నిర్-ఈశ్వరుడి ప్రత్యక్షం
"దేవుడు లేడు అని నేనన్నప్పుడు నా ఉద్దేశం దేవుడు ఉన్నాడు అని. ఇది ఎవరికర్ధం అవుతుంది ? … నిరీశ్వరుడే ప్రత్యక్షమై నేనున్నాను అంటే నమ్మకం లేకుండానే నమ్మకాన్ని ప్రకటిస్తాను." (శ్రీశ్రీ - చరమరాత్రి కధ నించి) (from "Charama Raatri" - story by SriSri)
******************
రమణుడిని దీక్షా స్వీకారం చేయాల్సిందని ఒక స్వామి వారు భక్తి తో వేడుకున్నాడట. 'ర' అనుజ్ఞ ఇస్తే అన్నిసామాన్లతో మఠాధిపతే అక్కడికి వచ్చి దీక్ష ఇవ్వగలరనీ, అఖండ కాషాయం ఇష్టం లేకుంటే ఆ కౌపీనమైనా కాషాయం గా ధరించవలసిందని ప్రార్ధించి "నేను కొండ దిగి భోజనం చేసి మూడు గంటలవేళ కు తిరిగి రాగలను. అనుగ్రహించాలి" - అని చెప్పి వెళ్ళాడట.
తరవాత (రమణుని మాటల్లోనే)--కాస్సేపటికల్లా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూట పట్టుకొని వచ్చాడు. ముఖం ఎప్పుడో చూచి నట్లే ఉన్నది. ఆ మూట లో పైన పుస్తకాలున్నట్లు తెలుస్తూ ఉన్నవి. వచ్చీ రావడమే ఆ మూట నా యెదుట పెట్టి చిరపరిచితుని వలె "స్వామీ నేను ఇప్పుడే వచ్చాను. స్నానం చేయలేదు. ఈ మూట చూచేవారు ఎవరూ లేరు. కొంచెం చూచుకో" అని చెప్పి వెళ్ళాడు. వారటు వెళ్ళగానే ఎందుకో నాకు మూట విప్పి పుస్తకాలు చూద్దామన్న బుద్ధి పుట్టింది. మూట విప్పగానే అరుణాచలమహాత్మ్యం అన్న సంస్కృతాక్షరాలున్న గ్రంధం నా కంట బడ్డది. ఈ మహాత్మ్యం సంస్కృతం లో కూడాఉన్నదన్నసంగతి నాకు లోగడ తెలియదు. అందువల్ల ఆశ్చర్యం కలిగి పుస్తకం తెరిస్తే ఈశ్వర వాక్కు గా స్థల విశేషాన్ని గురించి చెప్పిన ఈ శ్లోకం కంట పడ్డది.
'యోజన త్రయ మాత్రేస్మిన్......
ఈ అరుణగిరి కి మూడు యోజనముల లోపల నివసించే వారికి ఆచరించదగిన దీక్షాదులేమీ లేకున్నప్పటికీ పాశ రహితమైన నా సాయుజ్యము సిద్ధము. ఇది నా ఆజ్ఞ'
ఆ శ్లోకం చూడగానే-ఆ సరి సరి. ఆ శాస్త్రుల వారికి చెప్పేందుకు ఇది సరియైన సమాధానం గా దొరికిందని, వెంటనే ఆ ఒక్కటీ కాపీ చేసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎక్కడ రాబోతాడోనని యధాప్రకారం మూట కట్టి పెట్టాను. సాయంత్రం శాస్త్రుల వారు రాగానే ఈ శ్లోకం చూపాను. వారు మరి మాట్లాడక అతిశయించిన భయ భక్తులతో నమస్కరించి వెళ్ళారు….. .
ఇదే విధంగా ఎందరో వారి వారి మార్గాలకు తిప్పాలని చూచే వారు. వట్టి వట్టి మాటలెన్ని చెప్పినా సరిసరి అనేవాణ్ణే గాని దీక్షా స్వీకారం చేసుకోండి అని అంటే మాత్రం ఒప్పేవాణ్ణి కాదు. తప్పుకునేందుకు ఏదో ఒక ఉపాయం దొరికేది. పద్యాలు వ్రాయడం అంతే. నేను గా సంకల్పించి ఒక్కటీ వ్రాయలేదు. ఏదో ఒక కారణం పెట్టుకొని ఎవరో ఒకరు అడిగేవారు. ఏదో ఒక ప్రేరణ తో వ్రాసేవాణ్ణి. అంతే. "
(సూరి నాగమ్మ గారి శ్రీ రమణాశ్రమ లేఖల పుస్తకం నించి)(quoted from Smt. Suri Nagamma's book- Sri Ramanasrama Lekhalu)
*******