2006-06-26

ఏదో ?!

Nov 9, 05.

ఎన్ని స్వరాలున్నా ఏదో అపస్వరం ఉన్నట్టు :
ఎంతమంది చుట్టూ ఉన్నా ఏదో ఒంటరితనం.
ఎన్ని కళ్ళున్నా ఏదో అంధకారం
ఎన్ని తెలుసుకున్నా ఏదో జారి పోతున్న భావన.

(అక్షరకృతి - మురళి గారి ప్రేరణ)

2006-06-22

అపరాధ భావన

August 15, 03.
ఆమ్స్టర్ డామ్, హాలెండ్ నించి వుప్పర్తల్, జర్మనీ కి రైలు ప్రయాణం లో:
భయం భయం గా దగ్గరవుతోంది సాయం కాలం
చెప్పరాని చెప్పలేని గుబులు పుట్టిస్తూ.
ఆకాశం అంతా ఏదో తెలీని వేదన అలుముకుంది
బావి గట్టు దగ్గరున్న రావి చెట్టుమీద
అంతా గోల గోల గా ఉంది.
మరి పక్షులు గూళ్ళకి చేరతాయా ?
మార్కాపురపు బాల్యం మెల్లగా వెనక్కి వస్తోంది.
ఆటలాడే సమయం అయిపోయింది.
ఇక నాన్న వస్తాడు
ధుమ ధుమ లాడుతూ కంది పచ్చడి కలుపుతూ ఉంటాడు
అమ్మ లోలోపల పళ్ళు కొరుకుతూ వడ్డిస్తూనే ఉంటుంది.
మజ్జిగ దగ్గర వస్తుంది తారాస్థాయి.
చెంబులో పళ్ళేలో గాల్లోకి లేస్తాయి.
అందరితో పోలుస్తూ అసంతృప్తి ప్రకటిస్తూ
విరుచుకు పడుతుంటాడు నాన్న.
అవును అవునవును
తప్పంతా నాదేగా నాన్నా - అవును నాదేనా
ఇప్పుడు ఆఫీసు లో ఏ పని జరిగినా జరక్కపోయినా
అదంతా నాదే బాధ్యత. అందుకనే ఈ క్షోభ.
ఎన్ని హృదయాలు తూట్లు పడాలో
ఎంత మంది 'వాంగో' లు బలి అవాలో
ఎన్ని చిత్రాలు ఛిద్రమవాలో
ఎన్ని కుంచెలు విరిగిపోవాలో
ఈ పోల్చి చూసుకోవడాలకి.
తప్పు తప్పు గా ఉందే అంతా ?
ఈ కౄరత్వానికి పరిష్కారం మార్క్సు కనిపెట్టాడనుకున్నారు.
అసలు మనిషి ని మార్చకుండా
పై పైన తూతూ మంత్రం వేసారు.
కౄరత్వం అధికారం కేవలం వేషం మార్చుకున్నాయంతే.

2006-06-21

జ్వరం ఒక వరం

శ్రీమతి సరోజినీ ప్రేమ్ చంద్ (Srimati Sarojini Premchand) గారి "మబ్బుల అడవి" (Mabbula Adavi) కవితా సంపుటం లోనించి. చాలా చక్కటి కవిత.
_______________________________________________________
జ్వరం ఒక వరం

బాల్యంలో బడి కి ఎగనామం పెట్టే ఒక ఎత్తు.
బెడిసి కొడితే
ఆకాశం కింద గాలితో పరుగులు తీసే కాళ్ళకి
నవారు మంచం లో ఖైదు.

ఇప్పుడు గానుగ ఆపేసి
ఎద్దు కాళ్ళని కట్టి పడేసి
ఎన్నాళ్ళనించో ఊరిస్తున్న పుస్తకం
ఒక్క బిగిన చదివే అదును.

ఆల్బుఖారా చప్పరిస్తూ
బాబరు తెచ్చాడా, బుడత కీచులా
ఏ స్తానో ఈ బుఖారా జన్మస్థానం
సోమరిగా వాగే మనసుకు
సువిశాలమైన ఆటస్థలం

పిచ్చాపాటీల నుంచీ
తప్పని సరి కబుర్ల శ్రవణం నించి
ఊసుపోని ఇరుగుమ్మల నించి
రక్షించే కవచం అవుతుంది మంచం
నన్ను నాతోనే పంచుకునే స్నేహం పుట్టుకొస్తుంది.
బిరుసెక్కిన అరచేతుల్లా
కడగంటి చూపైనా ఎరగని మోచేతుల్లా
లోలోపలి లోతుల్లో
అణగారి పోయిన మోజులూ మోహాలూ
తడిమి చూసుకునే తరుణం అవుతుంది.

చనిపోయిన మామ్మ, చిన్ననాటి నెచ్చెలీ,
మాగాయ అన్నం లో మీగడేసి పెట్టిన అత్తయ్యా -
అంతా గుర్తుకొచ్చి జ్ఞాపకాల కణాలు కరిగి
కళ్ళ అంచుల్దాకా ప్రవహించే
మనోచిత్రాల స్రవంతవుతుంది.

కిటికీ లోనుంచి పిలిచే ఆకాశపు నీలం
అతి దగ్గర నేస్తాల మాటల్లా వినిపించే
కాకి అరుపు, పిట్టల కిలకిల, ఉడతల కీచుకీచులూ
చెట్లపై కదులుతున్న లేలేత ఎరుపులూ,
పచ్చి పచ్చి పచ్చలూ, పండబారిన పసుపులూ
మునుపెన్నడూ గమనించని వాటి రూపురేఖలూ

కొబ్బరిచెట్టు గంభీరంగా నిలబడి
గోపాల రెడ్డి గారిలా చేతులూపడం
కొత్తగా ఆవిష్కరించుకున్న రంగుల చిత్రపటం అవుతుంది.

నుదుటి మీద యుడికొలొన్ దస్తీ కంటే
చల్లని ప్రేమ హస్తం
వూరికే పడుకున్నా వురిమురిమి తొంగి చూడని
వంటింటి నిశ్శబ్దం
మందలింపు మాటల్లో మందులా సేదనిచ్చే
వింత తత్వం

జ్వరం వస్తే ఎందుకసలు అంత కలవరం ?

2006-06-20

ప్రేమనగర్

Mar 11, 04.

ప్రేమనగర్ పాటలు : ఆ వీణ, గిటారు, తబలా, ఘంటశాల గొంతు లో ఖంగు మన్న ఇనుప జీర, తీగ సాగిన సుశీల - ఆ గాత్రాల వెనుక ఉన్న ఏమిటో తెలియని చల్లని, హాయైన నిశ్శబ్దం. ఊహ అప్పుడే తెలుస్తున్న రోజుల్లో విన్న గ్రాంఫోన్ రికార్డుల స్మృతులు.
పుహళేంది మామ లు పలికించిన ఆ విరుపులూ, అతి గంభీరంగా మ్రోగిన తబలాలూ, నేల క్లాసు నించీ ఎగువ మధ్యతరగతి దాకా నానా రకాలుగా విన్యాసాలు చేసిన టక్ చిక్ టక చికలూ, టింగ్ టింగ్ లూ - ఇవన్నీ వింటుంటే కలిగే స్పందన ని మాటల్లో పట్టుకోలేక పోయినా, కొంత వరకూ తెలుస్తోంది - mind ఎలా ఆలోచిస్తోందీ, ఏ రకంగా అ. నా నీ, వాణిశ్రీ నీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న setting లోని మజా నీ ఆస్వాదిస్తోందీ - ఇవన్నీ feel అవాలని ప్రయత్నిస్తుంటే ఉండే సుఖం, రంజు, రసానందం. మళ్ళీ బాలమురళి సారంగ లో అలవోకగా ఒక్క కూనిరాగం తీస్తే మొత్తం మెదడంతా blank అయి కూచుంటుంది!

చర్విత చర్వణం

Mar 8, 04.

Theory of chaos కి తెలుగు "గగ్గోలు సిద్ధాంతమా" ?
/ కొన్ని సంవత్సరాలూ, యుగాలూ కొద్ది సెకన్లలోనే గడిచి పోతాయి కలల్లో అంటున్నాడు కొ. కు.- ఎన్నో సార్లు ఇలాంటి అనుభవం మేలుకుని ఉన్నప్పుడే కలుగుతుంది సుదీర్ఘాలోచన తరవాత.
ఇంటి దగ్గర బయల్దేరినప్పుడు ఉన్న state of mind దారి లోని ఆలోచనలూ, future projections వల్ల office కి చేరేటప్పటికి పూర్తిగా మారిపోతుంది - గంట లోనే ఎన్నో ఏళ్ళు గడిచినట్లూ, మనసులో పెను మార్పులు జరిగినట్లూ, అప్పటి దాకా ఉన్న పాత approach నశించి పోయి ఏదో కొత్త జీవనం మొదలయినట్లున్న ఊహలు office లోపలికి వెళ్ళగానే మాయమవుతాయి.

పునరపి జననం ..

Mar 5, 04.

భిక్షా పాత్ర పట్టుకొని పరుగెడుతున్నాడు. సన్నిహితుల, స్నేహితుల, సహచరుల దగ్గర దొరకని దేని కోసమో వెతుకుతున్నాడు - పుస్తకాల్లో, శాస్త్రాల్లో, సినిమాల్లో, రచనల్లో, రాజకీయాల్లో, సంగీతంలో, ఆర్ట్ లో, ధనంలో, లైంగిక సంబంధాల్లో - వెతికి వెతికి తిరిగి వేసారి, తిరిగి తన దగ్గరకే రావాలని తెలీదు - ఈ మంట, అశాంతి దగ్గరకే - ఈ బాధని అనుభవించడానికే మళ్ళీ?!

అహం స్ఫురణ

Sept –Nov 2003

కొంత కాల భాగం నా తలలో ఘనీభవించి
పగళ్ళూ, రాత్రులు గా ప్రవహిస్తూ ఉంది.
అంతా నిశ్శబ్దంగా, స్పష్టంగా ఉంది.
ఎవరూ అడగకపోతే ప్రశ్శల్లేవ్, జవాబుల్లేవ్.
కల్పించక పోతే చట్రాల్లేవ్ బద్దలు చెయ్యడానికి విగ్రహాల్లేవ్
అధికారమే లేనప్పుడు ప్రతిఘటించడం ఎందుకుంటుంది ?
విప్లవ వాదులందరికీ పని లేమి !

సొంతమయిన ఆలోచన వల్ల ప్రపంచంలో ప్రత్యక్షమైన కాలం
వారూ వీరూ తనననుసరించి ఉండాలని ఆశ పడుతుంది
ఆశ ఆశయంగా ఉద్రేకంగా మారి చివరకు హింసిస్తుంది.
వట్టి ఆలోచన తప్పు కాదు - "నా"త్వం లోనే ఉంది అభాసం!