2005-03-28

మనోధర్మపు సంకేతం

8/30/02
హృదయాన్ని గొంతు లోకి తెచ్చుకొని పాడుకున్నాను కరుణశ్రీ పద్యాల్ని ఘంటసాల వారిని అనుకరిస్తూ.
మనోధర్మమనే "core" కి టెక్నిక్ కలిసినప్పుడే పది కాలాల పాటు న్యూరల్ సర్క్యుట్రీ లకి "నేను" ని మరిపించగల కళ ప్రాదుర్భవిస్తుంది. ఇక్కడ టెక్నిక్ అన్న మాట ని భారతీయం చేస్తే సాంకేతికం. అబ్బా ఎంత అర్ధవంతంగా ఉందీ మాట. ఎంత చక్కటి అన్వయసౌలభ్యం. సాంకేతికం అంటే "అసలు" కి సంకేతం మాత్రమే అన్నట్టుగా..
ఈ సంకేతం గానంగా, కావ్యంగా, చిత్రంగా లేదా ఏదో శాస్తృం గా - ఏ రూపమైనా తీసుకోవచ్చు. "దీనికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యతే ఇవ్వండి - అసలు వేరే వుంది" అని చెప్తున్నట్టుగా ఉందీ మాట. (మరి టెక్నిక్ అనే ఇంగ్లీష్ మాట కి ఇటువంటి మూలార్ధం ఇంకేదైనా యూరోపయన్ భాష లో ఉందో లేదో!)
అన్ని రంగాల్లోనూ ఈ సంకేతాల వెనకే ఎక్కువ మంది వెర్రిగా పడడం వల్ల మనోధర్మపు ప్రభ కొడిగడుతుంది. మనుషులు తమ జీవితాలు మరింత సుఖవంతం కావడానికి చేస్తున్నామనుకునే ప్రాసెస్ లన్నింటిలోనూ ఇది కనబదుతోంది. పారిశ్రామిక నాగరికతని కొనసాగించడానికి, దాన్లో సుఖవంతం గా మనగలగడానికీ, ఆఫీస్ కి వెళ్ళి రోజూ పని చేస్తున్నాం. ఎన్నో టెక్నికల్ పనులు - ఇవన్నీ సంకేతాలే - అసలు తెలుసుకోవడానికీ, అది express చెయ్యబడడానికే వీటి ఉపయోగం, అంతవరకే వీటి విలువ అని గుర్తించ లేరు ఎక్కువ మంది.
మనోధర్మం అనేది కొంచెమో గొప్పో అభినివేశంఉన్నవాళ్ళకీ, ఒళ్ళంతా చెవుల్జేసుకునీ కళ్ళు చేసుకునీ వినే వాళ్ళకీ, చూసేవాళ్ళకీ కూడా ఉండొచ్చు. మనోధర్మాన్ని పరికిస్తూ దాని వంక చూస్తే టెక్నిక్ ని సొంతంచేసుకున్న వాళ్ళమీద పర్సనల్ గా ఉండే అతి ప్రేమలూ, అలాగే వాళ్ళకి ఉండే మహా అహంకారాలూ ఎంత అర్ధంలేనివో తెలుస్తాయి. ఈ హైరార్కీ లన్నీ (నేను ఇంత గొప్ప కళ ని సృష్టించాను కాబట్టి గొప్ప వాణ్ణనే గొడవలు) అసలు మనోధర్మపు వెలుగు ముందు కొట్టుకుపోవల్సిందే. - of course, ఆ వెలుగు ని చూడగలిగితే.

వ్యవస్థ

8/28/02
ఉన్నత మైనవనో నీచమైన వనో పిలువబడే భావాలో, ఆదర్శాలో, ఆశయాలో ఉండటం వల్ల కలిగే ఉద్రేకం, ఉత్తేజం - వాటివల్ల కలిగే కోరికలూ - ఇంకా ఇంకా పెరిగే మానసిక శారీరక అవసరాలూ - వాటివల్ల జరగాల్సిన ఉత్పత్తి - ఇదంతా ఆలంబన గా చేసుకుని పెరుగుతున్నట్టుగా అన్పిస్తూంది - ఆధునిక నాగరికతా, ఆర్ధిక వ్యవస్థా..

పేర్లు

8/25/02
నిజం గా ఎవరైనా పెట్టుకుంటే ?
భౌతికుడు, తాత్విక మూర్తి, అధివాస్తవి, సాధక సూరి, హఠాన్మయూరి, ()జీవశాస్త్రి...
భౌతిక శర్మ, అభౌతిక శాస్త్రి అనే రెండు పాత్రల మధ్య సంభాషణ ఎలా ఉంటుంది
?

తండ్రీ కొడుకులు

8/25/02
డేవిడ్ Mc Cullough అనే చరిత్రకారుడు మాట్లాడుతున్నాడు సి-స్పాన్ టీవీ చానల్* లో జాన్ ఆడమ్స్ గురించి.
ఆనాటి హ్యూమన్ వాల్యూస్ అండ్ ఫెయిల్యూర్స్ ని ప్రస్తావిస్తూ ఎంతో ఉద్వేగంగా ప్రసంగించాడు. ఒక్క బానిసని కూడా సొంతం చేసుకోకుండా అధ్యక్షుడు గా పని చేసింతర్వాత 25 సంవత్సరాలు ఆయన కున్న పరిధి లో inward journey చేశాడు జాన్ ఆడమ్స్. దాదాపు వెయ్యి ఉత్తరాలు రాసుకున్నారుట భార్య అబిగ్యేలూ ఆయనా - లోపలి భయాల్నీ, ఆశల్నీ, కోరికల్నీ, ఆశయాల్నీ నిర్భయంగా వెల్లడించుకుంటూ.
అన్ని వందల సంవత్సరాల క్రితం when communication is only as fast as transportation (i.e. a person riding or ship sailing), అన్ని ఆస్తుల్నీ, అంత పరివారాన్నీ మైంటైన్ చేస్తూ రాత్రుళ్ళు అనేక విషయాల మీద అంత ఓపికగా ఉత్తరాలు రాయడం, పుస్తకాలు చదవడం - ఎంతో ఫాసినేటింగ్ గా ఉంది.

డిప్లమాట్స్ గా యూరప్ లో పని చేసేటప్పుడు జాన్ ఆడమ్స్ ఆయన భార్య అబిగ్యేలూ అన్ని నిర్ణయాలు ఎవరికి వారే తీసుకోవాలి. If we can’t realize what an enormous responsibility this was, it is enough if we remember that they can not just pick up the phone and talk to somebody for a discussion or advice. And almost every single decision they made shaped the history and affected the lives of thousands of people and of course their own careers.
థామస్ జెఫర్సన్ కి ఉన్నంత టాలెంట్, గిఫ్ట్ , ఆకర్షణ లేక పోయినా ఆయన కన్నా జాన్ ఆడమ్స్ ఎంతో ట్రూత్ ఫుల్ అండ్ ఓపెన్ పర్సన్ అంటున్నాడు ఈయన లెక్క ప్రకారం. (థామస్ జెఫర్సన్ తన భార్య కి రాసిన ఉత్తరాలన్నీ నాశనం చేశాడుట - పైగా కొడుకులకి ఆస్తి గా మిగల్చడం కోసం బానిసల్ని ఎవర్నీ రిలీజ్ చెయ్యలేదు రాసిన వీలునామా లో - అక్రమ సంబంధం వల్ల పుట్టిన బానిస సంతానాన్ని తప్ప)

జాన్ ఆడమ్స్ తన కొడుకు జాన్ క్విన్సీ ఆడమ్స్ కి చెప్పేవాడుట - రైటింగ్ అనేది ఎంత మంచిదో, how it can make brain focus in a different way అనే విషయమూ, మాట్లాడే భాషలో ఉత్తరాలు ఎలా రాయాలో, డైరీ ని ఎలా maintain చెయ్యాలో - జాన్ క్విన్సీ ఆడమ్స్ ఆ సలహాని పాటించి 68 సంవత్సరాలు రాసాడు తన జీవితం లో డైరీ ని. క్విన్సీ ఆడమ్స్ కూడా తక్కువ వాడు కాదు - ప్రెసిడెంట్ గా పని చేసి మళ్ళీ ఒక సాధారణ హౌస్ రిప్రెసెంటేటివ్ గా పని చేసిన ఏకైక వ్యక్తి అమెరికా చరిత్ర లో (and perhaps will ever be) అంటే అధ్యక్ష పదవి కి అత్యున్నత ఇమేజ్ తగిలించలేదన్న మాట ఆయన. జీవితాన్ని ఒక పదవి ని అధిరోహించడానికి పనికి వచ్చే నిచ్చెన గా కాకుండా ఒక ప్రయాణంగానే చూసి ఉంటాడు. ఆ ప్రయాణంలో అధ్యక్ష పదవి అనేది ఆయనకి ఒక ముఖ్యమైన మజిలీ మాత్రమే అయ్యుండవచ్చు. ఆఖరి శిఖరమేమీ కాదు.

--------------------------------------------------------
*లారా బుష్ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన పుస్తకాల పండగ సందర్భంగా జరిగిన ఉపన్యాసం ఇది. 2001 సెప్టెంబర్ ఎనిమిదవ తారీకున. వచ్చిన జనాన్ని చూసి ఉపన్యాసకుడి వ్యాఖ్య - ఇట్లాంటి వాళ్ళ పుణ్యం వల్లనే ఇప్పటికీ అమెరికా లో మెక్ డొనాల్డ్ outlets కన్నా పబ్లిక్ లైబ్రరీ లే ఎక్కువ గా ఉన్నాయని...

యాది

8/25/02
వార్త లో సదాశివ గారు -తెలుగు, ఉర్దూ పండితులు, సంగీతజ్ఞులూ- రాస్తున్న ఈ కాలమ్ లోని తెలంగాణావమానాలు చదువుతూంటే (ఆయనని అయిదో తరగతి తెలుగు వాచకాన్ని కూర్చమని అడిగిన వైనమూ - నిజామాబాద్ ఊరి వాడనీ, తెలుగు సరిగా రాదేమోననీ అనుమానంగా చూసిన విధమూ..) ఉద్యమం అని మనమనుకునే వన్నీ ఎక్కడో చిన్న చిన్న వైయుక్తిక స్థాయి సమస్యలు గా ఎలా మొదలవుతున్నాయో స్పష్టంగా నే కనబడుతోంది. ఇలాంటి అనేక సంఘటనలు వేల జీవితాలలో జరగడం- వాటి ప్రభావమంతా కలసి కొంత మంది లో కేంద్రీకృతమై ప్రత్యేక ఉద్యమాలు సంభవించడం - ఇంకొన్ని లక్షల కోట్ల జీవితాలు వాటి వల్ల ప్రభావితం కావడం…
అయినా ఇదంతా అంత సులభమైన వ్యవహారం కాదు - నదీ జలాలూ, డాములూ, బజెట్ అల్లొకేషన్ - ఇవన్నీ వ్యక్తిగత వ్యవహారాలు కావు అనుకోవచ్చు. కానీ ఇవి కూడా సమస్యలు గా పరిణమించింది ఎవరో మనలాంటి మనుషుల (నాయకులనే పేరు తో) ఈగో లవల్లా, అవగాహనా రాహిత్యంవల్లా పరిష్కారాల పట్ల నిజమైన ప్రేమ లేకపోవడం వల్ల నే.. సరే దురాశా, గ్రీడ్, అవినీతు ల సంగతి చెప్పనే అక్కరలేదు.
బలవంతుడు - తెల్లవాడో ఇంకెవడో - అసలు వివక్షత చూపించక పోతే - స్వాతంత్ర్యం అనేది ఏమిటి ? అందరూ వ్యక్తిగతానికున్న ప్రాముఖ్యతని అర్ధంచేసుకుంటే దురాక్రమణ అనే పదం ఎలా పుడుతుంది ? మనుషులందరూ నిజంగా వివేకవంతులయితే అసలు "ప్రభుత్వం" అనేదే అవసరంలేదంటున్నారెవరో.

ఆశ

8/25/02
ఎంత రాసినా, చేసినా, ధనం సంపాదించినా చివరకి ఒక సుఖమయిన స్థితి ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండే కాలం రావాలని ఆశ మనసుకి. ఈ ప్రాసెస్ లో ప్రస్తుత క్షణాన్ని పారబోస్తూ ఉంటుంది. బాహిర పరిస్థితులలో మార్పులు అసలు మందు లో చాలా చాలా కొద్ది భాగమే. మిగతాదంతా ఉన్నదాని వంక చూసుకోవడమే.

రహస్య వర్షం

8/24/02
ఎప్పుడో నడి రాత్రి ప్రారంభమైనట్టుందీ వాన. కాసేపు కురిసీ కురవనట్లూ, కాసేపు బలంగా చప్పుడు చేస్తూ, అంతలోనే మందగిస్తూ.. మట్టివాసన ను రేపుతూ.. చిన్నప్పుడు ఎంత బాగుండేదో ఇలా ముసురు పట్టిన రోజు పుస్తకాలు చదువుకుంటూ ఎంజాయ్ చెయ్యడం…
రహస్యం గా కురిసిన వాన అన్న మాట కొ. కు. నవలల్లొ ఎక్కడో వాడాడు. ఏదో తెలీని ప్రేమ భావం సమస్త మానవ జాతి మీద తెలుస్తూ ఉంటుంది ఆయన రచనల్లో. దానికి దీటైన ఇంటెలెక్ట్, అలుపెరుగని శ్రామిక మనస్తత్వం- అదే సమయం లో ఎదుటి వాళ్ళ మీద అగ్రెసివ్ గా రుద్దకుండా చులాగ్గ్గా మృదువుగా చెప్పగలిగే విషయ పరిజ్ఞానం.. సహజంగా మనసులో ఉన్న ప్రేమ వల్లే ఆ మృదుత్వం అబ్బిందేమో ఆయన రచనలకి..

వద్దు

8/23/02
ఆధ్యాత్మికంగా అందరూ కోరే వాళ్ళే పై పై కి, నిజంగా ఇస్తే పుచ్చుకునే వాడొక్కడూ మిగలడు అంటున్నాడాయన. టాగూర్ రాసిన కధ లో దేవుడు కనబడబోతున్నాడని తెలియగానే వెనక్కి తిరిగి పారి పోయిన కధానాయకుడి వైనం గుర్తొస్తూంది.. మనసు తను ఆధ్యాత్మికం అని ఊహించుకున్న దానిని తనకి కావాల్సిన విధం గానే తప్ప ఇంకోలా భరించలేదు.

ప్రభావం

8/23/02
"సమస్య గా ఘనీభవించిందొక సంసారికి" అన్న మాటల్లోని పద కౌశల్యాన్ని చూసి కుశాల పడ్డవాళ్ళు కాక అవి చదివి భయంతో గడ్డ కట్టుకు పోయిన వాళ్ళెంత మందో..

మెలకువ

8/18/02
ఇందాకటి కల ని తల్చుకుంటే ఏదో చెప్పలేని హాయి. బహుశా ఆ భయపు కల అయిపోయిన క్షణంలో మెలుకువ వచ్చినప్పటి మానసిక స్థితి లోని తేలిక తనం. మెలకువ, తనకీ సుషుప్తికీ మధ్య ఉన్న పొరని తాకుతూ ఉన్నప్పుడు తెల్సిన నిజం- మెరపులా మెరిసిన క్లారిటీ. స్వచ్ఛాత్మ భావం - ఆనందామృత వర్షం - అలుముకుంటున్న కృతజ్ఞతా భావం.
జీవితం లో ప్రతిరోజూ పోతున్నదే నిద్ర - దీన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం దాదాపు అసాధ్యంగా కన్పడుతోంది. సుషుప్తీ, నిద్రా, జాగృతీ - ఆధ్యాత్మిక విషయాలలో వీటిని అంత ప్రముఖమైన విషయాలు గా ఎందుకు పరిగణించారో కొంచెం కొంచెం అర్ధమవుతున్నట్టుగా ఉంది.

2005-03-25

స్వరోత్సవం - ఋషిమూలం

Aug 12-20, 02.
కవీ అయితే నీ ఋషులెవ్వరు? అన్న ప్రశ్న విని "రాతదేవుళ్ళు" అన్న పదం ఊహించుకొని అమితంగా నవ్వుకోవడం. ఇవాళ పేపర్లో భూమాతకి స్థూలకాయం అని ఓ సైన్స్ వార్తకి పెట్టిన శీర్షిక తలుచుకొని మిక్కిలిగా వినోదం.

"పాట దేవుళ్ళు" :
కన్నుల పండుగ రష్యా అంటున్నారు బాలమురళి విజయవాడ ఆర్కైవ్స్ వాళ్ళ సంగీతం సీడీ లో. ఏళ్ళక్రితం విని మళ్ళీ అలాంటి రాగం ఎక్కడ పడుతుందా అనుకుంటున్న "కృష్ణాయన బారదే" (కన్నడ పురందర దాసా?) లోని పోలిక స్పష్టంగానే ఉంది. కేదారం ట దీని పేరు.
భామరో ఊరికీ అని ప్రతి అక్షరం లోనూ ఆనందభైరవి ని పిండుతున్నాడు. దాంతో పాటు నరాల్నీ.

*పరమ హంస హృదయోత్సవకారీ అంటున్న మంగళంపల్లి కంఠం తో పాటు అంపోలు వారి వయొలిన్ తీగ నడిచి వెడుతోంది అదే దారిలో మనసునిండా సంగీత పరిమళాలువెదజల్లుతూ. హృదయంలో సుఖపుగీతలు గీస్తూ సాగుతూనే ఉంది రోజంతా పాట. సుదీర్ఘంగా ఒకటే స్వరం లాగా వినబడుతూ అన్ని వంపులూ ఎలా తిప్పాడో ఆ శబ్దాన్ని-సుఖపుదెబ్బలు కొట్టారు ఇద్దరు మురళీకృష్ణలూ.*
మైండ్ లో రికార్డ్ చేసి సొంతం చేసుకోకపోవడం లో, అర్ధం చేసుకోవాలన్న(సంగీతాన్నే!) కోరిక లేని తనంలో, జ్ఞాపకానికి కమిట్ చెయాలన్న ఆరాటం లేక పోవడంలో ఎంత స్వేచ్ఛ, హాయి..
ఆలోచిస్తే (ఆలోచించకూడదేమో ఇలా) - ఎన్నో శతాబ్దాల క్రితం ఎవరో రాసిన పాటల్ని దశాబ్దుల క్రితం పాడటం -ఎవరో ఎక్కడో చేసిన పరిశోధనల వల్లా, ఈ రేడియో కేంద్రాల వల్లా, CD టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళ వల్లా జరిగిన అనేక వేల సంఘటన ల గొలుసు లో "నేను విని ఈ రాత్రుళ్ళు ఆనందించడం" అనే సంఘటన ఇప్పుడు జరుగుతోంది. రాగ నిర్వచనం చేసిన ఋషిమూలం ఎక్కడుందో ఇప్పుడు? సామవేదం ఏ కాస్మిక్ డాన్స్ లో
భాగం? అబ్బా ఏమిటి అధివాస్తవికత ఇంత వాస్తవంగా తెలియబడుతొఓంది మైండ్ కి ? క్షణ క్షణం స్పృహ తప్పుతూ మేల్కోవడం లాగుంది ఇప్పుడు?
-----------------------------------------------------------------------

*కీర్తన పల్లవి "గాయతి వనమాలీ" ( సదాశివ బ్రహ్మేంద్రస్వామి-ఆల్ ఇండియా రేడియో ఆర్కైవల్ రిలీజ్ - సదరన్ గ్లోరీ - మంగళం పల్లి గానం - అంపోలు మురళీకృష్ణ వయొలిన్)

2005-03-24

జన్యూద్భవం

8/18/02
పాట, పద్యం, శ్లోకం, పదం మనసుని ఎలా ఆడించి కట్టేసుకుంటాయో. దీపం చుట్టూ తిరిగే శలభం లాగా ఫీల్ అవుతోంది మనసు. ఇవి మనసు అంతరాంతరాల్లో కి చొచ్చుకుపోయి ఏవో తెలీని బేసిక్ ఇంస్టింక్ట్ ని తడుముతాయి. రెండు లక్షల సంవత్సరాల క్రితం మొదటి మానవుల స్వరపేటిక, గొంతు కండరాల్ని సులభంగా మానిప్యులేట్ చెయ్యగలిగే ఒక జన్యువు* హఠాత్తుగా (?!) మ్యుటేషన్ వల్ల ఉద్భవించి ఇరవై ముప్పై వేల సంవత్సరాల కాలంలోనే మొత్తంభూమండలంలోని సమస్త జాతి ని ఆక్రమించుకుందట. పరిణామ శాస్తృ సూత్రం ప్రకారం advantage of having that faculty swept the whole race. ఇది మొత్తం సంస్కృతి అనే దానికే కారణ మయింది. వర్షంపడితేనో, ఆహారం దొరికితేనో మంచి జత దొరికి సుఖంలభిస్తేనో - ఆనందంగా గంతులు వేసి ఉంటారు ఆది మానవులు. ఆ ఆనందాన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలన్న, express చెయ్యాలన్న కోరికేనా ఈ జన్యువు కి కారణం ? "నా" గుర్తుని కాలంలోకి వదలడం, పక్కనున్న మానవ జాతి సభ్యుల్ని "తాకడం" ఇదే కన్పిస్తుంది యావత్ సాహిత్యానికీ, సంస్కృతికీ మూలకారణం గా కనీసం చాలా మంది దృష్టికి.
కానీ ఈ సంస్కృతి అనే దాన్ని ఆలోచన, కాలం అనే వాటికి ఆవలవైపు ఏముందో తెలుసుకునే ప్రయత్నంగా నిర్వచించి, ఆ ప్రయత్నం చెయ్యని జాతి శీఘ్రం గానో ఆలస్యం గానో నశిస్తుందం టున్నాడాయన.
_________________________________________
*ఈ మాట్లాడే శక్తి ప్రసాదించిన జన్యువు కి FOXP2 అని నామకరణం చేసారట. లండన్ లోని ఒక వంశపు వ్యక్తులలో అండ్, ఇఫ్, హిప్పోపాటమస్ లాంటి పదాలు పల్కలేని గుణాన్ని పరిశోధిస్తూ కనుగొన్నారట దీనిని. శాస్తృజ్ఞుల లెక్క ప్రకారం రెండు లక్షల సంవత్సరాల క్రితం ప్రత్యక్షమయిన ఈ జన్యువు "seems to trigger the ability to develop movement of mouth, lips and tongue and certain neural processes. (చూ. టైమ్ పత్రిక ఆగష్ట్, 02.)

అద్వైత ప్రశ్నలు

Aug 9,02.
ఏది చేస్తే సుఖం. ఏది దుఃఖం. "నువ్వంటే నాకెంతో ఇష్టం" అని ఎవరైనా ఇంకోళ్ళతో అంటే దానర్ధం? ఎందుకు లేదు నిజానికీ అబద్ధానికీ అబేధం? ఏవో కొన్ని కండిషన్స్, స్టిమ్యులేషన్స్ ఉండాల్సిన అవసరం ప్రతి నిజాన్ని అబద్ధంగానూ, దానిని దీని గానూ మార్చలేదా?
భావన ఎంత కాలంజీవిస్తుంది ? ఫీలింగ్ వయసు ఎంత ? ఓ మహాత్మా ఓ మహర్షీ ఏది సత్యం ఏదసత్యం - అన్న పాట విన్నందుకే మానవజాతి కి కృతజ్ఞత గా ఉండాలనిపిస్తూందే. ఇంక కొండ దగ్గరున్న మహర్షి నో, మదనపల్లి లో పుట్టిన మహానుభావుణ్ణో చూసి ఉంటే ఏమయ్యేది ? చైతన్యపు కొన్ని శకలాలు ఎందుకంత క్లారిటీ ని సంపాదించుకోగలిగాయి ? ఎందుకని అవి కొన్ని శరీరాలని ఆశ్రయించుకొని ఉండాలి ? నేను అనుకునే దాని వంక చూసిన కొద్దీ ఇంకా ఇంకా గాఢం గా పెరుగుతుందెందుకు చైతన్యపు వేడిమి ? ఇంట్యూషన్ అంటే తెలుగు అప్రయత్న జ్ఞానమా ? Nothing can be called as miracle now because everything is a miracle by definition – ఆశ్చర్య పోవడంఅనేది ఎంత వ్యర్ధం?

పోలిక

Aug 4, 02.
ఒక ఉద్వేగ భరిత మైన ఆనందానికీ; కేవలం కామవాంఛలోనో, ఇంకొక ఇండల్జెన్స్ తీర్చుకునేటప్పుడు ఉండే సుఖానికీ - తేడా ఆలోచించుకోవడం చాలా ఆసక్తికరం. పోయిన సంవత్సరం క్రిష్టమసు కి ఒక పది మంచి పుస్తకాలు కొని గ్రంధాలయానికిచ్చినప్పుడు అపరిమితమయిన ఆనందంతో వణికిపోయాడు. నిమీలిత నేత్రాలతో నవ్వుకుంటూ ఆ సుఖం అనుభవించాడు - ఎన్నో తరాల పాటు ఆ పుస్తకాలు చదివే మనుషులని తల్చుకొని. చిన్నప్పుడు ఎవడో స్నేహితుడు వాడి అభిమాన నటుడి చిత్రం టిక్కెట్లు (ఎవరూ కొనకపోతే) మొత్తం తనే కొనేసి అందరికీ పంచేసి ఆనందించిన సన్నివేశం గుర్తొచ్చి విరగబడి నవ్వుకోవడం - దానికీ దీనికీ పోలిక పెట్టి. Of course, there are some very basic differences but still the feeling of emotion is same at the core level.

శ్రీశ్రీ వ్యాసాలు

Aug 4, 02.
అరవై ఏళ్ళ క్రిందటి గాఢమైన ఆధునిక వచనం.. అంత అమోఘమైన వచన రచనా శక్తి ఎక్కడ నించి వచ్చిందో.. ఎంత ఉద్వేగం. పత్రికలూ, సాహితీ వివాదాలూ, కవులూ, స్వాతంత్ర్యోదయం, ఆశలూ, వాగ్దానాలూ, ఆశాభంగాలూ. మానవుడి మూల సమస్య ఎలాగూ ఉద్వేగాల వల్ల తీరదు కానీ అభినివేశానికీ, ఉద్వేగానికీ, ప్రేరణ కీ జీవితంలో ఉన్న ప్రాముఖ్యాన్ని నిరాకరించలేం. వాటిని అనుభవించి దాటుకోవాల్సిందే. వ్యాసాల్ని చదివి ఆనాటి పారిశ్రామిక నాగరికతా సమాజపు సంక్షోభాన్నీ, ఆనాటి మానవుడి మానసిక స్థితిని కొంత వరకూ అందుకోవచ్చు. ఆనాటి పాత్రికేయ సమాజం, కాలగర్భం లో కలిసిపోయిన ఢంకా, రూపవాణి, నవోదయ, తెలుగుస్వతంత్ర.. - ఏదో రాద్దామనీ, చేద్దామనీ, చేరవేద్దామనీ, ఎవరికో చెప్పాలనీ, చూపాలనీ ఎంత తపన, వేదన… ఉదయిని జనార్ధనరావు లాంటి వాళ్ళు ఈ వేదనాయుత స్పెక్ట్రం లో మరీ చివర ఎక్స్ట్రీం కి చేరుకున్నారేమో పాపం.. - తమ భావల్నీ, నిజం అని భావిస్తున్న విషయాల్నీ సమాజానికి అందించాలన్న ప్రయత్నం- దీన్ని మానలేరు. కానీ అలా చేయడానికి రిసోర్సెస్ అయితే లేవు తమ దగ్గర. సాహిత్యం లో ప్రమాణాలని ఎరిగినవారూ, భాషా సాంస్కృతిక రంగాలలో విషయజ్ఞులూ కానీ ఆధునిక సమాజ జీవితానికి అవి ప్రైమరీ కాకపోవడం వల్ల (ఇంజనీరింగో, వైద్యమో, పద్దుల తనిఖీ యో లాంటివి) ఆర్ధిక వసతి లేక ఘర్షణ. వేదనాయుత జీవితం. ఈ వలయం తమని మింగకుండా జాగ్రత్త పడి తమ సృజన ని కాపాడుకున్నది ఎవరో కొ. కు. లాంటి అరుదైన వ్యక్తులే.

భాషా వాతావరణం

Aug 3, 02.
తెలుగు అంటే - చెట్లూ, చెరువులూ, చందమామ, బాల్యం, బొమ్మరిల్లు, యవ్వనం, లైంగికం, సాహిత్యం, సామ్యవాదం, తిట్టుకవిత్వం, వంటగది, కుటుంబం…
ప్రతి భాష చుట్టూ ఒక వాతావరణం ఏర్పరచుకునేది మనసు - కనీసం అప్పటి తరం పిల్లల్లో.
ఆధునిక విజ్ఞాన శాస్త్రాలకి సంబంధించిన విషయాలు ఆలోచిస్తూ ఉంటే చప్పున తెలుగు గుర్తొచ్చేది కాదు. ఉద్యోగ, శాస్త్ర విషయాలను గురించి తెలుగులో అలోచించడం, మాట్లాడడం కొంచెం అరుదే. చుట్టూ ఉన్న సమాజంలోని ఏ విషయాలు ఆ భాష లో ఎక్కువగా ఉన్నాయో వాటి aura ఒకటి భాష చుట్టూ అలుముకుని ఉండేది. అలానే సంస్కృతం అనగానే వేదాలూ, భగద్గీత, పూజలూ ఇవన్నీ మనసులో కి వచ్చి అదొక రకమైన ఆధ్యాత్మిక రెసోనాన్స్ తో నిండిన వాతావరణం నెలకొంటుంది మనసు నిండా.. ఇదంతా మైండ్ లో పెరిగిన కండిషనింగ్ అనేది తెలిసిన విషయమే..

ఇలా..

Aug 2, 02.
"ఇలాగుండాలి" - "ఇది మంచిది కాదు" - "మరి అలా చేస్తే మంచిది. బాధ పోవాలంటే"
సూపర్ఫిషల్ మాటలన్నీ తెలివి తక్కువగా అన్పించే సందర్భం రాక మానదు. ఎప్పటికైనా మనసు బాధ నించి తప్పించుకోకుండా పడాల్సిన రోజు రాక మానదు. బాధని అణువణువునా అనుభవించి, పలవరించి, దాన్లో చొచ్చుకుపోయి మరీ చూడాల్సిందే ఎప్పటికైనా. తెలియని దేదో అక్కడ నీకు దర్శనమివ్వవచ్చు - చూడగల సత్తా సంభవిస్తే. లేకపోయినా, కనీసం అనుభవం - అత్యంత విలువైనదే - మిగుల్తుంది.

ఊహా సంభాషణ

7/30/02
“సోర్స్ దగ్గ్గరకి వెళ్ళమంటున్నారా? హలో, ఎవరండీ మాట్లాడేది ? మహర్షి గారేనా, ..ఆ కొండ దగ్గిర్నుంచేనా?”
“…”
“మౌనంగా ఉండి పోయేరేమిటండీ.. నేను చేసే ప్రయత్నం అంతా సోర్స్ కోసమే నండీ.. కానీ ఏది నేను సోర్స్ కి దారి అనుకుంటున్నానో అది అది కాదేమోనని భయంగా ఉంది.”
“…”
“ఈ భయాన్నే సోర్స్ చేసుకోమంటారా.. రేపు ఏదో జరుగుతుంది, దొరుకుతుంది అనుకోవడమే తప్పంటారా - అవును వాచ్యంగా తెల్సండి - ఇంకో పెద్దాయన యాభై అరవై ఏళ్ళు చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పారు.. అయినా మళ్ళీ మళ్ళీ మర్చిపోతుంటామండీ”
_______________________________________________ వాడనుకునేదీ ఇదే - ఎప్పటికీ ఏదీ అద్భుతం జరగదన్న విషయం ఎప్పటికైనా 'తెలియడం' జరుగుతుందని ఆశిస్తాడు. అబ్బా ఎంత
casuistry..

ఉత్పత్తి చక్రం

7/27/02
లెక్కలూ సైన్సూ బాగా వస్తేనే నీ తెలుగు మార్కులకి విలువ.. చిన్నప్పటినించీ పెద్దవాళ్ళూ, పంతుళ్ళూ, చుట్టుపక్కల సమాజమూ ఎంతో బలంగా ఇన్ స్టాల్ చేసిన ఈ " గిల్ట్ సిస్టం" ధాటికి తట్టుకోలేక మానసికం గా చనిపోయే వాళ్ళే ఎక్కువ మంది. నిజంగా గట్టి ప్రేమ ఉన్నవాళ్ళెవరో ఈ చట్రాన్ని అధిగమించగలరేమో. మిగతా వాళ్ళకి ఆ అవకాశం బహుశా లేదు. వాళ్ళ మనసుల్లో ఉత్పత్తి చక్రం అంటే లెక్కలూ సైన్సేనన్న విషయం స్థిరంగా పాదుకొనడంవల్ల..

2005-03-23

శక్తి పిడుగులు

4/28/02
ఇక్కడంతా స్వేచ్ఛాయుతం. ఎవరికీ ఏమీ ఆబ్లిగేషన్స్ లేవు. ఆనందం కోసం అన్వేషణ మాత్రమే
ఉంది. ఇది డెమోక్రసీ కూడా కాదు సెల్ఫోక్రసీ..
మొన్న బ్యూటిఫుల్ మైండ్ సినిమా చూసి నాష్ గారికి వినబడిన విషయాల గురించి ఆలోచన.

అవి ఎందుకు అన్రియల్ అయ్యాయో. ఆ గణితాల్ని అర్ధంచేసుకున్న కాన్షస్ లు ఉన్నాయి
గానీ తనకి వినబడ్డ శబ్దాల్ని తనతో సహా ఎవరూ అర్ధంచేసుకోలేకపోయారేమో లాంటి ప్రశ్నలు
అడుగుతున్నాడు నాష్ గారు. ఇన్సేనిటీ కీ దాన్లో 'ఇన్' లేకపోవడానికీ తేడా మనం
అనుకునేంత స్పష్టం గా ఉండదని అంటున్నాడాయన. సమతా స్థితి సిద్ధాంతానికి
పురస్కారాలు అందుకున్న జీవితం లో ఆ స్థితి లేక ఎన్ని పాట్లు .. ఎంత ఐరనీ.. ఆ తెర తొలగిపోయినపుడు డెలిరియం లాంటివి రాక తప్పదేమో… శక్తి పిడుగుల్ని అందుకున్న ఎంతో మంది కళాకారులు, శాస్తృజ్ఞులు సమాజం విధించే చట్రాలలో ఇమడ లేక బాధ పడతారు.

2005-03-21

అసమానం

7/24/02
ఒకడిది సూటి చూపు. ఇంకోడిది మందబుద్ధి. వేరొకడికి శాస్త్రాసక్తి. పక్కవాడిది మట్టిబుర్ర. కొంతమందికి ప్రకృతి శక్తుల్ని వశపర్చుకుందామన్న తపన. మరి ఎక్కువమందికి మొద్దుగా తిని నిద్రబోదామనే. ఒకడికి అమితమయిన పట్టుదల అధికారం సాధించాలని. ఫలితం కాంతాకనక కీర్తులు. దానివల్ల ఇంకా పెరిగిన విషయవాంఛలు.
ఇన్ని రకాల అసమానతలు పెరుగుతున్నాయి శరవేగంతో. సమాజం లో. మరి ఇవన్నీ ఈర్ష్యాసూయలనీ, భయాందోళనల్నీ కలిగించడంలో ఆశ్చర్యం లేదు (ఆర్ధికం సంగతి అటుంచినా ) వేరే రకంగా జరగదు. ముందుకు పోతున్న మనిషి ని ఆగమనో లేదా వెనక్కి చూడమనో అంటే వెర్రి వాడి గా జమకడతారు. మిగతా సమాజాని కన్నా ఎంత ఎక్కువగా పోతే అంత అభివృద్ధి. దానివల్ల మరిన్ని అంతరాలు. ఎవరి వృత్తిలో , జీవితం లో వారు మునిగి ఉండి ఇంకా పై పై కి పోవాలని ఆరాటమూ… ఆగి తన వంక చూసుకోవడమే అవమానంగా భావించడమూ…

భయ గుణింతం

2001 ?
ఏదో పెద్ద మార్కెట్ లోనో ఇంకెక్కడయినానో జనసమ్మర్దాన్ని చూస్తే భయంభయంగా ఉండేది వాడికి. అంత మంది మనుషుల్ని ఒకే చోట చూసి - నేల నించి కాలుష్యం అంతా ఒకే సారి పైకి ఊరినట్లు. వాడు ఒక్కడే కూచుని ఆలోచించుకుంటేనే ఇన్ని రకాల విషయాలు మనసుకి తోస్తున్నయే…. అవి ఇన్ని భయాల్నీ, సందేహాల్నీ, కోపతాపాల్నీ రేపుతున్నాయే - వీటన్నిటినీ ఇంత మంది మనుషుల చేత గుణిస్తే ఎంత భయం!! అందరి లోనూ ఎంతో కొంత ఉండే చెడ్డ ని భూతద్దంలో అనేక రెట్లు పెంచి భయ పడుతున్నప్పుడు; ఆనందం, మంచితనం, ప్రేమ - వీటి సంగతేమిటి మరి ? అవి ఎందుకు గుర్తు రావు? పర్ యూనిట్ లెక్క లో మంచి కన్న చెడ్డ ప్రతి ఒక్కరి లోనూ ఎక్కువ వుంటుందన్న నమ్మకం ఎలా ఏర్పడింది? అసలు అటో ఇటో ఏ అభిప్రాయ మైనా నమ్మకమైనా ఎందుకు ఉండాలి?

విజ్ఞాన బాంబు

7/21/02

పని ప్రదేశం లో ఎవరిని కదిలించినా అసంతృప్తి.. ఎక్కువ మందికి ఫ్రస్ట్రేషన్, యాతన.. పని మీదా సబ్జక్ట్ మీదా ఇష్టం సంగతి అటుంచి, ప్రతి విషయం లో పూర్తి కంట్రోల్ సాధించలేదనో, "మొత్తంగా" అర్ధం కాలేదనో బాధ.
"ఆధునిక విజ్ఞాన బాంబు" పేలడం మొదలయిన దగ్గర్నించీ ఇలా విషయాల్ని మొత్తంగా అర్ధంచేసుకోవడమనేది అసాధ్యమని అందరికీ తెలిసినట్టే ఉంది మరి. అయినా పూర్తి అధికారం సంపాయించాలనో, సంపాయించానని అనుకోవాలనో కోరిక. తీరక ఫ్రస్ట్రేషన్.

అబద్ధపు శాశ్వతం

7/19/02
ప్రశాంతత అంటే కోపాన్నీ, ద్వేషాన్నీ, భయాన్నీ జయించడం కాదని తెలుస్తూనే ఉంది. జయించడం అనే మాట కి అర్ధం లేదు. ప్రశాంతత లొ అవి మాయమయినై అంతే.. తర్వాత, రేపు, యల్లుండి, వస్తాయా రావా అన్న ఆలోచన లేదు. ఇవన్నీ నిజం గా పోయినాయా, లేక పోయాయని అనుకోవడమేనా అన్న ప్రశ్న ఉండేది. "శాశ్వతంగా పోవడం" అన్న మాట కి అర్ధం లేదేమో. మైండ్ తో వ్యవహారం జరుగుతున్నంత సేపూ "అప్పటికి అనుకోవడం" మీద ఆధారపడాల్సిందే. అవి లేవనో ఉన్నాయనో తెల్సేది మైండ్ వల్లే. అది అలా అనుకోవడం లేదా దానికి అలా అన్పించడం వల్లే. కాబట్టి ఆ క్షణానికి అవి లేవు అంతే. ఏ విషయానికైనా ఉనికి లేదా రాహిత్యం మనం అనుకోవడం వల్లే. మళ్ళీ భయం, క్రోధం, హింస రేపు లేదా కొంతసేపటికి వస్తాయా అన్న ప్రశ్న కి అర్ధం లేదు. మహా అయితే "తెలీదు" అని చెప్పవచ్చునేమో. ఇంకా గట్టిగా చెప్తే - తర్వాత, రేపు లాంటి మాటలకి రియాలిటీ లేదు నిజంగా - అవి ఊహలు కాబట్టి. అందుకని ఆ ప్రశ్నలకి అర్ధం లేదు.

రేపటి మనసు

7/19/02
…..
అంతా రాసింతర్వాత బాగా ఎగ్జాస్ట్ అయినట్లుగా, అలసిపోయినట్టుగా ఉంది. వాడిలో ఉన్న జ్ఞాపక భారం బాగా తగ్గినట్టుగా, ఆలోచనల ఉధృతి మాయమయినట్లుగా భావన. సమాజ భారాలు లేకుండా వాడి వంక వాడు నిజాయితీ గా చూస్కోవడం వల్ల ఏదో ఆనందం గా ఉందనిపిస్తోంది. కానీ నిజానికి దీన్లో "కొత్తగా లభించిన" ఆనందం ఏమీ లేదు. ఆలోచనలూ, జ్ఞాపకాలతో నిర్మించబడ్డ "నేను" ఎంత ఎక్కువగా కరిగిపోతే లేదా డైల్యూట్ అయిపోతే అంత తేలిక గా ఉంటుందని స్పష్టం గానే తెలుస్తూంది. ఈ తేలికతనాన్ని మళ్ళీ ఒక స్మృతి గా తయారు చేసి దాని కోసం కొత్త పధకాలు వేస్తుంటూంది "రేపటి" మనసు.

పరీక్షలు

7/19/02
ఇష్టం లేని పనులు ఏదో కొద్ది కాలం డబ్బు సమకూడేదాకా చేసి మానేస్తే - అప్పుడు ఇంక ఆ భయాలూ, అయిష్టం అనుభవించనక్కర్లేదు కదా తర్వాత అనుకుంటాడు - చాలా సార్లు అవి రూపం మార్చుకుని అక్కడే ఉంటాయి, ఎక్కడికీ పోవు బయట పరిస్థితి పోయినంత మాత్రాన అంటున్నాడాయన..
పరిక్షలు తప్పుతామన్న భయంతో కూడిన కలలు చచ్చేదాకా చాలా మందికి వస్తూనే ఉంటాయంటున్నారు. ఆ రూపం లో కాకపోతే ఇంకో రూపం లో, ముసుగు వేసుకొనో దర్శన మిస్తూనే ఉంటాయి భయాలూ, ద్వేషాలూనూ.. వాటిని పూర్తిగా అర్ధంచేసుకుని (!?) తొలగించుకోవాలిట..

ఎఫిమెరల్

7/19/02
.. ఎంతో అయిష్టం ఒక్క క్షణం లో మాయమవడం… కట్టిన ఇమేజ్ మేడలన్నీ ఒక్క దెబ్బలో కూలడం, మళ్ళీ ఏదో ఒక్క చిన్న సంఘటన లేదా ఆలోచన వల్ల క్షణాల్లో అంతస్తులు లేవడం.. - ఉందనుకున్న ప్రేమంతా ఒక్క నిప్పురవ్వ తో భగ్గున ద్వేషంగా మారడం.. ఒక్కసారిగా నాణెపు బొమ్మ బొరుసవడం.. ఇదంతా ఒంటరిగా గమనిస్తూ రాయడం….

వలయం

7/15/02
బాధ మాయమవగానే రాయాలన్న అర్జ్ తగ్గడం తెలుస్తూంది. ఈ మాయమవడం దేనికీ చివరా కాదూ మొదలూ కాదేమో. ఏదో ఒక క్షణంలో వచ్చిన "....". అంతే. చాలా కాలంనించీ పడుతున్న బాధ వ్యూ పాయింట్ నించి చూస్తే ఒక సైకిల్ కి ఎండింగ్ అనుకోవచ్చునేమో. ఇంకా ఎన్నో వలయావర్తాలూ, శాఖా చంక్రమణాలూ చెయాల్సి రావచ్చు నేమో.. ఈ జీవితానికి - భౌతికంగా రోజుల్లోనో సంవత్సరాల్లోనో ముగిసిపోవచ్చు శరీరం.. కానీ మానసికంగా ఒక్క రోజులోనే కొన్ని సంవత్సరాల జీవితం గడిచిపోవచ్చు..

2005-03-20

ఖాళీ

7/13/02
కరుడు గట్టిన బాల్యం. ఆర్ధిక విద్యా వనరులెంత పెరిగినా రాని అభయం.
******
ఎంత రాసినా ఏమిటి ప్రయోజనం ? ప్రయోజనం ఉన్నా తర్వాత ప్రయోజనంఉండదు. ఎందుకంటే కాలం ప్రయోజనంఅన్న మాటకి కొత్త అర్ధాన్నిస్తూ ఉంటుంది అనంతంగా.. ఏ మాటకైనా స్థిరమైన అర్ధం ఎలా వుంటుంది?
మళ్ళీమళ్ళీ దుఃఖం.. గొంతులో ఏదో మేకు ఉన్నట్టుగా, కళ్ళమీద వత్తినట్లుగా బాధ. ఎక్కడనించి, ఎందుకు బాధ వస్తోందో తెలీదు. అసలు తెలుసుకుందామన్న కోరికే లేదు. బాధ గుండా ప్రయాణించడంఒక్కటే సరియైన మాట గా తోస్తోంది.

ఎందుకు ఈ బాధ లోనే పడి కొట్టుకుంటావు? అలా బయటికి వచ్చి ఏదైనా సినిమానో పుస్తకమో పట్టుకోరాదా అంటున్నారు ఎవరో తన మనసు లోపల. తల్లిదండ్రులూ , స్నేహితులూ, సహచరులూ - ఎంతో మంది ఎన్నో రకాలుగా లోపల మాట్లాడుతున్నారు. - భార్యా భర్తల సంభాషణ వెనక అటూ ఇటూ ఐదు తరాల తల్లుల్నీ తండ్రుల్నీ దృశ్యం గా నిలబెట్టి కొనసాగించిన సినిమా సన్నివేశం గుర్తుకొస్తూంది
పుస్తకంచదవడం, సినిమా చూడడం, మాట్లాడడం అప్పుడు కలిగే ఆలోచనలూ - దాని విధానంఆ ఆక్టివిటి
అయిపోగానె మళ్ళీ "సమయం" దాని ప్రతాపంచూపించడం- ఇవన్నీ వెంటవెంటనే తలపులలోకి వస్తాయి.
కాబట్టి వీటో.
లోకం లో చెల్లాచెదరుగా, చెదురుమదురుగా వ్యాపించిన బాధంతా ఒక్క సారిగా జీవితంలోపల జొరబడి గాఢంగా అలుముకుంది కొద్దిరోజులుగా.. తప్పు! తప్పు! ఇదంతా ఏదో కాస్త చెయ్యి తిరిగిన స్టైలిస్టిక్ రైటింగ్ లాగా ఉంది. పెంచుకున్న ఊహా చిత్రాల వల్లా, వేసుకున్న ముడుల వల్లా, తేల్చుకోలేక, లోపలకి చూసుకోవడం చాతకాక బాధ పడుతున్నావు కానీ, ఎక్కడనించో బాధ ప్రత్యక్షం అవడం ఏమిటి, వెర్రి మొర్రి !
ఈ బాధ, అసహనం లోపలే అంటుకొని ఉన్నాయనీ, అవి ఎప్పటి కన్నా మాయమవుతాయో లేవో తెలీదు కానీ బాహిర భౌతిక పరిస్థితులు మారడం వల్ల పోవని తెరలు తెరలుగా లోపల్నించి ఒక్కసారిగా ఉబికి వచ్చిన నమ్మకం లాంటి దేదో విద్యుద్ఘాతంలా వెన్నును తాకింది. ఒక్క క్షణమే.. మాయమయిన బాధ.. ఏదో తేలిక తనం.. ఒక్క సారిగా "జీవం" పోసుకున్న ప్రదేశాలూ, మనుషులూ, శబ్దాలూ… కొత్తగా ఏమీ జరగలేదని స్వచ్ఛంగా కన్పిస్తున్న నిజం. మెదడు లోంచి మాయమయిన భవిష్యత్తు.. లోపలికి చూస్తే ఉండాల్సిన బాధ స్థానం లో కన్పించిన పెద్ద ఖాళీ…

కల్పన

7/12/02
ఈ స్వకీయ కల్పనా ఫలిత కారాగార ప్రవాసం ఎప్పటికి తప్పేది?
ఏది నేర్చుకునే విషయం చూసినా ప్రతి దాన్లోనూ సూసైడల్లీ హై స్టాండర్డ్స్ పెట్టుకోవడం..
మెదడు నిండా నిండిన ఈ "అత్యున్నత శిఖర" మూర్ఖత్వానికి మానసిక వికాసపు ముసుగు

తగిలించడం- దాని వల్ల ఏర్పడుతున్న మోసం, కాపట్యం….
****************************************************
అతడొక ఆది మానవుడు. కూడూ గుడ్డా చక్కగా జనానికి లభ్యంఅయే దశ వచ్చిందనుకుంటున్నప్పుడు అతడు మాటలతో ఆటలాడడం ప్రారంభించాడు. ఏళ్ళ తరబడి మెదడు లో సాధన చేసి మాటల్ని అందంగా కూర్చే నేర్పు సంపాదించాడు. అలా చేయడం లో ఏదో సుఖం ఉందని గమనించాడు. కొన్నాళ్ళ తర్వాత తనలో తనే అనుకోవడం విసుగనిపించింది. తన చుట్టూ ఉన్న తన అంశలకీ, ప్రతిరూపాలకీ నేర్ప డం ప్రారంభించాడు. కొన్ని తరాలు గడిచాయి. ఆది మానవుడి అంశ రెండు గా విడిపోయింది. మాటల్ని ఆస్వాదించే, వాళ్ళని తృప్తి పరచే వర్గాలుగా. వాటి మేధ మునపటి కన్న అనేక రెట్లు పెరగడంవల్ల మానసికోల్లాసపు చివరలూ, ప్రమాణాలూ, పరిమాణాలూ పెంచబడ్డాయి.
పేరు తెలీకుండా ప్రతి వాళ్ళ లోనూ ఉన్న ఏదో ఊహ, జనసంఖ్య తో గుణించబడి మేరు పర్వతంలా, ఒక కల్పన గానే అయినా, పెరిగింది. మేరువుని అందరికన్నా ముందుగా అధిరోహించి ఆక్రమించుకోవడం కోసం సాముగరిడీలు ప్రారంభమయ్యాయి.

తనలో ఏర్పడుతున్న కోరికలూ, ముడులూ అవి సమాజాన్నీ, తర్వాతి తరాల్నీ ఎలా ప్రభావితం చేస్తున్నాయో, తన విద్వత్తు అంతా అవసరానికి మించి ఎలా పెరిగిపోయిందో, అది సాముగరిడీ లకి ఎలా బానిస అయిందో - ఇదంతా చూడకుండా గుడ్డిగా ఎన్ని వందల వేల సంవత్సరాలు జీవించి ఎంత విద్యా, కళా పోగేసినా శాంతి లేదని కొద్దికొద్దిగా అర్ధమవడం మొదలయింది.

పని ప్రదేశం

7/10/02
ఆఫీసు పని అంతా ఒక ప్రశ్న జవాబుల పరంపర గా తయారయింది. ఇది ఇలా ఎన్నేళ్ళో?
జీవితమంతా ప్రశ్నలకోసం ఎదురుచూస్తూ జవాబుల్ని వెతికిపెడుతూ ఎవరినో సంతృప్తి పరుస్తూ..

ఆత్మ పాత్రాభినయం

7/10/02
తనలో తనె మాట్లాడుకుంటూ ఉంటే అమితమయిన ఆనందం… ప్రపంచాన్నంతా తనలోకే తెచ్చుకుని తనకు నచ్చిన విధంగా దానిచేత రెస్పాన్స్ ఇప్పించుకుంటాడు. హాస్యం, కరుణ, విషాదం, తిట్లూ, పొగడ్తలూ, వ్యాఖ్యానాలూ, వ్యాఖ్యానానికి తిరిగి వ్యాఖ్యానాలూ, ప్రశ్నలూ, జవాబులూ, అన్నీ వాడే. పెద్దపెద్దగా మాట్లాడుతూ, నవ్వుకుంటూ, పాటలు పాడుకుంటూ, భయవిహ్వలుడవుతూ, ఆశ్చర్యపడుతూ...

ఫర్వాలేదు

7/7/02
కోరిక కలిగి, అది తీర్చుకునే ప్రాసెస్ మొదలు కాగానే దాని తీవ్రత, గాఢత లేదా అసలు కోరికే తగ్గి పోవడం గమనిస్తున్నాడు. ఏదో కోరిక కలుగుతుంది. అది తీర్చుకోవడానికి బయలుదేరగానే ఆ ఏముందిలే అక్కడ అన్పించడం…. ఇలా ఎందుకు జరుగుతుందా అన్న ప్రశ్నకు ఒక సమాధానం : కోరిక తీరడం అంటే అది ఇంద్రియాల అనుభవం లోకి రానక్కర్లేదు అన్నిసార్లూ. తీర్చగలిగే శక్తీ, తీరే ప్రాసెస్ అందుబాటు లో ఉన్న విషయం కన్ఫర్మ్ అయితే చాలు మనసుకి. అందుకనే బయల్దేరగానే అది - వీడు మన కంట్రోల్ లోనే ఉన్నాడు ఫర్వాలేదు అని తృప్తి పడిపోతుందేమో.
***************************************
అవిచ్ఛిన్నంగా భంగమవుతున్న ఊహాస్వరూపాలూ, తిరగబడటం, కొట్లాటలు, తగాదాలూ, మరిన్ని కొట్లాటలు, శారీరక హింస, రక్తపు మరకలు, విపరీతమయిన లైంగిక వాంఛ, సమాజ ద్వేషం, అక్రమ సంబంధాలూ - దీన్నంతా తెలియకుండానే ఎంజాయ్ చేస్తూ ఆ సెన్సుయల్ ప్లెషర్ కి అలవాటు పడ్డ శరీరమూ, మనసూ… ఇప్పుడు తేట తెల్లంగా ఉంది. అంతా పరిష్కరించుకోలేక పోయినా (అసలు పరిష్కారం అంటే?), నెమ్మదిగా వాటి వంక చూసుకోవడం, తెలుసుకోవడం చాలా ముఖ్య విషయంగా కన్పడుతోంది. ఏవో ఇతర విషయాలూ సంపదలూ కూడ వెయ్యడంకన్నా.. లోపలి జీవితంలోకి చూసుకోవడం మిగతా పనులు చెయ్యడం ఇష్టం అవకా, లేక బద్ధకమా చెయ్యాలంటే ? ఈ ఆత్మవిమర్శ వ్యవహారానికి శ్రమ పడకుండా (సందేహమే) ఊరికినే కూర్చుని ఆలోచించుకుంటూ రాసుకుంటూ ఉంటే చాలు అనా ? ఎన్నో సందేహాలూ, అనుమాన పీడిత హృదయాలూ..

2005-03-19

పద్ధతి

7/7/02
ఎవడో ప్రవాసుడు ఏదో సాహితీ అభిప్రాయమో ఇంకో మాటో వెల్లడించగానే - దాన్ని ఇండివిడ్యుయల్ గా చచ్చినా చూడరు. ఇమ్మీడియట్ గా తెలుగు సాహిత్యాన్ని హైజాక్ చెయ్యడానికో ఆక్రమించడానికో ఒక వర్గంచేస్తున్న కుట్రగా ఒక పాటర్న్ కనిపెట్టి విమర్శిస్తారు. ఇక్కడ వాళ్ళలో అంత ఐక్యత ఏదీ ఏడవకపోయినా...
దాదాపు ప్రతి రంగంలో ప్రతి దేశం లో ప్రతివాళ్ళు చేస్తున్నారేమో ఇది.. ఈ రకమైన విమర్శలన్నీ విని విని ఆ పాటర్న్ నిజంగానే ఏర్పడుతుంది. వార్తలు రాసేవాళ్ళు ప్రతిదాన్నీ ఏదో గ్రూప్ చేస్తున్న పనిగా, ఒక ప్లాన్ ప్రకారం ఇంకో వర్గం వాళ్ళని ఎదుర్కోవడానికి చేసిన పని గా రిపోర్ట్ చెయ్యడం - ఇట్లా వందల సంవత్సరాలుగా సమాజం లో ప్రతి పనినీ పత్రికలూ ప్రజలూ పాటర్న్ లో భాగంగా చూసి చూసీ అవి నిజంగా నే అలా రూపు దాల్చాయేమో. ఒక "పద్ధతి" ని ఊహించి సామ్యం కోసమో వైరుధ్యాల కోసమో అనుక్షణం వెతికే మానవ స్వభావ ఫలితం.

2005-03-17

ఎందుకంటే....

6/29/02
ఇంత గొప్ప సంగీత విద్వత్తు ఉన్న గాయకుడు తన మాతృభాష కాని తెలుగులో ఎందుకు ఇన్ని చవకబారు సినిమా పాటలు పాడాడు అని పడుతున్న బాధ.. ఒక ఓదార్పు. : సమాజం లో అతి కొద్ది మంది మాత్రమే అప్రీషియేట్ చెయ్యగలిగిన గొప్ప కళ ఉంది. కానీ మిగతా వేలూ లక్షల మంది కోసం మామూలు పాటలు పాడాల్సిందే. ఎందుకంటే వాళ్ళందరి చేత తయారుచేయబడ్డ కారులూ, రోడ్లూ, భవంతులూ, ఉపకరణాలూ, ఇతర సుఖాలూ కావాలి కాబట్టి.

అంటు

6/28/02
ఎవరైనా ఒక మెచ్యూర్డ్ understanding తో ఒక మాట మాట్లాడితే, ఒక ఆధ్యాత్మిక
స్పృహతో కూడిన రచన చేస్తే, లేదా జిజ్ఞాసాత్మక భావన వెలిబుచ్చితే చాలు -
ఇంక వాళ్ళు జీవితమంతా అదే రకమైన అండర్ స్టాండింగ్ తో ప్రవర్తించారనీ,
వాళ్ళు మాట్లాడే ప్రతి మాట లోనూ ఈ మెచ్యూర్డ్ స్పిరుట్యుయల్ క్వెస్ట్
ఉండాలనీ ఆశించడం… ఒక ఉన్నతరూపం ఊహించుకొని దానికి కొంచెం భిన్నంగా
జరిగితే భంగ పడి, బాధ పడడం.. ఒక్క మంచో చెడ్డో జరిగితే చాలు - ఇక
దాన్ని జీవితం మొత్తానికీ అంటగట్ట ప్రయత్నించడం, వాళ్ళని దాన్ని బట్టే జడ్జ్
చెయ్య బూనడం - ఇదంతా తప్పని తెల్సు. అయినా మనసు ఆ ఇమేజ్
వదలలేక మళ్ళీమళ్ళీ అదే చేస్తూంటుంది.
వైరుధ్యాల కోసమే వెయ్యికళ్ళతో ఎదురుచూడడం వల్లా ?

ఇంద్రియ స్పందన

6/27/02
ఆలోచన అనేది పదాల రూపం సంతరించుకున్న ఇంద్రియస్పందన అంటున్నారు.
ఇక్కడ ఇంద్రియం అంటే మైండ్ కావచ్చు. "భాష" సహాయం లేకుండా "ఆలోచించ"డానికి
ప్రయత్నిస్తే తెలియవచ్చు దీన్లో నిజం.
కొంతమంది కి రాసుకోవడం అనేది ఆలోచన యొక్క ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. వచ్చిన ప్రతి

ఆలోచననీ రాయాలనీ ఎవరో గుర్తించాలనీ యావ కొంతమందికి. దీన్లో అసహజమేమీ
ఉన్నట్టులేదు. ఎందుకంటే మనకి తెల్సిన జీవితం అనేది in its core, basic form
ఆలోచనల ప్రవాహం కాబట్టి.

మహా...

6/23/02
కర్మజీవితంలోనో ఇతర సాంఘిక సంబంధాలలో ఉన్న అయిష్టతా, బాధలన్నింటినీ రాతల్లో బహిర్గతం
చేస్తుంటే (కాయితాన్నీ, కలాన్నీ నమ్ముకుని) క్రమంగా ఆందోళన తగ్గడమూ, రక్తంలో కొత్త శక్తులు
నించుకోవడమూ తెలుస్తూంది వాడికి. మరి ఇది ఎస్కేప్ అవునా కాదా ?
"
అది" ఉన్నప్పుడు మహాకరుణ నెలకొంటుందంటున్నాడాయన.
"మరి మాలో కన్పిస్తున్న మహా భయం, ద్వేషం సంగతేమిటి మహాప్రభూ ? "
"
దాన్ని గురించి చాలానే చెప్పినా సరిగ్గా పట్టించుకోలేదేమో"

జన్యు వాతావరణాలు

6/23/02
మూడ్ మారి కొంత ప్రశాంతత, నార్మాలిటీ మనిషి లో కనబడగానే లోపల్నించి వినబడుతున్న అరుపులు - మర్యాదస్తుడివవుతున్నావా? క్రమబద్ధమైన జీవితంగడప బోతున్నావా? చట్రంలో ఇముడుతావా? - ఇత్యాది. ఎప్పుడూఏదో భిన్నంగా కొత్తదనం కోసం వెంపర్లాట. - ఏమిటో కారణం? సంక్షోభ బాల్యం పెట్టే అవస్థా? మనసు అంత గట్టిగా అలవాటు పడింది ఈ కొట్టుకోవడానికీ, ఆందోళనకీ, సంక్షోభానికీ. అందుకని అది ప్రశాంతత ని అంగీకరించలేదు. (అమ్మో సమస్యలు లేకపోతే ఏమైపోతాము? సమాజం ముందుకు నడిచేది ఎట్లా అంటున్నాడు లోపలి మీడియోకర్ వ్యక్తిత్వవికాసవాది) ఇది కొంత కాలానికో, కొన్ని తరాలకో జన్యువులలో కూడుతుందనడానికి వేరే ఋజువులెందుకు? చుట్టూఉన్న మనుషులనిచూస్తేనే తెలుస్తూంది స్పష్టంగా.
జన్యువులలో కూడుతోందనడం చుట్టూ ఉన్న ప్రదేశాల, పరిస్థితుల ప్రభావాన్ని తక్కువచెయ్యడం
కాదు. కానీ అసలు ఆ ఎన్విరాన్మెంట్ లో సింహభాగం అనేది ఏర్పడుతున్నది ఇలాంటి ఎన్నో జన్యువులున్న "మంది" కలవడంవల్లనే కదా..

ప్రమాణం

6/22/02
ఏదో శారీరక సుఖం కలగడంలేదనీ లేదా ఇంకేదో మిస్ అయిపోతున్నామనీ బాధ. పోనీ ఆ కోరిక లేని ఈ సమయం లో ఇంకొక సుఖం కావాలనే కోరిక పుడితే, కనీసం ఏదో గుంపులో చేరి ఆనందాన్ని పొందితే ఫర్వాలేదు. ఏమీ లేని ఈ శూన్యాన్ని భరించడం కష్టం. ఈ ఆలోచనలని చూసి ఫర్వాలేదోయ్ అనేవాళ్లుండాలన్న కోరిక.
ఒకరోజు అమితమైన ప్రశాంతత. ఇంకోరోజు బాధ, అంతులేని అసంతృప్తి. పొడుగాటి లేబుల్స్, ఏవో పేర్లు ఉండే ఉంటాయి - మానసిక వైద్య పరిభాషలో వీటికి- సందేహంలేదు. ఏ ప్రమాణాలని అనుసరించాలి ఈ అశాంతి లోని మంచి చెడ్డలని నిర్ణయించడానికి? బాధని తగుమాత్రం పరిమాణం లో ఉంచగలిగి ఏదో ఒక పని లో మునిగిపోతే చాలుట ఎలాగోలా
!
ఎలా దీని పరిమాణాన్ని కొలవడం?

ఆదర్శ పరిష్కారం

6/12/02
పక్కన ఉన్న మనిషి తో ఏదో సమస్య సలుపుతోంది. మరి దీనికి కరెక్ట్ రెస్పాన్స్ ఏంటి అని ఆలోచిస్తున్నాడు వాడు. అంటే ప్రతి సమస్య కీ ఒక ఆదర్శ రెస్పాన్సూ లేదా పరిష్కారంఉండాలా? దాన్ని కనుక్కోడానికి
మనమంతా ప్రయత్నించాలా? ఇలా ఎందుకు ఆలోచించడానికి అలవాటు పడింది మైండ్?
అన్ని సమయాలలో అందరికీ వర్తించే ఆదర్శ పరిష్కారం అబద్ధమా?
ప్రతీ సారీ సమస్యని కొత్తగా ఎదుర్కోవడం అంటే ?

2005-03-16

మహా ప్రస్థానపు 'వ్యత్యాసం'

3/23/01
"మేం ఇన్ని పుస్తకాలు చదివాం. ప్రాచ్య,పాశ్చాత్య రీతులన్నీ ఔపోసనపట్టాం , మీకన్నా తెలివిగా పారిశ్రామిక నాగరికతని అర్ధం చేసుకున్నాం. కోరికల్ని అనుభవించలేక, చంపుకోలేక అర్ధం కాక సతమతమవుతున్నాం .. సమాజం లో అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నాం.. ఇంత తెలివితేటలుండీ ఇంత అశాంతి గా ఉన్నాం. మీరంతా ఇంత సుఖంగా ఉన్నారెలాగ? లేవండి ప్రపంచం మంటలెత్తుతోంది - మాలాగా మీరూ బాధల్ననుభవించండి. లేదా మా మాట, మామాట.. దాన్ని అనుసరించండి.. ఎందుకంటే మేం మీకన్నా గొప్పవాళ్ళం. మీ పాతకాలపు పురాణాలూ, కవిత్వాలూ, సుఖంగా తీరి కూర్చున్న వేదాంతాలూ, ఆచారాలూ మాకుగిట్టవు - మేం కొత్త ని స్థాపించబోతున్నాం ఫాలో ఆర్ పెరిష్.."
** ప్రశ్నించి, ధిక్కరించడం అనే వలయం లోనే ఆగిపోయాడామహానుభావుడు?* యోగ్యతాపత్రాన్ని ప్రసాదించిన సత్యాన్వేషి మాత్రం జీవితపు ఉత్తరార్ధం లో చేసిన మహాప్రస్థానం లో ఈ ప్రశ్నించడం, ధిక్కరించడం వెనుక ఉన్న అసలు స్వరూపాన్ని చూడగలిగాడు. అందుకే "నా పుస్తకాలన్నీ లోకం మీద విమర్శ లాగా కనిపిస్తాయి బయటికి. కానీ అవన్నీ నాలో ఉన్న అవలక్ష ణాలు. వాటిని నేనుబయటికి తెచ్చే ప్రయత్నం లో బయల్పడినవే నా పుస్తకాలన్నీ" అని చెప్పగలిగాడు.ఆ ప్రశ్నించడం, ధిక్కరించడం ఒక డైమన్షన్.. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ ఇంకొక డైమన్షన్. ఇది ముందుదాన్ని అబద్ధం చెయ్యదు అన్నాడంటే కనీసం మేధతో నైనా మొత్తం ప్రాసెస్ ని అర్ధం చేసుకోగలిగాడన్న మాట. ఈ ద్వేషం, ధిక్కరింపు అంతా సమాజం లో (ఎప్పుడూ ఏదో ఒక రూపం లో) ఉండే ఒక పర్టిక్యులర్ పాటర్న్ కి వ్యక్తి లో వున్న రియాక్షన్ అనీ, అది ఎక్కువ దూరం తీసికెళ్ళలేదనీ గమనించగలిగాడు. of course that rebellion is very important and significant, but the very next act for many is to create another pattern and fall into it. ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ మీద కసి.తిరుగుబాటు. నాకూ అధిపత్యం ఇస్తే చాలు నేనూ మర్యాదస్తు ణ్ణవుతాను అనే రకం అది వేరే. అది కాదు ఇది. అందుకే చనిపోయే దాకా ఈ బాధ పడ్డాడు. చాలా మందికి ఈ ద్వేషం, కసి చల్లారకూడదు అనే లోపల. బహుశా ఇంకేదీ
ఇవ్వలేని ఆనందాన్ని ఇది ఇస్తుంది కాబట్టేమో. మనసుకి అంత నిషా ఈద్వేషం తో కూడిన కసి
మండించే మంటవల్ల . దానికోసమే మళ్ళీమళ్ళీ ద్వేషించుకుంటూ ఈ వలయం లో తిరుగుతుంది. వ్యక్తి తనలో కేంద్రం గా ఉన్న నేను ను మార్చుకుంటే
తప్ప (అసలు అలాంటిదేమన్నా ఉంటే) లోకాన్ని తిట్టి బాగు చేస్తానని బయల్దేరడం వల్ల ప్రయోజనం లేదని ఎలాగో తెల్సింది అతడికి. ఈ రకమైన ధిక్కారం, నియమాలని అతిక్రమించడం ద్వారా వచ్చే తెలియని ఆనందం - ఇవన్నీ మళ్ళీ తను సృష్టించే కొత్త ఆదర్శాలకీ కూడా వర్తిస్తాయని వాటికీ ఆ గతి పట్టక తప్పదని చూడగలిగాడు.


****వాదానికి వాదముంది బాణానికి బాణం .. అంటున్నాడు కవి ****


ప్రతిరోజూ ప్రతిక్షణమూ మైండ్ లో ఇన్ని గందరగోళాలూ, సమాలోచనలూ, సమావేశాలూ, సర్దుబాట్లూ, కల్లోలాలూ జరుగుతుంటే ఇవన్నీ కళ లో ప్రతిఫలింపజేయాలని ప్రయత్నం కొంత మందికి. దాన్ని కోసం నియమాల్నీ, సంప్రదాయాన్నీ నిర్లక్ష్యం చేస్తున్నారని ఇంకొంతమంది బాధ. నిజానికి this fire is within each one of us.. దాన్నిపట్టుకుంటే నియమాల్ని అతిక్రమించామా, అనుసరించామా అన్నది అప్రధాన విషయమై పోతుంది.
******************************************************************

* *ప్రశ్నించి, ధిక్కరించిన మహానుభావుడు కొన్నిసార్లైనా అక్కడితో ఆగలేదనడానికి కొన్ని తార్కాణాలు :
".....ఆ తర్వాత కొందరు నన్నడిగినప్పుడు ఐ ఫెల్ట్ ఇన్ మై మైండ్ ఏన్ అబ్సొలూట్ జీరో అంటే
వాళ్ళు అపార్ధం కూడా చేసుకున్నారు. దీన్ని విపులంగా వివరించాలంటే ఎన్నో ఫండమెంటల్ క్వెశ్చన్స్
లోకి ఎంతో లోతుగా వెళ్ళాలి." ----- చూ. శ్రీశ్రీ ఉపన్యాసాల సంపుటి - ఆంధ్రపత్రికకు లేఖ.
"... అయితే అప్పుడు కూడా అందరాని దేనికోసమో అశాంతి పొందేవాళ్ళూ ఉంటారని
మాత్రం చెప్పవచ్చును." --- చూ. శ్రీశ్రీ వ్యాసాల సంపుటి - ఆంధ్రదేశంలో సాహిత్యసంఘాలు.



అబద్ధం

6/23/02
ఎండా కాలపు ఒంటరి మిట్ట మధ్యాన్నం. చెట్టు కింది నిశ్శబ్దం. చేతిలో పుస్తకం - సిద్ధార్ధ - Herman Hesse.
మన మనసుల్లో సహజంగా ఉండే కాల భావన నిజంకాదు అని పురాతన కాలం నించే చెపుతున్నారట ఎంతో మంది మహానుభావులు. రేపు అబద్ధం అనీ సైకలాజికల్ టైమ్ అనేది భ్రమేనని వేదకాలపు ఋషుల నించీ శాస్తృ పరిశోధకుల దాకా ఎంతమంది అరిచినా ఊదరగొట్టినా ఏమిటి ప్రయోజనం? దాని అర్ధం, విలువ ఎలా తెలుస్తుంది? నా అంతట నాకు అన్పించిన "కాలం" లో తప్ప..
నాళై వరుంయన్రునంబలామా అంటున్నాడు తమిళ సోదరుడు.

హబుల్ బబుల్

5/2/02
పొద్దున్నే ప్రశాంతత. నిన్న రాత్రి కోరిక తీరాల్సిన విధంగా తీరినందుకా…
విశ్వం విస్తరిస్తోందని ముందే తెలుసుట కానీ అది మునపటికన్నా వేగంగా విస్తరిస్తోందని లెక్కలు

చెబుతున్నాయట.* నాలుగైదేళ్ళ క్రితం ఎవరైనా అలా ఊహిస్తే నవ్వు పుట్టించిన విషయం ఒక్కసారిగా నిజమైంది.
అనేక స్థలాల మధ్య ఇంకా ఇంకా వేగం గా స్థలం సృష్టించ బడుతోందట..
ఒక పిచ్చివాడి ఊహ : చేతనల లో వేగం పెరగడంవల్లనే ఇలా జరుగుతోందేమో. మన

ఆలోచనల వేగానికీ విశ్వం లోని స్థలానికీ సంబంధంఉందేమో. is this rate continuously
increasing or did it decrease at any point of time (బహుశా ఎన్నో చేతనల
కదలికలు ఆగి విశ్వం లో ఒకటిగా లయించినపుడు) and then started to increase
again (ఎన్నో ఆలోచనలకి ఋణావేశం ఆవహించినపుడు)

* చూ. God’s Equation – Amir Aczel

2005-03-15

క్షణ స్పృహ

4/28/02
నేర్చుకునే వాడికి కి ఎంత క్షణ స్పృహ ఉండాలో చెప్తున్నాడు. ఇప్పుడున్న స్థితి నించి వేరే ఏదో స్థితి కి పోవాలన్న కోరిక ఉండాలా నేర్చుకోవడానికి అంటే ఒక రకంగా అవును ఒక రకంగా కాదు. ప్రసారం అనే దానిమీద నమ్మకం, నేర్చుకునే విషయం మీద కంపాషన్ లేకుండా (కాన్షస్ గానో అన్ కాన్షస్ గానో) లోతుగా ఏదీ నేర్వలేం. ఉన్నస్థితి లోనే కొత్త (పాటైనా, శాస్తృమైనా) విషయాన్ని చూస్తూ ఉండడానికీ - క్షోభిస్తూ దానికోసం అమితమైన బాధ పడుతూ నేర్చాలనో ఆక్రమించుకోవాలనో ప్రయత్నించడానికీ తేడా తెలుస్తూనే ఉంటుంది. రెండో దానిలో ఆక్రమించుకోవడంవల్లో సొంతంచేసుకోవడంవల్లొ వచ్చే సెన్సువల్ ప్లెజర్ ముఖ్యం. ఆ ప్లెషర్ కోసం క్షోభ లేనప్పుడు మనిషి కి చూస్తూ ఉన్న స్థితి లోనే ఏదో తెలీని సంతృప్తి, శాంతి తో అప్రయత్నం గా అవగతమయ్యేదేదో ఉంది. ప్లెషర్ కోసం వెంపర్లాడి నేర్చుకున్నా అశాంతి మొదలవాల్సిందే మళ్ళీ ఇంకో దాని కోసం.
*****

"తీరాలేవో చేరుతు ఉన్నా దూరం మారదులే" అంటున్నాడు ఎదురీదడానికి ప్రయత్నిస్తున్న కవి.

సాలెగూళ్ళు

3/3/02
గ్రామపు వీధిలోని ఎస్టీడీ బూత్ లో అయిదురూపాయిల కమీషన్ కోసం చెక్కబల్ల వేసుకుని
కూర్చున్న మనిషి కీ, సముద్రాల అవతల ఇక్కడ కనబడుతున్న కెమికల్
సైంటిస్ట్ కీ ఉన్న సంబంధం గురించి ఆలోచన. వీళ్ళు కెవ్లారో ఇంకేదో జేస్తేనే
తట్టుకుంటున్నాయట వత్తిడి కి రోదసీ లో శాటిలైట్లు. మరి బూత్ లో తిప్పగానే ఎక్కడో

మోగడం శాటిలైట్ల వల్లనే గదా.. లోకమంతా వ్యాపించిన ఆర్ధిక, సాంకేతిక పని సంబంధాలు
ఎంత గజిబిజి గా క్లిష్టంగా అల్లుకొని ఉన్నాయో ఊహించడానికే గుబులు, భయం
పుడుతుంది. మానవ సముదాయాలు తమ నాగరికతను పెంచుకొనే ప్రయత్నం లో
ఏర్పడ్డ సంబంధాలు అర్ధం చేసుకునే విషయం లో నే ఇన్ని గందరగోళాలూ, గొడవలూ
జరుగుతూంటే విశ్వాంతరాళం లో మనకి కనపడేవీ, కనపడనివీ శక్తులు - ఎన్నిఉన్నాయో,
వీటిలో ఎన్ని అంతస్సంబంధాలు ఉన్నాయో, అవి మనల్ని ఏ రకంగా ప్రభావితం
చేస్తాయో ఊహించడానికే భయం వేస్తూంది. నీ గది కిటికీ రెక్క మూసినప్పుడు
విడుదల అయ్యే శక్తి - గణన చెయ్యడానికి సాధ్యం కానంత తక్కువ అయితే
కావచ్చు- విశ్వం లో ని ప్రతి అణువు మీదా ఉంటుందంటున్నాడు భౌతిక శాస్త్రవేత్త.

ప్రయోగశాల

2/24/02
రేపులేని జీవితం ఎంత ధన్యం - రేపు మళ్ళీ గొడవలూ, ఆందోళనలూ
అనురాగాలూ, అసూయలూ కలగొచ్చు అన్న భావన లోని అసత్యం తోచిన
సమయం. రాబోయే కాలంలో ని సంఘటనలగుండా, కళ్ళు
విప్పార్చుకుని నిబిడాశ్చర్యంతో ప్రయాణించాలిగదా అన్న భావన. శరీరానికి కలిగే

సుఖాల్ని పరిశీలిద్దామన్న ఉత్సుకత.

కుంతీ ప్రశ్న

2/19/02
సూర్యుడు ప్రత్యక్షమైనప్పుడు కుంతీ దేవి ప్రశ్న. -
"అయితే హైడ్రోజెన్ ని హీలియంగా మారుస్తున్నావన్నమాట! ఎంత కాలంనించీ
సాగుతోందీ వ్యవహారం? అయినా నీకు నువ్వు మిణకడమేనా మానవులకేమైనా నేర్పేదుందా
ఇంధనం తయారీలో
? "

ఒక ఊహ

కొన్ని భావాలూ, భయలూ తద్వారా చేయబడే పనులు జీన్స్ లో నిక్షిప్తమై ఉంటాయి.
మరి కొన్ని భావాలూ, ఆలోచనలూ పనులూ ఫ్రీ విల్ నించి పుడతాయి.
(ఫ్రీ విల్ ముందుగా జీన్స్ లో నిక్షిప్తమై లేదా ? )
ఈ సాయంత్రం ఈ క్షణంఎందుకు మౌనంగా కూచోకూడదూ ? ఎందుకు భయంవంక

తేరి పార చూడకూడదు ? ఎందుకు నా చేతస్సు లో లోతుల్లోకి వెళ్ళకూడదు? శక్తి ఉందా ?
ఎందుకు వీడు భయంలో ఇంత ఆనందంఅనుభవిస్తాడు ? భయంవెనుక వీడూ,
వీడి వెనక భయమూ పదే పదే పడే కారణం ? కారణం యొక్క ప్రాముఖ్యం
?

స్వాతంత్ర్యం

2/16/02
పాశ్చాత్య సమాజం లో ఉన్న లైంగిక స్వాతంత్ర్యం వల్ల (మంచిదా చెడ్డదా అన్న ప్రశ్న కాదు),
ఒకే మనిషి తో 'అంటుకుని' ఉండాలన్న సాంస్కృతిక బరువులు మానసికంగా తక్కువవడం
వల్ల కొంచెం చూపు ఉన్నవాళ్ళు చూడడం, వినడం ప్రారంభించవచ్చునేమో - కోరికలని లోలోపల
దాచుకుని కుళ్ళిపోకుండా, ఒక్క సారో రెండు సార్లో పది సార్లో నిజమైన గమనిక తో

పూర్తి స్వేచ్ఛతో అనుభవిస్తే.

ఒక వలయం

02/16/02
సంశయిస్తున్నాడు. ఆలోచనకీ, భావానికి శాశ్వతత్వం - తాత్కాలికంగా నైనా - కల్పించే ప్రయత్నాన్ని చూసి.
పట్టుదలా, అర్పించుకోవడమూ - ఈ మాటలు మంచివేనా, చెడ్డవా -మళ్ళీ ద్వందాలు- సాధించాననుకున్న
ప్రతి క్షణమూ కోల్పోయిందేనా ? నేను ను పెంచాలనుకున్న ప్రయత్నాలన్నీ వేదన కే మార్గాలా ?
కోరిక ని మళ్ళించాలనుకున్నా, అణగద్రొక్కాలనుకున్నా అది వ్వర్ధమేనా ? జరుగుతున్నదంతా
పూర్వకార్య ఫలితమూ మళ్ళీ కార్యమూ కూడానా ?

నేను ఇటువంటి వాడు. చాలా గొప్ప. తక్కువ. ప్రత్యేకం. ఇదీ విశేషం. ఎవరో చేస్తున్న వ్యాఖ్యానాలు.

తెర తొలగి విడి పోవడం అనే ఆలొచనని పట్టుకొని వేళ్ళాడ్డం. పోల్చుకోవడం. మాటున దాగి ఉన్న
అసూయ. ఒకళ్ళ మీద కోపం. ఇంకోళ్ళ మీద మోహం. అసలు దారి ఇది కాదనీ చూడటమే
పరిష్కారం కాని పరిష్కారం అని తెలుసు. కానీ చూడగలిగేది ఉండాలి గా మనలో?
వేసుకున్న పై పై పూత సహాయాలు అన్నీ క్రమక్రమం గా కరిగిపోతున్నాయి కళ్ళముందే.,
'అసలు' ను మార్చగలిగే శక్తి వంక చూడడానికి భయం వేస్తోంది.

2005-03-11

ఇంబెసైలులు

12/16/01
అబ్బురంతో కూడిన చూపులు : దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న
తక్కువభావం, అతి వినయం, ప్రభుభక్తి వల్ల బయటి సమాజం లో పని
చేసే వాళ్ళంటే గొప్ప ఊహించుకుని ఆశ్చర్యంతో, అబ్బురంతో కొంచెం
వెకిలి మూర్ఖత్వం తో కూడిన చూపులు చూడడం. ఇంకోళ్ళ నించి
అట్లాంటి చూపుల కోసమే ఎదురుచూడడం, దానికోసమే బతకడం

అలవాటయ్యింది బాల్యంలో. తను అలా ఎందరి వంక చూసాడో.
(హోటల్ లో ఉల్లి మినపా ఓట్టీ అని అరిచే మనిషి నించీ ఆఫీసులో
అధికారి దాకా) వెరసి సమాజం నిండా అలాంటి ఇంబెసైల్స్
తయారవడానికి దోహదం అన్నమాట. ఈ హీరోవర్షిప్పు వెనకాల
ఉన్న కాపట్యం, స్వార్ధం అర్ధమవుతూనే వుంది. చాలా వరకూ
పెంచిపోషించినవి సినిమాలూ, పత్రికలూ ఇతర భజన పుస్తకాలూ -
కానీ వాటిని సృష్టించింది నీలాంటి, నాలాంటి మనుషులేగా..
దీనికి రియాక్షన్ గా - పొగిడే వాళ్ళుంటే తిట్టేవాళ్ళుండరా -
హేళన విమర్శ తో కూడిన ఇంకొక సెగ్మెంట్ సహజం గానే
మొదలయింది - అనేక మంది చలాలతో.
ఇలాగ పాడే తిట్టే వాళ్ళతో ద్వందాలు అతిగా పెరిగిపోయి
అసలు నిజంగా ఉన్నది ఉన్నట్టు గా చూసే వాళ్ళు తక్కువయి
పోతున్నారు లోకంలో. ఎక్కడ ఏ సినిమాలో పత్రిక లో చూసినా
అతిగా గ్లోరిఫై చెయ్యడమో లేక అధఃపాతాళానికి అణగద్రొక్కడమో
కనిపిస్తోంది. ఏదో ఒక ప్రక్కకి ఇమోషన్ ని విపరీతంగా ఉద్రేకించి
చూపించడమే కళ గా చెలామణీ అయిపోతోంది.

అభావం

6 Dec 01.
మనసులో భావం, తెలియని అభావంగా, నిగూఢంగా ఉంది.
ఏదో కలిగినప్పుడు అది బయటికి వస్తుంది.
ఆ కలిగేదేదో తెలుసుకుని దాన్ని ఎప్పుడూ
కలిగించుకోవాలని చేసే ప్రయత్నం
కాలానికి గాలం వెయ్యాలనే సంకల్పం
ఎంత మూర్ద్ఖత్వం

సమూహాలు

6th Dec 01.
రంగురంగుల జెండాలు వరసగా నుంచున్నాయి.
యుద్ధకవాతు లో సైనికుల తుపాకుల్లాగా.
ఎవరు నువ్వు ? నీదే దేశం ? ఏ రంగు జెండా ?
రష్యా ? అమెరికా ? భరతమా ? పాకిస్తానా ?
ఏ ముక్క మీది వాడివి ? అని గర్జిస్తున్నాయి.

భూమి ని ముక్కలు చెక్కలు గా విడ కొట్టిన
రంగు జెండాల్ని చూసి పెదవి విరిచాను. తెలీదన్నట్లుగా.
అదృశ్యం జెండాలన్నీ.
ముల్లాలూ, పురోహితులూ, పాస్టర్లూ, రాబీ లూ ప్రత్యక్షం.
అల్లా? కృష్ణుడా? క్రీస్తా? మోజస్సా? ఎవరు నీ దేవుడు ?
కాలాన్నీ సృష్టినీ, మతపు కళ్ళద్దాల లో
చూడలేక కన్నీళ్ళు కార్చాను. అసహాయత ని ప్రకటిస్తూ.

హోదా

6th Dec 01.
ఎంతో బాగా పనిచేసే ఇంజనీర్ కి ఏదో ఒక ప్రమోషన్ ఇవ్వాలని మేనేజర్ ని చేసారుట. ఇష్టంలేక ఆజీవితం ఇక సర్వ నాశనం. నేను ఆ పని చెయ్యలేను అనగల నిజాయితీ, తప్పకపోతే వేరే పని వెతుక్కోగల అవకాశమూ సమాజంలో ఉంటే ఫరవాలేదు.
కానీ ఏదో కారణాల వల్ల హోదా కోసమో, డబ్బు కోసమో ఇష్టం లేని పని చేసే దుస్థితి ఉన్నవాళ్ళే ఎక్కువ. మరి హోదా, డబ్బు ఎంత నిజం ? మనసు లోపల ఇష్టం, తృప్తీ ఎంత నిజం ? అది ఎవడికి వాడు తేల్చుకోవలసిందే. నిజాయితీ, తృప్తీ కన్నా డబ్బూ హోదా లే ఎక్కువ ఆనందంఇస్తే తప్పు లేదు కానీ తేల్చుకోకుండా ప్రశ్నలు వేసుకుంటూ ఘర్షణ పడడమే బాధ. ఏ ఛాయిస్ లో నైనా బాధ, ఘర్షణ తప్పదు. "నేను" పరిష్కరించుకునే దాకా. అది పరిష్కారమైతే ఇక హోదా కోసమో డబ్బు కోసమో వెంపర్లాడడం ఉండదు. అలాగే ఇష్టం, తృప్తీ కోసంకూడా.

సంభావ్యత

5 Dec 01.
అణువులు పాప్ ఇన్అండ్ పాప్ ఔట్ ఆఫ్ ఎక్జిస్టెన్స్ ట - ఏదో భౌతిక శాస్తృం ప్రకారం. ఆలోచనలు పాప్ అప్, డౌన్, ఇన్ అండ్ ఔట్ ఆఫ్ బ్రైన్ - జీవితంప్రకారం.
ప్రతిదాన్నీ పట్టుకోవాలని వెంపర్లాట.
అర్ధం చేసుకుని నమిలి మింగాలన్నమాట.
కోరికనీ కాలాన్ని సరిగా చూడగల శక్తి ఉంటే చాలు.
కోరిక తీరకపోయినా, కాలం బాలేక పోయినా ఫర్వాలేదు.
పొడి చెయ్యకపోయినా జీవితం వృధా కాదు.
దానివంక చూస్కోగల శక్తి ఉంటే చాలు.
చూస్కోవడం అంటే "నా" ఆలోచన లేకుండా చూస్కోవడమన్న మాట.
********
మళ్ళీ చదివించిన మంచి పుస్తకం - సంభావ్యత (ప్రాబబిలిటీ) యొక్క
దివ్యత్వాన్ని గురించి ..

God's Debris - by Scott Adams
ఎప్పుడో అరవైల్లో కొడవటిగంటి తన నవలలో పలికించిన సంభాషణల ప్రతిధ్వనుల్ని వినవచ్చు శ్రద్ధగా చదివితే..(మన శరీరంలో రక్త కణాలకి తాము ఒక whole లో భాగం అన్న స్పృహ లేనట్టే మనం నిజంగా ఇంకొక మొత్తం లో భాగం అయ్యుండీ ఆ విషయం తెలుసుకోలేక పోతున్నామేమో..)
ఇంకొక పుస్తకం..
why god does not go away - by Newberg & D'auqili

కోమల స్పృహ

2nd Dec 01
మరోసారి ప్రాతఃకాల దర్శనం. ఇగ్నొరెన్స్ అండ్ ఇన్నొసెన్స్ -
బోత్ బీఇంగ్ రీజన్స్ ఫర్ హాపీనెస్ - వాటిలో ఉండే తేడా ఏమిటో చక్కగా
విశ్లేషించిన నీలంరాజు గారి వ్యాస (ఆంధ్రభూమి-ఆలోకన) పఠనం.
స్వామి రామతీర్ధ గురించి చెప్తూ వాడిన కోమలస్పృహ అన్నమాట
ఎంత బాగుంది. ప్రతి విషయాన్నీ ఉన్నదున్నట్టుగా చూస్తూ, దాన్నిగురించి
ఎక్కువ శబ్దం చెయ్యకుండా చెయాల్సినదాన్ని చేసే వాళ్ళని
ఆవరించుకొని ఉండేదిది..

2005-03-10

తీరాని కి రాని నావ

11/28/01
ఇదీ ఈ రకంగా నన్ను గుర్తిస్తే తను గొప్పవాడయినట్లు అని చిన్నప్పటినించీ
కలలు గన్నాడు. లేదా పుస్తకాల్లో చదివాడు. సినిమాల్లో చూసాడు.
దానికోసం ప్రయత్నిస్తూ, ఘర్షణ పడుతూ, రహస్యంగా మనసులో
ఊహిస్తూ, ఇంకా జరగలేదని క్షోభ పడుతూ అమితమయిన ఎదురు
చూపులు చూసాడు. సరిగ్గా అలాంటిదే జరగడానికి పరిసరాల్లో
పనిజీవితంలో వీల్లేకపోయినా దానిని పోలిన సంఘటన జరిగి మనసంతా
తేలిక తనం. రోజంతా తలలో ఉల్లాసం, ఉత్తేజం. ఇదంతా పెద్ద
విశేషం కాదు. ఇకముందు ఏం జరుగుతుంది ? మళ్ళీ ఏ వలలో చిక్కాలి ?
లేదా ఏ వల వెయ్యాలి ? ఏ కోరికలు పెంపొందించుకోవాలి ? మళ్ళీ ఏ
ఆశయాల ముసుగులో రహస్య కోరికలు పెంచాలి ? ఏ పన్నాగాలు
పన్నాలి ? ఏ మబ్బుల్ని ఆశించి ప్రస్తుత క్షణ జలాన్ని పారబోయాలి ?
ఇది పూర్తి అవుతుందా ఎప్పటికైనా ? ఒకటో లేదా వెయ్యో సంఘటన తో
మొత్తం కోరిక తీరుతుందా ?
పూర్తిగా కోరికల్ని తీర్చుకోవడమంటూ ఉంటుందా ?
ప్రశ్నల వల్ల ఉపయోగం ఉందా ?
తెలీదు కానీ ఇంకొకడి సమాధానం వల్ల ఉపయోగం లేదని తెల్సు.

ఆనందోద్రేకం

11/28/01
మనసు తన ప్రాముఖ్యత కి వచ్చిన గుర్తింపు ని చూసి గంతులేస్తూ
గర్వపడుతోంది. ఎలా ఈ సంతోషాన్ని భరించాలో ఆలోచిస్తోంది.
ఊహ గా మనసులో ఎగురుతున్న దాన్ని
శరీరం లోకి తర్జుమా చెయ్యాలని ఆరాట పడుతోంది.
కొనసాగింపు :
స్వార్ధం, కపటం : ఇదేఇదే మళ్ళీమళ్ళీ కావాలని మనసు చేసే గోల.
దానికోసం ఏం చెయ్యాలి? వచ్చిన ఈ గొప్పదనాన్ని నిలుపుకోవాలంటే ఎలా?
ఏం చేస్తే ఇలాంటి సంఘటన జరిగింది ?
వికృతం : హా హా అంటూ సుఖాల వెంటపడి విచ్చలవిడి గా ప్రవర్తిస్తే ?
భయం: అసలు ఈ ఆనందమంతా నిజమేనా లేక ఎండమావా? ఎన్నాళ్ళుంటుందో?
గర్వం : అబ్బా కర్మజీవితంలో ఎంతో సాధించావే - కాళ్ళు బారజాపుకుని
తాపీగా ధర్మాన్ని ప్రవచిస్తే ?
శూన్యం : అసలు ఏమిటిదంతా ?

ద్వైతం

11/11/01
ఐడియల్స్ ఎందుకు ఏర్పడుతున్నాయి - ఎందుకు ఏర్పడకూడదు
ఎందుకు పాటర్న్స్ లో పడుతున్నాము - ఎందుకు పడకూడదు
ఎందుకు పనికొస్తావురా నువ్వు - ఎందుకు పనికి రావాలి

శీర్షిక

11/28/01

"నేను" అన్న రెండక్షరాలనీ విశ్వమంతా నిండేటట్లు
శీర్షికగా రాయాలన్న కోరిక.
దాని క్రింద ఏమిటి చెప్పడం ?

ప్రస్తుతం

11/28/01

మెదడులో పేరుకున్న ముందు జీవితం
ఒక్క క్షణం లో మొత్తం అదృశ్యం
మనసు నిండా మంచి గంధం.
రేపు లేదు నిన్న లేదు
అంతటా అలముకున్న ప్రస్తుతం.

కోరిక

11/27/01

వాల్జెడ, నగ్న జఘనాలతో నాముందుకు వచ్చి నిల్చున్న కోరిక
నన్ను తీవ్రంగా జాలిగా చూసింది.
కోరిక తీర్చుకోనా, అణగ ద్రొక్కనా ?
ఏమీ అర్ధం కాక చూస్తూండి పోయాను
ఎవరితోనూ పంచుకోవాలని లేదు. తెంచుకోవాలనీ లేదు.
అంతటా వ్యాపించిన ఉద్వేగం.
అబ్బా కోరిక ఎంత మృదువు !
ఎంత కఠినం !
గాఢం ! ఉత్తేజం ! విఘాతం !

పతనం

11/27/01
స్పందించే హృదయాలు తగ్గిపోతున్నాయి
కళలని నిర్లక్ష్యం చేసిన ఫలితం.
మనసులు నగల్లో, ధనంలో,ఆస్తుల్లో, సింబల్స్ లో
పడి నలిగి చనిపోతున్నాయి.
సున్నితత్వం అనే మాటే కర్కశం గా వినబడుతుందేమో కొంతకాలానికి

క్రోధ సంచిక

11/25/01
వజ్రాలు కొనుక్కోవడం. అవి ప్రతివాళ్ళకీ చూపించడం.
జీవితమంతా విస్తరించిన వికృతి.
కుటుంబ సంబంధాల్లో నగలపాత్ర గురించిన రీసెర్చి !
శ్రవణ యంత్రాల్లో చెవులు చిల్లులు పడేలాగా అర్ధరాత్రులన్నీ అరుస్తున్నాయి.
భయంకర కరాళ నృత్యం చేస్తూన్న వికృతం
సముద్రాల్ని దాటి వెళ్తున్న కోరికలు
కళ్ళలో పగులుతున్న స్ఫటికాలు
మరుగుతున్న రక్తం
ఇంద్రియాల్ని కొరుకుతున్న క్రోధ రాక్షసి
ఇదేమిటి చేతివ్రేళ్ళు కొద్దికొద్ది గా మాయమవుతున్నాయి !
******************************************
అవతలి మనిషి మీద ఊహించుకున్న పాత్ర ఛిద్రమవుతూంది
ఖండన అన్న మాట అర్ధం తెలుసుకుందామన్న తీవ్రమైన వాంఛ
దొరకని పదాలు
పట్టని మాటలు
ఏదో అమితమైన భావం
దీని పేరు కోపం ట
ఇది ప్రేమ కి వ్యతిరేకం ట

అనుమాన ప్రాణి

11/19/01
మన కంఫర్ట్ జోన్ పదిలంగా ఉన్నంతవరకేనా ఈ మంచితనమూ, సో కాల్డ్ బెనావెలెన్సూ ?
ఈ జోన్ చెదిరి పోగానే ఈ ఆర్ద్రత, సున్నితత్వం ఎగిరిపోయి అసలు జంతువు బయట పడుతుందా ?
ఏమో తెలీదు. కానీ దీన్ని వివేచించడం చాలా ఆసక్తికరం. అలాంటి జోన్ ఉంటే
దానిని తెల్సుకోవడమూ, దాని ఎల్లలు గమనించుకోవడమూ, దానివల్ల మనసుకి (కొంత శరీరానికీ)
కలిగే సుఖాన్ని పరిశీలించడమూ - ఇదంతా ఎంతో ఎంతో ఆనందం. ఉద్యోగం వల్లో, మరో
దానివల్లో కలిగిన ఆర్ధికభద్రత వల్ల ఈ కంఫర్ట్ జోన్ అంత త్వరగా పోదన్న ఫీలింగ్ ఉన్నప్పుడు
ఇలా ఆలోచించుకోవడం, రాసుకోవడం ఇంకా ఇంకా ఆనందం.

2005-03-09

మబ్బుల్లో "దండకా"రణ్యం

11/17/01
ఆకాశం సముద్రం లో తేలుతోంది కింద. ముప్పై వేల అడుగుల ఎత్తున
ఎగురుతూ చూస్తుంటే. అసంఖ్యాకంగా మబ్బులు అట్లాంటిక్ లో
పాల తరకల్లా దోగాడుతూ ఉన్నాయి.
****
ఈ దండకం విన్నది పాండురంగ మహాత్మ్యం సినిమాలో. కానీ తరవాత
ఎక్కడో పింగళిసూరన కళాపూర్ణోదయాన్నివచన రూపంలో చదువుతూంటే
ఇవే మాటలు తారసపడినట్లు గా గుర్తుంది. ఘంటసాల ఆరభి (లేదా సామ?)
రాగం లో ఆలాపించారుట, లేదా అదరగొట్టారో !
***విన్న పాట గుర్తున్నవిధం గా వ్రాస్తే...**
శ్రీ కామినీకామితాకార సాకార కారుణ్య ధారా నవాంకూర సంసార సంతాప
నిర్వాపణాపాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా భవా భావా
హే వాసుదేవాసదానంద గోవింద సేవించు మావిందవై డెంద మానంద
మొందింప ఎందున్ విచారంబు లేమిన్వచోగోచరాగోచరత్వంబు లూహింప
లేమైతిమో దేవా నీ పాద సేవాదరంబున్ మదిన్ గోరుచున్ వేద వాదుల్
శమాదుల్ కడుంజాల నార్జించి భోగేచ్ఛవర్జించి, నానా తపశ్చర్య తాత్పర్య
పర్యాకులత్వంబునన్ గైకొనన్ మాకు నే(యే)త్రముల్ లేకయే నీ కృపాలోక
సంసిద్ధి సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబుగాదే
జగన్నాధా హే జగన్నాధాఈ రీతి చెన్నార మున్నే ఋషుల్ నిన్ను
కన్నార కన్నారు, నాకన్నులెన్నంగ ఏ పుణ్యముల్ జేసెనో నిన్ను
దర్శింపగా భవ్య యోగీంద్ర సాంద్రాదరా కాంక్షితైకాంత సంసేవనా
భావనాతీత కల్యాణ నానాగుణ శ్రీ సముద్భాసితాంగా దయా పూరా
రంగత్తరంగాంతరంగా నమో రుక్మిణీ సంగా హే పాండురంగా
హేపాండు రంగా నమస్తే నమస్తే నమః

వేయిన్నొక్క సంభాషణా శకలం

11/17/01
" ఏదో ఏదో చెప్పాలన్న కోరిక ఉండేది , ఉత్సాహం ; పూర్తిగా పోయినయ్యే ?"
నా ముఖం లోకి నేను చూసుకుంటూ లోయల్లో పడుతుంటే చేరుతున్న శిఖరాలు చాలవా ? ఇంక వేరే
ఉత్సాహం ఎందుకు ?
" అయితే ఈ లోయలూ శిఖరాలే నిన్ను చేర్చాల్సిన చోటు కు చేరుస్తాయనా ?"
చేరాలన్న చోటు అనేది ఒకటుందో లేదో తెలీదు అసలు.. ప్రస్తుతానికి మాత్రం ఈ రాతల్లో 'క్షణం'
ఏదో దొరుకుతున్నట్టుంది.
*****
ఏదో జరుగుతుందనీ జరగబోతోందనీ ముందుకు మునుముందుకు మానసిక రేపుల్లో తేలియాడే ఆలోచన ఆగిపోతే ? 'ఇప్పుడు ఉన్నది' అకస్మాత్తుగా ప్రకాశించడం మొదలవుతుంది. కాళ్ళూ, చేతులూ, ముఖమూ, కళ్ళూ ఎవరివో కొత్తగా అన్పిస్తాయి.

బౌద్ధులు - బయాలజిష్టులు

11/15/01
కొంత మంది చిన్నపిల్లలు అడిగే ప్రశ్నలు వింటే ఆశ్చర్యం - ఘంటసాల గురించీ, సావిత్రి గురించీ.. కర్మ సంచితాలని బౌద్ధులూ, ప్రోగ్రామ్డ్ ఇన్ టు డిఅన్ఏ అని బయాలజిష్టులూ అంటారు.
it is like birds in subsequent generations know how to go from one country to another simply 'caz their ancestors knew it..

తొందర

11/15/01
తరగతి. బోధన. ఏదో పనికి సంబంధించిన విషయాల గురించి. మనసు తొందర తొందరగా
ఉన్నప్పుడు ఎంత వేగంగా తప్పు రెస్పాన్స్ ఇస్తుందో ! ఏవేవో తార్కిక తీర్మానాలు చేస్తూంటుంది. జంపింగ్ టు కంక్లూషన్స్ - ఆగకుండా, అసలు ప్రశ్న ని తాకకుండా, దాన్ని ఫీల్ అవకుండా..
ఈ తొందరపాటూ, తత్తరపాటూ చిన్నప్పటి నించీ స్కూళ్ళలో కాలేజీల్లో తొందర తెలివితేటల ప్రదర్శనని అలవాటు చేసిన విద్యాసంస్కృతి లో పెరగడం వల్ల వచ్చాయా ?
లేక ప్రశ్న నించి వీలైనంత త్వరగా పారిపోదామన్న భయమా ? రెండూ ఒకటేనా ?