2005-05-05

తిరోగమనం

4/28/03
ఏర్ పోర్ట్ లో కళ కళ లాడుతూ కొత్తగా నైసు గా ఉన్న గుడ్డలూ, సంపదా, దీపాల కాంతులూ, వరసగా అమర్చిన కార్లూ ఏదో పరాయి భావన ని కలిగిస్తున్నాయి. మిట్టమధ్యాన్నం, ఎండవేడి, నిశ్చలంగా నిల్చున్న తాడి చెట్లు, వేడిమి తో కాగుతున్న భూమి, చల్లని చెట్టు నీడ, చెమట తో తడుస్తున్న నల్లటి రస్టిక్ మొహం గుర్తొస్తున్నాయి.
ఏమిటో తెలిసినట్లుగా ఉంది ఈ ప్రయాణం వల్ల. అసలు మూలాల్ని చూసినట్లుగా ఉంది. అందుకనే ఎంత అసౌకర్యం గా ఉన్నా వ్యతిరేక భావాలు కలుగలేదేమో. మూడేళ్ళు గా జరుగుతున్న ప్రాసెస్, ఒక రకమైన ఆలోచనా ధోరణి అంతా ఏమవుతుందో తెలుసు కోవాలన్న ఉత్సుకత తీరింది బహుశా. కొన్ని సుఖాలు లేనప్పుడు ఈ ధోరణి అంతా మాయమై పాత నేను ప్రత్యక్షమై ఇంతకు ముందు కన్నా అగ్రెసివ్ గా ఉంటాడన్న సందేహమో, భయమో తీరింది. విదేశం లో లెక్క పద్దుల గురించి సహాయం చేసినా, స్వదేశం లో ఇంకోటి చేసినా "వ్యవహారిక గోలలు" దాదాపు గా ఒకటి గానే ఉంటాయి. . మరి ఒకటి అయిష్టం గానూ ఇంకొకటి ఇష్టం గానూ కన్పడుతోంది. ఎందుకని?

// ప్రేమ చూపించే వాళ్ళు లేరు బాబూ - అదీ సమస్య అని ఆ ముసలామె రోదించడం కళ్ళముందు మెదుల్తోంది. అందరికీ అదే సమస్య అని అందామనుకుని ఆగిపోయాను. ఆమె ఏడుపూ, నా ఏడుపూ, అందరి ఏడుపూ అన్ని దేశాలలో, ప్రదేశాలలో దాదాపు గా అదే నేమో. అందరూ భిక్ష మెత్తితే వేసే వాళ్ళెవరు ? ఒక్కరు చూపితే అందరూ చూపుతారా? ఏమో !

// నా అసలు మూలంతో కనెక్ట్ అయితే ఈ అశాంతి పోతుందా? ఈ లాగుతున్న బంధాల్ని మన్నించి వాటి ప్రకారం పోతే అంతా బాగుంటుందా ?
// ఆదర్శప్రాయమైన కన్ను గురించి రాస్తున్నాడు కొ. కు. తాత్విక వ్యాసాలలో. అబ్బా ఎంత బాగుంది, ఇంద్రియాల ద్వారా మనం ప్రపంచాన్ని సృష్టించామన్న భావన. ఒళ్ళంతా తమకంతో కంపిస్తోంది. నేను అనే వాడు ఏర్పడకుండా ఈ ఇంద్రియాలు మన కిచ్చే data ని ఒట్టిగా చదవచ్చా
?