభకోణం లో పడిందట. ఆ పదార్థం ఈ గుడి కి దగ్గర లోనే ఉన్న మహామహం అనే కోనేరు లోనూ, ఈ గుడి లోనూ పడిందనీ స్థలపురాణం (ఇది ఒక వెర్షన్ ). ఈ కథలన్నీ గుడి లోపల వివరంగా రాసి ఉన్నాయి - బొమ్మలతో సహా!


రామానుజన్ నివసించిన ఇల్లు


సారంగపాణి ఆలయానికి దగ్గరలోనే విశ్వవిఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు రామానుజన్ నివసించిన ఇల్లు ఉంది. దీనిని శాస్త్ర యూనివర్సిటీ వాళ్ళు సందర్శకుల కోసం చక్కగా పరిరక్షిస్తున్నారు. వారి నిర్వహణ చాలా బాగుంది. పెంకులు, గోడలు, తలుపులు, గడపలు అచ్చు ఆనాటివే అన్నట్లుగా ఉండి ఇంటి లోపలకి వెళ్ళగానే ఒక వంద సంవత్సరాలు కాలంలో వెనక్కి వెళ్ళినట్లు అనుభూతి కలిగింది. రామానుజన్ కి సంబంధించిన కొంత ఇన్ ఫర్మేషన్, ఫోటోలు, పేపర్ కటింగ్స్ ఇంట్లో ఉన్నాయి.


రామానుజన్ లండన్ లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో మానసిక సంఘర్షణని తట్టుకోలేక సబ్ వే రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఏదో అద్భుతంలాంటిది జరిగి రక్షింపబడ్డారు. ఆత్మహత్య చట్టప్రకారం నేరం కాబట్టి పోలీసులు కేసు పెట్టబోతే, హార్డీ గారు (రామానుజన్ ని లండన్ కి రప్పించినవాడు) రామానుజన్ రాయల్ సొసైటీ మెంబర్ కాబట్టి ఆయన్ని కోర్టుకి ఈడ్చకూడదని, చట్టం వర్తించదని చెప్తే - 'సరే' అని పోలీసులు వదిలేశారుట. అయితే రాయల్ సొసైటీ సభ్యులకి కూడా చట్టాలు వర్తిస్తాయనీ, అయినా అసలప్పటికి రామానుజన్ కి ఇంకా అఫిషియల్ గా ఆ సభ్యత్వం రాలేదన్న విషయం కూడా లండన్ పోలీసులకి తెలుసుననీ, హార్డీగారు చెప్పినదాన్ని "నమ్మినట్లు నటించి" రామానుజన్ ని వదిలిపెట్టారనీ, కేసు లేకుండా వదిలేసెయ్యడానికి అసలు కారణం రామానుజన్ మీద జాలిపడటం వల్లనేననీ - మొదలైన విషయాలు రాసి ఉన్న 'హిందూ పత్రిక' వార్త పేపర్ కటింగ్ ఇక్కడ నోటీస్ బోర్డులో ఉంది.



మధురై చూడాలన్న కోరిక పుట్టించి తద్వారా ఇన్ని ప్రదేశాలు చూసే అవకాశం కల్పించిన భగవాన్ కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెనక్కి వచ్చాను.

అంతర్వేదం

 


'అంతర్వేది' అనే పేరు తలచుకోగానే అంతర్ వేదం, అంతరంగంలోని వేదం అన్న మాటలతో పాటు- అంతరువు ఏది? (ప్రపంచానికీ నాకూ మధ్య) అన్న భావం కలుగుతుంది. అందుకనే అంతర్వేది అనే పేరులో ఏదో ఆధ్యాత్మిక భావన వినిపిస్తుంది.

చిన్నప్పటి నించీ ఒక నది సముద్రంలో కలవడం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి, ఆకాంక్ష. ఇంత పెద్ద జీవనది ఐన గోదావరి సముద్రంలో కలిసే చోట కొన్ని మైళ్ళ దూరం పాటు సముద్రంలో కూడా మంచి నీళ్ళే ఉంటాయిట అన్న ఆసక్తికరమైన సంగతి చిన్నప్పట్నించీ వింటూ ఉండటం కూడా ఈ ప్రదేశాన్ని చూడాలన్న కుతూహలాన్ని పెంచింది (ఇది తప్పని - కనీసం వరద లేని వేసవి కాలంలో - అక్కడికి వెళ్ళాక తెలిసింది).


గోదావరి గురించి నాకున్న పరిమితానుభవం గురించి.....


చిన్నప్పుడు ఒంగోలు నుంచి విశాఖపట్టణం వైపు రైల్లో వెళ్ళేప్పుడు గోదావరి బ్రిడ్జిని దాటిన అనుభవం ఉంది. గోదావరి రైలు బ్రిడ్జి కి ఇటుప్రక్క పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, బ్రిడ్జి దాటితే అటుప్రక్క తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి - ఇదీ నాకు తెలిసినది.


కానీ ఇప్పుడు తిరపతి నించి రాజమండ్రి కి బస్సు లో వచ్చేటప్పుడు, గోదావరి ని రెండుసార్లు చూసే అవకాశం కల్గింది. ఎందుకంటే హైవే (స్వర్ణ చతుర్భుజి) లో వేసిన రోడ్డు రాజమండ్రికి కొన్ని కిలోమీటర్లు దక్షిణంగా గోదావరి నదిని దాటుతుంది. అంటే రైలు మార్గం తాడేపల్లి గూడెం, నిడదవోలు, కొవ్వూరుల రూట్ లో వచ్చి గోదావరిని దాటితే - స్వర్ణ చతుర్భుజి రోడ్డు మార్గం మాత్రం తాడేపల్లి గూడెం ప్రాంతాల్లో దక్షిణం వైపుగా మళ్ళి తణుకు మీదుగా వచ్చి గోదావరిని దాటుతుంది. కానీ అప్పటికే గోదావరి రెండు పాయలుగా చీలి ఉంటుంది.


తూర్పు వైపు ఉన్న పాయని 'గౌతమీ గోదావరి' అని పశ్చిమం వైపు ఉన్న పాయని 'వశిష్ట గోదావరి' అని పిలుస్తారు. గోదావరి జిల్లాలని వేరు చేస్తున్నవి - గోదావరి నదీ(ధవళేశ్వరం దాకా), ఆ తరవాత వశిష్ట పాయలే. అంటే పశ్చిమ గోదావరి జిల్లా నించి తూర్పు గోదావరి జిల్లాలోకి హైవే రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ముందుగా వశిష్ట గోదావరిని దాటాలి. అప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తాం. ఆ తర్వాత గౌతమీ గోదావరి పాయని దాటి కొంచెం ఉత్తరం వైపుగా ప్రయాణిస్తే రాజమండ్రి చేరతాం.


ఈ వశిష్ట, గౌతమి పాయల మధ్య ఉన్న రావులపాలెం మీదుగా హైవే వెళుతుంది. ఈ ఊరుని 'కోనసీమ ముఖద్వారం' అని పిలుస్తారు. కాబట్టి రైల్లో అయితే గోదావరిని దాటే అవకాశం ఒకసారే కాని ఈ హైవే మీద రాజమండ్రికి వెళితే వశిష్టని, గౌతమిని కూడా చూడొచ్చు!


సరే రాజమండ్రి లో దిగాక - ఇంకేముంది బస్ స్టాండ్ నించి తిన్నగా అంతర్వేది బస్ ఎక్కడమేగా - అని అమాయకంగా, నిర్లక్ష్యంగా వెళ్ళాను పొద్దున్నే ఆరు గంటలకి. 'అంతర్వేదికి బస్సు ఏ ప్లాట్ ఫారమ్ మీదికి వస్తుంది?' అని ధాటీగా అడుగుతున్న నన్ను చూసి నీళ్ళు నమిలాడు అక్కడ ఎంక్వయిరీలో కూర్చుని ఉన్న యువకుడు. ఆ ఆవరణలోనే ఒక ప్రక్కగా వేరేగా ఉన్న ఇంకో చిన్న బస్టాండ్ వైపు చూపిస్తూ 'కాకినాడ బస్సు' అంటూ ఏదో గొణిగాడు. సరే అనుకుంటూ ఒక మూలగా ఉన్న ఆ బుల్లి బస్టాండ్ దగ్గరకి వెళ్ళి అడిగితే ఒకాయన 'మీరు రాజోలు వెళ్ళి అక్కడ నుండి వేరే బస్సులో వెళ్ళాలి' అన్నాడు. మళ్ళీ వెనక్కొచ్చి ఎంక్వయిరీ కౌంటర్ యువకుడి మీదకి యుద్ధానికి సిద్ధమవుతుండగానే అతడు హంబుల్ గా "సార్ నాకు తెలియక చెప్పాను, మీరు రాజోలు బస్ ఎక్కాలి ఫలానా ప్లాట్ ఫారం మీద" అంటున్నాడు.

రాజోలు బస్సు ఎక్కగానే బస్ కండక్టర్ "రాజోలు వెళ్ళి అక్కడ నించి సఖినేటిపల్లి వెళ్ళే బస్ పట్టుకుని మధ్యలో మలికిపురంలో దిగి అక్కడ నించి ఆటోలో వెళ్ళాల్సిందే" అని వివరించాడు.

సరే, ఇక రాజమండ్రిలో బయల్దేరిన రాజోలు బస్ బుర్రిలంక, కడియపు లంక, చెముడు లంకలను దాటి దక్షిణంవైపు గా ప్రయాణిస్తూ గౌతమీ గోదావరి పాయని దాటింది. అంటే రావులపాలెం అన్నమాట. రావులపాలెం దాటి పశ్చిమంగా ప్రయాణించి వశిష్ట గోదావరి పాయని చేరడానికి కొంచెం ముందే మళ్ళీ దక్షిణం వైపుకు తిరిగింది బస్సు. ఈ లెఫ్ట్ టర్న్ తీసుకున్న ప్రదేశం పేరు ఈతకోట. ఇహ అక్కడ్నించీ దాదాపు గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకే ప్రయాణిస్తూ గంటి, గంటిపెదపూడి (జి పెదపూడి), తాటిపాక మీదుగా రాజోలు చేరింది. అన్నీ చిన్న ఊర్లే అని చెప్పొచ్చు. తాటిపాక మాత్రం చిన్న టౌన్. రాజోలు అంతకన్నా కొంచెం పెద్ద టౌన్.


రాజోలు నించి అంతర్వేదికి బస్‌ సౌకర్యం లేదు. బహుశా రోజుకొకటి లేదా రెండు బస్సులు ఉన్నాయేమో! ఎవర్నడిగినా సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం అనే ఊళ్ళో దిగి అక్కణ్ణించి ఆటోలో వెళ్ళమన్నారు. సరే, అలాగే వెళ్ళి మలికిపురం చేరాను. అక్కడ షేర్ ఆటో ఎక్కాను. (మామూలుగా ఆంధ్రాలో అన్ని ఊళ్ళల్లో కుక్కినట్లే ఇక్కడ కూడా - 20 కి.మీ ప్రయాణం కాబట్టి ఛార్జి 20 రూపాయలు. జనం నిండిందాకా ఆటో కదలదు కాబట్టి వేళ కాని వేళలో మలికిపురం చేరామంటే ఇరుక్కుపోతాం).


అదృష్టవశాత్తూ నేను అరగంట కన్నా ఎక్కువ వేచి ఉండనక్కరలేకుండానే పదకొండు గంటలకంతా అంతర్వేదికి చేరిపోయాను - అరటి, కొబ్బరి ఇంకా ఎన్నో పచ్చపచ్చని ఫల పుష్ప వృక్ష జాతులు దారికిరుప్రక్కలా కన్నుల పండువ చేస్తుండగా చాలా చిన్నచిన్నగోదారిపల్లెల గుండా ప్రయాణం. దారి పొడుగూతా గోదారి కాల్వ - కాటన్ మహాశయుణ్ణి గుర్తు చేస్తూ.


***


అంతర్వేది. చిన్న పల్లెటూరు. గాలిలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే తోచింది - బహుశా నా మనసులో ఉన్న భావనే అయిఉండవచ్చు ! బస్టాండ్ ఉండేంత పెద్ద ఊరు కాదు. లక్ష్మీనరసింహస్వామి గుడి బయట పందిళ్ళు వేసి ఉన్న స్థలంలో ఆటో ఆగింది. ప్రాకారం దాటి గుడి లోపలకి వెళ్ళీ వెళ్ళగానే చుట్టూ తిరిగాను. నలువైపులా నాలుగు ద్వారాలు. దక్షిణం, పశ్చిమం ద్వారాల నుంచి బయటికి చూస్తే విశాలమైన ప్రదేశం - దూరంగా నదీ పరివాహిక ప్రాంతం. రక్తకుల్య అనే నది కూడా ఇక్కడ ఉంది. ఈ నదికి స్థల పురాణంలో ఒక ప్రత్యేక పాత్ర ఉందిట. లక్ష్మీనరసింహస్వామి గుడికి ఐదారు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కృష్ణమ్మ అనే జమిందారు దీనిని పునరుద్ధరించాడు. ఈ గుడి కన్నా పురాతనమైన నీలకంఠేశ్వరస్వామి గుడి (చాలా చిన్నది) దీనికి కొంచెం దూరంలోనే ఉంది. క్షేత్ర పాలకుడైన ఈ నీలకంఠేశ్వరస్వామి గర్భగుడి ముఖద్వారం పశ్చిమ వైపుకు ఉండటం ఒక ప్రత్యేకతట.


అన్ని గుళ్ళ మాదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిలో కూడా స్పెషల్ దర్శనం టిక్కెట్టంటూ వేరేగా ఉంది. (ఇది కొన్న వాళ్ళకే లక్ష్మీ నరసింహస్వామిని దగ్గరగా చూసే అవకాశం - మిగతా వారిని కొన్ని అడుగుల ముందుగా ఆపేస్తారు) కానీ జనం చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా ప్రశాంతంగా ఉంది - వాతావరణంలో కమర్షియల్ గోల లేదు. గుడి లోపల నలువైపులా చక్కని దారి, చెట్లు. ఈశాన్య మూలలో ఒక చిన్న బావి. దానిలో ఒక పెద్ద తాబేలు, కొన్ని చిన్న తాబేళ్ళు.


మధ్యాహ్నపు ఎండ బయట కారం దంచుతున్నట్లుంది - అగ్నివర్షంట - ఆరోజు (మే 23, 2015) ఉష్ణోగ్రత నలభై ఎనిమిది దాటిందేమో తూ.గో లో బహుశా. కానీ లోపల గుడిలో భరించలేనంత వేడిగా ఏం లేదు. గుడి వెనక ఉన్న ఒక హాలులో నిత్యాన్నదాన పథకం క్రింద భోజనం పెడుతున్నారు. ఇది రోజూ జరిగే కార్యక్రమమేనట. తిన్న వాళ్ళందరూ కంట్రిబ్యూట్ చేసే నిధుల నించే ఈ కార్యక్రమం నడుస్తుందట. ఎవరైనా ఒక్కోరోజు పూర్తిగా స్పాన్సర్ చేసేవాళ్ళు కూడా ఉంటారట. ఆ రోజు ఎవరో స్పాన్సర్ చేసినట్లున్నారు - బ్రహ్మాండమైన గోదావరి జిల్లా భోజనాన్ని కొసరి కొసరి మరీ వడ్డిస్తున్నారు.


తీవ్రమైన వేసవి కాబట్టి జనం ఎవరూ కనపడుతున్నట్లు లేరు. ఆలయోద్యోగులు తప్ప. భోజనమయ్యాక బావిలో తాబేళ్ళని కాసేపు చూసి గుడి ఆవరణలో కూర్చున్నాను. అప్పుడప్పుడూ చల్లని గాలి వీచి బయటి ఎండని మరిపిస్తోంది. ఆలయంలో దాదాపుగా జనం లేనట్లే.


ఇంతలో ఒక హరికథా కళాకారిణి - మంధా నాగమణి గారట యానాం నించి వచ్చారు - ఆ మిట్ట మధ్యాహ్నం పూట "కృష్ణ రాయబారం" కథ చెప్పడం ఆరంభించారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆస్థాన కళాకారుడు మృదంగంతోనూ, బయట నుంచి వచ్చిన వేరొకరు హార్మోనియంతోనూ నాగమణి గారికి సహకారం అందించారు. మైక్ సెటప్ చేయడానికి ముందు ఆవిడ కొన్ని కీర్తనలు చక్కగా ఆలపిస్తుంటే (పన్నెండున్నరనించి ఒంటి గంట దాకా) 'ఎవరో గాయని అయిన భక్తురాలు పాటలు పాడుతున్నారేమో' అనుకున్నాను. తర్వాత సంప్రదాయానుసారం చిరతలు, పూలమాల ధరించి ఒంటి గంట నించీ దాదాపు రెండున్నరదాకా ఖంగుమనే కంఠంతో హరికథ చెప్పారు - ఎక్కడా 'గొంతు' దాచుకున్నట్లు అనిపించకుండా.


'ఇదేమిటి ఇంత మండు వేసవి మధ్యాహ్నంలో హరికథా?' అని అక్కడున్న ఆలయ ఉద్యోగిని అడిగితే ఆయన నవ్వి 'అవునండీ ఇక్కడ ప్రతి శనివారం మధ్యాహ్నం ఉంటుంది - వేసవికేం ఎక్సెప్షన్ లేదు' అన్నారు. బహుశా సాయంత్రం ఏర్పాటు చేస్తే జనం తిరిగి వెళ్ళడానికి ఇబ్బంది పడతారని మధ్యాహ్నం ఏర్పాటు చేశారేమో ! (అంతర్వేది చాలా మారుమూల పల్లెటూరు, రాకపోకలకి రోడ్లు ఇరుకుగా ఉంటాయి) మొత్తానికి మధ్యలో 'గోవిందోహారి' చెప్పేవాళ్ళు, చివర్లో చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోయినా నాగమణి గారు నిరుత్సాహపడినట్లు కనిపించకుండా మధ్యమధ్యలో చక్కని జోక్స్ చెప్తూ హరికథాకాలక్షేపం చేశారు.


రాయబారం వెళ్ళేముందు కృష్ణుడితో ద్రౌపది చెప్పిన తిక్కన గారి పద్యం "ఇవి దుస్ససేను వ్రేళ్ళందవిలి" - ఆ రోజుల్లోనే క్లోజప్ షాట్ ని ఈ పద్యం ద్వారా తిక్కన స్ఫురింపచేశాడు అని శ్రీశ్రీ పొగిడినది - పాడతారేమోనని ఆశగా ఎదురు చూశాను. కాని పాడలేదు. రాయబార ఘట్టంలో ప్రసిద్ధమైన పాండవోద్యోగ నాటక పద్యాలు (జండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో) అన్నీ పాడారు.


సాగర సంగమంకి ఎలా వెళ్ళాలి అని గుళ్ళో ఇద్దరు ముగ్గుర్నడిగితే దారి కన్నా జాగ్రత్తలు ఎక్కువగా చెప్పారు. చాలా లోతు ఉంటుంది, ప్రమాదాలు జరిగాయి వగైరా..


నాలుగున్నరకి బయల్దేరి ఊళ్లోకి వచ్చి 'సాగరసంగమం ఎక్కడండీ?' అని ఒకాయన్ని అడిగితే 'అలా శివాలయం ప్రక్కనుండి తిన్నగా వెళ్ళిపోండి' అంటూ 'కాళ్ళు కూడా కడుక్కోవద్దండీ దయచేసి - ఎక్కడ ఎంత లోతుంటుందో ఎవరికీ తెలియదు' అని భయపెట్టారు. ఆయన చెప్పిన శివాలయం అక్కడకి చాలా దగ్గరే - ఇదే క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వర స్వామి ఆలయం. అక్కడకి వెళ్ళాక 'సాగరమునకు దారి' అన్న బోర్డు చూసి మలుపులేమీ తిరక్కుండా బోర్డులో సూచించిన దారి వైపు వెళ్ళాను. ఒక కిలోమీటరుకి పైగానే నడక. తాటి చెట్లూ, మధ్యలో చిన్న చిన్న చెరువుల లాంటి గుంటలూ, ఓయన్జీసి వాళ్ల పెట్రోల్ బావుల వాసనలు, దూరంగా వినిపిస్తూ క్రమంగా దగ్గరవుతున్న సముద్రపు హోరు. సముద్రం చాలా ఉద్ధృతంగానే ఉన్నట్లనిపించింది. కొద్దిమంది స్నానాలు చేస్తున్నారు. 'మరీ కాళ్ళు కూడా తడపనంత ప్రమాదం ఏముందబ్బా ఇక్కడ' అని అనుకున్నాను.


'ఇంతకీ గోదావరి ఎటున్నట్లు? ఎక్కడ కలుస్తోంది సముద్రంలో?' అని ఆలోచించుకుంటూ 'పోనీ అలా తీరం వెంబడే నడుచుకుంటూ పోదామా' అనుకున్నాను. ఉత్తరం వైపు (ఇది ఈశాన్యం - సముద్రం దగ్గిర దిక్కులు తెలీక చాలా గందరగోళం గా ఉంటుంది) చూస్తే అనంతమైన సముద్రం. మరో వైపు మాత్రం తీరం వంపు తిరిగి ఉంది. కాబట్టి బహుశా గోదారి అటువైపు ఉండవచ్చు అనిపించింది. కొంచెం సేపటికి ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి అక్కడే చాలాసేపు గడిపాను. చిరుచీకట్లు పడేటప్పుడు మళ్ళీ నడుస్తూ బయలుదేరి గుడి కి వెళ్ళకుండా మలికిపురం వెళ్ళే రోడ్డు లోకి తిరిగేసి అలా రెండు కిలోమీటర్లు నడుస్తూ పోయాను ఆటో దొరికిందాకా.


ఆటోలో ఒక రైతు సోదరుడితో పరిచయం. ఆయన పేరు ప్రభోజీ! 'ఇలాంటి పేరు ఎక్కడా వినలేదండీ' అంటే 'విశాఖపట్టణం జిల్లాలో కసింకోట అనే ఊళ్ళో ఉన్న ఒక ముస్లిం గురూజీని కొలిచే వారు ఇలాంటి పేర్లు పెట్టుకుంటారని చెప్పాడు. గోదావరి జిల్లాల్లో చాలా మంది హిందువులు (ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ఆలయ పూజారులతో సహా) ఈయనని ఆరాధిస్తారట - హిందూ మతాన్ని పాటిస్తూనే.


మలికిపురంలో ఆటో దిగి మళ్ళీ ఇంకో షేర్ ఆటోలో రాజోలు వచ్చేసి రాత్రికి రాజమండ్రి చేరాను. తర్వాత రోజంతా అంతర్వేదిలో నిర్జనంగా ఉన్న ఆలయ ప్రాంగణం, తాబేళ్ళ బావి, హరికథ, సముద్రం - వీటన్నిటినీ రెలిష్ చేసినా అసలు గోదావరి సముద్రంలో కలిసే చోటు చూడలేకపోయానే అని మనసంతా పీకుతూనే ఉంది. దీన్ని గురించి ఇంకొంచెం తెలుసుకుందామని గూగులించితే నరసాపురం నించి అంతర్వేది లోని సాగరసంగమానికి లాంచి సర్వీసు ఉందని ఏదో వెబ్సైట్ లో కనపడింది.


మర్నాడు బండలు పగిలే ఎండలో, వడగాడ్పులో పదిన్నరకి రాజమండ్రిలో నరసాపురం బస్ ఎక్కాను.

మునుపు తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది వెంబడే దక్షిణం వైపు గా ప్రయాణిస్తూ అంతర్వేది చేరుకుంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించి గోదావరి నదికి దాదాపు సమాంతరంగా అంతర్వేదికి వెళ్తున్నాననమాట. ఎందుకంటే వశిష్ట గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతానికి రాజోలు తూర్పు వైపున ఉంటే నరసాపురం పశ్చిమం వైపు ఉంది. ఈ రకంగా పశ్చిమ గోదావరి వైపున్న ఊళ్ళు కూడా చూడవచ్చు అనుకుంటూ రాజమండ్రిలో బస్ ఎక్కాను. ఆంధ్రదేశంలో అగ్నిమండలం విస్ఫోటనం చెందిందా అన్నట్లుంది వాతావరణం.

బస్సు రాజమండ్రి నుంచి దక్షిణంగా గౌతమీ గోదావరికి సమాంతరంగా ప్రయాణించి గౌతమీ పాయనీ, రావులపాలెం నూ దాటి, వశిష్ట గోదావరిని కూడా దాటింది. అంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించిందన్నమాట. దొంగరావిపాడు అనే ప్రాంతం దగ్గర బస్సు ఎడమ వైపు తిరిగి వశిష్ట గోదావరికి సమాంతరంగా దక్షిణం వైపుకి ప్రయాణించింది. సిద్ధాంతం, వడలి (ఈ ఊరు చూడగానే సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులైన వడలి మందేశ్వరరావు గారు గుర్తొచ్చారు), చెరుకువాడ, పెనుగొండ, మార్టేరు, కవిటం, వేడంగి (రేలంగి లాగా కనపడుతూ ఎన్నో పాత సినిమాల్లో వేళంగి అనే పేరుతో హాస్య పాత్రలు వేసిన యక్కల కోటేశ్వరరావు అనే నటుడిదీ ఊరేనా), పాలకొల్లుల మీదుగా నరసాపురం చేరుకుంది.


మిట్టమధ్యాహ్నపు రోడ్డుపై మండుటెండ నోటికొచ్చినట్లు పేలుతూనే ఉంది. నరసాపురం బస్టాండ్ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఒకాయన్ని లాంచి సర్వీసు గురించి అడిగాను. ఆయన 'సాగరసంగమానికి లాంచి సర్వీసు తీసేసి చాలా రోజులయిందనీ, కొద్ది దూరంలోనే వశిష్ట గోదావరి పాయ ఉందనీ, దాన్ని పంటు మీద ఐదు నిమిషాల్లో దాటుకుని అటువైపు గట్టునించి ఆటో తీసుకుని మలికిపురంలో దిగి వెళ్ళమని అన్నాడు.


అయ్యో, మొన్నటి రూటే పట్టుకోవలసి వచ్చిందే! అనుకున్నాను. కాని పంటు ఎక్కడం కొత్త అనుభవమే కదా అనుకుంటూ ఆయన్ని దారి అడిగాను. తన బండి మీదే ఎక్కించుకుని పంటు బయల్దేరే చోట నన్ను దింపాడు. పది రూపాయలకి టిక్కెట్టు కొనుక్కుని పంటులో కూర్చున్నాను. ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంది కాని పది నిమిషాల్లోనే ఎన్నో సైకిళ్ళు, కొన్ని మోటారు సైకిళ్ళు, ఒక కారు వచ్చి పంటు ఎక్కాయి. బయట ఎండ భయంకరంగా ఉన్నా గోదావరి నీళ్ళని చూస్తే మనస్సులో చల్లగా ఉన్నట్లనిపించింది.


ఈ గట్టు నించి అవతలి గట్టుకి చేరడానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదేమో! అవతలి గట్టున (తూ.గో. జిల్లాలో) ఉన్న ఊరు సఖినేటిపల్లి లంక. అక్కడ సిద్ధంగా ఉన్న ఆటో ఎక్కాను. మధ్యాహ్నపు అగ్నిహోత్రుడి మీద మంత్రాల్లా పైనుంచి రాలుతున్న నిప్పుల్లోంచి గోలగోలగా పరిగెత్తుతూ ఆటో మలికిపురం చేరేప్పటికి రెండు గంటలయింది.


ముందురోజు రాజోలు నుంచి సఖినేటిపల్లి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలో మలికిపురం దిగాను. ఈరోజేమో సఖినేటిపల్లి లంక నుంచి రాజోలు వెళ్ళే రూటులో ప్రయాణించి మధ్యలో ఉన్న మలికిపురంలో దిగాను.


ఆ సమయంలో ఆటోలు ఏమీ లేవు. మూడు మజ్జిగలూ, ఒక నిమ్మకాయ షోడా తాగేసి మూడున్నరకి బయల్దేరిన ఒక ఆటోలో ఎక్కి అంతర్వేదికి చేరేటప్పటికి నాలుగయింది. వదలకుండా ఎండ ఇంకా తీవ్రంగా ఉపన్యసిస్తూనే ఉంది. కొంచెం సేపు లక్ష్మీనరసింహస్వామి గుడిలోనే కూర్చుని అక్కడి వాళ్ళని సాగరసంగమం గురించి ఈసారి కొంచెం వివరంగా అడిగాను. అందరూ సముద్రం దగ్గరకి వెళ్ళే దారి గురించే చెప్తున్నారు (జాగ్రత్త లతో సహా) కానీ నదీ సాగర సంగమం గురించి అడుగుతూంటే సరిగా బదులివ్వడం లేదు. ఈ మధ్యనే ఏవో సంఘటనలు జరిగిఉంటాయి అనుకున్నాను వాళ్ల ధోరణి చూసి.


గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే ఒకాయన "ఆ ప్రదేశం చాలా దూరం అండి. మీరు అంతదూరం నడవలేరు. ఒకవేళ ఇప్పుడు బయలుదేరినా అక్కడికి వెళ్ళేటప్పటికి చీకటి పడొచ్చు" అంటున్నాడు. (అప్పుటికి సాయంకాలం అయిదు అవుతూ ఉంది). 'ఫర్వాలేదండి. చూసి ఒచ్చేస్తాను" అని కొంచెం మాటలు కలిపినాక 'నీలకంఠేశ్వర స్వామి గుడి దాటాక కుడి ప్రక్కకి వెళ్ళే సందులోకి తిరిగి తిన్నగా వెళ్ళిపోండి" అని అన్నాడు.


'ఈ మలుపు తిరగకకుండా తిన్నగా వెళ్ళడం వల్లే నదీ సాగరసంగమానికి బదులు బీచ్ కి వెళ్ళిపోయాను నిన్న' అనుకుంటూ ఆ మలుపు తిరిగి త్వరత్వరగా నడవడం ప్రారంభించాను. కనీసం చూసి వచ్చేద్దాం అనుకుంటూ.

ఓ అయిదు నిముషాలు నడవగానే ఎవరో ఒక యువకుడు బండి మీద వెళుతూ "ఎక్కడికి వెళుతున్నారండీ?" అని నన్ను పలకరించి "నాతో రండి" అంటూ తన బండి మీద ఎక్కించుకున్నాడు. కొంత దూరం తిన్నగా ప్రయాణించి తర్వాత రోడ్డు దిగి ఒక పేటలోకి ప్రవేశించి చాలా మలుపులు తిరిగి ఒకచోట ఆపి "ఇక్కడ నుంచి తిన్నగా వెళితే లైట్ హౌస్ వస్తుంది. దాని పక్క నుంచి వెళితే సాగరసంగమం వస్తుంది" అని నన్నుదించి వెళ్ళిపోయాడు.


ఓ పది నిమిషాలు నడిచి సాగరసంగమం చేరుకున్నాను. కుడివైపు చూస్తే అఖండ గోదావరి. ఎడమవైపు కొద్ది దూరంలోనే మహోధృతంగా వినిపిస్తున్న సముద్రఘోష. మేట మీదుగా నడుచుకుంటూ నది దగ్గరకి వెళ్ళాను. నలుగురైదుగురు తప్పితే అక్కడ ఎవరూ లేరు. ఒకరిద్దరు జాలర్లు మాత్రం తీరం వెంబడే కర్రలు పాతుతూ వాటికి వలలు చుట్టుకుంటున్నారు. నదిలో దిగి స్నానం చేయాలని ఇచ్ఛ. అక్కడే దిగితే అక్కడున్న నలుగురైదుగురూ వద్దని వారిస్తారేమోనని భయం వేసి మేట మీద ఏటవాలుగా కుడివైపు తీరం వెంబడే ఒక అరకిలోమీటరు నడుస్తూ కొన్ని చెట్లు, పొదలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాను. అక్కడ నది కొద్దిగా వంపు తిరిగి ఉండటం వల్ల ఆ ప్రదేశం ఎవరికీ కనిపించదు. అక్కడ నదిలోకి దిగడానికి తయారవుతుండగా ఒక జాలరి ఉన్నట్లుండి ప్రత్యక్షమై 'జాగ్రత్తండోయ్' అంటూ కొద్ది దూరంలోనే తన వలను అల్లుకుంటూ కూర్చున్నాడు.


గోదావరిలోకి దిగాను. పైన విశాలమైన ఆకాశంలో అస్తమించడానికి ఉద్యుక్తుడవుతున్న సూర్యుడూ, చుట్టూ అఖండ గోదావరి, దూరంగా సముద్రపుఘోష. మనసంతా మౌనం.


ఏదైనా నది - వంపు తిరిగి వెనక్కి రావడం (కాశీ దగ్గర గంగ, ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు దగ్గర గోదావరి), సాగరంలో లీనమై తన ఐడెంటిటీ కోల్పోవడం - ఇవన్నీ బహుశా ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం ఉన్న విషయాలే. నీ మూలస్థానంలో కలిసిపోవడం, నిన్ను నువ్వు కోల్పోవడం, అంతర్ముఖుడవడం - ఇలాంటి వాటికీ నదీ సాగర సంగమానికీ ఏదైనా సంబంధం ఉందేమో!


ఒక గంట సేపు నీళ్ళల్లో గడిపి బయటకి వచ్చాక ముందురోజు చూసిన బీచ్ మీదుగా వెళ్ళవచ్చుకదా అని అనిపించింది. గోదావరి గలగలలు వింటూ సముద్రం వైపుకి నడిచాను. సాగరసంగమాన్ని దర్శించి ఎడమ ప్రక్కకు తిరిగి మరో అరకిలోమీటర్ నడిచి బీచ్ పాయింట్ కి చేరుకున్నాను.


కొంతసేపు అక్కడ గడిపి నదీ సాగరసంగమాన్ని చూడగలిగానన్న తృప్తితో వెనక్కి మళ్ళాను.



*****