నల్లచిల్లి
2/21/04ఏ విషయాన్నైనా కలకలం, కలవరం లేకుండా మౌనంగా అవధరించడానికి అడ్డుపడే urge to impress, ఇతర నెగెటివ్ భావాలు పెద్ద black holes లాంటివి. 'నా' లో ఉన్న పెద్ద 'నల్లచిల్లి'.
బావామరుదులు
2/21/04
కవి కుమారులిద్దరూ వరసకి బావామరుదులే. తమలో సహజ సిద్ధం గా ఉన్న అధిక్యతా భావ ప్రదర్శన ని తృప్తి పరచే పోరాటం కోసం ఒకళ్ళ ఇమేజ్ ని ఇంకొకళ్ళు పరస్పరం ఉపయోగించుకుంటారు. కానీ అసలు మనుషులు భౌతికంగా కల్సినపుడు మాత్రం మామూలు గానే జోకులేసుకుంటూ మాట్లాడుకుంటారు.
దూర దర్శనం
2/20/04
'నెగటివ్ స్ట్రీక్' అనే దాన్ని ఎదుర్కొని దాంతోనే జీవిస్తూ ఉండు. కరిగిపోతుందో, విరిగిపోతుందో లేక నిన్ను విరుస్తుందో, పెరుగుతుందో ఏమౌతుందో నిశ్చయంగా తెలీదు. అసలు ఎవరికీ గూడా తెలియబోదు అన్న విషయం అర్ధం గావడం కష్టమే. ఏదో జరుగుతుందనే, జరగాలనే ఏ అప్రోచ్ తీసుకున్నా. ఈ మనసు కి అనేక విషయాల తో ఉన్న సంబంధాన్ని ఏ ఆశింపులూ లేకుండా 'చూడటమనే ప్రయోగం' చేయడం దాదాపు అసాధ్యంగా కన్పడుతోంది. అదే దాని సౌందర్యం కూడా బహుశా.
// ఏంచేస్తున్నారని అడిగిన స్నేహితుడితో "టీవీ చూస్తున్నా" అని చెప్పి "అంటే పెట్టుకొని ఏదో కార్యక్రమం చూడ్డం కాదు - ఆపేసిన టీవీ పెట్టె ముందు కూర్చుని దాని నిగారింపునీ, నునుపుదనాన్నీ, తయారు చేసిన జపానీయ నైపుణ్యాన్నీ, స్క్రీన్ మీద కనపడే గదిలోని వస్తువుల ప్రతిబింబాన్నీ, ప్రతిబింబం గుర్తు చేసే మిధ్యా వాదాన్నీ, దానికి "లిమిట్" వేస్తున్న టీవీ అంచుల్నీ - వీటన్నింటినీ చూస్తున్నాను " అని చెప్పి విరగబడి నవ్వడం.
వెనకాడే పదం
2/20/04పదం తటపటాయిస్తోంది - మనసు పొరల్లో జరుగుతున్న సంచలనాన్ని తన లోకి తర్జుమా చేయడానికి. భయాలన్నీ మాయమయిన తేలిక తనం- ఎవరికీ ఎవరూ ఏమీ ఇవ్వక్కర్లేదనీ. మాటని జాగ్రత్తగా వింటున్నప్ప్పుడు కలిగే భావన.
అహం
2/20/04"నేను ముఖ్యం" అన్న భావం ఉబికి ఉబికి వచ్చి పెద్ద అలలా ఈడ్చి ఈడ్చి కొట్టి చప్పున విరిగింది కొన్ని రోజులు గా. ఒక ప్రత్యేక మాటల ధోరణి, కొంత మంది మనుషులకు తక్కువ దనపు వాసన కొట్టే జ్ఞానం, పనులు - వీటన్నిటి మీదా ఏళ్ళ తరబడి పెంచుకున్న ద్వేషపు గాజుబొమ్మ మరోసారి విరిగి ముక్కలతో అక్కడక్కడా గుచ్చుతోంది.
ముక్కలు
Feb 10, 04.కాలంముక్కల్నన్నింటినీ చేర్చి, జీవితం అని పిలిచి, ఆ ముక్కల మొత్తాన్ని ఒకటిగా అర్ధంచేసుకోవాలని ప్రయత్నం మానవుడి కి. మాటగా కాక మనసులో మొత్తం మాయమయి ఈ క్షణమే అంతా తానైనప్పుడు వెలుగుతుంది దృశ్యం. అభాస కాదు జగం.
Feb 6, 04.ఇదిగిది - ఈ ఆలోచన ఏమిటీ ? వెనక ఉన్నది వెతుకులాటా భయమా కోపమా తాపమా - ఇట్లా నెమ్మదిగా తీరిగ్గా చూడ్డానికి వ్యవధి ఎక్కడుంటుందీ బొచ్చెడన్ని కోరికలు చచ్చేట్టుగా వచ్చి పడుతుంటే ?
అసలు ప్రకృతి
1/29/04అసలు ప్రకృతి - మట్టి పెళ్ళలతో నిండి ఉన్న మెదడు వాతావరణం- శారీరక సుఖం వెతుక్కుంటున్న మధ్యాహ్నాలు - చెడ్డ అనో మంచి అనో పేర్లు పెట్టక పోతే - ఇదీ ఉంది ఇక్కడ జన్మ చక్ర స్వభావం లో. దీన్ని దాటుకోవాలనీ, అధిగమించాలనీ కోరికలు నిజానికి లేవు. అది అట్లాగే అనుభవిస్తే తీరిపోతుందేమో. లేని పోని మేధా విన్యాసాలు, చదువులూ, విజ్ఞానం, వివేకం - స్వయంగా వేసుకున్న అనేక ముళ్ళు. ఎవరికీ హాని తల పెట్టని కాంప్లికేషన్స్ లేని జీవితం కుదరక సమాజాన్నీ నాగరికత నీ విపరీతం గా పెంచేశారు - ఎవరికీ ఏమీ అర్ధం కాకుండానే. బహు వచనాన్ని జాగ్రత్త గా అర్ధం చేసుకుంటే నిజానికి అలా జరిగింది అనేక మంది ప్రత్యేక వ్యక్తుల వల్లనే. సరిగా దేన్నీ అర్ధం చేసుకోకుండా అనేక మందిమి పక్క వాళ్ళని చూసి పరుగులెత్తడం వల్లనే జరుగుతోందిదంతా ('సామూహిక అంశల్ని' ఆడి పోసుకోవడం కూడా అందులో భాగంలాగానే ఉంది)
ఆరంభం
1/22/04
This huge interdependence looks and might feel very good at times.
ఇంకోళ్ళతో సంబంధం లేకుండా జీవించలేననీ - మానసిక భౌతిక అవసరాలు తీరడానికి ఎన్నో interconnections సరిగా పని చేయాలనీ - ఈ కనక్షన్స్ అన్నీ ఇలాంటి ఎన్నో human systems మీద ఆధార పడ్డాయనీ తెలిసినప్పుడు కలిగే భయం. వాళ్ళందరూ instable అయి ఉండొచ్చన్న అనుమానం - దాని వెనక ఉన్న తీవ్రమయిన స్వార్ధం అర్ధమవుతూనే ఉన్నాయి.
// attentive గా, passion తోటీ, ప్రేమ తోటీ ఉన్నప్పుడు ఇట్లాంటి భయాల గొడవ ఉండదు. నిన్న బిల్ క్లింటన్ గారు చెప్తున్నారు (వరల్డ్ ఎకనమిక్ ఫోరం దావోస్ లో) isolation, interdependence, integration అనే స్టేజస్ గురించీ ఒక దాన్నించి వేరొక దానికి human race ఎలా ట్రాన్సిషన్ అవుతోందీ - అవాలీ etc.,
// భయ పడుతున్నప్పుడు ఆ భావం ఎదుటి వారిలో ఎంత త్వరగా భయపెట్టాలన్న కోరిక ని activate చేస్తుందో అనుభవ మయిన విషయమే. దీని వల్లే భయపడే వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళని భయపెట్టే వాళ్ళుగా రూపొందుతారు.
// switch నొక్కగానే టప్పున వెలిగిన మానిటర్ - ఎలక్ట్రాన్స్, శక్తీ, దాని నిత్యత్వ సూత్రాన్నీ జ్ఞాపకం చేసి; తెర మీద కనబడుతున్న అక్షరాలకి కారణమైన లాప్ టాప్ కంప్యూటర్ నీ, మొట్టమొదట దాన్ని ఆలోచనగా కలిగించుకున్న ఆడమ్ఆస్బార్న్ నీ - మళ్ళీ అక్కణ్ణించి దాన్లో మూల సూత్రాన్ని conceive చేసిన బాబేజ్ అన్న వ్యక్తి యొక్క మెదడు లో న్యూరాన్ల విస్ఫోటనాన్ని కలిగించిన జన్యువు ల మీదుగా … ///- - - కారణాలు వెతుక్కుంటూ ఉంటే దానికి అంతం ఉండదు ఎందుకంటే 'ఆరంభం' అన్నది మన మైండ్ లో పుట్టిన కాన్సెప్టే కాని నిజంగా లేదు కనక - అంటున్నాడు ఆశ్రమం లో మౌనంగా కూచున్న ముసలాయన. //గోడల్లో గదిని వెతకడంలాగా ఉంటుంది - విశ్వం పుట్టుకని కాల ప్రమాణం లో చెప్పాలని ప్రయత్నించ బోవడం అంటున్నాడు కొ.కు.
ప్రయత్నం
1/21/04ఇంక వేటినీ సప్రెస్ చెయ్యడానికో ఎంకరేజ్ చెయ్యడానికో ప్రయత్నించకుండా డైరెక్ట్ గా సరిగ్గా ప్రయత్నంచేసే వాడి వెనక ఉన్న దాన్ని చూడమన్నాడు అతను. ఇంత కన్న deep గా మాటల్లో పెట్టడం కష్టమే అనాల్సొస్తుంది - వెనక చూడటం ప్రయత్నం కాదా అని అడిగితే.
//ప్రత్యేక సంఘటనలూ, వ్యక్తుల ప్రస్తావన లేకుండా సూచిక లాంటి మాటలతో మెదడు లో జరుగుతున్న భావాన్ని abstract గా చూడటమే కవిత్వమా ?
// దాగుడు మూతలతోనే జీవితమంతా జరిగిపోతే ?
లోపలి అసలు చూడకుండా - ఏమీ లేదని తెలుసుకోకుండా
చూసే కోరిక మాయమవకుండా జీవితం గడిచి పోతే ?
అదుగో - ఏమీ లేదని తెలుసుకుంటున్నానన్న జ్ఞాపకాన్ని
భద్ర ప్రరుచుకుంటోంది నేను.
// మొట్టమొదటి భయం- వాడేదో అంటాడనీ ఇదేదో అవుతుందనీ వాడూ అదీ అలా
ప్రవర్తిస్తారన్న ఊహకి కారణం నా స్వభావమే. నిజంగా అది జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఎదుర్కోవడం వేరు - అది భయంకాదేమో. వాడు నన్ను తిడతాడో, కొడతాడో లేదా అసూయ పడతాడో అన్న భయ భావన కి కారణం 'వాడు' కాదు. నాలో ఉన్న వాడి అంశ. ఇంకా deep గా ఆ భయాన్ని ఆవాహన చేసుకొని అవధరిస్తే ఆ భయ పు సంఘటన ని కలుగజేసే ప్రవర్తన ని వదలలేక పట్టుకుని నేను వేళ్ళాడుతూ ఉండటం వల్లే అని ఇదంతా అని తెలుస్తుంది. ఇది ఒకసారి అనుభవంలోకి వచ్చింతర్వాత జ్ఞాపకంగా మారి భవిష్యత్తులో గ్రహించే శక్తి ని పోగొట్టడం కరప్ట్ చేయడం తెలుస్తూంది. 'నేను' కీ జ్ఞాపకానికీ ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకుంటే ఇది జరగక పోవచ్చు.
// రేపు, భవిష్యత్తు అనేవి అబద్ధపు మాటలనీ, పరిమిత ప్రయోజనం కోసం పుట్టించబడ్డవనీ అర్ధం అవుతుంది గ్రహించగలిగితే.
// అన్ని రకాలకీ ఇది వర్తిస్తుందా ? అచ్చంగా external object యొక్క ఉనికీ లేదా ప్రవర్తన వల్ల జరగబోయే హాని తెలుసుకున్నప్పుడు కలిగే భావం - నీలోంచి పుట్టిన భయం కాక పోతే దాన్నించి దూరంగా వెళ్ళిపోవడమే ఉంటుంది. అప్పుడు భయం ఉండదు.
'పరాయి' బాధ
Jan 4 04.
ఈ పరాయి బాధను మాటల్లో పెడితే..
శరీరమంతా ఒక అంగుళం మందాన కమ్ముకున్న పొర. సహించలేని ఆలోచన ఏదో ఈ పొర నిండా వలయాలు వలయాలుగా తిరుగుతూ మెదడు ని సుడిగుండంలో తిప్పుతున్న భావన. రెండు భుజాల్నీ ఏదో నొక్కుతున్నట్టూ ఆ నొక్కుడు భుజాల గుండా గుండెల్లోకి పాకుతున్నట్టు బాధ. బుగ్గటెముకల్ని ఏదో తెలియరానిది వత్తుతున్నట్లు..
// ఆణకువ, తేట, తెలివి గల మొహాల్ని మైంటైన్ చెయ్యడం సమాజం లో ఒక పెద్ద చెర - 'లోక గొప్ప' చదువులకీ ఇమేజ్ లకీ పెద్ద నమస్కారం.
ప్రవాసులు
Jan 13, 04.
There is a certain strange peace or lightness that comes from the detachment to surroundings in a foreign country. You just tend to focus on your own existence, affairs and very few people. This might be one of the reasons for immigrants’ success. ఇక్కడి సమాజం లో జరిగిన, జరుగుతున్న సంఘటనలూ, అక్రమాలూ అంత అఫెక్ట్ చెయ్యవు. ఒక క్రీడ కోసం వేల లక్షల మంది వీరావేశ పూరితులై రాక్షసంగా ప్రవర్తించారన్న వార్త - అమెరికా లో జరిగితే అస్సలు ఇక్కడ ప్రవాసుల మనసులో కి వచ్చి నట్టు కనిపించదు. అదే అక్కడ జరిగే ప్రతి అన్యాయమూ ఎన్నో రోజుల పాటు వెంటాడుతుంది. మన సమాజం, మనుషులూ ఎటు పోతున్నారన్న ప్రశ్నలూ అది కలిగించే అమితమయిన భయం కనిపిస్తుంది అందరిలోనూ. ఇక్కడ సమాజ పరిస్థితులతో ఎక్కువ మందికి ఉండే డిటాచ్మెంట్ (కనీసం మొదటి తరం ప్రవాసులలో) చాలా వరకూ కారణమేమో వాళ్ళ విజయానికి.
అ ప్రతిచర్య
Jan 12,04.
ఊరికినే ఉబికి ఉబికి వస్తున్న ఈ అమితమైన ప్రశాంతత ని చూస్తూ కూచుందామన్న భావన ప్రపంచానికి వ్యతిరేకంకాదు. దానికదే వస్తున్నప్పుడు దాని విలువ తెలుస్తూంది. ప్రపంచమో సమాజమో నీమీద విధించిన ఆంక్షలనీ, బాధ్యతల్నీ ధిక్కరించడానికో, తప్పించుకోవడానికో వస్తున్నంత కాలం ఇది కూడా ఒక రియాక్షనే. దేనికో ప్రతి చర్యే.
దూరం లేని కాలం
Jan 7, 04.మనసులోని కాల భావన నిజం కాదన్న మాట లో ని నిజాన్ని ఎంతో కొంత తెలుసుకోగలం మెదడుతో. ఏదో కొంచెం తంటాలు పడితే. కానీ space (అనగా దూరం లేక ఖాళీ అందామా) కూడా నిజం కాదంటాడే కొండ దగ్గిరున్న మహర్షి ? ప్రతి క్షణమూ ఈ లోకం లో అనేక సంభావ్యతలు (possibilities) హఠాత్తుగా collapse (అనగా materialise) అయి మళ్ళీ హఠాత్తుగా vanish (లేక de-materialise) అవుతూ ఉంటాయని ప్రత్యక్షంగా తెలిస్తే అప్పుడు అర్ధమవుతుందేమో. అసలు కాల భావన వల్లనే దూర భావన కూడా కలుగుతోందేమో.
శరీరపుటాలోచన
11/25/03ఏదో జర్నల్సూ, అసైనమెంట్లూ రాయడం. నోరు తిరగని, బుర్ర తిరిగే పొడుగాటి వాక్యాల్ని చదివి నైసు నైసు గా మళ్ళీ అనలైజ్ చేయడం.
// తల నిండా ఉన్న కనపడని చిన్న చిన్న రంధ్రాల్లోంచి పొగ లాగా బయల్వెడలుతున్న ఆలోచన కాలానికి కారణమని తెలుస్తూనే ఉంది. కాలంఅంటే మన మధ్యనున్న ఊహలూ, సంబంధాలూ, పోరాటాలూ ఇంకా కంటికి కనపడుతున్న వస్తు సముదాయాలూ..
// ఈ రాతంతా ఎక్కడి నించో తల లోకి ప్రవహిస్తోందన్న ఆలోచన.
// ఏదో కొంచెం అటూ ఇటూ పని చెయ్యడం కాకుండా నిజంగా అటెన్షన్ ఇచ్చి పని చేసినప్పుడు ఇతర భయాలూ, అజిటేషన్స్ మాయమవుతాయి. (అలా మనసు పెట్టి చేయగలిగే పని కుదిరినప్పుడు) అలా మాయమయిన సమయంలో 'ఇది' మిగులుతుంది. కాలాన్ని పెంపొందిచాల్సిన ఆలోచన కదలక మెదలక పడి ఉంటుంది. స్వగ్రామం లో నిశ్చలంగా ఆవరించిన మధ్యాహ్నాలూ, వేడి గాలితో కూడిన శరీరపుటాలోచనా ముందు కొచ్చి నిలబడతాయి.
వేవ్ ఫంక్షన్
11/13/03భయం ఎందుకా ? నాకు నచ్చే పాటర్న్స్ తో నేను నిర్మించుకున్న భవనాలని కూలదోస్తారేమోనని - నా ఆలోచనలనీ, భావాలనీ కాదని నన్ను నిర్భందిస్తారని, స్వాతంత్ర్యం అని నేను అనుకుంటున్నదేదో పోతుందనీ. నేను నా పాటర్న్స్ నీ, ఆశయాలనీ, ఫలానా రకంగా ఉండాలన్న కోరికని పెంపొందించుకునేటప్పుడే వాటికి వ్యతిరేకంగా ఒక భయం, విరోధం లేదా వైరుధ్యం నాలో ఏర్పడిందేమో. అదే ఇప్పుడు అనేక సంఘటనల , వ్యక్తుల వల్ల నా ఆలోచననీ భయం వైపు ఆక్టివేట్ చేస్తోందేమో.
నేను మునుపు ఎవరివో కూల ద్రోసాను అందు వల్ల నా పాటర్న్స్ ఇప్పుడు కూలుతున్నాయి అనుకోవడం ఒక రకమైన సంతృప్తి కలిగించే ఆలోచనా ధోరణి. అసలు నా పాటర్న్స్ కట్టేటప్పుడే, నాకు అనుకూలంగా ఒక ధోరణి ని మలుచుకుంటున్నప్పుడే, నాసొంతమనీ నా అధికారమనీ, ఇలాంటి బీజాలు పడినప్పుడే (ఇదంతా తప్పు అన్న ఉద్దేశంతో కాదు రాయడం) ఈ భయానికీ దుఃఖానికీ బాధకీ పొటెన్షియల్ పాసిబులిటీ ఏర్పడింది. అదే ఇప్పుడు confirm అయింది. (అంటే అదే దో క్వాంటం సిద్ధాంతం ప్రకారం wave function collapse అయిందన్న మాట).
అడుగులు
11/10/03ఉద్వేగం ఆపు కోలేక అబద్ధాలు చెప్పడం - పాపం ఈ కుటుంబాలకు పుట్టుకతో సంక్రమించిన గుణం. ఇదేకదా కల్పనా కళ గా పరిణమించి (కొండకచో పరిమళించి) మరి కొన్ని మానవ సమూహాలను ఉత్తేజితుల్ని చేసింది !
//ఏమిటి తేడా అడుగులు వదులుతూ పని చేయడానికీ, ముద్రలు వదలకుండా జ్ఞాపకాలలో బంధించకుండా, పనిని తనలో ప్రవహింపజేయడానికీ ?
చేయాల్సిన పని చేయలేక ఇంకేదో పుస్తకాన్నో, సినిమా నో పట్టుకోవడం. భయం తో బాధతో
ర గులుతూ, ఏదో ఘోరం చేస్తున్నానన్న జ్ఞాపకం పోగు చేసుకుంటూ ఆ పని చెయ్యడానికీ, అలాంటి భావాలు ఏమీ లేకుండా - ఏదో అసలు పని చేసే శక్తి పోయిందనుకుంటూ హాయిగా సుఖించడం - ఈ రెండు మార్గాల లోనూ భౌతికంగా జరిగేది ఆ సమయానికి ఒకటే. అయినా మనసులో మెదడు లో ఆలోచనల ఫలితంగా ఏర్పడిన ముద్రల వల్ల తరువాత జరిగే అసంఖ్యాక మయిన సంఘటనల వరసలు ప్రభావితమై ఆయా జీవితాలని వేరు వేరు మార్గాలు పట్టిస్తాయనేది స్పష్టం.
భ్రమణం
9/30/03 చవుటుప్పల్ అన్న మాటని పదేపదే అనాలన్న కోరిక. అనోయా అన్న పేరు ని వినగానే మే మే అని అరుస్తూ అనోయామే - చకమే - మరణమే - శరణమే అని తల నిండా తిరుగుతున్న మాటలు.
ప్రాచీన పెంకుటింట్లో నల్ల కర్ర దూలాలున్న వంటగది. ఇంటికొచ్చి గొప్ప ప్రదర్శించాలనుకున్న మనుషుల్ని (వీళ్ళందరూ తన తల లోంచి ఊడి పడ్డ భాగాలే) భీకరంగా భయపెడుతూ గర్జించాలన్న భావన. సహజాధిక్యతా భావాలు - ఇవి దేశాధ్యక్షుడివైనా, కుంఫిణీ అధికారి వైనా, సామాన్య గుమాస్తా వయినా - తమని చూపించుకుంటూనే ఉంటాయి దినచర్యలలో.
సహచరి
9/24/03ప్రపంచం నాతో పుట్టి పెరుగుతోందన్న భావన. అన్ని కష్టాలూ, ఇంపర్ ఫెక్షన్సూ, కన్నీళ్ళూ, ఆనందాలూ, దుఃఖాలూ చివరికి మాయమయిపోతాయనీ , అదే జీవితానికి కంక్లూషన్ అన్న భ్రమ.
తేల్చుకో
9/21/03'నా' లో కొంచెం భాగమే తెలుసు నాకు. ఆ కొంచెం భాగాన్నైనా సరిగా చూసుకుని explore చేసుకుంటే చాలు. ఇతర కోరికలతో ఇరుకిరుకుగా జీవితాన్ని గందరగోళంగా గజిబిజి గా చేసి నాశనం చేసుకోకూడదు. మనసులో కలుగుతున్న భావాల్ని (మంచి అనీ చెడ్డ అనీ రకరకాలుగా పేర్లు పెట్టబడుతున్న వాటిని) అలాగే ఇంటెన్స్ గా అనుభవించడం - ఇదంతా 'రియల్ నేను' ని జీవించే భాగం. పూర్తి స్వరూపం అని చెప్పలేను కానీ కనీసం మేజర్ పార్ట్ అని తెలుసు, అనేక విషయాల పట్లా, వాంఛల పట్లా ఉన్న సంబంధాన్ని తేల్చుకోవడం.
విముక్తుడు
8/29/03ప్రతి క్షణమూ అలల్లాగా ఎగసి పడే అనంతమైన ఆలోచనల వల్ల ఏమిటి ప్రభావం? అవి వాటి ముద్రలనీ, అడుగుజాడలనీ మనసు మీద వేయక పోతే ఏమీ లేదు కాన్సీక్వెన్స్.
స్వీయ ధర్మపు వాసననీ, కవి చెప్పిన ప్రాచీన స్మృతుల శబ్దాల్నీ కలిపితే..
ప్రాధమికమైన వేడి తో నిండిన వాతావరణం. ఏమీ చేయనక్కర లేని పగళ్ళూ - మధ్యాహ్నాలూ; ఏవో ప్రాధమిక మైన పనులు ఉన్నా - వంట, ఊడ్చటం, కడగటం, నానబోయడం, చేతుల్తో తిప్పడం, పొయ్యి వెలిగించడం - ఇవన్నీ ప్రదర్శించాల్సిన పనులు కాదుగా.
పగళ్ళూ రా త్రుళ్ళూ, సంఖ్యలూ పేర్లూ తగిలించుకోకుండానే మారుతుంటాయి. బయటి శక్తులు తమ తమ ప్రభావాలని రకరకాల వేషాల్లో మోసుకొచ్చి ఏమీ చెయ్యలేక విఫలమవుతుంటాయి. దేన్నీ మార్చనక్కరలేని స్థితి క్షణక్షణమూ అవగతమవుతూ ఉంటుంది. కాలం అనేది పేరు పెట్ట నక్కర్లేకుండానే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఉవ్వెత్తున ఎగిసి పడే కోరికలూ, ఆలోచనలూ ఆక్షణం లోనే అప్పటికప్పుడే అంతమవుతూ ఉంటాయి - ముద్రలని వదలకుండా. జీవితపు ప్రాధమిక అంశలన్నీ స్పష్టం గా ముందుకొచ్చి నిలబడతాయి. 'అసలు' అయిన 'మొదటి' దాన్ని తాకుతున్న భావన ముంచెత్తుతూ ఉంటుంది.
బలహీనమైన కాళ్ళూ, చేతులూ తమ పనుల్ని మెల్లగా చెయ్యడానికి మొహమాట పడవు. ముఖమూ, కళ్ళూ ఉద్రేకపు రంగు పూసుకోకుండానే వెలిగిస్తుంటాయి పరిసరాలని. ఆశయాలకీ చట్రాలకీ కన్ఫర్మ్ కావల్సిన అవసరం మాయమవుతుంది. వెకిలిలో, చెడ్డలో, సదుపాయాలు లేని తనంలో ఎండలో, మట్టి లో తన ప్రతిబింబాన్ని చూసుకుని నేను కాలుతూ ఉంటుంది జ్ఞానాగ్నితో.
ప్రస్తుత క్షణం లో ఉన్న భావమే తర్వాత క్షణంలో ఉంటుందనీ, ఉండాలనీ అన్పించదు. అసలు తర్వాత అన్న పదమే మాయమవచ్చు కూడా. మూల ప్రాధమిక ధర్మం వేడి, మురికి, మందబుద్ధి అయినప్పుడు - ఉన్న దాన్లోనే ఉండి పోవడం అంటే ఏమిటో అర్ధమవుతుంది. నేను పూసే అన్ని పూతలూ పూర్తిగా మాయమయి పూవులన్నీ వికసిస్తాయి.
గీతార్ధం
7/13/03నీరవపు మధ్యాహ్నం లో అనుకోకుండా దొరికిన బద్ధకపు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ "రాజ శేఖరా నీపై మోజు తీరలేదురా" అన్న పాట వినడం. ఈ రాజు లేదా రాజ శేఖర్ అనే వాడి యొక్క అనేక ఆలోచనా రూపాల్నుండి వెలువడుతున్న సుఖ దుఃఖ ఛాయల్ని సంపూర్ణం గా అనుభవించడం ఇంకా పూర్తి కాలేదు అన్న అర్ధాన్ని అన్వయించుకుని పాడుకుంటూ విరగబడి నవ్వుకోవడం.
మొదటి నేను
July 1st 03.
ఏమీ బరువులు లేని తేలిక తనం, స్పష్టమైన చూపు, ప్రశాంతత ఉన్నప్పుడు రాయాలని పెద్దగా అన్పించదు. మరీ ఎక్కువ శక్తి పిడుగులు పడుతున్నట్లుంటే తప్ప.
// నిజమే. అన్ని ఆలోచనల్లోనూ అంతర్లీనంగా "మొదటి నేను" ఉన్నట్లే ఉంది.
// ఇరవై కోట్లసం వత్సరాల నాటి పెద్ద బల్లుల శిలాజాలు దొరికాయట ఆదిలాబాద్ జిల్లాలో. నిజంగా పేరు లోని "ఆది" సార్ధకమయినట్లుగానే ఉంది.
ప్రస్తుతం తల లో ఖాళీ. నెమ్మదిగా (బాల్యపు) ఆం. శర్మ గారో అ. నారాయణ గారో దిగుతారు. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా వాళ్ళ తీవ్రత, ఆగ్రహం, స్వార్ధం, వెకిలితనం నాలో తెలుస్తున్నాయంటే ఈ పంతుళ్ళూ, నాన్నలూ, అగ్రజులూ అందరూ నేను సృష్టించి ఆహ్వానించిన వాళ్ళే. మృదుస్వభావులెంత మంది తగిలి ఉంటారు ? వాళ్ళ faculty లు అతుక్కోలేదేమి ఇంత గాఢంగా ?
లోపలి తనం
5/23/03it is almost like so many people got captured inside the mind and they talk, discuss, object , agree, cry, criticize, comfort, yell continuously.
ఎవరో లోపల ప్రశ్న వేస్తున్నారు. ఈ ప్రశ్న వేస్తున్న తత్వవేత్త, లేదా మానసిక శాస్త్రజ్ఞుడు ఎవరు ? ఏ పుస్తకం ద్వారా మెదడు లో చొరబడ్డాడు ? ఇట్లా అందరి మనసులో పుట్టిన ఆలోచనలు అందరికీ అందుతున్నాయి, పుస్తకాల ద్వారానో, సినిమాల ద్వారానో. అందుకనే టెలీపతీ లాంటి వైయుక్తిక శక్తులు వాడకం తగ్గిపోయి క్రమంగా మాయమయి పోయినట్లున్నాయి.
ఇంతకీ అడగబడుతున్న ప్రశ్న ఏమిటంటే had one not listened/read all these people/books will the mind be still crowded this much ? probably yes – those few persons would chatter enough to keep the intensity strong !
పోలిక
5/22/03అసమానతలు - ఎటు చూసినా. చుట్టు పక్కనున్న అనేక విషయాలలో కత్తి లా చొచ్చుకుపోయి అతుక్కుంటున్న మెదడు. దీని వెనక ఉన్న ఆందోళన, హింసాత్మకం తెలుస్తూనే ఉంది. తన తెలివి తేటల ధాటి తో గుచ్చుకుంటున్న మెదడు పక్కన ఉన్న స్లో మెదళ్ళ ని చూసి అసహ్యించుకుంటోంది. నవ్వుకుంటోంది (లేదా భయ పడుతోందో ?)
కూలి పోతున్న క్రమ బద్ధపు గోడలు.
నువ్వే
5/20/03ఎన్ని వేషాలు వేసినా, సమాధానాలు చెప్పుకోవాలని ప్రయత్నించినా లాభం లేదు. కుదరదు. జీవితం లో అత్యంత మౌలిక బాధ కళ్ళకి కట్టి నట్టు గా కనిపిస్తోంది. నా కళ్ళ లోకి నేనే చూసుకోవాలి. మనసు లో ని ఈ విషయం, ఈ రియాక్షన్ అంతు చూడాలి. లోపల నిరంతరంగా మండుతున్న ఈ అసంతృప్తి జ్వాల ని అనుభవించాలి. No teacher, no religion, no philosophy, no leader, no book can take this off - నువ్వు నీకుగా లోపలికి వెళ్ళి చూసుకోవలసిందే అంటున్నారు. సహృదయం తో చేసే సూచనలు గ్రహించవద్దని కాదు.
ఎదురుచూపు
9th May 03.
పని జీవితం, రోజూ ఆఫీసు కు వెళ్ళి రావడం: ఇదంతా తాత్కాలికంఅనీ, రేపో మాపో అయిపోతుందనీ ఎదురు చూసాడు చాలా కాలం. తరవాత కొంత కాలం నిజంగా అయిపోక పోయినా రోజు గడుస్తుంది కదా అనుకుంటూ సమస్యలు లేకుండా సుఖాన్ని గ్రోలే సమయంకోసం ఎదురుచూసేవాడు, ప్రతి రోజూ పని చివరిలో. ఇప్పుడు రెండోది కూలి పోయినట్టు కనబడుతోంది. దాని స్థానం లో రోజూ "బేసిక్ లైఫ్ - అనగా అసలు, మామూలు శరీరాన్ని చూసుకుంటూ గడిపే సమయం" కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పటికి తీరేది ఈ ముడి ?
జాతి గుణం
3/21/03కీలాగ్ని శిఖలు. బ్రద్దలవుతున్న పర్వతాలూ - మహా ప్రవాహ వేగంతో నా నించి బల్వెడలుతున్నాయి - చేసే పనుల ద్వారా, ఆలోచన రూపం లో జరుగుతున్న కర్మల ద్వారా - this race was genetically trained and conditioned to get release from this mental exercises – or rather mental ejaculations అన్న భావం తెరలు తెరలు గా ఉబికి వస్తోంది.
నో మస్ట్
3/19/03ఆలోచన, దుఃఖమో, సుఖమో, కోరికో దేని ఛాయ అయినా మెల్ల గానో, వేగంగానో 'నేను' తో తాదాత్మ్యం చెందక తప్పదు. అంటే ఈ భావన నాకు సొంతం అవుతుంది. అమితమయిన హాయి సొంతం చేసుకున్నాననుకుంటున్న భావన కలుగుతోందా ? ఇదే బై డిసైన్ ప్రకారం రేపు దుఃఖాన్ని కల్గించక తప్పదు 'నేను' కి.
దీనికి కంక్లూషన్స్ ఏమీ లేవు చివరిలో. మస్ట్ డూ ఆర్ మస్ట్ నాట్ అని చెప్పడం కాదు ఇదంతా.
గాడి
April 11, 02.
పాటర్న్ లో పడడం అంటే? This means mind is trying to get pleasure out of the “new” new thing which it stumbled upon. Then slowly it gets addicted and then again ..patterns ..
వ్యక్తిత్వం
11/28/01వ్యక్తిత్వం అనేది రోజూ చేసే పనిలో వ్యక్తం అయి దాన్ని షేప్ చేస్తుందనేది చాలా వరకూ నిజం. పని జీవితాన్నీ, పని చేసే తీరునీ చాలా ప్రభావితంచేస్తుంది. వ్యక్తిత్వంఅంటే 'నేను' రూపొందిచబడ్డ విధానం అనుకోవచ్చు. మౌలికంగా విషయాల పట్ల, మనుషుల పట్ల, పని పట్ల ప్రవర్తించే తీరు ని ప్రభావితం చేస్తుంది. ఇది సామాన్యంగా అందరికీ వర్తించినా మినహాయింపులు చాలానే కనిపిస్తాయి.
ప్రవాహం
6/14/03పోయిన శనివారం సుధా రఘునాధన్ కచేరీ కి వెళ్ళాం. మధ్యాహ్నం మూడున్నర కి ప్రారంభించి రాత్రి తొమ్మిదిన్నర కి (మేం లేచి వచ్చేటప్పటికి) కూడా పాడుతూనే ఉంది. సంగీతం ప్రవాహమై ముంచెత్తింది ప్రేక్షకుల్ని. లేచి వెళ్ళేముందు స్టేజ్ కి దగ్గరగా వెళ్ళి పది నిముషాలు కూర్చున్నాం. అమితమైన శక్తి స్వరూపాల్ని దగ్గరగా చూడ్డానికి. మోర్సల్ వాయించిన ఆయనకి పెదవి చిట్లిందిట.
పరాయి రాయి
5/30/03పరాయి , పరాయి , పరాయి - రాయి తో తల పగిలి పోతోంది.
లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది 'కలెక్టివ్' అనేది. దాని ఫార్మాట్ కి ఎందుకు లోబడాలి ?
// బిడియపు మెరుపులూ, భయపు పిడుగులతో కురుస్తున్న జడివాన జీవితం.
గడపాలి ప్రతి చినుకునీ అనుభవిస్తూ.
అది చెయ్యాలి ఇది చెయాలి పొడి చెయ్యాలి అనుకోవడం విడిచేసి ప్రస్తుతం లో విడిది చెయ్యాలి.ఈ క్షణం తో చెలిమి చేయాలి.
విర్ట్యుయల్ రియాలిటీ
5/24/03
శుభ్రం గా తుడిచిన కాఫీ బల్ల ఉపరితలం మీద గది లోని వస్తువులన్నీ (నేల గా మారిన కప్పు భాగం మీద) తల క్రిందులుగా నిలబడి ఉండడం చూసాను. దాన్ని ఒక బేస్ మెంట్ గా ఊహించుకుంటూ ఆ విర్ట్యుయల్ రియాలిటీ లో కొంత సేపు తిరుగాడాను.
//శరీరమంతా మేధా పరమైన ఉద్వేగం - అంటే ఎలా ఉంటుంది ?
అంకె - పదం
8th May,03.
“is there a number called twenteen” అని అడుగుతున్నాడు ఏడేళ్ళ అబ్బాయి. పదం నేను చూసిన నిఘంటువు లో లేదు కానీ అంకె ఉందా అని ఉద్దేశం కాబోలు. (అంత ఆలోచన ఉండి ఉండదు ఈ ప్రశ్న వెనకాల బహుశా). అలాంటి నంబర్ లేదు. “there has to be a word if there is such a number” అనుకుంటున్నా. I don’t know if this is a deep/significant question in philosophy. అంకెలకీ, గణితానికీ ఫిజికల్ రియాలిటీ లేదన్న విషయం తెలుస్తూనే ఉంది. పదం లేకుండా అంకె కి తనంతట తానుగా ఉనికి ఉందా? **తాజా కలం **భాష కీ, గణితానికీ మునుపు అనుకున్నంత అవినాభావ సంబంధం లేదని కొత్త పరిశోధనలు నిరూపిస్తున్నాయట చూ. సైంటిఫిక్ అమెరికన్ పత్రిక - జూన్ 2005.
6th May, 03.కనీస(?) సౌకర్యాలు ఉండి, మంచి(?)వర్గపు మనుషులతో మెలిగితే చాలు అన్న కోరిక తప్ప ఇంకేమీ అక్కరలేదన్న స్పష్టత ఎప్పుడూ ఉంటే చాలు.
మరి ఈ స్పష్టత, వేరే కోరికలు లేని తనం చాలామందికి ఇంకొక వర్గం/పని పట్ల భయం గా పరిగణించి అవమానకరంగా భావిస్తారెందుకో. .కొన్ని విషయాలపట్ల అయిష్టం, భయం ఉంటే తప్పేమీ కాదన్న విషయం అర్ధమయినట్లనిపించదు.
2nd May, 03.కొండ నాలుక కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా ఏదో మార్పు గా వెళ్ళి వస్తే కాస్త ఈ వాతావరణం మీదా ఇక్కడి పన్ల మీదా ఇష్టం, ఆసక్తి తాత్కాలికంగా అయినా వస్తాయనుకుంటే దానికి సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది.
తిరోగమనం
4/28/03ఏర్ పోర్ట్ లో కళ కళ లాడుతూ కొత్తగా నైసు గా ఉన్న గుడ్డలూ, సంపదా, దీపాల కాంతులూ, వరసగా అమర్చిన కార్లూ ఏదో పరాయి భావన ని కలిగిస్తున్నాయి. మిట్టమధ్యాన్నం, ఎండవేడి, నిశ్చలంగా నిల్చున్న తాడి చెట్లు, వేడిమి తో కాగుతున్న భూమి, చల్లని చెట్టు నీడ, చెమట తో తడుస్తున్న నల్లటి రస్టిక్ మొహం గుర్తొస్తున్నాయి.
ఏమిటో తెలిసినట్లుగా ఉంది ఈ ప్రయాణం వల్ల. అసలు మూలాల్ని చూసినట్లుగా ఉంది. అందుకనే ఎంత అసౌకర్యం గా ఉన్నా వ్యతిరేక భావాలు కలుగలేదేమో. మూడేళ్ళు గా జరుగుతున్న ప్రాసెస్, ఒక రకమైన ఆలోచనా ధోరణి అంతా ఏమవుతుందో తెలుసు కోవాలన్న ఉత్సుకత తీరింది బహుశా. కొన్ని సుఖాలు లేనప్పుడు ఈ ధోరణి అంతా మాయమై పాత నేను ప్రత్యక్షమై ఇంతకు ముందు కన్నా అగ్రెసివ్ గా ఉంటాడన్న సందేహమో, భయమో తీరింది. విదేశం లో లెక్క పద్దుల గురించి సహాయం చేసినా, స్వదేశం లో ఇంకోటి చేసినా "వ్యవహారిక గోలలు" దాదాపు గా ఒకటి గానే ఉంటాయి. . మరి ఒకటి అయిష్టం గానూ ఇంకొకటి ఇష్టం గానూ కన్పడుతోంది. ఎందుకని?
// ప్రేమ చూపించే వాళ్ళు లేరు బాబూ - అదీ సమస్య అని ఆ ముసలామె రోదించడం కళ్ళముందు మెదుల్తోంది. అందరికీ అదే సమస్య అని అందామనుకుని ఆగిపోయాను. ఆమె ఏడుపూ, నా ఏడుపూ, అందరి ఏడుపూ అన్ని దేశాలలో, ప్రదేశాలలో దాదాపు గా అదే నేమో. అందరూ భిక్ష మెత్తితే వేసే వాళ్ళెవరు ? ఒక్కరు చూపితే అందరూ చూపుతారా? ఏమో !
// నా అసలు మూలంతో కనెక్ట్ అయితే ఈ అశాంతి పోతుందా? ఈ లాగుతున్న బంధాల్ని మన్నించి వాటి ప్రకారం పోతే అంతా బాగుంటుందా ?
// ఆదర్శప్రాయమైన కన్ను గురించి రాస్తున్నాడు కొ. కు. తాత్విక వ్యాసాలలో. అబ్బా ఎంత బాగుంది, ఇంద్రియాల ద్వారా మనం ప్రపంచాన్ని సృష్టించామన్న భావన. ఒళ్ళంతా తమకంతో కంపిస్తోంది. నేను అనే వాడు ఏర్పడకుండా ఈ ఇంద్రియాలు మన కిచ్చే data ని ఒట్టిగా చదవచ్చా ?
దృశ్యాదృశ్యం
4/25/03మిట్టమధ్యాన్నం. బద్ధకంగా కనిపిస్తూ నడుము వాల్చిన ఎద్దు. పెచ్చులూడి పోయిన రెండు మట్టి గోడలు. అక్కడక్కడా పడి ఉన్న కొబ్బరిమట్టలూ, చిప్పలూ. ఎండవేడి. వేపచెట్టు. ఓరగా వాల్చిన బండి. గూని తో వంగి నడుస్తున్న ముసలమ్మ. మట్టికుండలు. పెంకుటిళ్ళు. కొబ్బరిచెట్లు. నా ఆలోచన తప్ప ఇంకే శబ్దమూ లేదు. అప్పుడప్పుడు పక్షుల అరుపులు తప్పితే. కొంచెం సేపు పెద్దగా నవ్వు - కారణం తెలీకుండా. గాలీ, ఇల్లూ, పొలాలూ, ప్రకృతి శబ్దాలలోని నిశ్శబ్దం. ఇదంతా సెన్సుయల్ ప్లెషర్ గా ఫీలవడం తెలుస్తోంది.
మట్టి రోడ్డు మీద సైకిలు పోతున్న శబ్దం. పాత గోడలు. కొంచెంమసి బారిన పాత్రలు.
గడ్డి వాము దగ్గిర నెమరు వేస్తున్న బర్రె. కళ్ళతో దృశ్యాల్ని తాగడం ఆ అనందం మెదడుకు సరఫరా అవడం అంతా స్పష్టంగా తెలుస్తోంది.
// చురుక్కుమంటున్న చూపులు - ప్రతి మనిషి కళ్ళలోకి చూస్తూ అతని మస్తిష్కాన్ని వెతకడం - ఏదో జీవశక్తి చటుక్కున బయటికి రావడం - అప్రయత్నం గా వచ్చే ఒక చిరునవ్వు.
ప్రస్తుత క్షణం
April 9, 03సరే ప్రస్తుత క్షణం ఇలాగుంది. ఆ సౌకర్యాలూ, మృదువుగా స్మూత్ గా సాగే లైఫ్ స్టైల్, అర్ధం పర్ధం కనిపించని విషయాలకి మైండ్ చింపుకోవడం - అదంతా తల్చుకుంటే ఎబ్బెట్టు గా, వెగటు గా ఉంది. కొన్నాళ్ళకి మళ్ళీ ఇక్కడ పాటర్న్స్ ఏర్పడి వాటికి మైండ్ అలవాటు పడితే తర్వాత ఏమనిపిస్తుందో. అప్పుడు ఆ దేశానికి ఎగిరి పోవాలని అనిపించదా? ఏమో? నా ‘నేను’ ఏ విధంగా పెరుగుతుంది అనే దాని మీద ఆధార పడి ఉంటుందేమో..
ప్రతి క్షణం మనసులో రంగుల్ని గమనించుకుంటూ ఉంటే వచ్చే ఆనందం మాత్రం ఉంటుంది ఎలా అయినా.
మూలాలు
April 6, 03.
ఏ పుస్తకాలూ, సాహిత్యాలూ ఆదర్శపుటాలోచనలూ కామాలూ లేకుండా ఈ ముతక మురికి జీవితాన్ని అచ్చం అలాగే అనుభవించాలన్న తీవ్రమైన కోరిక తీరుతోంది. అబ్బా. . "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం" అన్న సంస్కృత శ్లోకం రాసిన వాడి మనసులో ఎంత శుద్ధ ప్రజ్ఞ నెలకొని ఉందో.
మాసి పోయిన గుడ్డలు జాలిగా చూస్తూ ఉంటే దుమ్ము మట్టి అంటుకున్న వస్తువులన్నీ చీదరగా చిందరవందరగా మనసులో అదో రకమైన గందరగోళాన్ని కల్పిస్తున్నాయి. ఇదే నాకు ధర్మం(!?) గా కన్పించడానికి కారణమేమిటి? బాహ్య వాతావరణ శారీరక సుఖాన్ని కోరే అంశ మాయమయినట్లుగా ఉంది. I don’t know if this is indirectly increasing my “me”. నాలో ఉన్న కఠోర పరిశ్రమ కారుణ్ణి పెంపొందించే మైండ్ ట్రిక్ కాదని తెల్సు. ఏదో ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్న భావన. I just wanted to see the genuinity of this feeling – whether it will wither away by certain environment. ఉక్క తో వేడి గా మగ్గి పోతున్న శరీరం. పళ్ళూ తోముకోవడం నించీ పడుకునే దాకా పూర్వం మైండ్ లో జరిగే నాయిస్ అంతా ఏమైంది ? ఈ పరిసరాల్లో ?
అవసరానికి మించిన కంఫర్టబుల్ లైఫ్ గడుపుతున్నప్పుడు ఎన్నోసార్లు all this is not a big deal అనుకున్న విషయం ఇప్పుడు ఇలా కన్ఫర్మ్ అవుతోందనా ఈ తృప్తి? శరీరానికి అసౌకర్యం కలుగుతూ ఉంటే చూస్తూ తమాషాగా వింతగా ఉన్న ఫీలింగ్ ని చూడడం లో ఉన్న తృప్తా ఇది ? చెక్కు చెదరని పెరగని తరగని ఏదో ఒక దానికి చిహ్నమా ఇది ? ఎన్నో ఏళ్ళనించీ దొరకని ఈ అసౌకర్యం ఎంతో హాయిగా ఉంది. This is not idealizing the discomfort but rather not thinking about any other comforts and experiencing the present as it is… "ఏడు కొండల వాడ వెంకటా రమణా" (పెళ్ళి చేసి చూడు - చక్రవాకం ట) - ముసలి కంఠం తో అమ్మ పాడు తున్న పాట అమిత మధురంగా ఉంది. ఇంకా - "మా వల్ల గుణ దోష మేమీ" "ఎవరో వారెవరో" "మధురం మధురం మనోహరం" - ఆమె లో ఉన్న ఇంత చక్కటి జ్ఞాపక శక్తి కీ కళ కీ నమస్కారాలు చెప్పుకుని మురుసుకున్నాను.
April 7 03.
నా మూలాల్ని ఈ క్షణంలో దుమ్ములో మురికిలో ఈ అశుభ్రత లో రస్టిక్ మాటలలో వెతుక్కుంటూ శరీరం జ్వలిస్తోంది. ఎన్నోసార్లు గత మూడేళ్ళలో నిద్ర లో విన్న ప్రాచీన స్మృతుల చప్పుడు ఇప్పుడు కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తోంది అనుక్షణమూ. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ప్రతి వారూ ఆఫ్రికా లోనో సుమేరియా లోనో మెసపొటేమియా లోనో భాగంట. అయినా వాటితో ఇప్పుడు ఆ అనుబంధం చప్పుడు వినగలమా? కానీ పిఠాపురంలో మా మాతామహులు శృతి చేసిన వీణల చప్పుడో కావలి బుడమ గుంట లో పితామహులు అరక దున్నుతూ జీవితాన్ని గురించి చేసిన ఆలోచన ఎంతో దగ్గరగా, దాన్ని గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తి కరంగా ఉంది. చెమట, వేడి, దోమలు అప్పుడప్పుడు శీతల పవనాలతో కలిసివచ్చే మురుగు కంపు - వ్యతిరేక భావాల్ని కలిగించడం లేదు. ఫీలింగ్ అట్టర్లీ హోమ్. గడుపుతున్న జీవితం అంతా ఎవరికో చూపించుకోవడానికి చేసే తెలివితేటల ప్రదర్శనో లేక ఆర్ధిక భద్రత కోసం పడే వెంపర్లాటో నని హఠాత్తుగా మూడేళ్ళ క్రితం మైండ్ లో మెరుపు మెరిసిన దగ్గర్నించీ ఇది ఇలా జరుగుతుంది అని తెలుసు చివరికి. చదువు, తెలివితేటల ప్రదర్శన, నేను ను మాగ్నిఫై చేసే ఈ నాగరికత పేరుతో అలవడ్డ సుఖాల వెంపర్లాట అంతా అన్రియల్ అని తోచినా అది కూడా ఇంకొక ఫాన్సీ ఆలోచన కాదని ఎలా నిరూపించడం.. ఇక్కడికొస్తే తప్ప..
స్వాభావికం
April 5, 03.మాతృభూమి లో పడ్డాం… . sudden change in atmosphere. extreme heat – desultory gossip talk. ఒక్క నిముషం నేను పూర్వం పడ్డ బాధ పది రెట్లు మాగ్నిఫై అయినట్లు అనిపిస్తోంది. అమితమైన వేడి అలుముకొన్న ఈ కొలిమి లో - బలమైన సమ్మెట పోట్లు - సాధింపులు - భయ కార్పణ్యాల వెనక దాగి ఉన్న అసలు ? ఆర్ధికానికి అమిత భయంకరమైన ప్రాముఖ్యం ఇచ్చు కోవడం వల్లనా ఈ స్వీయ రక్షణ కవచాలు ఏర్పడ్డాయి మనుషుల మధ్య ? లేక అది ఇటా (వైస్ వెర్సా?)
మురికి ఇరుకు గదులు - వేడి - చట్టున వీచిన శీతల పవనం - మళ్ళీ అమితమైన వేడి - ఒక చిన్న పెళుసు మాట పైపైనే - అంటుకున్న నిప్పురవ్వ - తారాజువ్వ లా ఎగిసిన ఎమోషన్స్.. ముదిమి చేత మైల్డ్ అవబడ్డ భావాలు. డైల్యూట్ అయిపోయి మనసుకు అందకుండా చేజారి పోతున్న క్షణాలు. మళ్ళీ గ్రీష్మ తాపం. కొంచెం చల్లని గాలి. చదువు చెప్పించుకున్న బాలిక.
కళ్ళూ మిరుమిట్లు గొలిపే సంపద, అనేక వృక్ష, పుష్ప, ఫల జాతులతో కూడిన విశాలోద్యానవనపూరితమైన ప్రదేశాలలోంచి ఒక్క సారిగా ఇరుకు గదుల మనసులలోనికి వెళ్ళినా ఏమీ వ్యతిరేక భావం కలగదు. చప్పున అర్ధమవుతున్న 'స్వాభావికం' అన్న మాట.
ప్రయాణం లో ఫెర్మాట్ థీరం
April 3, 03.It is almost like a big animal – this airport – with all its huge buildings, roads, cars, people – police officers with piercing looks - హడావిడి గా తిరుగుతున్న మనుషులు.
The whole thing – “system” – used to make one feel very small petty and inferior. చిన్నప్పటినించీ వేరే వర్గానికి చెందిన (వాళ్ళని తను అనుకుంటున్న) మనుషుల్ని చూస్తే భయం, భయం, - ఇంకా భయం - మరి కొంచెం ద్వేషమేమో.. ఒకడి చిన్నప్పటి మధ్యతరగతి పరిస్థితులకీ, ఆలోచనలకీ భిన్నమైన వాతావరణం ఏది చూసినా నిస్సహాయత తో కూడిన భయం.
4/4/03
విమానం లో కొన్ని (తరవాత మర్చిపోతానేమోనని)
పుస్తకం చదవడానికీ అదే విషయం రికార్డ్ చేసింది వినడానికీ ఎంత తేడా ? అదేమిటో Eckhart Tolle ఉపన్యాసం CD విన్నాక తట్టింది. మైండ్ లో ప్రతీ క్షణానికి ఉన్న నెగటివిటీయో లేక పాజిటివిటీయో లేక ఇంకేదో ఒక టింజ్ చదువుతున్న దానికి అంటుకుంటూ ఉంటుంది. ప్రతి వాక్యానికీ విడివిడి గా కాక పోయినా మొత్తం విషయానికి నా టోన్ యొక్క కలర్ కొద్దో గొప్పో అంటుకుంటుంది (ఆ రాసిన విషయం లో అది లేక పోయినా) కానీ వినేటప్పుడు ఈ లేబులింగ్ కొంచెం తక్కువగానే ఉంటుందనిపించింది. చెప్పే వాడి కంఠం లోని భావం మైండ్ వేసే ఇమేజ్ ప్రభావాన్ని కొంచెమైనా తగ్గిస్తుంది.
****************
యుటక తనియామా, గోరో షిమురా ప్రతిపాదిత పాఠాలని (conjecture కి తెలుగు) నిరూపించాడట వైల్స్ గారు. ఈ వాక్యం ఎలా చదవాలో రాత లో ఎలా ఎక్స్ ప్రెస్ చెయ్యడం ?
ఎవరో సియస్సారో, విన్నకోట రామన్న పంతులో లేదా గోవింద రాజుల సుబ్బారావో పోనీ వీరభద్రరావో - వీళ్ళ మాడ్యులేషన్ లో fermat theorm కధని చెప్పాలి. **
ఎన్నో దశాబ్దుల క్రితం ప్రతిపాదించారు ఒక సిద్ధాంతాన్ని యుటక తనియామా, గోరో షిమురా లు.. కానీ నిరూపించలేదు.. ఎక్కడో కొడితే ఎక్కడో తగిలిందన్నట్టు, వీళ్ళ ప్రతిపాదనల్ని గనక నిరూపిస్తే , వందల సంవత్సరాలుగా కొరకరాని కొయ్యగా పడి ఉన్న ఫెర్మాట్ చివరి సమస్య పరిష్కార మవుతుందని కొంత మంది గణకులు విహార యాత్ర లో నిరూపించారుట. దాన్ని ఊతంగా చేసుకుని వైల్స్ గారు ఎన్నో ఏళ్ళు రహస్యంగా ఒక్కడే పని చేసి యు. త. & గో. షి. ల సిద్ధాంతాలని నిరూపించాడట. నిజానికి యు. త. గో. షి. లకే అసలు మూలపు క్రెడిట్ దక్కాలేమో.. **చూ. ఫెర్మాట్స్ ఎనిగ్మా - సైమన్ సింగ్
చూపులు
3/15/03శరీరాన్ని కాల్చుకుతింటున్న చూపుల్ని అసహ్యించుకోకుండా, అలాగని ఎంజాయ్ చెయ్యకుండా ఒక అమ్మాయి పెద్ద మనసుతో ఇలా అందిట .. కళ్ళనిండా నీళ్ళతో. "ఇన్ని వేలమందికి బేసిక్ బయలాజికల్ నీడ్ తీరకుండా ఇంత వికృతంగా కృతకంగా మార్చిన ఈ సమాజం, వ్యవస్థ ఏర్పడడానికి కారణమైన నీచ, రెప్రెసివ్ సంస్కృతి ఏది? ఎందుకు మీరు ఈ పురాతన సదాచార అని పిలువబడే నికృష్టమైన దీనిని పట్టుకుని వేళ్ళాడుతున్నారు? " ఆహా ఎంత అందమైన కల్పన? (ఆ అమాయి కి పేరు కూడా ఇదే పెట్టొచ్చు కధగా రాస్తే)
అసలు కోరిక యొక్క నిజ స్వరూపాన్ని చూస్తే ఎవరికీ హాని కలిగించని మంచి సంప్రదాయం దానంతట అదే కుదురుకుంటుంది.
కళ్ళు
3/14/03నిన్నా మొన్నా అమితమైన బాధతో అశాంతితో నిద్ర పట్టక దొర్లుతూంటే ముసురుతున్న ఆలోచనలు తల నిండా.. అకస్మాత్తుగా కొన్ని క్షణాలలో ఎక్కడి నించో పొడుస్తున్న అక్షర సముదాయాలు.. కవి తను రహస్యంగా అసహ్యించుకునే వాటిని.. ఇంకా ఏవేవో మాటలు చప్పున గుర్తుకు రావడంలేదు. ఏమైనా ఆ ఉద్వేగం లో రాయాల్సిందే కానీ వాటిని సొంతం చేసుకుని ప్రయత్నించి (అంటే గుర్తుంచుకుని) తరవాతెప్పుడో రాయాలంటే పాచి పోయిన అన్నంలో రుచి వెతుక్కున్నట్టు గా ఉంటుంది.. ప్రస్తుతానికి తోచింది రాస్తే..
కొన్ని రోజులుగా చెడ్డ ఆలోచనల సర్పం కాటు తిన్న మెదడు లో ఉత్పన్నమైన బాధ అంతా శరీరం అంతా వ్యాపిస్తోంది ఒక మనిషికి. "యాగ యోగ త్యాగా భోగ ఫలమొసంగే.. అని మొహం కండలు ఉబికిస్తూ అతి తీవ్రమైన అగ్రెసివ్ మైండ్ తో పాడుతూ ఒకడు. "అమ్మా, అయ్యా, ఆ.. " అని నచ్చు స్వరం లో గుమ్మడి పాత్రని అనుకరిస్తూ ఇంకొకడు. ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని గంటలు అని తక్కెడ లో బిల్లింగ్ రాళ్ళు ఒకవైపు వేస్తూ, ఇంకొకవైపు మనషుల్ని(అనగా కన్సల్టెంట్స్) తోలుతున్న ఒక అధికారి (అనగా మానేజర్) - అబ్బా ఆ సెట్టింగ్ రాకపోతే ఇది ఎలా నడుస్తుంది? వాడికి దాన్నిగురించి ఉత్తరం పంపావా అంటున్నారు ఇంకొకరెవరో. అనేక వందల సముదాయాల ఆలోచనలతో మండుతున్న నెగడు ఈ మెదడు.
కళ్ళు - we would not have eyes had we all not been part of the same god (or its debris?) అంటున్నాడెవడో. కళ్ళ మీద కత్తులతో వత్తినట్లుగా ఉంది ఈ భయం చేత. I can see how my eyes are affected by my mind. తప్పు జరిగితే కళ్ళు పోతాయన్న మాటకి అర్ధం తెలిసినట్లుగా ఉంది. One thing that is so extremely difficult is to keep this emotion without reacting and also see it without running away nor enjoying it.. ఈ భయం on its own enjoyable కాకపోయినా అది తెరిచే ద్వారాల గుండా ప్రయాణిస్తే వచ్చే sensual satisfaction కి లొంగి పోకుండా (అంటే జంతు ప్రవృత్తి ని తృప్తి పరచే వయొలెన్స్ కి సరెండర్ అయి పోకుండా ఉండడం ఎంత కష్టమో తెలుస్తోంది. భయం కళ్ళని ఇలా వత్తిడి కి లోను చేయడం కాక ; - భయం తోనే జీవించాలనీ ఇంకెక్కడికీ పారిపోకూడదనీ చేసే ప్రయత్నం లో వచ్చిన రెసిస్టెన్స్ అయ్యుండవచ్చు ముఖం అంతా నొక్కుతున్నట్లు అన్పిస్తున్న ఈ భావన.
ఆధునిక మానసిక శాస్త్రం ఇలాంటి రాతల్ని చూస్తే ఎన్ని జబ్బుల పేర్లు ఏకరువు పెడతారో. ఏది నిజం ఏది అబద్ధం ఏది ప్రమాణం ఓ మహాత్మా ఓ మహర్షీ ..
//ఎందుకని ఆధ్యాత్మికానికీ ఈ సోకాల్డ్ ఆధునిక సమాజ జీవితానికీ పొసగదు జనరల్ గా? నాలో ఉన్న సమస్త భావాల్నీ వేటికి వాటిని విడిగా చూస్తూ అనుభవిస్తూ జీవిస్తూ ఉండాలంటే ఆధునిక సమాజంలో అవకాశాలు తక్కువయిపోతున్నై. When I have fear, elation, anger, goodness, violence, benevolence – I am not supposed to display them as they are. Of course, చాలా కొద్ది మంది ఉన్నత సంస్కార జీవుల మధ్య కుదరచ్చు. కానీ నూటికో కోటికో ఉంటారు అటువంటివారు. ఎక్కడికక్కడ భావాలని అణచుకొని ధన సంపాదన కోసమో ఇతర material practical considerations కోసమో పరుగులెత్తాల్సొస్తూంటే తీరి కూర్చుని సెల్ఫ్ లోకి వెళ్ళే వీలెక్కడ ?
బాధ
March 10, 03.ఈ అమితమైన బాధ ఏమిటి ? నరాలను కోస్తున్నట్లుగా కాళ్ళూ చేతులూ చచ్చుబడినట్లుగా ఫీలింగ్.. ముఖం మీద ఎవరో ఇనప అచ్చులతో వత్తినట్లుగా బాధ.. ఏ రకమైన సంఘటనలు జరిగితే ఈ బాధ ఉపశమిస్తుందో మనసు గాలిలో తేలియాడుతుందో తెలుసు. కానీ అవి జరగాలని ప్రయత్నిస్తే ఆ ఎస్కేప్ వల్ల తరవాత ఎంత సంఘర్షణ అనుభవించాలో కూడా తెలుసు. అందుకని ఈ బాధని బాధగానే అనుభవిస్తున్నాను.
స్తబ్ధత
2/23/03అతి తీవ్రమైన నిరాసక్తి. ఏం చేస్తే పోతుందో మనసంతా మళ్ళీ ఎక్సైట్ మెంట్ తో నిండి గాలి లో ఎగరాలంటే ఏయే సంఘటనలు జరగాలో తెల్సు. కానీ అవి కావాలన్న కాంక్ష, ఈ మాంద్యం పోవాలన్న కోరిక బొత్తిగా లేనట్టుంది. కూరుకుపోయి ఆనందించడానికీ, విడివడి దానివంక చూడ్డానికీ మధ్య ఉన్న సన్నటి గీత మీద అటూ ఇటూ తిరుగుతోంది మనసు - నాల్గు రోజులుగా. బయటి ప్రపంచ సంబంధం లో ఉన్న స్తబ్ధత వల్ల ఇదంతా అని స్పష్టంగా తెలుస్తూ ఉన్నా, ఏ పనీ చెయ్యకుండా అసలు ఈ సంబంధం లోని స్తబ్ధత వెనుక ఉన్న భయాన్ని చూడాలను కుంటుంది మనసు. తీరని కష్టమైన కోరికలెందుకు దీనికి ? శరీరం అంతా అలముకుంటున్న భయద్వేషాల నించి తప్పించు కునే అవకాశం ఉన్నా పోదెందుకు?
ప్రసారం
2/14/03ఇంకోళ్ళు చెప్పే మాటకీ సలహాకీ ( సహృదయంతో) విలువ అస్సలు ఉండదా? ఎవడిది వాడు చూస్కోవల్సిందే అనుకున్నట్టయితే కమ్యూనికేషన్ అంతా వృధాయేనా అని అడిగితే సమాధానం ? కాదు అనే. ఎవడికి వాడు తానుగా చూసి అనుభవించి తీసివేస్కోవలసిందే. కానీ అది ఏమిటో ఎరిగినవాళ్ళు చెప్పినపుడు వినేవాడు ఇంటెన్స్ అటెన్షన్ తో -'నేను' ప్రతిబంధకమవకుండా కనక వింటే అది హఠాత్తుగా అర్ధమవచ్చు. చెప్పటం, బోధన వీటి విలువ అప్పుడు తెలుస్తుంది. ఎవరో మహానుభావుడు " 'నేను' అని నువ్వు అనుకుంటున్నది నిజం కాదు" అని చెప్పగానే నిసర్గదత్తుడు గారు గుడ్డిగా నమ్మేసినట్లనిపించదు.. వేరే వ్యతిరేక ఆలోచనలేమీ లేకుండా సూటిగా దానిలోని సత్యాన్ని ఆయన చూసి అనుభవించినట్లనిపిస్తుంది.
పోరాటం
feb 1, 2003.ఏడేళ్ళ అబ్బాయి అంటున్నాడు. I want to be shouted at by my mom.. because it makes me feel stronger in a fight or argument.. అదిరి పోయాను. అంత డైరక్ట్ గా చెప్తూంటే. పోరాడడానికి ఎంత ఎమోషనల్ బలం ఉందో - తరాల తరబడి వాటిలో మజా పొందడానికి అలవాటయిన జన్యువులు తమ కవాటాలను ఆ సన్నివేశాల కోసం ఎంత బాగా తెరిచి ఉంచి ఆహ్వానిస్తాయో - ఇదంతా ఒక్క ముక్కలో విన్నట్టుగా వుంది.
ప్రదర్శకుడు
12/16/02ఒంటరి ప్రయాణంలో దిగులు. చేయి అందించేవాడు ఉన్నా ఇంకోకడి వల్ల జరగకుండా నా (అలాంటి దేమన్నా ఉంటే) లోంచి రావాలని యావ. బేసిక్ ఒరిజినల్ 'నా' అనేది ఏమిటో ఆ బ్రహ్మ పదార్ధం ఎలాంటిదో మనకి తెలీదు.
ఇదంతా మెటాఫరికల్. అందించేవాడూ, ఇంకొకడూ, దిగులూ - ఇవన్నీ పదాలే. అసలు పాయింట్ మెదడు లో రగులుతున్న ఆందోళనలూ, భయాలూ, వడివడి గా పరిగెత్తే ఆలోచన - కోరికల వలయావర్తాలలో సుడులూ, సెగలూ, మారువేషాలలో వెంటాడే ముసుగు మనుషులూ, మాటలూ, పాటలూ - దీన్నంతటినీ దిగులు అన్న పదం సూచించగలదా ? ఇక దీన్నించి తప్పించుకుని పోయి, ఈ మంటని చల్లర్చకుండా ఆ వేడిని భరిస్తూ (దానిలో కాలిపోవడం, లొంగి పోవడంకాదు) బాధ పడడం - ఇంకోళ్ళని అనుకరించకుండా ప్రాక్సీ గా అనుభవించకుండా ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం.
///ఈ ప్రదర్శకుడి యావంతా ఏమిటి ? ప్రతి ఆలోచనలో, సంభాషణలో చూపులో కల్పనలో అన్నింటి వెనకా ఉండి నడిపించే ప్రదర్శకత్వం సాలెగూడు లాగా అల్లుకుపోయింది. ఎప్పుడూ ఇంకొకరు తన గురించి ఏర్పరుచుకోబోతున్న ఇమేజ్ గురించి ఆలోచించడం నా లో ఉన్న "ప్రదర్శించి లొంగ దీసే" అగ్రెషన్ కి నిదర్శనం. కదిలే ప్రతి ఆలోచననూ గమనిస్తూంటే - స్లో మోషన్ లో - బయట పడుతున్న చెడ్డతనం.
విశ్వాల్గారిధమ్
12/8/02ప్రపంచాన్ని కంట్రోల్ చేసే బేసిక్ అల్గారిథమ్ కోసం వెతుకుతున్నారట స్టీవెన్ వోల్ఫ్రామ్*గారు. ప్రపంచంలో నేనూ ఒక భాగం కాబట్టి అది తెలిస్తే 'నా' సమస్య పరిష్కారమౌతుందా అందరికీ ? విశ్వజననం, కాలం లాంటి వాటికన్న మనసు లో జరిగే దాన్ని పట్టుకోవడమే ముఖ్యం నాలాంటి మామూలు మానవుడి కి.
// ఉన్న భయ ద్వేషాసూయల్ని చూస్తే, చిన్నతనపు అబ్యూస్ వల్లనో, ఆ సంక్షోభ బాల్యపు ప్రేమ రాహిత్యం వల్లనో అనిపిస్తుంది. ఇట్లా లీనియర్ గా కారణాలు వెతకడం ఎంత ఆనందం ? కారణం వెతకడం అనే కాసల్ ఆపరేటర్ మెదడు లో వైర్ అయిపోయి ఉంటుందంటున్నారు శాస్త్రజ్ఞులు. డోర్ బెల్ మోగగానే తలుపు తీయాలంటే ఈ ఆపరేటర్ అవసరం. శాస్త్ర జ్ఞానం పుట్టుక, పెంపు అంతా దీని వల్లే జరిగిందనేది స్పష్టం గానే ఉంది. ఈ కారణాలు వెతకడం వెనక ఏదో తెలియ రానిదీ, తెలియ లేనిదీ తెల్సుకోవాలన్న ఆకాంక్ష, అసంతృప్తి, అశాంతి..
* a new kind of science - by steven wolfram - ఈ పుస్తకం లో చివరికి చెప్పిన ప్రశంసలు బుద్ధుడు చెప్పినట్టుగా అనిపిస్తాయి.
ఆధ్యాత్మిక పరిష్కారం
Sept 7, 2002.ప్రతి సమస్యకీ ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటుంది - ప్రేమ నిజంగా ఉంటే చాలు - ఏది ఎలా జరిగినా మంచికే - అంతా మన perception లోనే ఉంది - వగైరా మాటల్ని చాలామంది ఆధునికులు హేళన భావం తో చూస్తారు. ఈ రకమైన దృష్టి - జరుగు తున్న దంతా ఇప్పటిదాకా మనకి మనమే పేర్చుకుని ఉన్న దానికి కొనసాగింపు అనీ 'నేను' కరగడం ద్వారా భౌతిక పరిస్థితి మారడానికి అవకాశం ఉందనే దృష్టి - 'స్వ' బాగా తగ్గి పోవడం వల్ల వచ్చే paradigm shift అని అన్నా అర్ధం అవడం కష్టమే - ఆ మాటని సోకాల్డ్ పాప్ సైకాలజీ సెల్ఫ్ హెల్ప్ గురువులు బాగా అరగదీసి వాటి చుట్టూ ఒక ఆరా కల్పించారే…
//సుందర చైతన్యానంద గారు వార్త లో రాస్తున్నారు. - మనకి శరీరాలు వేరైనా మనసులు ఒకటే; ఎన్నటికీ విడిపోగూడదు అని తీర్మానాలు చెయ్యడం, అలా ముందు విడిపోవచ్చన్న భయం వల్లనే అని! - ఉన్నది ఉన్నట్టు గా చూడడం అన్న శీర్షిక పెట్టారు - బుద్ధిష్టుల ని తలపిస్తూ..
// ఎగువ మధ్యతరగతి భార్యాభర్తల మధ్య ఒక ఆదర్శ ఇమేజ్ ప్రకారం ఎంతో సహజం గా వున్నట్టనిపించే నటన అలవడుతుంది ఇక్కడ సమాజంలో - ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గానీ ఏదైనా కమ్యూనిటీ కార్యకలాపాలలో పాల్గొనేటప్పుడు గానీ - ఉన్నట్టుండి కక్షలూ కావేషాలూ మాయమై గౌరవనీయమైన రిలేషన్ షిప్ ప్రొజెక్ట్ చెయ్యబడుతుంది ఎలాగో. ఇలా స్పర్ధలు వచ్చినపుదు అలాంటి ఆక్టివిటీస్ లోకి జారిపోవడంకూడా ఒక రకమైన సొలూషనే. లేనిదాన్ని (లేదా వివాహ బంధంపేరిట ఎక్కడో మూల అణగారి మిణుకు మిణుకు మంటున్నదాన్ని) బాగా ఉన్నట్లు చూపడం - ఎస్కేప్ వల్ల ద్విగుణం బహుళం అయ్యే బాధకన్నా దీన్ని ఎదుర్కోవడమే మేలు.
20 th Sept
దైనందిన జీవిత వ్యవహారాలలో 'స్వ' ని పెంచుకోవడం కోసం ఘర్షణ బాగా తగ్గిపోతే
'స్వ' మాయమయే ఇతర సుఖాల వెంపర్లాట (లైంగిక etc.,) ఉండదంటున్నాడాయన.
Oct 20ఆధ్యాత్మిక రచనలు చేసిన ఒక ఆఫ్రికన్ అమెరికన్ మహిళ కొన్నాళ్ళ క్రితం అంటోంది (సి-స్పాన్ లో)…
If somebody comes to me and says ‘I am a Christian’, I’ll be very surprised because I’m trying to be one for the past several years. And I’d ask ‘ have you already become a Christian ?
ఈవిడ పంజరాన్ని తప్పించుకునే పక్షులు అనో అలాంటి అర్ధం వచ్చే ఏదో పేరు గల పుస్తకం రాసింది.
అలాగే చాలా జంట లు చెప్పాలేమో - we are living together for the last several years, trying to get married. అని…